Previous Page Next Page 
సంధియుగంలో స్త్రీ పేజి 22


    "స్త్రీల వల్ల బాధపడే పురుషులు లేరా? ఎంతమంది భార్యలు మగవాళ్ళను కాల్చుకు తినడం లేదు? దానికి మీ సమాధానం ఏమిటి అని నన్ను అడుగుతూ ఉంటారు మీ సమాధానం వినాలని ఉంది" అన్నాను.    
    లక్ష్మి అదోలా నవ్వారు పూర్తి అవగాహనలేని వాళ్లు వేసే ప్రశ్న అది అవి వ్యక్తిగతమయిన సమస్యలు ఇలాంటి సమస్యల్ని గురించి ఆలోచించేటప్పుడు కొద్ది కుటుంబాలనూ, వ్యక్తుల్నీ దృష్టిలో పెట్టుకుని కాదు ఆలోచించాల్సింది సమాజపరంగా ఆలోచించాలి ఇది పురుష ప్రపంచం పురుషుడు కావాలనుకుంటే తనను బాధించే భార్యను తేలిగ్గా వదులుకోగలడు.     
    కాని స్త్రీకి ఆ అవకాశం లేదు భార్య పెట్టే బాధల్ని భరించే భర్తలు కూడా ఉండవచ్చు కారణాలు వేరువేరుగా ఉండవచ్చు. అవి "వ్యక్తిగతమయిన సమస్యలు" అన్నది లక్ష్మి.  
                                              భార్యలు
    "ఇదీ ఒక చీరేనా? ఈ రంగేమిటి? ఈ చీరేమిటి? అయ్యో రామ! ఆ మాత్రం తెలిస్తే ఇంక లేందేముంది? అయినా ఇంత డబ్బు తగలేసి ఇలాంటి చీర తెచ్చిన మిమ్మల్ని.... నా రాత?
    శ్రీమతి విసుక్కుంటూ చీరను విసుగ్గా గిరాటు వేసింది శ్రీహరి ముఖం చిన్నబోయింది.
    "అదేమిటి, సుజా! నిన్న షో కేసులో చూసి ముచ్చటపడ్డావుగా? అందుకే నీకు సర్ ప్రైజు ఇద్దామని ఆఫీసులో అప్పుచేసి ఇవ్వాళ చీర కొనుక్కొచ్చాను నిన్న పొగిడేశావ్! ఇవాళ తీరా కొనితెచ్చాక ఇలా అంటావేం?"    
    "రాత్రి షో కేసులో దూరం నుంచి చూస్తే చాలా బాగున్నట్టు కనిపించింది."
    "అసలు సంగతి అది కాదు షో కేసులోని ఆ అందమైన బొమ్మ మీద ఆ చీరకు ఆ అందం వచ్చింది" అనాలనుకున్నాడు కాని అనలేక పోయాడు అసలే అనుమానం మనిషి! ఆ బొమ్మను ప్రేమించేస్తున్నానని  గొడవ చేయనూ చేయవచ్చును అనుకున్నాడు.   
    కొందరు భర్తలకే కాదు, భార్యలకు కూడా అనుమానం ఎక్కువే అందులో సుజాత మరీనూ ప్రతి ఆడదీ తన భర్తను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టే ప్రవర్తిస్తుంది.
    "ఇంత ఖరీదు పెడితే పట్టుచీర వచ్చేది."
    "వంద రూపాయలకు పట్టు చీర ఎక్కడ్నుంచి వస్తుంది?"
    "అయినా అసలు ఇది మిమ్మల్నెవరు తెమ్మన్నారు? నాకు అక్కరలేదు ఇచ్చేసిరండి" సుందరరావుకు ఒళ్ళు మండిపోయింది ఇక జన్మలో ఇలాంటి తెలివి తక్కువపని చేయకూడదని చెంపలు వేసుకున్నాడు.    
    "తిరిగి ఇస్తే తీసుకుంటాడా ఏం? నీకు ఇష్టం లేకపోతే కట్టుకోకు. అవతల పారేయ్." విసుగ్గా అన్నాడు.
    "అబ్బో! లక్షాధికారిలా మాట్లాడుతున్నావే! అప్పుచేసి ముష్టి వందరూపాయల చీర తెచ్చావ్." మూతి సున్నా చుట్టింది సుజాత.
    "మా ఆఫీసులో పనిచేసే ఆడవాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారేమో నేను కనుక్కుంటాలే. అన్నం వడ్డించు."
    "ఓహో, దానికి.... అదే ఆ టైపిస్టుకు  ఇస్తావా? అసలు సంగతి ఇదన్నమాట! అందుకే పెళ్ళి అయిన ఇన్నాళ్ళకు చీర తెచ్చావు అదీ నాకు నచ్చనిరంగు నేను ఎటూ వద్దంటాను ఆ తర్వాత దానికి..." ఛ! నోర్ముయ్!" అనాలనుకున్నాడు కాని తనే నోరుమూసుకుని కళ్ళు తెరిచి భార్య ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు.
