Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 28

    కామేశ్వరరావు మాటల్లోని అంతరార్ధం సుందరమ్మకు అర్ధం కాలేదు.
    సుందరమ్మ ఆరోజు పొద్దుపోయే వరకు రమేశ్ చిన్ననాటి ముచ్చట్లు గురించి గుర్తు చేసుకుంటూనే వుంది. కామేశ్వరరావుకు చెబుతూనే వుంది.
    "పొద్దుపోయింది. పడుకో." అన్నాడు కామేశ్వరరావు.
    "రేపే అందరికీ చెప్పెయ్యండి."
    "ఏమని?"
    "మళ్ళీ మొదటికొచ్చారు. ట్యూషన్సు మానేస్తున్నానని చెప్పండి."
    "ఎందుకు మానేస్తున్నావని అడిగితే!"
    "నా చిన్నకొడుకు దగ్గరకు హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పండి.' అందరికీ చెప్పండి."
    కామేశ్వరరావు పక్కకు వత్తిగిలి పడుకున్నాడు.
                                 *   *   *
    నాలుగురోజుల్లో రమేశ్ వస్తున్నాడు. సుందరమ్మ మహాహడావిడి పడిపోతున్నది. ఇల్లంతా సర్దింది. పప్పులూ ఉప్పులూ మూటలు కట్టింది. రమేశ్ కు ఇష్టమైన పిండి వంటలకు కావాల్సిన సామాగ్రి తెప్పించి పెట్టింది. ఇరుగు పొరుగు వాళ్ళందరికీ రమేశ్ దగ్గరకు వెళ్ళిపోతున్నట్టు చెప్పింది. అద్దె ఇల్లు ఖాళీచేసి, వచ్చి స్వంత ఇంట్లో వుండమని చంద్రంతో చెప్పింది."
    కామేశ్వరరావు సుందరమ్మ చేస్తున్న హడావిడి చూస్తూనే వున్నాడు. ఏమీ అనలేకపోతున్నాడు.
    "ఇంకా మూడు రోజులేవుంది వాడు రావడానికి ఇవ్వాళ కూడా ట్యూషన్ కు వెళ్తానంటారేమిటి? ఇంకా చెప్పెయ్య లేదా ఇకరానని?" సుందరమ్మ భర్త ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించింది
    "కానియ్! ఇంకా మూడు రోజుల సమయం వుందిగా!" అంటూ బయటికి వెళ్తున్న భర్తను చూస్తూ "చాదస్తం పాడుగాను" అనుకుంది.
    రమేశ్ వచ్చాడు. తల్లిదండ్రులకు కన్పించి అత్తవారింటికి వెళ్ళాడు. ఆదివారం సాయంకాలం బయలుదేరాలన్నాడు. సుందరమ్మ పిండివంటలు ప్రారంభించింది. ఇంకా రెండు రోజులే ఉంది. కొడుక్కు ఇష్టమని అరిసెలు చేసింది. చక్కిలాలు చేసింది. డబ్బాలకు సర్దింది ఊరగాయలు సీసాలకు పెట్టింది. జాడీలు మాత్రం చంద్రం భార్యకు అప్పగించింది.
    శనివారం సాయంత్రం రమేశ్ భార్యను వెంటబెట్టుకొని వచ్చాడు. చంద్రం, చంద్రం భార్యకూడా వచ్చారు. భోజనాలు అయ్యాయి. పొద్దుపోయేదాకా అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు.
    "అమ్మా! ఇక బయలుదేరతాం!" భార్యకు కనుసైగచేసి లేచి నిల్చున్నాడు రమేశ్.
    "రేపు ఎన్ని గంటలకు ప్రయాణం?" చంద్రం తమ్ముణ్ణి అడిగాడు.
    "ఏడు గంటల బసుకు విజయవాడ వెళ్తాం. రామం అన్నయ్య కూడా విజయవాడ వస్తాడు. అందరం ఒక రోజు కులాసాగా గడిపి వెళ్తాం!"
    "నేను కూడా విజయవాడ వరకు వచ్చి మీరు రైలు ఎక్కిందాకా వుండి వచ్చేస్తాను" అన్నాడు చంద్రం!
    "అవున్రా చంద్రం నేనూ ఆమాటే అందాం అనుకుంటున్నాను. కోడల్ని పిల్లల్ని కూడా తీసుకురా!" అంది సుందరమ్మ సంబరంగా. కామేశ్వరరావు మౌనంగా వింటున్నాడు.
    "ఎందుకన్నయ్యా నీకు కష్టం! నేను హైదరాబాద్ లో సెటిల్ కాగానే వస్తాను. నువ్వూ, వదిన, పిల్లలూ శెలవలకు రండి. అమ్మా! నువ్వూ నాన్నా కూడా అన్నయ్యతో రండి. అమ్మనూ, నాన్ననూ కూడా మీతో తీసుకురా అన్నయ్యా!"
    చంద్రం విస్మయంగా తమ్ముడి ముఖంలోకి చూశాడు. తల్లిని చూశాడు. ఆమె ముఖంలో నెత్తురు చుక్కలేదు. తండ్రిని చూశాడు. ఆయన చాలా మామూలుగా వున్నాడు.
    "నాన్నా! ఇక నువ్వు ట్యూషన్లు మానెయ్. నేను నెలకు ఇంతని పంపిస్తాను. చంద్రం అన్నయ్య పాపం ఇవ్వలేడు. విజయవాడ వెళ్తున్నాగా? రఘు అన్నయ్యను, రామం అన్నయ్యను కూడా ప్రతినెలా ఇంతని పంపించమని చెప్తాను." అన్నాడు రమేశ్ తనధోరణిలో.
