Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 21

    "అమ్మా...ఇతనికి.." అన్నాడు.

    "అతనికి ఆమె చిరునామా తెలిసిపోయింది నాన్నా!" అంది భ్రమరాంబ. ఏడుపొక్కటే తరువాయి ఆ అమ్మాయికి.

    ఆయన గొంతు సవరించుకుని, విక్రమ్ తో "చూడు బాబూ! పెద్దవాడ్ని చెప్తున్నాను విను. ఆ అమ్మాయికి..." పెళ్ళయింది అన్న మాట పూర్తిగా చెప్పకముందే అడ్డుపడి.

    "మీరు ఈ ఇల్లు ఖాళీ చెయ్యవలసి వుంటుంది" అన్నాడు గంభీరముగా.

    "ఆ!..." ఆయనా, భ్రమరాంబా ఒకేసారి నోళ్ళు తెరిచేశారు చెప్పాల్సిన విషయం మర్చిపోయి.

    "అవును! ఎదురింట్లో నా ప్రియురాలు వుంది గాబట్టి ఈ ఇంట్లో నేను వుండాలనుకుంటున్నాను. ఆమె వచ్చే దాకానే! అందుకని మీరు వెంటనే ఖాళీ చేస్తే మర్యాదగా వుంటుంది" అన్నాడు! సిగరెట్ వెలిగించుకుంటూ.

    విక్రమ్, ఉన్నపళంగా పొమ్మంటే ఎలా?" అంది భ్రమరాంబ నెమ్మదిగా.

    "నాకు తెలియదు! సాధ్యమైనంత త్వరగా ఖాళీ చెయ్యండి! లేదా....నా సంగతి తెలుసుగా."

    భ్రమరాంబ తండ్రి ఇక ఊరుకోలేకపోయాడు. "ఏమిటయ్యా నీ అఘాయిత్యం? నీ దౌర్జన్యం చూస్తూ ఊరంతా చేతులు ముడుచుకుని కూర్చుంటుందనుకున్నావా? పోలీస్ రిపోర్టు ఇచ్చానంటే?" ఆయన మాటలు పూర్తికాకుండానే విక్రమ్ విసురుగా ఆవైపు కదిలి, కాలర్ దగ్గర చొక్కా పట్టుకుని "ఏం చేస్తావ్? పోలీస్ రిపోర్టు ఇస్తావా? ఇవ్వు చూద్దాం, ఏం జరుగుతుందో ఇవ్వు...ఊ" అన్నాడు.

    "విక్రమ్ ఆయనకీ అసలే ఒంట్లో బాగాలేదు వదిలిపెట్టు..." అంది భ్రమరాంబ తండ్రిని వదిలిస్తూ.

    విక్రమ్ వదిలేస్తూ "మరి ఎప్పుడు ఖాళీ చేస్తారు?" అడిగాడు.

    "మేము ఖాళీ చెయ్యడం ఎందుకు విక్రమ్? వెనకాల మెట్ల కింద ఒక రూం వుంది, నీకు కావలసినన్ని రోజులు అందులో వుండు" అంది.

    "అమ్మా...." అంటున్న తండ్రివైపు మాట్లాడవద్దన్నట్టు చూసింది.

    "వె....న....కా.....లా?" చిరాగ్గా అడిగాడు విక్రమ్. "నో! నాకీ ముందు గదే నచ్చింది. ఇక్కడ్నుంచి అయితే ఎదురిల్లు బాగా కనిపిస్తుంది. మీరే వెనకాల వుండండి" మొండిగా అన్నాడు.

    "సరే!" వెంటనే ఒప్పుకుంది భ్రమరాంబ.

    ఆమె తండ్రి ఏమీ చెయ్యలేనట్టు, పళ్ళు కొరుక్కుంటూ కోపం దిగమింగుకున్నాడు.

    "త్వరగా ఖాళీ చెయ్యండి, నేను రేపు ఉదయమే వచ్చి చేరిపోతాను" చెప్పాడు విక్రమ్.

    "అలాగే! ఇప్పుడే చేసేస్తాము" చెప్పింది భ్రమరాంబ.
   
                                                 *    *    *

    "భ్రమరా...భ్రమరా" తలుపుకొట్టింది అమృత.

    భ్రమరాంబ బద్దకంగా లేచి "ఎవరూ?" అంది.

    "నేనే....ప్రొద్దున్నే రైలు దిగాం. పాలు పోయించుకున్నావా? ఇవాళ వూరు నుంచి వస్తామని చెప్పానుగా." అమృత అడుగుతూ వంటింటిట్లోకి వచ్చేసింది.

    భ్రమరాంబ నిద్రమత్తు వదిలిపోయింది.

    "వెనకాల వైపునుంచి వచ్చావా?" అడిగింది.

    "అవును, ముందువైపు తలుపు ఎంతకొట్టినా తియ్యకపోతేనూ..."

    వర్షా నువ్వు వెళ్ళిపో, నేను వచ్చి పాలు ఇస్తాను" కంగారుగా చెప్పింది భ్రమరాంబ.

    "అదేమిటే? ఎందుకంత కంగారుగా వున్నావూ? అసలిలా వంటింట్లో పడుకున్నారేమిటి?"

    "అన్నీ చెప్తాను, నువ్వు ముందిక్కడనుంచి వెళ్ళిపో" అంది భ్రమరాంబ.

    "సరే! త్వరగా రా, హర్షకి లేవగానే కాఫీ కావాలి" అంటూ ఆమె వెళ్ళిపోయింది.

    భ్రమరాంబ ఆమె వెనకాలే వచ్చి  గేటు వేసేస్తూ "త్వరగా వెళ్ళిపో" అంది.

    "పీడ కలేమైనా వచ్చిందా?" అమృత నవ్వుతూ వెళ్ళిపోయింది.

    విక్రమ్ మంచానికి అడ్డంగా పడి నిద్రపోతున్నాడు. అతను సాధారణంగా రాత్రి ఎక్కడెక్కడో తిరిగి చాలా ఆలస్యంగా పడుకుని పగలు పదింటికి లేవడం! అమృత ఈ రోజు వస్తుందని తెలీదు పాపం! తెలిస్తే అసలీ రాత్రి నిద్రపోయే వాడు కాదు! అనుకుంది కసిగా భ్రమరాంబ. ఆ 'కసి'లో దాగిన ఈర్ష్య ఎందుకో ఆమె మనస్సుకి తెలుస్తోంది.

    అంతలో వాళ్ళింటికి బంధువులొచ్చారు.

   
                                                                           *    *    *

    "హేపీ బర్త్ డే టూ యూ!" వెనక నుండి అమ్రుతని చుట్టేస్తూ అన్నాడు హర్ష.

    "థాంక్యూ! మరి నాకు ఏం ప్రెజంటేషన్ ఇస్తున్నావు?" అడిగింది అమృత, అతనివైపు తిరిగి.

    "ఏం కావాలి? చీరా"

    "పుడ్తూనే చీర కట్టుకోమంటావా?"

    "అంటే బర్త్ డే సూట్ లో వుంటావా ఇవాళ!

    అయితే లీవ్ పెట్టేస్తాను " ఉషారుగా అన్నాడు హర్ష.

    "ఇప్పుడు కాదు గానీ మధ్యాహ్నం మనం చాలా ఎగ్జయిటింగ్ గా టైం స్పెండ్ చెయ్యబోతున్నాం ఒంటిగంట కల్లా వచ్చెయ్యండి" చెప్పంది నవ్వుతూ.

 Previous Page Next Page