    సుజాత లేచివెళ్ళి దూరంగా పడివున్న చీరను తీసుకుని లోపలకు వెళ్ళిపోయింది పెట్టెలో పెట్టింది.
    సుందరరావు నవ్వుకున్నాడు ఆ చీర తను ఎక్కడ ఆ టైపిస్టుకు ఇస్తాడోనని ఆమె భయం! ఆడబుద్ధి మనసులోనే గొణుక్కున్నాడు.
    సుజాతకు అనుమానం ఎక్కువన్నాను గదూ? ఆ అనుమానానికి పెద్ద కారణం అక్కర్లేదు ఒకరోజు సుందరరావు, సుజాత సినిమాకు వెళ్ళారు ఒక అందమైన అమ్మాయి నవ్వుకుంటూ సుందరరావు దగ్గరకు వచ్చి 'నమస్కారమండీ' అన్నది.
    సుజాత ముఖంలో భావాలు రంగులు మారాయి.
    "ఆమె మీ శ్రీమతిగారా సార్! నమస్కారమండీ, నా పేరు సరోజ! సుందరరావు గారి సెక్షన్ లో టైపిస్టును!" ఆ అమ్మాయి తన పరిచయం తనే ఇచ్చుకుంది.
    ఆ తర్వాత సుజాత "ఆవిడకు పెళ్ళయిందా?" అని సినిమా చూస్తూ అడిగింది.
    "ఇంకా కాలేదు ఇద్దరూ ప్రేమ ఘట్టంలోనే ఉన్నారు." సినిమాలోని నాయిక గురించి అడుగుతున్నదనుకుని అన్నారు సుందరరావు.
    "బాగానే ఉంది సంబరం నేను అడిగేదేమిటి? మీరు చెబుతున్నదేమిటి?"
    "ఏమిటి?"
    "అదే -- ఆ టైపిస్టుకు పెళ్ళయిందా అని అడుగుతున్నాను." ఇలాగే ఉంటాయి ఆడవాళ్ళ అనుమానాలు.
    ఒక డాక్టర్ ఉన్నాడనుకోండి అతను ఏదో అర్జంటు కేసు ఉండి మరీ ఆలస్యంగా ఇంటికి వచ్చాడే అనుకోండి అనుమానంగల భార్య అయితే మూతి ముడుచుకుని, బిగదీసుకుని పడుకొని కనిపిస్తుంది కదిలిస్తే కందిరీగలా 'ఝయ్'మని లేస్తుంది.
    "ఇదో వంక అసలు ఆ కొత్త నర్సు చేరినప్పటి నుంచి మీకు డెస్పెన్సరీ వదిలి రావాలనిపిస్తుందా? దాన్ని చూసి అప్పుడే అనుకొన్నాను దాని లయలు, హొయలు.. అది వచ్చాక ఒక రోజైనా సమయానికి ఇంటికొచ్చారా? పైగా విసుగు... అవును, దాన్ని చూసిన కళ్ళతో నన్ను చూస్తే విసుగ్గానే ఉంటుంది అవును మరి? దానిలా నాకు టక్కులు తెలుసా! లయలు తెలుసా? నేను సంసారిని!"
    మిగతా అందరూ సానులైనట్టే అంటుంది లాయర్ భార్య అయితే .... "జూనియర్ గా ఆడదాన్ని ఎందుకు వేసుకొన్నారు? మగవాళ్లు దొరకలేదా పైగా నాకు అనుమానం జాస్తి అంటారు. కోర్టులో ఉన్నంతసేపు బల్లముందు కూర్చుని అదేదో సినిమాలో చూపించినట్లు కాళ్లు తొక్కుకుంటూ కూర్చుంటారా? హోహో! కాన్ఫరెన్సుకు బొంబాయి వెళ్తున్నాం! దాన్ని వెంట వేసుకునేనా? అసలు సంగతి అది కాదులే. ఇంతకాలం లేనిది ఇప్పుడీ బొంబాయి ప్రయాణం ఎందుకు వచ్చిందో? అది నా కాపరంలో నీళ్లుపొయ్యడానికి వచ్చింది."
    ఒక మహానుభావుడు ఉన్నాడు అతనికి రచయిత్రులు రాసిన నవల ఇంటికి తీసుకెళ్ళాలంటే భయం ఎందుకో తెలుసా? 'ఈ రచయిత్రి నీకు తెలుసా? ఏం అంత శ్రద్ధగా ఆ పుస్తకం చదువుతున్నావ్?' అని అనుమానంతో సాధించి పెడుతుందట ఇది అతిశయోక్తి కాదు అక్షరాలా నిజం!
