"ఏరా! రమేశ్! హౌస్ సర్జన్ కాగానే ఇక్కడే నర్సింగ్ హోం పెడతావా? ఆరోజు చుట్టం చూపుగా వచ్చిన కొడుకుని అడిగాడు కామేశ్వరరావు.
"మొదట అలాగే అనుకున్నాం నాన్నా! కాని ఇప్పుడు మా మామగారికి ఇష్టంలేదు."
"ఏరా! ఎందుకు ఇష్టం లేదు. అంతా మామగారి ఇష్టమేనా? కనిపెంచిన వాళ్ళ ఇష్టాఇష్టాలతో ప్రమేయం లేదా?" సుందరమ్మ గయ్యిన లేచింది.
"సుందరీ! నువ్వు మాట్లాడకు." కామేశ్వరరావు కసురుకున్నాడు.
"ఊ! మీ మామగారు ఏమంటున్నారు?" కొడుకుకేసి తిరిగి అడిగాడు.
"ముఖ్యమంత్రిగారితో మాట్లాడి హైదరాబాద్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటున్నాడు."
"మంచిదే!"
"ఏమిటండీ మంచిది?"
"నిన్ను మాట్లాడొద్దన్నానా?"
"ఎందుకు మాట్లాడకూడదు! మీరు మాట్లాడరు. నన్ను మాట్లాడనివ్వరు. వాళ్లేమో ప్రయోజకులవగానే పెళ్లాల కొంగుల చాటుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళమీద మనకు ఎలాంటి హక్కులేదా?"
"ఇప్పుడు హక్కుల దాకా ఎందుకు కాని నువ్వు కాసేపు మాట్లాడకు."
సుందరమ్మ విసురుగా లోపలకు వెళ్ళిపోయింది.
"అమ్మ మరీ అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతుంది నాన్నా!" అంటూ కామేశ్వరరావు ముఖంలోకి చూసి గతుక్కుమన్నాడు రమేశ్.
ఆయన ముఖంలో ఎన్నో ప్రశ్నలు రమేశ్ ను నిలదీశాయి. "వస్తాను' అంటూ గబగబ బయటికి వెళ్ళిపోయాడు.
రమేశ్ ఊరికి వెళ్ళబోతూ చెప్పడానికి వచ్చాను.
"అమ్మా!"
ఆ పిలుపుకే పొంగిపోయిన సుందరమ్మ వంటింట్లో నుంచి బయటికి వచ్చి" ఏం నాన్నా!! కాఫీ తాగుతావా" అని అడిగింది.
"వద్దమ్మా! బస్ కు టైం అవుతుంది. ఎల్లుండే ఆసుపత్రి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. వెళ్తున్నానని చెప్పడానికి వచ్చాను." అన్నాడు.
"ఒక్కడివే వెళ్తున్నావా? కోడల్ని కూడా తీసుకెళ్తున్నావా? అడిగింది సుందరమ్మ.
"ఒక్కణ్ణే వెళ్తున్నాను. ఇప్పుడు హౌస్ సర్జన్ గా చెయ్యడానికి వెళ్తున్నాను. అది పూర్తి అయ్యాక కాని ఉద్యోగం రాదు. ఆ తర్వాతే ప్రమీలను తీసుకెళ్తాను."
సుందరమ్మ కొడుకు ముఖంలోకి వింతగా చూసింది.
"మంచిదేరా! వెళ్ళిరా!" అన్నాడు కామేశ్వరరావు.
"ఎందుకమ్మా దిగులుగా వున్నావు? రెండు మూడు నెలలకొకసారి వస్తూనే వుంటాగా?" అన్నాడు కొడుకు తల్లిని చూస్తూ.
సుందరమ్మ మాట్లాడలేదు.
"బస్ కు టైం అవుతూంది వస్తాను." రమేశ్ గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు.
అలా వెళ్తున్న కొడుకును కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయింది ఆ కన్నతల్లి.
వీడు... వీడు కూడా వీడు అందరిలాంటి వాడు కాడనుకుంది. వీడు అన్నలనుమించి పోయాడు. ఉద్యోగం రాగానే హైదరాబాద్ లో ఇల్లుచూస్తాను. అందరం వెళ్ళిపోదాం అని అంటాడని తను అనుకుంది. కాని వీడు అన్నది ఏమిటి? ఉద్యోగం వచ్చాక భార్యను తీసుకెళ్తానన్నాడు. అలాగే అన్నాడా? లేక తను పొరపాటుగా విన్నదా?
"ఏమిటి సుందరీ ఆలోచిస్తున్నావ్?"
"వాడు ఏమన్నాడు?"
"ఏ విషయం?"
"ఉద్యోగం వచ్చాక ప్రమీలను తీసుకెళ్తాను అన్నాడు కదూ?"
"అవును!" కామేశ్వరరావు భార్యధోరణి అర్ధం కాలేదు.
"అంతేకాని... ఉద్యోగం వచ్చాక మిమ్మల్ని తీసుకెళ్తాను అని అనలేదుకదూ?" నిద్రలో పలకరిస్తున్నట్టుగా అన్నది సుందరమ్మ.
