Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 26

    "వెళ్లొద్దామా?"
    "నాకెలా వీలవుతుంది? పిల్లలకు పరీక్షలు దగ్గర పడ్తున్నాయి. నువ్వెళ్ళిరా!"
    "మిమ్మల్ని వదిలేసి నేనెక్కడికెళ్తాను. వీలున్నప్పుడు ఇద్దరం కలిసే వెళ్దాం ఇంకా ఏం రాసింది.
    "అత్తమామలు బాగానే వున్నారట. వాళ్లకాలక్షేపమంతా పాపతోనేనట. ఇప్పుడు ఏ గొడవలూ లేవట?
    "పోనియ్యండి కలతలు లేకుండా వున్నారు. అల్లుడు మంచివాడు. తల్లిదండ్రులంటే ఎంత అభిమానం! మనకూ వున్నారు ఎందుకూ!"
    "అమ్మాయికి మూడోనెలట!"
    "నిజంగా!"
    "అదేంప్రశ్న" హాయిగా నవ్వాడు కామేశ్వరరావు.
    "వేవీళ్ళతో బాధపడ్తుందో ఏమో! ఒకసారి వెళ్ళిరావాలని వుంది."
    "వెళ్ళమనే కదా అంటున్నాను."
    "నేను వెళ్తే మీకెలా?"
    "హోటల్లో భోంచేస్తాను."
    "అసలేమీ ఆరోగ్యం బాగాలేదు."
    "నాకేం రాయిలా వున్నాను."
    సుందరమ్మ భర్త ముఖంలోకి జాలిగా చూసింది. రాయిలా వున్నాడా! లోతుకుపోయిన ఆకళ్ళు - పీక్కుపోయిన ముఖం -- అలసిపోయిన బాటసారిలా కన్పించాడు. సుందరమ్మ కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది.
    "నేను వెళ్ళను. ఏడో నెలరాగానే అమ్మాయిని తీసుకురమ్మని అల్లుడికి ఉత్తరం రాయండి."
    "పర్వాలేదు! వెళ్ళిరా!"
    "నేను వెళ్ళను. మరో ట్యూషన్ కూడా ఒప్పుకున్నారటగా? సుందర్రావు చెప్పాడు."
    "ఇంకెంత కాలంలే. చిన్నవాడు ఊళ్ళోనే నర్సింగ్ హోం పెడ్తానంటున్నాడుగా?"
    డబ్బుతో కూడుకున్నపని. అంత డబ్బు మన దగ్గిర ఎక్కడుంది?"
    "రఘు నర్సింగ్ హోం మనం డబ్బిస్తేనే పెట్టాడా?"
    "అంటే...?" సుందరమ్మ కళ్ళు పెద్దవిచేసి చూసింది.
    "సుందరరామయ్య కబురుపంపాడు. పిల్లనిస్తాడట. ఊళ్లోనే ఆసుపత్రి పెట్టిస్తాడట అల్లుడిచేత?"
    "నిజంగా? అంత పెద్ద షావుకారు మనతో వియ్యమందుతానంటున్నాడా?" సంబరపడిపోయింది సుందరమ్మ.
    "అవును! ఎల్లుండి మంచి రోజట. వచ్చి మాట్లాడతానని సాంబయ్య చేత కబురు పంపించాడు."
    "మన రమేశ్ అదృష్టవంతుడు." ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న భార్యకేసి అదోలా చూశాడు కామేశ్వరరావు.
                               *   *   *
    రమేశ్ చివరి సంవత్సరం పరీక్షలు రాసి శెలవుల్లో ఇంటికి వచ్చాడు. సుందరరామయ్య కూతుర్ని చూశాడు. వివాహానికి అంగీకరించాడు. వివాహం అంగరంగ వైభవంగా చేశాడు షావుకారు సుందరరామయ్య.
    కొడుకులూ, కోడళ్లూ, మనవలూ, మనవరాళ్ళతో ఇల్లంతా కళకళలాడింది. కూతురి మామగారు పోవడం వల్ల తమ్ముడి పెళ్లికి రాలేకపోయింది. అల్లుడూ, కూతురూ పెళ్లికి, ఇంట్లో జరిగిన ఆఖరు పెళ్లికి, రాలేకపోయినందుకు సుందరమ్మ బాధపడిపోయింది.
    "అత్తయ్యా! అత్తయ్యా!" అంటూ కోడళ్ళూ "అమ్మా! అమ్మా అంటూ కొడుకులూ, "నానమ్మా! నానమ్మా!" అంటూ మనవలూ, మనుమరాళ్లూ పెళ్లి పందిట్లో సుందరమ్మ చుట్టూ తిరుగుతూవుంటే చూసిన వాళ్ళు ముచ్చటపడిపోయారు.
    "సుందరమ్మా! అదృష్టమంటే నీదేనమ్మా! నాకూ ఉన్నాడు ఒక కొడుకు. నేనెప్పుడు చస్తానా అని ఎదురుచూస్తున్నాడు." అంది కోటమ్మ."
    ఆ మాటలు విని సుందరమ్మ పేలవంగా నవ్వింది.
    "కొడుకులంతా ప్రయోజకులయ్యారు" అంది కామేశ్వరమ్మ.
    "పాపం! చంద్రం ఒక్కడే తక్కువలో వున్నాడు". అంది మరో ముత్తైదువ.
