Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 25

    అమృత విభ్రాంతిగా అతన్నే చూస్తూ, "నువ్వేం మాట్లాడ్తున్నావో నీకు తెలుస్తోందా? నేను ఎవరనుకుంటున్నావూ? ఇప్పుడు నేను ఒకరికి ఇల్లాలివి. అమృతా హర్షవర్ధన్ ని" అంది.

    "ఛీ!" అంటూ అతను ఆమెని వదిలేశాడు. "సిగ్గులేదూ! ఇలా మనసు చంపుకుని మరొకరి భార్యగా బ్రతకడానికి!"

    అమృత కళ్ళు రెండూ చెరువులైపోతూవుండగా, "మనసు కాదు! మనిషినే చచ్చిపోయాను" అంది డగ్గుత్తికతో.

    "చూస్తూనే వున్నాను. జీవచ్చవంలా బ్రతుకుతున్నట్టున్నావు పాపం!" అతని గొంతులో ధ్వనిస్తున్న వ్యంగ్యం ఆమెని తూట్లు పొడుస్తున్నట్టుగా అనిపించింది.

    "అవును! వర్షిణి పోయింది. నువ్వు ప్రేమించిన వర్షిణి ఎప్పుడో పోయింది. నువ్వు పోయావన్న వార్త వినగానే..."

    "నేను పోయాయని తెలిసి వర్షిణి పోయిందా?" అతను హేళనగా నవ్వాడు. "అయితే ఇంకేం? ఇప్పుడు నేను వచ్చానుగా! అమృతని చంపేసి వర్షిణిని బ్రతికించేస్తాను."

    అమృత జవాబు ఇవ్వలేనట్టు నిస్సహాయంగా చూసింది.

    దధి చిలికితే నవనీతం! జలధి మధిస్తే హాలాహలం! మది కెలికితే పరితాపం!

    విక్రమ్ కటువుగా చెప్పాడు, "నా సంగతి నీకు తెలుసు. నేను అనుకున్నది చేసితీరుతాను. అందుకు నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకోవదానికైనా, వెనుకాడను! ఐ విల్ గో టూ ఎనీ ఎండ్!"

    "అంటే!" కంపిస్తున్న స్వరంతో అడిగింది.

    "నీ జీవితంలోంచి ఆ రెండవ వ్యక్తిని శాశ్వతంగా తప్పించడం కోసం...అతన్ని అతని జీవితం నించి తప్పించైనా సరే!" తాపీగా చెప్పాడు సోఫాలో కూర్చుంటూ.

    "వద్దు...వద్దు అలా మాట్లాడకు! నేను భరించలేను" అంది చిగురుటాకులా వణికిపోతూ.

    అతను ఆమెని ఓ నిముషంపాటు అలాగే చూస్తుండిపోయాడు. ఆ తరువాత కసిగా..."నేను చచ్చిపోయాను అన్న వార్త విన్న తరువాత కూడా సుఖంగా బ్రతుకుతున్న నీవు...నిన్న కాక మొన్న నీ జీవితంలోకి వచ్చిన నీ రెండో ప్రియుడు 'చచ్చిపోతాడు' అన్నమాట కూడా భరించలేకపోతున్నావా?"

    అమృత దీనంగా "అతను నా భర్త!" అంది.

    "అదే అతను చేసుకున్న పాపం!" కంగుమని మ్రోగింది అతని గొంతు.

    "అతన్ని ఎందుకు అంటావూ! చేసిన తప్పేమయినా వుంటే అది నాది, నన్ను చంపు. నీ కసి చల్లారుతుంది....ఊ, చంపు" అమృత టేబుల్ మీద వున్న చాకు తీసి అందిస్తూ అంది.

    "నిన్ను చంపుకోవడానికి రాలేదు" అతను నెమ్మదిగా అయినా దృఢంగా చెప్పాడు. "నిన్ను నాతో తీసుకుపోవడానికి వచ్చాను. ఏం చేసైనా సరే!" అతని కళ్ళల్లో ఆరాధన మాటల్తో పోటీ పడ్తోంది!

