Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 24

    ఆ ప్రశ్నలకి అమృత తెలివి తెచ్చుకుని తన పరిస్థితి చూసుకుని, ఉలిక్కిపడింది. బెడ్ షీట్ తప్ప ఆమె శరీరం మీద మరో రకమైన ఆచ్చాదన ఏదీ లేదు! దాన్ని మరింత పైకి లాక్కుంటూ , "విక్రమ్....ప్లీజ్! ఒక్కసారి బైటికి వెళ్ళు" అంది స్వప్నంలోంచి బైటపడ్డట్టుగా చూస్తూ.

    "ఎన్ని రోజులకి! మళ్ళీ నీ గొంతు వింటున్నానూ!" అతని ఆనందం అంతా అతని గొంతులో ప్రతిధ్వనిస్తోంది.

    "తర్వాత మాట్లాడుకుందాం! ముందు బైటికి వెళ్ళు. నేను బట్టలు కట్టుకోవాలి" ఆమె కటువుగా అన్నా, ఆ గొంతులో కోపం కంటే దుఃఖమే ఎక్కువగా ధ్వనించింది.

    "ఓ....కే!" విక్రమ్ ఆమె ప్రవర్తనని ఆశ్చర్యంగా చూస్తూ ఆ గదిలోంచి బైటికి వెళ్ళిపోయాడు.

    అతను వెళ్ళగానే అమృత ఒక్కసారిగా మంచంమీద నుంచి లేచి, పరుగెత్తి తలుపు ధడాల్న వేసేసింది. నెమ్మదిగా ఆ తలుపు దగ్గరే జారి కూలబడిపోతాను అంటోంది నిస్సత్తువ ఆవరించిన శరీరం! గుండెలు బద్దలయ్యేలా వెక్కి వెక్కి ఏడవాలనుంది అంటోంది అలసిపోయిన మనసు! ఆ రెంటినీ ఆమె తన ఆధీనంలోకి తీసుకుంది.

    ఆమె బట్టలు ధరించి తలుపు తెరిచేసరికి ఎదురుగా విక్రమ్! ఆవేశంతో నిలువెల్లా కంపిస్తూ కనబడ్డాడు.

    చేతిలోని ఫోటోని పైకి ఎత్తి చూపిస్తూ, "ఇదేమిటీ?" అన్నాడు.

    అది తనూ, తన భర్తా కలిసి వున్న పెళ్ళిఫోటో! మెడనిండా పూలదండలతో, ప్రపంచంలోని ఆనందమంతా వారి మొహాల్లోనే తాండవిస్తున్నంత సంతోషంగా వున్నారు.

    అమృత శాంతంగానే జవాబిచ్చింది "పెళ్ళి ఫోటో"

    విక్రమ్ కోపాన్ని ఆపుకోలేక ఆమె భుజం పట్టి వూపుతూ అరిచాడు ఎవరి పెళ్ళి? చెప్పు? నేను అనుకుంటున్నది నిజం కాదనీ, అబద్దం నీ చెప్పు."

    ఆ వూపుకి ఆమె జాకెట్లోంచి మంగళసూత్రాలు బైటపడ్డాయి. అతను అనుకుంటున్నది 'నిజమే' అనడానికి రుజువులుగా!

    "నువ్వు అనుకుంటున్నది....చూస్తున్నదీ నిజమే విక్రమ్...ఇప్పుడు నేను మరొకరి భార్యని..." అమృత మాట పూర్తి చెయ్యకముందే ఆమె చెంప అదిరిపోయింది! ఆ తరువాత అతను విసురుగా తోసిన తోపుకి ఆమె వెళ్ళి సోఫాకి కొట్టుకుని క్రిందపడింది. అంతే విసురుగా వచ్చిన ఆమె పెళ్ళిఫోటో, ఆమె నుదుటిని తాకి క్రిందపడింది. అంతే విసురుగా వచ్చిన ఆమె పెళ్ళిఫోటో, ఆమె నుదుటిని తాకి క్రిందపడి భళ్ళున బద్దలైంది.

    ఆమె తన మదుటినించి స్రవిస్తున్న రక్తాన్ని ఎడమచేత్తో అదిమి పెడ్తూ, కుడిచేత్తో సోఫాని ఆసరాగా చేసుకుని లేచి నిలబడింది.

