Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 22

    'మా అమ్మకూ నాన్నకూ నాకంటే ఎవరూ లేరని మీకు తెలుసు. వాళ్ళు నన్ను అపురూపంగా, కంటి పాపలా కాపాడుతూ పెంచారు."

    "కదామరి! ఒక బిడ్డ బిడ్డా కాదుడు ఒక కన్ను కన్నూ కాదు అంటారు. ఒకే సంతానం వున్న తల్లిదండ్రులు ఆ బిడ్డను ఎలా పెంచుకుంటారో నేను ఊహించగలను బాబూ!' అంది సుందరమ్మ. సునంద ముఖం విసుగ్గా పెట్టింది.
    "నేను తప్ప వాళ్ళకు వేరే ప్రపంచమే లేదు. ఎన్నో కష్టాలు పడి నన్ను ఇంతవాడ్ని చేశారు. ప్రయోజకుడ్ని చేశారు. ఈ జన్మ, ఈ శరీరం వాళ్ళు ఇచ్చింది. ఈ వయసులో వాళ్ళను సుఖపెట్టడం నా బాధ్యత కాదంటారా మామయ్యా!"
    "అలా ఎవరంటారు?"
    సూర్యం సునంద ముఖంలోకి చూశాడు.
    "సునంద ఏమైనా అంటున్నదా?" కామేశ్వరరావు కంఠం అదోలా మోగింది.
    "ఏమే!" సుందరమ్మ కూతుర్ని చూస్తూ అంది.
    "అసలు సంగతి చెప్పండి" సునంద రోషంగా అంది.
    "నువ్వే చెప్పు" అన్నాడు సూర్యం.
    "అసలు సంగతేమిటి? సునంద వాళ్ళు మీతో వుండడానికి వీల్లేదంటున్నదా? కామేశ్వరరావు కంఠం తీవ్రంగా వుంది.
    "అది కాదు నాన్నా! నేనేం వాళ్ళను వెళ్ళగొట్టమని అనలేదు. వాళ్ళు ప్రతిదానికీ సణుగుతూ వుంటారు. మా అత్తగారైతే మరీనూ!"
    "కొందరికి వయసుతో పాటు చాదస్తం అబ్బుతుంది. ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటారు. మనక్షేమం కోరే ఇస్తుంటారు. వాళ్ళ సలహాలన్నీ మనం పాటించనక్కర్లేదు. వాళ్ళ సలహాలను మనం గౌరవిస్తున్నట్టుగా నటిస్తేచాలు."
    "నావల్ల కాదు."
    కామేశ్వరరావు కూతుర్ని ఆశ్చర్యంగా చూశాడు.
    "ఏమిటే ఆ మాటలు?" తల్లి కసురుకుంది.
    "లేకపోతే ఏమిటమ్మా! వాళ్ళ కొడుకు ఏదో కష్టపడి పోతున్నట్టుగా ఒకటే సణుగుడు.
    "అందుకు కారణం వాళ్ళు నన్ను అమితంగా ప్రేమించడమే. తరాల అంతరాల మధ్య ఏర్పడే ఘర్షణ ఇది. చిన్నవాళ్ళు చేసే కొన్ని పనులు వాళ్ళకు నచ్చవు. అలాంటి వాటావళ్ల వాళ్ళ సంతానం కష్టాల్లో ఇరుక్కుంటుందని భ్రమ పడ్తారు. వాళ్ళ మంచికోసమే చెబుతున్నామని భావిస్తారు. అందుకే కల్పించుకొని సలహాలిస్తారు. ఆ సలహాలు పాటించాలని కూడా లేదు. వాళ్ళనూ, వాళ్ళ అభిప్రాయాలనూ గౌరవిస్తున్నట్టు వాళ్ళకు అన్పిస్తే చాలు. అంతకంటే, వృద్దాప్యంలో తల్లిదండ్రులు తమ సంతానం నుంచి కోరుకొనేది ఏదీ వుండదు. వాళ్ళ ఆలోచనల పరిథి ఆగిపోతుంది. చిన్నవాళ్లు ఆలోచించగలవాళ్లు, పెద్దవాళ్ళను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి."
    "దేనికయినా ఒక హద్దంటూ వుండాలి."
    సుందరమ్మ సునందకేసి జాలిగా చూసింది. అంటే! ఆ ముసలాళ్లు తన బిడ్డను అంత బాధ పెడ్తున్నారా! అల్లుడు మరీ అంతగా వాళ్లను వెనకేసుకు రావడం ఏమిటి. తన ఆలోచనకు తనే ఉలిక్కిపడింది. ఏమిటి తనిలా ఆలోచిస్తున్నది? తన కొడుకుల్ని గురించి మరోలా ఆలోచిస్తుందేం?
    "మా అమ్మ నాన్నా నిన్నేం బాధలు పెడ్తున్నారా? అనరాని మాటలు అంటున్నారా? వాళ్ళను కాస్త అర్ధం చేసుకోమంటున్నాను అంతేగా?
    "నా వల్లకాదు".
    "సునందా!" తండ్రికేకకు బిక్క చచ్చిపోయింది సునంద.