    ఆడవాళ్ళ సాధింపులు ఇలాగే ఉంటాయి.
    ఎంతసేపూ పురుషులు భార్యల్ని కాల్చుకు తింటారనే రాస్తారు భర్తల్ని కాల్చుకు తినే భార్యలు లేరా? ఆ విషయాలు ఎందుకు రాయరూ? ఎందుకీ స్త్రీ పక్షపాతం: అంటూ చాలామంది ఉత్తరాలు రాస్తారు ముఖం మీద కూడా అడుగుతూ ఉంటారు.   
    సాధారణంగా భర్తలో ఏదో లోపం కన్పించినప్పుడే భార్యకు అనుమానం మొదలవుతుంది. దానితో ఆమె విచక్షణ లేకుండా ప్రతి వాళ్ళనూ అనుమానిస్తుంది. అంతమాత్రం చేత పురుషుడు తను చేయదల్చుకొన్నది చెయ్యకుండా మానడు భార్యకు భయపడుతున్నట్టు నటిస్తాడు కొందరు నిజంగా భయపడే వాళ్లు లేకపోలేదు. దానికి అనేక కారణాలు ఉండవచ్చును కావాలంటే భర్తభార్యను వదిలించుకోగలడు కాని భార్య అలా చేయలేదు ఇది పురుష ప్రపంచం అందుకే స్త్రీల సమస్యలకి ప్రాధాన్యం అవసరం.   
    మధ్యతరగతి స్త్రీలకేనా కష్టాలు 'ఒరేయ్! నీ జిమ్మడ! నీకు పోయేకాలం రాను! నా జుట్టు వదులు." జుట్టు పట్టుకొని వంగదీసి ధబీదభీబాదుతున్న మగవాడి మోకాళ్ళపైకి ఉన్న పంచ పట్టుకుని లాగుతూ తిడుతోంది ఆడమనిషి.   
    బస్ స్టాండుకు వెళ్తూ వెళ్తూ నిలబడ్డాను పేవ్ మెంటు మీద జరుగుతున్న ఈ దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు రోడ్డునపోయే వాళ్లు ఆగి.
    "ఏమిట్రా పాపం! దాన్ని చంపుతావా ఏం?" అంటూ ఒక కరుణామయుడు మగవాణ్ణి ఇవతలకు లాగాడు పైట జారిపోయిన ఆ స్త్రీని ఆవురావురుమంటూ చూస్తూ నల్లగా ఉన్నా వయసులో ఉన్నది కాయ కష్టం చేసే శరీరం పిటపటలాడుతూ ఉంది.   
    "ఎందుకురా! దాన్ని అలా బాదుతున్నావ్?" అన్నాడు మరొకడు.
    "చూడండి బాబూ! నాలుగు రోజులైంది పనికెళ్లక. ఇయ్యాలా ఎల్లనంటుంది ఎట్టా గడుస్తది మీరే చెప్పండి."    
    "ఎవమ్మా?"
    "నాకు జ్వరంగా ఉంది ఆ మట్టితట్టలు మొయ్యలేను జ్వరం తగ్గినాక పోతానన్నా చావబాదుతున్నాడు. "పెదవి చిట్లి రక్తం కారుతూ ఉంటే తుడుచుకుంటూ అన్నది.
    "ఆడు తెచ్చింది తాగుతాడు! నా కూలితో తింటడు ఇప్పుడు ఇంట్లో తిండిలేదు ఈడిజిమ్మచెడ!" ఇలా సాగుతోంది అక్కడి సంభాషణ బస్ రావడం వల్ల బస్ ఎక్కి కూర్చున్నాను.
    మా పనిమనిషి లక్ష్మి గుర్తుకొచ్చింది ఇవ్వాళ రాలేదు రెండు రోజులకొకసారైనా తాగివచ్చి ఆమె భర్త ఆమెను బడితపూజ చేస్తాడు పోయిన నెలలో కొడుక్కు జ్వరం ఉన్నదని నా దగ్గిర ఐదు రూపాయలు తీసుకెళ్ళింది మందులు కొనడానికని: భర్త ఇంటికి వచ్చి నేను ఇచ్చిన ఐదు రూపాయలు తీసుకుని మందులు తెస్తానని వెళ్ళాడటా. రాత్రంతా రానే లేదు పిల్లవాడికి పలవరింతలు ఆమె ఏం చెయ్యడానికి తోచక, ఏడుస్తూ కూర్చుందట తెల్లవారి ఉదయం ఇంటికి వచ్చాడు ఆమె భర్త రాత్రంతా కల్లు పాక దగ్గరే పడి ఉన్నాడట.

 Previous Page Next Page