Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 24

    చిన్నకొడుకు రమేశ్ డాక్టరు చదువుతున్నాడు. "నాన్నా రిటైరు అయ్యావుకదా! ట్యూషన్స్ తో తమ్ముడ్ని ఎలా చదివిస్తున్నావు! డబ్బు ఏమైనా కావాలా?" అని బాగాసంపాదిస్తున్న పెద్ద కొడుకు రఘుకానీ, రెండో కొడుకు రామంకానీ మాట మాత్రంగానైనా అనలేదు. చంద్రం అప్పుడప్పుడు "నాన్నా డబ్బేమైనా కావాలా?" అని అడిగేవాడు. చంద్రం సంపాదన అంతంత మాత్రమే. అతని జీతం, బడిపంతులుగా ఎంత వస్తుందో కామేశ్వరరావుకు తెలుసు. వద్దురా నాన్నా! నీ సంపాదన గురించి నాకు తెలియదా?" అనేవాడు. అయినా చంద్రం పదీ, పరకా, తండ్రికి తెలియకుండా తల్లి చేతిలో పెట్టి వెళ్ళేవాడు.
    "పిచ్చి సన్నాసి. బంగారు గుణం. వీడికి అన్యాయం చేశాం. మంచి చదువు చదివించలేకపోయాం. వాడు అన్నదే తడువుగా ఆయన కూడా టీచర్ ట్రైనింగ్ కు పంపించాడు. టీచరుగా వుంటే తమ కళ్లముందే వుంటాడని తనూ ఆశపడింది. చంద్రం గురించి ఆలోచిస్తూ బాధపడేది సుందరమ్మ. "వీడ్ని ఏ డాక్టరో చదివిస్తే ఈనాడు ఆయన ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదు. మొత్తం భారం నెత్తినేసుకునేవాడు... ఏమో! ఏం చెప్పగలం? వీడూ పెద్ద సంపాదన పరుడై వుంటే వాళ్లలాగే ప్రవర్తించేవాడేమో?" ఇలా సాగేవి సుందరమ్మ ఆలోచనలు.
    కామేశ్వరరావు చిన్నకొడుకు చదువు కోసం రాత్రింబవళ్ళు ట్యూషన్లు చెబుతున్నాడు. పెన్ షన్ డబ్బులతో ఇల్లు గడుస్తున్నది. మధ్య మధ్య పండగలకు పిల్లలు వస్తూ పోతూ వుంటారు. తండ్రి కాస్తో కూస్తో వెనకేసే వుంటాడని కొడుకుల నమ్మకం.
    చంద్రం పెద్దకొడుకు సుందరమ్మ దగ్గిరే వుంటాడు. వాడికి నానమ్మ అంటే మహా ఇష్టం.
    వేసవికాలం. ఎండనిప్పులు చెరుగుతోంది. కుక్కలు నాలుకలు చాచి రొప్పుతూ నీడ వెతుక్కుంటున్నాయి.
    రోడ్డు మీద జన సంచారం లేదు.
    కామేశ్వరరావు ట్యూషన్ చెప్పి ఇంటికి బయలుదేరాడు. ఎండ నెత్తిమాడుస్తున్నది. తలనుంచి కారుతున్న చెమటబొట్లు చెంపలమీదుగా జారి గుండెమీద పడుతున్నాయి. చకచక నడుస్తున్నాడు. కాళ్లు మొరాయిస్తున్నాయి. నీరసంగా వుంది.
    వచ్చేనెలలోనన్నా గొడుగు కొనుక్కోవాలి. ఏమిటో ఇంత నీరసంగా వుంది? పెద్ద తనం వచ్చేస్తోందిగా? వచ్చేస్తుండడం ఏమిటి? వచ్చేసింది. ఎండకు తట్టుకొనే శక్తి పోయింది. ఇంకెంత కాలంలే? ఇంకా రెండేళ్లు. రమేశ్ చదువు పూర్తి అవుతుంది. డాక్టరుగా ఎక్కడో ఒకచోట సెటిల్ అవుతాడు. తనకు కాస్త ఊపిరి పీల్చుకొన్నట్టవుతుంది. తమ రెండు పొట్టలకూ ఎంతకావాలి? ఒకరిమీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ట్యూషన్స్ కూడా మానెయ్యవచ్చు' ఇద్దరూ కృష్ణా రామా అంటూ, ఒకరికొకరు తోడుగా నీడగా కాలం గడిపెయ్యవచ్చు. సుందరి వట్టి పిచ్చిది. ఏదేదో ఊహించుకుంటూ బాధపడుతుంది. కాలం మారిపోయిందనీ మానవ సంబంధాల విలువలు మారిపోయాయనీ ఆమెకు తెలియదు. లోకం పోకడ తెలియదు. తను వుండగా ఆమె వెళ్ళిపోతే అదృష్టవంతురాలు. తను ముందు వెళ్ళిపోతే... తల్లిని... పిల్లలు చూస్తారనే నమ్మకం తనకు లేదు. 
    "ఏమండీ కామేశ్వరరావుగారూ! ఇంత ఎండలో గొడుగన్నా లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు?" కామేశ్వరరావు ఆలోచనలనుంచి తృళ్లిపడి, తలతిప్పి చూశాడు. షావుకారు పద్దయ్యగారి వెంకట్రామయ్య కన్పించాడు. పాలేరు గొడుగు పట్టి నిల్చున్నాడు.
