"ఉంటుందండీ!"
"ఎలా?"
"ఏ మనిషికీ మరోమనిషిమీద ఆధారపడి బతకాల్సిన అవసరం వుండకూడదు. ప్రతి వ్యక్తికీ ఏ వయసుకు తగిన సెక్యూరిటీ, అదే భద్రత, ఆ వయసుకు వుండాలి. అప్పుడు ఒకరిమీద ఒకరికి నమ్మకం వుంటుంది. గౌరవం వుంటుంది. స్త్రీల విషయంలోనే చూడండి. వాళ్ళ కష్టాలకు ప్రధానకారణాలు - వారికి ఆర్ధిక స్వాతంత్ర్యం లేకపోవడం - సోషల్ సెక్యూరిటీ లేకపోవడమే. ఈ సమస్యలకు పరిష్కారం ఈ వ్యవస్తలో లేదు. వ్యవస్థ మారాలి."
"బాగా చెప్పావు బాబూ! వ్యవస్థ ఎప్పుడు మారుతుందో? కాని ఈలోగా... పెద్ద వాళ్ల సమస్యలు..."
"వృద్ధాప్యంలో వారికి కావాల్సిందేమిటి చెప్పండి. మీకు నేను చెప్పక్కర్లేదు."
"అయినా చెప్పు. వినాలని వుంది." అన్నాడు కామేశ్వరరావు అల్లుడ్ని ప్రశంసా పూర్వకంగా చూస్తూ.
"వృద్ధ తల్లిదండ్రులకు, తమ పిల్లలు తమను నిర్లక్ష్యం చెయ్యడం లేదనే నమ్మకం వుంటే చాలు. అలాంటి నమ్మకాన్ని కలిగించడానికి పిల్లలు పెద్ద త్యాగాలేమీ చెయ్యక్కర్లేదు. ప్రతిరోజూ ఓ పదినిమిషాలు వాళ్ళతో కూర్చుని ఆప్యాయంగా మాట్లాడితే చాలు. పొంగిపోతారు. వాళ్ళకు కొండంత బలం వచ్చినట్టుగా వుంటుంది. "నాన్నా! అమ్మా! మేము సినిమాకు వెళ్తున్నాం. జాగ్రత్తగా వుండండి." అని చెప్పి సినిమాకు వెళ్ళండి. వాళ్ళకు అందలం ఎక్కినట్టుగా అన్పిస్తుంది. ఏ పౌరాణిక పిక్చరో వస్తే, వాళ్ళను కూడా తీసుకెళ్ళి చూపించండి. అంత మాత్రంచేత తమ స్వేచ్చకు - సినిమాహాల్లో తమ స్వేచ్చకు - ముసలాళ్ళు అడ్డు వస్తారనుకోవడం అంత సిల్లీ మరొకటి వుండదు. 'ఓ పదినిమిషాలు తల్లి దండ్రులతో మాట్లాడినందుకే, ఈర్ష్యతో మూతిముడుచుకునే భార్యల్ని ఏమనాలి? ఆ భార్యలకు భయపడే భర్తల్ని ఏం చెయ్యాలి? కాసేపు తల్లి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పినంత మాత్రాన కొడుకుని "అమ్మకూచి" అని ఈసడించుకొనే పెళ్ళాన్ని మగవాడు ఎలా గౌరవిస్తాడు? నేను చెబుతున్నది మా అమ్మా నాన్నా గురించేకాదు. ఏ అమ్మా నాన్న చరిత్ర తిరగేసినా ఈనాడు కన్పిస్తున్నది ఇదే!"
"ఇంతకూ ఏం చెయ్యాలనుకుంటున్నావ్?" కామేశ్వరరావు ప్రశ్న.
"సునందను సంతోషపెట్టడానికి అమ్మనూ, నాన్ననూ మా ఊరికి పంపిద్దామనుకుంటున్నాను. అక్కడ చిన్న ఇల్లు వుంది. నెలకు ఇంత అని పంపిస్తే అక్కడే పడి వుంటారు. పగలంతా ఆఫీసులో పనిచేసి ఇంటికి వచ్చిన, నేను టెన్ షన్ భరించలేకుండా వున్నాను. అందుకే వాళ్ళను పంపించాలనుకుంటున్నాను." అంటూ అత్తగారి ముఖంలోకి చూశాడు.
సుందరమ్మ ముఖం వికసించింది. "ఆ పని చెయ్యి బాబూ! అందరికీ మంచిది." అన్నది.
"మామయ్యగారూ! మీ అభిప్రాయం కూడా చెప్పండి."
కామేశ్వరరావు అదోలా నవ్వాడు.
"వెయ్యి శకునాలు చెప్పిన బల్లి చివరకు కుడితి తొట్లో పడి చచ్చిందట. అట్లా వుంది నీ నిర్ణయం."
"అదేమిటండీ! అట్టా అంటారు. అబ్బాయి మంచి మాటే అన్నాడుగా?"
"అవును! మన అబ్బాయిలకంటే కూడా ఒకడుగు ముందుకే వేస్తానంటున్నాడు. మంచిపనే! ఇక మీదట నీ కొడుకులు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని నాముందు మాత్రం అనకు."
సుందరమ్మ నెమరికణతమీద కంకరరాయి దెబ్బతగిలినట్టుగా బిత్తరబోయింది.
"నన్నేం చెయ్యమంటారో చెప్పండి."