    సుందరమ్మ మనసు చివుక్కుమంది. కన్నతల్లి మనసు విలవిలలాడింది.
    "వాడికి మాత్రం ఏం తక్కువైంది? వాడి అత్తగారు మరీ లేనివాళ్ళు కారు. వాడు త్వరలోనే హెడ్ మాస్టరు అవుతాడు. అసలు వాడికి డబ్బు వ్యామోహం లేదు. కావాలంటే వాడు డాక్టరే అయ్యేవాడు. వాడు మాకు దగ్గరగా వుండాలనే స్కూలు మాస్టరు చేస్తున్నాడు." అంది సుందరమ్మ.
    "సత్యం సంగతి తెలిసిందా?"
    "వాడిదే నా బాధంతా?" సుందరమ్మ కంఠంలోకి దుఃఖం తన్నుకొచ్చింది.
    "ఏడవకు. శుభకార్యం జరిగే ఇంట్లో కన్నీరు పెట్టకూడదు" అంది శాంతమ్మ.
    "కోడళ్ళు నాకూ వున్నారు ముగ్గురు. ఒక్కనాడైనా ఒక్కతైనా 'అత్తయ్యా' అని నోరారా పిల్చిందా? నీ కోడళ్లు "అత్తయ్యా అత్తయ్యా" అంటూ పిలుస్తూ వుంటే ఎంతో ముచ్చటగా వుందే సుందరీ" అంది సుందరమ్మ సన్నిహితురాలు కనకం.
    సుందరమ్మ పెదవులమీద చిరునవ్వు కదిలి ఆగిపోయింది.
    "బంగారంలాంటి కుటుంబం. ఆ సత్యం ఒక్కడే కుక్కమూతి పిందెలా పుట్టాడు". అసూయతో మండిపోతున్న కాంతమ్మ సుందరమ్మకు మళ్ళీ సత్యాన్ని గుర్తు చేసింది.
    "వాణ్ణి ఏమీ అనకు పిన్నీ. వాడు అందరికంటే మంచివాడు. అందరూ సుఖంగా వుండాలని కోరుకునేవాడు. వాడి బుద్ధి ఎవరికీ రాదు. మనసు వెన్న. ఎవరు కష్టపడ్డా చూడలేక పోయేవాడు. ఆయన ఆరోజు అనవసరంగా గొడ్డును బాదినట్టు బాదాడు. చిన్న సన్నాసి. మనసు విరిగిపోయింది. మళ్లీ రాలేదు. వాడెక్కడున్నా సుఖంగా వుండాలి." చెమ్మగవల్లిన కళ్ళను పైటకొంగుతో తుడుచుకుంది.
    పెళ్లి తతంగం అంతా పూర్తి అయింది. ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఇద్దరు కొడుకులు తల్లి దండ్రుల్ని తమ ఇళ్ళకు ఆహ్వానించి మరీ వెళ్ళారు. 'వచ్చి నాలుగు రోజులు వుండిపోండి' అన్నారే కాని "నాన్నా! మీ బాధ్యతలు తీరాయి. ఇంకా ఏం కష్టపడ్తావ్! నువ్వూ అమ్మా వచ్చి నా దగ్గర వుండండి." అని ఒక్క కొడుకూ అనలేదు.
    ఆమాటే సుందరమ్మ భర్తతో అని బోలెడంత బాధ పడిపోయింది.
    కామేశ్వరరావు తేలిగ్గా నవ్వేశాడు.
    పెళ్లిపీటలమీదనుంచి లేచి అత్తవారింటికి వెళ్ళిన రమేశ్ అక్కడే వుండిపోయాడు. నెలగడిచింది. ఎప్పుడైనా చుట్టం చూపుగా వచ్చి తల్లిదండ్రుల్ని పలకరించి వెళ్తున్నాడు. శెలవులు ఇంకా పదిరోజులే ఉన్నాయి. ఆరోజు ఇంటికి వచ్చిన కొడుకుతో "కోడల్ని తీసుకురారా! ఈ పదిరోజులైనా మా కళ్ళముందు ఉండిపోవచ్చు." అంది సుందరమ్మ రమేశ్ సమాధానం ఇవ్వలేదు.
    "ఏరా! మాట్లాడవ్?"
    "మాట్లాడి చెప్తాను."
    ఆమెకంఠం. "మాట్లాడతావా? ఎవరితోరా?" అదోలా పలికింది.
    "ఏమిటమ్మా నువ్వు మరీనూ! వస్తాంలే". అంటూ చరచర బయటికి వెళ్ళిపోతున్న కొడుకు కేసి చూస్తూ వుండిపోయింది ఆ తల్లి.
    మంచిరోజు చూసి కోడల్ని పంపించమని సుందరమ్మ పోరు పడలేక కామేశ్వరరావు వియ్యాలవారింటికి కబురు పంపించాడు.
    "ఊళ్ళోనే వున్నారుగా? తొందరేమిటి? అల్లుడు ఎటూ వారం రోజుల్లో వెళ్ళిపోతున్నాడు. తర్వాత చూడొచ్చులే." సుందరరామయ్య సమాధానం కామేశ్వరరావు మౌనంగా విని ఊరుకున్నాడు. సుందరమ్మ సణిగింది.

 Previous Page Next Page