    "వాళ్ళ చాదస్తం చూస్తుంటే ఒకోసారి నాకు విసుగు పుడుతుంది మామయ్యా! ఒకోసారి వాళ్ళతో మాట్లాడటం కూడా మానేస్తాను. నేను రెండు రోజులు పలకరించకపోతే వాళ్లు దిగాలుపడిపోతారు. వాళ్ళను అలా చూస్తుంటే నాకు చాలా బాధగా వుంటుంది. సునంద నన్ను సాధిస్తుంది. అమ్మా నాన్నలంటే అంత ప్రేమ కారిపోయేవాడివి పెళ్ళెందుకు చేసుకున్నావ్? అని సాధిస్తుంది. ఆఫీసునుంచి అలసి పోయి వస్తాను. సునంద మూతి ముడుచుకొని కూర్చుని వుంటుంది. అమ్మ ఓమూల మునగతీసుకొని వుంటుంది. ఏమయిందని సునందను అడిగితే మీ అమ్మనే అడుగు" అంటుంది. అమ్మను అడిగితే "ఏమీ లేదు బాబూ! వొంట్లో బాగాలేదు." అంటుంది. చివరకు సునంద మీద విసుక్కుంటాను. పెద్దవాళ్ళను అర్ధం చేసుకోమంటాను. జీవితపు చివరి అంచుమీద తూలిపోవడానికి సిద్ధంగా నిల్చుని వున్న వాళ్ళను ప్రేమతో చూడమంటాను. చివరి రోజుల్లో తల్లి దండ్రుల్ని ప్రశాంతంగా వుంచడం పిల్లల బాధ్యత కాదంటారా చెప్పండి!"
    "నెపం అంతా నామీదే వెయ్యండి" సునంద ఏడుపు గొంతుతో అంది.
    "సునందా! నువ్వు నా కూతురివి. మరోలా ప్రవర్తిస్తావనుకున్నాను."
    "నాన్నా!"
    "అవునమ్మా! కాస్త ఆలోచించు. చంద్రం ఊళ్లో వేరే కాపరం పెట్టాడని ఎంతో బాధ పడిపోయావు. మీ అమ్మ అయితే ఇక సరేసరి! మా గురించి నువ్వు ఆలోచించావు. మీ అన్నయ్యలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని బోలెడంత బాధపడ్డావు. అందుకు కారణం వాళ్ల భార్యలేనని కూడా అనుకుంటున్నావ్. మరి నువ్వు చేస్తున్నదేమిటి? మాకు ఆరుగురు సంతానం. ఒక్కరు కాకపోతే ఒకరైనా చివరి రోజుల్లో చూడకపోతారా అనే ధైర్యం వుంటుంది. కాని మీ అత్తమామలకు ఒకే కొడుకు. ఆ కొడుకు తల్లిదండ్రుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదా? రేపు నీకూ పిల్లలు పుడ్తారు. వాళ్లను అల్లారు ముద్దుగా, నీ కలల పంటగా పెంచి పెద్ద చేస్తావు. వాళ్ళే నీకళ్ళ వెలుగుగా భావిస్తావు. వాళ్ళు పెరిగి పెద్దయి ప్రయోజకులౌతారు. పెళ్లాలు వస్తారు. వృద్ధాప్యంలో వున్న నిన్ను ఈసడిస్తారు..."
    "నాన్నా!"
    "ఏం? ఎప్పుడో జరగబోయేదాన్ని ఊహించుకోవడానికే భయంగా వుందా?"
    "వాళ్ళు ప్రతిదానికీ సణుగుతూ వుంటారు నాన్న!"
    "పెద్దవాళ్ళకు కొన్ని చాదస్తాలు వుంటాయన్నానుగా! సునంద గిర్రున తల తిప్పి భర్తను చూసింది. "పెద్దవాళ్ళందరూ మరి అలా వుండరేం? శకుంతల అత్తగారు మామగారూ మరి అలా వుండరేం?"
    "వాళ్ళ సంగతి వేరు."
    "ఏమిటా వేరు?"
    "రాజా తండ్రి బిజినెస్ మాగ్నెట్ .అతడి పేరు మీద బోలెడంత ఆస్తివుంది. ఇంకా సంపాదిస్తున్నాడు. అతడికి బిడ్డల మీద ఆధారపడి బతుకుతున్నాననే కాంప్లెక్సులేదు. ఏదైనా విషయంలో కొడుకు తండ్రితో ఏకీభవించకపోయినా, విసుక్కున్నా, కొడుకు తనను చిన్న చూపు చూస్తున్నాడనే భావం కలగదు. ఇక్కడ మానాన్న విషయం వేరు. మా నాన్నకు ఉన్న ఆస్తి నేనే! నామీద ఆధారపడి బ్రతుకుతున్నాననే భావం ఆయనకు వుంటుంది. అది సహజం. ఎన్నో కష్టాలు పడి చదివించాడు. నేను ప్రయోజకుడ్నయితే తమ కష్టాలు తీరతాయని కలలు కన్నాడు. తీరా నేను సంపాదించడం ప్రారంభించాక, నా సంపాదనమీద ఆధారపడి బతుకుతున్నానన్న భావం ఆయనలో చోటు చేసుకుంది. మనిషికి, తాను మరొకరి మీద ఆధారపడి బతుకుతున్నాననే భావం కలిగిన క్షణంలోనే సగం చచ్చిపోతాడు. అందుకే నేను ఏ కొంచెం విసుక్కున్నా పూర్తిగా చచ్చిపోయినట్టుగా కుంగిపోతాడు. మనిషికి సెక్యూరిటీ కావాలి. అది లేదనుకున్నప్పుడే అన్ని బాధలూ వస్తాయి. అదే మానాన్నకు బ్యాంకు బ్యాలెన్సు వున్నదనుకో నేను విసుక్కున్నా పట్టించుకోడు. అంతే కొడుగ్గా నాకా హక్కు వుందని అనుకుంటాడు".
    "చాలా బాగా చెప్పావు సూర్యం. కాని ఇలాంటి సమస్యలకు పరిష్కారం వుంటుందంటావా?" కామేశ్వరరావు సూర్యం విజ్ఞతకు విస్తుపోతూ అడిగాడు."  

 Previous Page Next Page