    చాకు పట్టుకున్న ఆమె చెయ్యి వణుకుతోంది. "నువ్వెంత ఘోరంగా మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా" ఆమె ఇంకా ఏదో అనబోతూ వుండగా, కారు వస్తున్న చప్పుడైంది.

    ఆమె చప్పున కిటికీ దగ్గరకు వెళ్ళి బైటికి చూసింది.

    అది హర్ష కారే! ఆమె నుదుట స్వేదం అలుముకుంది. కంగారుగా విక్రమ్ ని చూసి, "నువ్వు కిచెన్ లోకి వెళ్ళు....నా భర్త వస్తున్నాడు ప్లీజ్" అంది ప్రాధేయపూర్వకంగా.

    విక్రమ్ మొండిగా తల వూపుతూ "వెళ్ళను" అన్నాడు.

    అమృత గొంతు తగ్గించి, కఠినంగా చూస్తూ "అతను నిన్ను ఇక్కడ చూసి, నన్ను ఏదో అంటాడని కాదు! ఈ రోజు నా పుట్టిన రోజు! ఈ ఆనంద సమయంలో నీ మాటలూ, చేతలూ చూస్తే అతని గుండె తట్టుకోలేదు, అందుకనీ..." అంది.

    విక్రమ్ పళ్ళు బిగిస్తూ "గుండె తట్టుకోలేకపోతే, ఆగిపోనీ! పీడా పోతుంది" అన్నాడు కసిగా.
    అమృత వెంటనే చాకు తన మెడ మీద పెట్టుకుని, "నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే, ఇది నా గొంతులో గుచ్చేసుకుంటాను వెళ్ళు.....వెళ్ళవా?" అంటూ చాకుని బలంగా ముందుకు జరుపుకుంది. చాకు మొన గుచ్చుకుని, చిక్కని రక్తపు చుక్కలు ఒక్కటొక్కటిగా ఆమె మెడ మీదుగా జారసాగాయి.

    విక్రమ్ ఆందోళనగా ఆమెవైపు రాబోయాడు.

    "అమృతా...డార్లింగ్" అన్న పిలుపు బైటనుంచి వినిపించింది.

    అమృత చాకుని మరింత బలంగా గుచ్చుకుంటూ, వెళ్తావా లేదా?" అంది కఠినంగా.

    విక్రమ్ ఏదో అనబోయి, ఆమె కళ్ళల్లోకి చూసి ఆగిపోయాడు.

    ఒకప్పుడు కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు అన్నట్లుండే కళ్ళు ఇప్పుడు కందిన పూలలా వున్నాయి. అలసటా, నిర్వేదం ఆ కళ్ళల్లో పోటీ పడ్తున్నాయి. గిరుక్కున వెనక్కి తిరిగి కిచెన్ లోకి వెళ్ళాడు.

    అమృత హడావుడిగా కిచెన్ డోర్ దగ్గరగా వేసి, వాష్ బేసిన్ వైపు నడిచింది. గబగబా మెడమీద రక్తం నీళ్ళతో కడుక్కుని కొంగునిండా కప్పుకుంది.

    హర్ష రెండు చేతుల నిండా ప్యాకెట్లతో వస్తూ, "ఎక్కడున్నావు? పిలిచినా రాలేదేం?" అంటూ వచ్చి వాటిని టేబుల్ మీద పెట్టాడు.

    "ఒక్క నిముషం మొహం కడుక్కుంటున్నాను" అంది అమృత మొహంమీద నీళ్ళు జల్లుకుని, మామూలుగా వుండడానికి ప్రయత్నిస్తూ.

    అతను ఆమె దగ్గరగా వచ్చి, వెనకనుంచి నడుం పట్టుకుని, "హు .... హు ... హు... " అంటూ నవ్వాడు.

 Previous Page Next Page