"సుందరీ! ప్రతిదానికీ ఎందుకంత ఇదైపోతావు? కోడల్ని తీసుకెళ్తున్నావా అని నువ్వు అడిగావు. అందుకు వాడు ఆ సమాధానం ఇచ్చాడు."
"అంతేనంటారా!" తనను తనే ప్రశ్నించుకున్నట్టుగా అన్నది.
"అంతే! నాకు తల నొప్పిగా వుంది. కాఫీ ఇవ్వు."
సుందరమ్మ యాంత్రికంగా లోపలకు వెళ్ళింది.
* * *
రమేశ్ హౌస్ సర్జన్సీ పూర్తిచేసి, గాంధీ ఆసుపత్రిలో డాక్టరుగా చేరాడు. ఆ ఉద్యోగం అతడి మామ ఇప్పించాడు. ఆయన స్వయంగా హైదరాబాద్ వెళ్ళి హెల్త్ మినిస్టర్ని కలిసి, అల్లుడికి ఉద్యోగం ఇప్పించుకున్నాడు. తనకు ఉద్యోగం వచ్చిందనీ, ఇల్లు చూసుకొని త్వరలోనే వస్తాననీ తండ్రికి ఉత్తరం రాశాడు. ఆ వార్త కామేశ్వరరావు భార్య చెవులో చెప్పాడు.
సుందరమ్మ ఆనందానికి అవధుల్లేవు. చిన్నవాడి బుద్దేవేరు. "మీరు నాదగ్గిరే వుంటారమ్మా!" అని ఐదేళ్లనాడే తల్లిని ఊరడించాడు. ఆ మాట గుర్తొచ్చింది తల్లికి.
"అందరికీ చెప్పెయ్యండి." అంది సుందరమ్మ.
కామేశ్వరరావు ప్రశ్నార్ధకంగా చూశాడు.
"ఏమిటలా చూస్తారు? వెంటనే చెప్పెయ్యండి. వాడు ఎప్పుడొస్తాడో ఏమో! అన్ని లావాదేవీలూ పూర్తి చేసుకోవాలి ఈ లోపలే."
"నువ్వంటున్నదేమిటో నాకు అర్ధం కావడం లేదు. లావాదేవీలు పూర్తి చేసుకోవాలా? అందరికీ చెప్పెయ్యాలా? ఏం చెప్పాలి!"
"అయ్యోరాత! ఇక ట్యూషన్లు చెప్పనని చెప్పండి."
కామేశ్వరరావు భార్యముఖంలోకి వింతగా చూశాడు. ఆమె కళ్లు సంతోషంతో వెలిగిపోతున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఆ కళ్లల్లోకి వెలుగు వచ్చింది. అది చూసి కామేశ్వరరావు నిట్టూర్పు విడిచాడు.
"చంద్రం పిల్లల్ని వదిలి వెళ్ళాలంటే బాధగానే వుంది."
కామేశ్వరరావుకు, భార్యధోరణి అర్ధం అయింది. ఆమెకేసి జాలిగా చూశాడు. "పిచ్చి సుందరీ! నీ కొడుకు ఇల్లు చూస్తున్నది నీకోసం అనుకుంటున్నావా? ఇల్లు చూసి వస్తానంటే నిన్ను తీసుకెళ్లడానికి వస్తానన్నాడనుకుంటున్నావా? వాడు వస్తున్నది నిన్నూ నన్నూ తీసుకెళ్ళడానికి కాదు"
పైకి అనాలనుకున్న మాటలు మనసులోనే వుండిపోయాయి. సుందరమ్మ తన ధోరణిలో చెప్పుకుపోతూనే వుంది'
"చిన్నవాడు అందరిలాంటి వాడు కాడండీ."
"అందరిగురించి ఇలాగే అనుకున్నావు" అనాలనుకొని అనలేకపోయాడు."
"వాడు మనల్ని గాలికి వదిలెయ్యడని నాకు తెలుసండీ. కాని ఆ పిల్లకు గర్వం ఎక్కువ. నాతో సరిగా మాట్లాడదు. అలాంటిది మనల్ని బాగా చూస్తుందంటారా! ఎవరికోసం చూస్తుందిలే. చూడకపోతే నా బిడ్డ ఊరుకుంటాడా ఏం? ఆ పిల్ల ఎలాంటిదైతే మనకేం? మన బంగారం మంచిదే. మేలిమి బంగారం. వాడికి తల్లి దండ్రుల్నిఎలా గౌరవించాలో తెలుసు. ఎవర్ని వుంచాల్సిన చోట వాళ్ళను వుంచుతాడు." కొంచెం ఆగి మళ్లీ అంది.
"మీరేమీ మాట్లాడరేం?"
"ఏం మాట్లాడమంటావు? అన్నీ నువ్వే మాట్లాడేస్తున్నావుగా?"
"రమేశ్ చాలా పెద్ద డాక్టరు అవుతాడు. మంచిపేరు తెచ్చుకుంటాడు." గర్వం తొంగి చూసింది సుందరమ్మ కంఠంలోనుంచి.
"రఘు కూడా పెద్ద డాక్టరే. మంచి పేరు వుంది. బాగా సంపాదిస్తున్నాడు." అన్నాడు కామేశ్వరరావు.