    "మీరా? ఇంటికి వెళ్తున్నాను. గొడుగు కొనుక్కోవాలి" గొణిగినట్టుగా అన్నాడు.
    "మా వాడికి ట్యూషన్ పెట్టించాలని వుందయ్యా!"
    కామేశ్వరరావు ముఖం వికసించింది. "ఎవర్ని పెట్టాలనుకుంటున్నారు?"
    "మీరు చెబితే బాగుంటుందని. మా అబ్బాయి కూడా అదే అంటున్నాడు. చెప్పగలరా?"
    "తప్పకుండా" అన్నాడు ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ.
    "ఒక మాట అడుగుతా ఏమీ అనుకోరుగదూ?"   
    "అడగండి పర్వాలేదు."
    "మీ ఇద్దరు కొడుకులూ పట్నాల్లో రెండు చేతులతో సంపాదిస్తున్నారటగా?"
    "బాగానే సంపాదించుకుంటున్నారు."
    "ఇంకా మీకు ఈ తాపత్రయం ఎందుకండీ? ఈ వయసులో ఎందుకింత కష్టపడాలి.
    "చిన్నవాడు ఇంకా చదువుతూనే వున్నాడు."
    "అన్నలు ఆ మాత్రం చదివించలేరా? రిటైర్ అయ్యారు. మీరిద్దరూ ఏ కొడుకు ఇంట్లోనైనా తలదాచుకోవచ్చుగా. ఎందుకండీ ఈ తాపత్రయం ఇంకా సంపాదించాలని."
    కామేశ్వరరావు మనసు చివ్వుక్కుమంది.
    "నా శరీరంలో శక్తి వున్నంతవరకు తలెత్తుకునే బతుకుతాను. కాని ఒకరింట్లో మీరు ఇంతగా ఎందుకు కష్టపడడం అని మీకు బాధ కలిగిస్తే క్షమించండి."
    "ఇంకా ఓపిక వుందిగా! ఇప్పట్నుంచే వాళ్లకు బరువు కావడం ఎందుకని...'
    "బరువేమిటయ్యా! ఇంతవరకూ వాళ్ల బరువు నువ్వు మొయ్యలేదూ? పెద్ద తనంలో తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత వాళ్లకు లేదా?"
    "తల్లి దండ్రులకు బిడ్డలు బరువుకారు."
    "మరి పిల్లలకు తల్లిదండ్రులు బరువుగా ఎందుకనిపించాలి? అది సరే! డబ్బు సహాయం అందిస్తున్నారా?"
    "ఎందుకు పంపించరూ? ఎవరూ పంపించకుండానే చిన్నవాడ్ని డాక్టరు చదివిస్తున్నానా? అది సరే! ట్యూషన్ చెప్పడానికి ఎప్పట్నుంచి రమ్మంటారు?" చిరాకును అణుచుకుంటూ సాధ్యమైనంత సౌమ్యంగా అడిగాడు కామేశ్వరరావు.
    వెంకట్రామయ్య తలెత్తి కామేశ్వరరావు కళ్లల్లోకి చూశాడు. ఆ కళ్లల్లో నీరసం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నది. వెంకట్రామయ్యకు జాలివేసింది. ఏమిటో! ఈ మనిషి చాదస్తం! అనుకున్నాడు మనసులోనే.
    "ఎప్పుడో ఎందుకూ? ఇవ్వాల్టినుంచే రండి, అయ్యో మాటల్లోపడి మిమ్మల్ని ఎండలో నిలబెట్టేశాను. నెత్తి మాడుతుంది. వెళ్ళండి."
    "వస్తాను. "రెండడుగులు వేసి ఆగి" ఆఁ అబ్బాయితో చెప్పండి. సాయంకాలం ఆరున్నరకు వస్తానని" అన్నాడు.
    "అలాగే! అలాగే" అని ఎండలో నడవలేక నడిచివెళ్తున్న కామేశ్వరరావును జాలిగా చూస్తూ నిలబడిపోయాడు వెంకట్రామయ్య.
    "పిల్లలెవరూ సరిగా చూస్తున్నట్టుగా లేదురా ఏసోబు!" అన్నాడు పాలేరుతో.
    "సూత్తావుంటే అట్టాగే వుందండి" ఆరు బాగా సూత్తే ఇంత కష్టం ఎందుకు పడ్తారండి."
    "ఈ రోజుల్లో కుర్రకారు మరీ అన్యాయంగా వున్నారు. పాపం! ఆ ప్రసూనాంబను చూడు! ఎంత వైభవంగా బతికింది? కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త వున్నంతవరకు బాగానే చూసుకున్నాడు. అసలే రోగిష్టి మంసిహి పాపం! హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడెక్కడో, ముసలాళ్లకోసం, అదేంటో హోమంట అందులో చేర్పించాడంట ఆ కొడుకు. తల్లిని తన ఇంట్లో వుంచుకొని ఇంత ముద్ద పెట్టలేడా? తనకు జన్మనిచ్చి, మలమూత్రాలు ఎత్తేసి, పెంచి ప్రయోజకుడ్ని చేసిన ఆ తల్లిని ఆ మాత్రం చూసుకోవడం వాడి ధర్మం కాదా?" వెంకట్రామయ్య నడుస్తూనే చెబుతున్నాడు. ఏసోబు ఆయన తలమీద ఎండ పడకుండా గొడుగు పట్టుకొని పక్కనే నడుస్తూ వింటున్నాడు.

 Previous Page Next Page