    చంద్రం ముఖం కోపంతో కందగడ్డలా అయింది.
    సుందరమ్మకు అయోమయంగా వుంది. మాడుమీద గట్టి దెబ్బ తగిలినట్టుగా దిమ్మెరపోయినట్టుగా వుంది.
    "ఎందుకురా! నాకింకా ఓపిక వుంది. ఇప్పుడు నాకు మీరెవరూ డబ్బు పంపాల్సిన అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు ఎటూ తప్పదుగా' అన్నాడు కామేశ్వరరావు నిర్లిప్తంగా.
    సుందరమ్మ గవదలు బిగిసిపోయాయి.
    "అదికాదు నాన్నా! ఇంతమంది కొడుకులు వుండగా ఈ వయసులో మీరు ట్యూషన్లు చెప్పుకొని బతకడం మాకు మాత్రం ఏం బాగుంటుందినాన్నా! అందరూ ఏమనుకుంటారు?"
    "ఇందులో బాగుండక పోవడానికి ఏముందిరా? ఇంతకాలం నేను చేసినపని అదేగా? ఆపని చేసేగా మిమ్మల్ని ఇంతవాళ్ళను చేసి నా బాధ్యత నెరవేర్చుకున్నాను. ఓపిక వున్నంతవరకు కష్టపడి బతకడంలో వున్న సంతృప్తి మరొకరి సంపాదన తింటూ బతకడంలో వుండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. సిగ్గుపడాల్సిందేమీ లేదు ఇందులో" అన్నాడు కామేశ్వరరావు.
    "నా ఉద్దేశం అదికాదు నాన్నా!" రమేశ్ తడబడ్డాడు.
    "పర్వాలేదులే. మీరు సుఖంగా వుండడమే మాకు కావాల్సింది. నేను బతికుండగా మీ అమ్మదాటిపోతే అదృష్టవంతురాలే. అలా కాక నేనే ముందుపోతే మీ అమ్మ బరువు మీకు ఎటూ తప్పదు."
    "అమ్మ మాకు బరువు ఎందుకు అవుతుంది నాన్నా! నీ చాదస్తం నీదే! అన్నాడు రమేశ్ నొచ్చుకుంటూ.
    కామేశ్వరరావు చిరునవ్వు నవ్వాడు.
    "నాన్నా! మరీ కష్టపడకు. డబ్బు అవసరం అయితే ఉత్తరం రాయి. సందేహించకు.'
    కొడుకు మాటలకు ఏడ్వాలో నవ్వాలో అర్ధం కాలేదు కామేశ్వరరావుకు. ఆమాటలే తను ఎన్నోసార్లు అన్నాడు. ప్రతి కొడుకూ చదువులకు బస్తీలకు వెళ్ళే ప్రతిసారీ ఆమాటలే అన్నాడు. నిన్న మొన్నటి వరకు రమేశ్ శెలవులకు వచ్చిపోతున్న ప్రతిసారీ ఆమాటలే అన్నాడు. ఈనాడు... తనకొడుకు అందరికంటే చిన్నవాడు - తనతో ఆమాటే అన్నాడు. 
    రమేశ్ వెనకే చంద్రం కూడా బయటికి వెళ్ళాడు.
    కామేశ్వరరావు ఆలోచిస్తూ వుండిపోయాడు. అలా ఎంతసేపు ఉన్నాడో అతడికే తెలియదు. ఏదో గుర్తొచ్చినట్టు తృళ్లి పడ్డాడు. తలతిప్పి చూశాడు. సుందరమ్మ గోడకు చేరబడి కూర్చుని వుంది. రెప్పవెయ్యకుండా దూరంగా వున్నదాన్ని, దేన్నో చూస్తున్నట్టుగా వుంది. చైతన్యం లేని రాతి విగ్రహంలా వుంది. కామేశ్వరరావు లేచి సుందరమ్మ దగ్గిరకు వచ్చి నిల్చున్నాడు. ఆమెలో చైతన్యం కన్పించలేదు.
    "సుందరీ! ఏమిటలా కూర్చున్నావ్?"
    ఆమెలో ఎలాంటి మార్పులేదు.
    గాభరా పడ్తూ ఆమెకు ఎదురుగా నేలమీద గొంతు కూర్చున్నాడు. ఆమె భుజాలు పట్టుకొని ఊపుతూ "సుందరీ! సుందరీ! ఇలా చూడు! ఏమైంది! ఇప్పుడేమైందని అంత బాధపడడం లే!"
    సుందరమ్మ ఉలకలేదు. పలకలేదు.
    కామేశ్వరరావు ఆతృతగా భుజాలు పట్టుకొని ఊపుతూ "సుందరీ! సుందరీ!" గట్టిగా, దాదాపు అరిచినట్టే పిల్చాడు.
    ఎక్కడో కన్పించనిదాన్ని చూడడానికి ప్రయత్నిస్తున్న ఆ చూపులు కదిలి కామేశ్వరరావు ముఖం మీద నిల్చాయి. కొద్దిక్షణాలు అలాగే నిల్చాయి. ఒక్కసారిగా నిండుకుండ బద్దలైనట్టుగా బావురుమంది. రెండు అరచేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది.

 Previous Page Next Page