"మీగొప్పోళ్లకంటే మేమేనయం బాబు. మా ఇళ్లల్లో ఇంతవరకు పెద్దాళ్లను బాగానే చూసుకుంటున్నాం."
"నిజమే!" సాలోచనగా అంటూ నడక వేగం పెంచాడు వెంకట్రామయ్య. ఏసోబు కూడా గొడుగు పట్టుకొని వేగం పెంచాడు.
* * *
కామేశ్వరరావు ఇంటికి వచ్చేసరికి సుందరమ్మ వాకిట్లో కూర్చుని చీర చిరుగులు కుట్టుకుంటూ వుంది. పక్కనే కామేశ్వరరావు చిరిగిపోయిన ధోవతులు కూడా పడివున్నాయి.
భర్తను చూసి లేచి ఎదురువెళ్ళి చేతిలో వున్న కూరగాయల సంచి అందుకుంది.
"ఇవ్వాళ ఇంత ఆలస్యం అయిందేం?"
"పిల్లలకు పరీక్షలు దగ్గర పడ్తున్నాయి'...
"వాళ్ళిద్దరూ బాగానే సంపాదిస్తున్నారుగా? వాళ్లకు ప్రతినెలా ఇంతని పంపించమని రాయకూడదూ?" భర్తకు భోజనం వడ్డించి ఎదురుగా కూర్చుని అన్నది.
ముద్ద నోటి దగ్గరకు తీసుకెళ్తున్న కామేశ్వరరావు చెయ్యి మధ్యలోనే ఆగిపోయింది. ఏం నేను సంపాదించేది నీకు చాలడం లేదా?" కామేశ్వరరావు కంఠం తీవ్రంగా పలికింది.
సుందరమ్మ బిత్తరపోయింది.
'పట్టుచీరలు కట్టుకోవాలని వుందా? లేక నగలు దిగేసుకోవాలని వుందా?"
సుందరమ్మకు 'ఫెటీ ఫెటీ' మని ఎవరో నెత్తిమీద బాదుతున్నట్టుగా వుంది. ఎదురుగా వుంది తన భర్తేనా? ఆ మాటలు అంటున్నది నలభై ఏళ్లు తనతో కాపరం చేసిన తన భర్తేనా? వెర్రిచూపులు చూసింది. నోటమాట రావడం లేదు. మనసు చాలా లోతుగానే గాయపడింది.
కామేశ్వరరావు భార్యముఖంలోకి చూడడంలేదు. ఎటో దూరతీరాలను చూస్తున్నట్టుగా వున్నాయి అతని చూపులు. సుందరమ్మ ముఖంలోకి చూస్తే మాట్లాడలేక పోయేవాడు. మళ్ళీ అన్నాడు.
"లేకపోతే ఏమిటి? వాళ్ళముందు నేను నా పరిస్థితుల గురించి చెప్పుకోవాలా? డబ్బుకు కష్టంగా వుంది. తలాకాస్త పంపించండర్రా అని అడగాలా? నా బిడ్డల ముందు నేను బిక్షా పాత్రపట్టుకొని చేతులు చాచాలా?"
మాట్లాడుతున్న కామేశ్వరరావు కంఠం ఒక్కసారిగా ఎవరో నొక్కేసినట్టుగా ఆగిపోయింది. చివ్వున తలెత్తి చూశాడు. సుందరమ్మ కొంగు నోట్లో కుక్కుకుని వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటున్నది. కామేశ్వరరావు బిత్తరపోయాడు.
"సుందరీ! ఏడుస్తున్నావా? సారీ! ఏదో...."
"ఏనాడైనా పట్టు చీరలు కావాలన్నానా? నగలు కావాలన్నానా? నాకోసం వాళ్ళను డబ్బు అడగమన్నానా? మీరు పడుతున్న శ్రమను చూడలేక అన్నాను?" వెక్కిళ్లమధ్య అన్నది.
"నాకు మాత్రం తెలియదా? ఏదో విసుగులో అన్నాను. బాధపడకు సుందరీ! పశ్చాత్తాపపడుతూ అన్నాడు.
సుందరమ్మ కళ్ళు తుడుచుకుంది.
"బాధపడకు ఇంకెంతకాలంలే. ఆరు నెలల్లో చిన్నవాడి చదువు కూడా పూర్తి అవుతుంది. హౌస్ సర్జెన్సీకి వెళ్ళాక మనం వాడికి డబ్బు పంపించక్కర్లేదు. ఆనరోరియం ఇస్తారు."
"ఆతర్వాత వాడూ తన దారి తను చూసుకుని వెళ్ళిపోతాడు. సుందరమ్మ కంఠంలో మాటలకు అందని బాధ విన్పించింది.
కామేశ్వరరావు భార్య కళ్లల్లోకి లోతుగా చూశాడు. ఆ చూపులు బేలగా వున్నాయి. బోలుగా వున్నాయి. ఒకనాడు ఆ కళ్ళల్లో కాంతిరేఖలు కదులుతూ ఉండేవి. ఆ కళ్లలో ఎన్ని ఆశలు. భవిష్యత్తు గురించిన - తన భవిష్యత్తు కాదు - తన బిడ్డలు భవిష్యత్తు గురించిన ఎన్నెన్ని ఆశలు! కలలు! ప్రతి కాన్పులోనూ "అబ్బాయి ఎలా వున్నాడండీ! చాలా గొప్పవాడవుతాడు కదూ?" అని అడిగేది.