    విక్రమ్ కళ్ళు చింతనిప్పుల్లా మారి, ఎటువంటి వారికైనా దడ పుట్టించేటట్టుగా వున్నాడు.

    అమృత ఆ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "విక్రమ్ నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది. నువ్వు నిజంగా విక్రమ్ నే! ఇందాకట్నుంచీ అది కలేమో, లేక నువ్వు విక్రమ్ ని పోలిన మరో మనిషివేమో అనుకుంటూ వచ్చాను. కాని, కాదు. నువ్వు నిజంగా అప్పటి ఆ విక్రమ్ వే! ఇదెలా సంభవం? నువ్వు...నువ్వు..."అంటూనే వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది.

    ఆ దుఃఖాన్ని ఆపుకోవడానికి ఆమె విశ్వప్రయత్నం చేస్తూ, వివశంగా సోఫాలో కూలబడిపోయింది.

    విక్రమ్ ఆమె దుఃఖం చూడలేనట్టు ఆమె దగ్గరగా వెళ్ళి, జేబులోంచి రుమాలు తీసి, కళ్ళు తుడిచాడు. ఆ తరువాత దాన్ని ఆమె నుదుటికి కట్టుకట్టాడు. "నెప్పిగా వుందా?' ఆమె ముఖాన్ని రెండు చేతుల మధ్య పట్టుకుని బాధగా అడిగాడు. అతని కళ్ళల్లో కన్నీటి తెరకమ్మింది.

    అమృత అతని చేతుల నుంచి విడిపించుకుంటూ, "ఆపుకోలేని ఆవేశంతో ఒళ్ళు మరిచి ప్రవర్తించడం, తరువాత పశ్చాత్తాపపడడం, నువ్వేం మారలేదు విక్రమ్....ఈ ఆవేశమే నిన్ను నాకు దూరం చేసింది" అంది ఇంకా ఏడుస్తూనే.

    విక్రమ్ వెంటనే, "దూరమా?" అంటూ ఆమెని మరింతగా దగ్గరికి తీసుకుంటూ, "నిన్ను దూరం చేసుకోలేను! చేసుకోను. ఇంక నా వల్లకాదు!" అన్నాడు తీర్మానిస్తున్నట్టు.

    అనుకోని ఈ చర్యకి ఆమె బిత్తరపోయింది. ఏదో అనడానికి ఆమె నోరు తెరవబోయే అంతలో వినిపించాయి అతని మాటలు...ఆమె తలపై పిడుగులు కురుస్తున్నట్లూ....సముద్రం రౌద్రంగా ఘోషిస్తున్నట్లు...పర్వతాలు ఫెళఫెళమని విరిగి పడ్తున్నట్లూ, "పద! నా నుంచి నిన్ను ఎవరు విడదీస్తారో చూస్తాను. మేక్ ఇట్ ఫాస్ట్...నాతో వచ్చేసెయ్.

    ఏం మాట్లాడడానికి కూడా తోచనట్టు ఆమె చేష్టలుడిగి అలాగే నిలబడి చూస్తుండిపోయింది.

    అతను ఆవేశంతో ఎర్రనైన ముఖంతో, "నన్ను ఇంత త్వరగా మరిచిపోయి, మరో వ్యక్తిని 'ఎలా వివాహం చేసుకున్నావు' అని కూడా అడగను. ఎందుకంటే నేను ఈ వివాహానికి పెద్ద ప్రాముఖ్యతని ఇవ్వడం లేదు కాబట్టి. మానసికంగా నువ్వు ఎప్పుడో నాదానివి! నీ జీవితంలో మొట్టమొదటి వ్యక్తిని నేను! రెండవ స్థానంలోకి ప్రవేశించిన వ్యక్తిని గురించి నాకు అనవసరం! నేను లేను కాబట్టి అతన్ని చేసుకున్నావు. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఇంకా ఇక్కడ వుండవలసిన అవసరం నీకు లేదు! నాతో వచ్చేసెయ్....బయల్దేరు....." అతని గొంతు అంతకూ తీవ్రమయింది. "పద!" ఆమె భుజాన్ని గుచ్చి పట్టుకుని అన్నాడు.

 Previous Page Next Page