"ఏమిటయ్యా చెప్పేది? అంత పెద్ద లెక్చరు దంచిన వాడివి తీసుకోవాల్సిన నిర్ణయమా అది!"
"మరి!"
"నీ భార్యనే పుట్టింటికి పంపించెయ్యి.
"నాన్నా!" సునంద పెద్దగా అరిచింది.
"థాంక్సండీ! మీరు ఏమంటారో తెలుసుకుందామనే అలా అన్నాను. అంతేగాని ఏ పరిస్థితుల్లోనూ మా అమ్మానాన్న నాదగ్గర నుంచి వెళ్ళరు."
"ఇంకేం నన్నే పంపించెయ్యండి." ఏడుస్తూ అన్నది.
"ఆమాట నేను అనలేదు."
"అమ్మా! సునందా! ఒకటి చెప్పు! మమ్మల్ని అన్నయ్యలందరూ వదిలేస్తే నువ్వు ఆదరిస్తావా? మాటమారుస్తూ అడిగాడు తండ్రి.
"తప్పకుండా నాన్నా! నేను బతికి వుండగా మిమ్మల్ని గాలికి వదిలేస్తాననుకున్నారా?"
"వదిలెయ్యక ఏం చేస్తావమ్మా!"
"నా ఇంటికి తీసుకెళ్తాను."
"అది నీ ఇల్లు ఎలా అవుతుందమ్మా? అల్లుడు ఒప్పుకోవాలిగా?"
"ఒప్పుకుంటారు నాన్నా! ఎందుకు ఒప్పుకోరు? అది నా యిల్లు కూడా."
"ఎందుకు ఒప్పుకోవాలి? వాళ్ళ అమ్మానాన్నా కొడుకు ఇంట్లో వుండకూడదా? నువ్వు నీ తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటావా? నీ తల్లిదండ్రులకు ఆ ఇంట్లో వుండడానికి ఏం హక్కు వుంది? సూర్యం ఇల్లు అది. సూర్యం ఇంతవాడెలా అయ్యాడు? "కామేశ్వరరావు కంఠం తీవ్రంగా పలికింది.
సునంద బిక్కమొఖం పెట్టింది.
"నేను వాళ్ళను పంపించమని అనలేదు నాన్నా! ఆయన కూడా ఆమాట నాతో ఎప్పుడూ అనలేదు. ఇప్పుడే వింటున్నాను."
"ఏదో చిన్నతనం బాబూ! ఏమీ అనుకోకు" సుందరమ్మ కూతురి తల నిమిరింది.
"సునందా! ఇప్పుడే! మీ అమ్మా నాన్న ముందే నీ మనసులో మాట చెప్పు." సూర్యం నిలదీసినట్టుగా అన్నాడు.
"మా అత్తయ్యా, మామయ్యా నా దగ్గరే వుంటారు. వాళ్లనెవరూ నానుంచి దూరంగా పంపించలేరు." సునంద మాటలకు అందరూ అవాక్కయ్యారు.
"అది నా బిడ్డ. నేను పెంచిన బిడ్డ" అన్నట్టు చూశాడు ముఖంలోకి కామేశ్వరరావు.
"నా తల్లే! నా బంగారమే!" సుందరమ్మ మురిపెంగా కూతురి తల నిమిరింది.
"ఇలాంటి సమస్యలు ఇంత తేలిగ్గా పరిష్కారం అవుతాయా?" సందేహం తలెత్తింది కామేశ్వరరావు బుర్రలో.
* * *
ఐదేళ్లు గడిచాయి.
సంఘపరంగా చెప్పుకో తగ్గ మార్పులు రావాలంటే ఐదేళ్ల కాలం చాలా తక్కువ. కాని ఒక వ్యక్తి జీవితంలో ఐదేళ్ల కాలం చాలా ఎక్కువనే చెప్పాలి. ఐదేళ్లలో ఒక వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోవచ్చు. కామేశ్వరరావు జీవితం పూర్తిగా మారిపోయింది. ఆరు నెలల క్రితమే రిటైర్ అయ్యాడు.
పెద్దకొడుకు విజయవాడలో బాగా సంపాదిస్తున్నాడు. నర్సింగ్ హోమ్ కు మంచి పేరే వుంది. అతనికి ఇద్దరు ఆడపిల్లలు. ఒక మగపిల్లవాడు. రెండోవాడికి ఇద్దరు. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు. మూడోవాడు చంద్రానికి కూడా ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల వాడు.
అవసరం అయినప్పుడు పురుళ్ళు పొయ్యడానికి సుందరమ్మ కొడుకులు ఇళ్లకు వెళ్తూ, వస్తూ వుంటుంది. కామేశ్వరరావు సాధారణంగా ఎవరి ఇళ్లకూ వెళ్ళడు.
నాలుగోవాడు సత్యనారాయణ ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. అసలు వున్నాడో లేడో, వుంటే జైల్లో వున్నాడో, ఎక్కడున్నాడో తెలియదు. సుందరమ్మకు మాత్రం తనకొడుకు ఏనాటికైనా తిరిగొస్తాడనే నమ్మకం వుంది. సత్యం పేరు ఎత్తితేనే కామేశ్వరరావు కస్సుమంటాడు. రాజకీయాల్లో తిరుగుతున్నాడని ఆనోటా, ఈనోటా వింటూనే వున్నాడు కామేశ్వరరావు. కాని సుందరమ్మకు చెప్పలేదు ఆ విషయం.