ప్రతి బిడ్డకూ పాలు ఇస్తూ గుండెను అమృత నింపుకొనేది. నిద్రపోతున్న బిడ్డ ముఖం చూస్తూ ఏదో సామ్రాజ్యాన్ని జయించినంత గర్వించేది. బిడ్డల్నికని, తమ ఆస్తిత్వాలనే మర్చిపోయి, వాళ్ళకోసమే బతికే తల్లులకు వృద్ధాప్యంలో మిగిలేవి ఇన్ని కన్నీళ్లేనా?
అందుకే హిందీ ఒక కవి స్త్రీ గురించి అన్నాడు :-
"ఆంచల్ మై హైదూద్ - అంఖోంమేపానీ హాయ్! నారీ జీవన్ కీ యహీ కరుణ్ కహానీ"
స్త్రీకి కొంగులో పాలు - కళ్లల్లో నీరు - ఇదే స్త్రీ జీవితపు దయనీయగాథ.
"అయ్యో! అదేమిటి? అన్నం తినకుండా అలాగే కూర్చుండిపోయారేం? పాపిష్టిదాన్ని. ఎండలో పడి అలసిపోయి వచ్చిన మనిషి మనసు కష్టపెట్టాను." నొచ్చుకుంది సుందరమ్మ.
"బాబు నిద్రపోతున్నాడా?" మనవడ్ని ఉద్దేశించి అడిగాడు. చంద్రం కొడుకు నెలలో సగం రోజులు నాయనమ్మ దగ్గిరే వుంటాడు.
"ఇంటికి పంపించాను."
"ఏం?"
"కోడలు కబురు చేసింది. వాళ్ళమ్మ వచ్చిందట. మనవడ్ని చూడాలంటుందట."
కామేశ్వరరావు మౌంమ్గా ముద్దకలిపి నోట్లో పెట్టుకున్నాడు.
"చంద్రానికి జ్వరం వస్తుందట."
కామేశ్వరరావు చివ్వున తలెత్తి చూశాడు?
"ఎవరు చెప్పారు?"
"కోడలు తమ్ముడు. వాడే ఆదిత్యాకోసం వచ్చాడు."
"ఎన్ని రోజులనుంచి?"
"నాలుగు రోజులుగా జ్వరం నార్మల్ కు రాకుండా వుందట. అందుకే వాళ్ళొచ్చారట."
"నువ్వెళ్ళు. సాయంకాలం ట్యూషన్స్ ముగించుకొని నేను అటునుంచి వస్తాను. ఇద్దరం కలిసి ఇంటికి రావచ్చు."
సుందరమ్మ మౌనంగా వుండి పోయింది.
"మాట్లాడవేం?"
"ఏం మాట్లాడను? వాడికి నాలుగు రోజులుగా మూసిన కన్నెరక్కుండా జ్వరం. ఆ పిల్లవాళ్ళ అమ్మకు కబురు పంపించింది. మనం ఊళ్లోవున్నాం. ఒక మాట చెప్పిందా? మనం అంత పరాయి వాళ్ళం అయిపోయామా? ఎందుకెళ్ళాలి?"
"నీ కొడుక్కు జ్వరం. నువ్వు వెళ్తావు. నేను వద్దన్నా వెళ్తావు. నాకు తెలుసు."
"ఎందుకు వెళ్ళాలి? నాకు మాత్రం..."
'పోనియ్ మానెయ్. నేనూ వెళ్ళను. వాళ్ళు కబురు చేసినప్పుడే వెళ్దాం. సరేనా?'
"అయ్యో ఇద్దరం వెళ్ళకపోతే ఎట్లా? బిడ్డ ఎలా వున్నాడో ఏమో! తల్లి ముండను కదా ఎంత లేదన్నా - మాట మాత్రం కబురు చెయ్యకూడదూ?'
"సరే! నువ్వొద్దులే. నేను వెళ్ళొస్తాను."
"వెళ్ళకుండా ఎలా వుండగలను? వాడికి జ్వరం అని విన్నప్పట్నుంచీ మనసు మనసులో లేదు."
కామేశ్వరరావు బోలుగా నవ్వాడు.
"అమ్మాయి వుత్తరం రాసింది."
"అయ్యో! మరి చెప్పరేమండీ! ఏం రాసింది? కులాసాగా వుందా? అల్లుడెలా వున్నాడు? ఏదైనా విశేషమా?"
"ప్రశ్నలు పూర్తి అయ్యాయా ఇంకా ఉన్నాయా?"
"ఏం రాసిందో చెబుదురూ!"
"అందరూ బాగానే వున్నారు. పాపకు అన్ని మాటలూ వచ్చేశాయట. అమ్మమ్మ, తాతయ్య అంటుందట. మనల్ని ఒకసారి రమ్మని రాసింది."