అమృత అతన్ని మధ్యలోనే ఆపుతూ "మధ్యాహ్నం నువ్వు ఆఫీసు నుంచి వస్తావు...నేనేమో స్నానం చేసి బాత్ రూమ్ లోంచి....అలాగే వచ్చేసి....బట్టలు కట్టుకోబోతూ వుంటాను..."
"అప్పుడు నేను..." హర్ష పూర్తి చెయ్యబోయాడు.
"ఆగు! మధ్యలో అడ్డు రాకుండా పూర్తిగావిను! నువ్వు తలుపు తోసుకుని లోపలికి వచ్చేస్తావు. నేను నిన్ను చూసి కెవ్వుమని అరుస్తాను."
"ఎందుకూ?" హర్ష అయోమయంగా అడిగాడు.
"ఉష్ చెప్పేది విను! దుర్మార్గుడా వెళ్ళు....వెళ్ళిపో అంటాను. నువ్వు వెళ్ళిపోవు, నా దగ్గరగా వచ్చేస్తావు, నువ్వు వినవు! నన్ను పట్టుకోకు...ఒద్దు...అని అరుస్తుంటాను, నువ్వు వినవు! నన్ను చుట్టేస్తావు. ఇదంతా చీకట్లోనే-మెయిన్ ఆఫ్ చేసి వుంటుందన్నమాట."
"ఓసి రాక్షసీ! ఆ తరువాత..."ఆశ్చర్యంగా అడిగాడు హర్ష "నేను నీ చెల్లెలు లాంటి దాన్ని అంటావా? కొంపదీసి!"
"అనన్లే! వదులూ వదులూ...లేకపోతే చంపేస్తాను, అని గింజుకుంటాను. నువ్వు వదలకుండా అట్టహాసం చేసి...ఏదీ? ఓసారి అలా నవ్వు."
హర్ష నవ్వాడు.
"ఇంత అందంగానా? నేను "టెంప్ట్" అయిపోతాను. అలా కాదు. ఇలా..." అమృత వికటంగా నవ్వబోయే సరికి పొలమారింది.
హర్ష ఆమె నెత్తిమీద సున్నితంగా తట్టి "ఇదంతా ఎందుకు అమృతా!" అన్నాడు.
"అబ్బా! రోజూ ఒకలాగేనా....రొటీన్ గా లేదూ..." గారంగా అంది.
"ఆ...తరువాత..." అడిగాడు హర్ష.
"సిగ్గులేకపోతే సరి! అన్నీ చెప్పాలి" అమృత అతని చెవి మెలిపెట్టి వదిలి, అక్కడనుంచి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
హర్ష మామూలుగా ఆఫీసుకి వెళ్ళిపోయాడు.
అర్జంట్ ఫైలుమీద అతని సంతకం అవసరమైతే కీర్తి తలుపు తోసుకుని లోపలికి వెళ్ళబోతూ కంగారుగా భయంగా చూస్తూ నిలబడి పోయింది.
హర్ష ఒక్కడే కళ్ళు మూసుకుని "హా....హా....హా..."అని వికటంగా నవ్వి "అలాకాదు..." అని తల విదిలించి, మళ్ళీ ట్రై చేస్తున్నాడు.
ఉదయం వచ్చినప్పుడు బాగానే వున్నాడే పాపం! అనుకుంది విచారంగా.
ఇంతలో హర్ష తల ఎత్తి కీర్తిని చూసి, 'రా...కీర్తి...నేనే పిలుద్దామనుకుంటున్నాను. నీకు వికటాట్టహాసం అంటే తెలుసా?" అడిగాడు.
కీర్తి అర్ధం అయినట్లు "ఇదేదో పాపం ఆ భార్యామణి పెట్టిన విషమ పరీక్షే!" అనుకుంది.
వచ్చే నవ్వు ఆపుకుంటూ "మీరు తెలుగు సినిమాలు చూడరా సార్!" అని అడిగింది.
చాలా తక్కువ! ఇప్పుడు దానికోసం నేను తెలుగు సినిమాలు చూడాలా?" దిగులుగా అడిగాడు హర్ష.
"అక్కర్లేదు! చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు"
"ఎలా?"
"నవ్వు రానప్పుడూ, మనకీ భయం వేసేటప్పుడూ మనమే ముందు గట్టిగా నవ్వేసి ఎదుటి వాళ్ళని భయపెట్టాలనుకోవడమే, వికటాట్టహాసం! వికటాట్టహాసం చేస్తే 'నోరు' శివ తాండవం ఆడినట్టుండాలన్నమాట" అంది. ఆమె వెళ్ళాక ఇంటికి ఫోన్ చేసి,
"శివతాండవం అంటే గుర్తొచ్చింది. ఆ శివుడూ - పార్వతి పోలిక బావోలేదు."
"ఏం?" అంది అమృతవర్షిణి అట్నుంచి.
"తనకోసం అంత తపస్సు చేసిన పార్వతిని కేవలం పక్కనుంచుకుని గంగని తల కెక్కించుకున్నాడుగా."
"నిజమే సుమా" అంది.
అతడు గొప్ప సత్యం కనుక్కొన్నట్టు నవ్వేడు. తన జీవితంలో అదే రివర్సుగా జరగబోతుందని అతనికి తెలీదు.