Previous Page Next Page 
సంధియుగంలో స్త్రీ పేజి 21


    "పట్టుకుంటే ఏమవుతుంది" అని అడిగాను.
    ఆ అమ్మాయిని పట్టుకుంటే ముందు యువకుని కుటుంబీకులకూ, ఆ పిల్ల తల్లిదండ్రులకు కూతగాదా వస్తుంది. రెండు గ్రామాల పెద్దలూ చేరి చర్చిస్తారు తరువాత ఆ కుర్రవాడికి తప్పు వేస్తారు ఆ తప్పు రెండు మేకపోతులూ, ఇన్ని బియ్యం, ఇందరికి భోజనం పెట్టాలనే దానిమీద నిర్ణయిస్తారు ఆ తరువాత ఇద్దరికీ పెళ్ళి చేస్తారు అలా ఒక యువకుడు ఒక యువతిని పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ వివాహం జరిగి తీరుతుంది.  
    ఇది ఒకరకంగా రాక్షస వివాహమే అనాలి. ఒకవేళ ఆ అమ్మాయికి ఆ యువకుడంటే ఇష్టం అనుకోండి, ఆ అమ్మాయి పరుగెత్తినట్టే పరుగెత్తి అతనికి చిక్కిపోతుంది.   
    "మరి ఇష్టంలేని అమ్మాయి పరుగెట్టలేక చిక్కిపోతే?" "అయినా పెళ్ళి జరుగుతుంది" అన్నారు అది అన్యాయం అనిపించింది కాని ఆ అమ్మాయికి వివాహం అయాక కూడా అతనితో ఉండటం ఇష్టం లేకపోతే విడిపోవచ్చునట అది ఎలా సాధ్యం? అని అడిగాను అక్కడే చంకలో పిల్లవాడ్తో నిలబడి ఉన్న ఒక యువతిని చూపించి చెప్పారు -- ఆ అమ్మాయిని ఒక యువకుడు సంతలో పట్టుకున్నాడు.
    ముందు తగాదా పడ్డాడు పెద్దలు ఆ యువకుడికి తప్పు వేశారు విందులు ఆరగించారు ఆ అమ్మాయికి అతనితో పెళ్ళి అయిపోయింది ఒక కుర్రవాడు కూడా పుట్టాడు. అయినా ఆ అమ్మాయికి అతనంటే ఇష్టం లేదు. మరొకణ్ణి ప్రేమించింది అతనితో వెళ్ళిపోయింది మళ్ళీ గొడవ ప్రారంభం అయింది పెద్దలు చేరారు తీర్పు చెప్పారు.    
    ఆ అమ్మాయిని చేరదీసిన యువకుడికి తప్పువేశారు ఆమె భర్త మొదట తప్పుకు చెల్లించిన వస్తువులు ఇతని చేత ఆ భర్తకు ఇప్పించారు. అంతే కాదు -- పెద్దలందరికి విందు చేశాడు ఆ విందులో ఆ అమ్మాయి మొదటి భర్త కూడా పాల్గొన్నాడు విందు పూర్తి అయ్యాక ఆమె మొదటి భర్తతో కొత్త పెళ్ళి కొడుకు స్నేహపూర్వకంగా పెద్దల ముందు చేతులు కలిపాడు.
    అంటే కక్షలూ, ఆవేషాలూ లేకుండా స్నేహపూర్వకంగా విడిపోయారు. ఆమె మొదటి భర్త మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు రెండు కుటుంబాల వారూ సన్నిహితంగా ఉంటారు ఆమె మొదటి భర్త వారింటికి ఒక స్నేహితుడుగా వస్తూపోతూ ఉంటాడట.
    నాకు ఇది విని చాలా ఆశ్చర్యం కలిగింది. "అందరూ ఇలా ఉంటారా?" అని అడిగాను అందరూ అలా సన్నిహితంగా ఉండకపోయినా శత్రుత్వం మాత్రం వహించరట.
    "మరి పిల్లల బాధ్యత పురుషుడు తీసుకుంటాడా? స్త్రీ తీసుకుంటుందా?" అని అడిగాను.
    "ఎవరికి ఇష్టం అయితే వాళ్ళే తీసుకోవచ్చును. సాధారణంగా ఒకరి కంటే ఎక్కువ సంతానం ఉన్నప్పుడు సమంగా పంచుకుంటారు" అని చెప్పారు ఆ సమాజంలో స్త్రీ పురుషులు సమానంగా కష్టపడి సంపాదిస్తారు ఒకరి మీద ఒకరు ఆధారపడాల్సిన అవసరం లేదు. కొన్ని గిరిజన సమాజాల్లో ఈ రోజుకు కూడా సంతానానికి తల్లి పేరు ఉంటుంది మలబారులోని నాయర్ కుటుంబాల్లో కూడా ఈ పధ్ధతి ఈనాటికీ ఉన్నది."
    ఏ సమాజంలోనైనా స్త్రీ స్థానం ఆయా ఆర్ధిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. నాయర్ కుటుంబంలో తండ్రి సంపత్తి కొడుక్కు గానీ, కూతురికిగానీ లభించదు అతని చెల్లెలు ఆ ఆస్తికి వారసురాలు అవుతుంది ఆడపిల్లకు సంపత్తి భర్త నుంచి కాక, సోదరుడి నుంచి లభిస్తుంది. భర్త చనిపోయిన స్త్రీ భర్తపోయినందుకు బాధపడుతుంది అంతేగాని, ఆమె ఆర్ధిక పరిస్థితిలో పెద్ద మార్పు ఏం ఉండదు.
    ఒకసారి ఒక నాయర్ కుటుంబానికి సంబంధించిన స్త్రీని కలుసుకోవటం తటస్థించింది
    "బ్రాహ్మణ కుటుంబంలోని స్త్రీలనూ, హిందూ సమాజంలోని ఇతర కులాలకు చెందిన మధ్యతరగతి స్త్రీలనూ, వారి పరిస్థితులనూ చూస్తే జాలి వేస్తుంది. మా కులంలో ఏ తల్లిదండ్రులూ ఆడపిల్ల వివాహం గురించి బాధపడరు వారికి అది సమస్యే కాదు మాకు అత్తగారి బాధలు ఉండవు పైసల కోసం భర్త ముందు చెయ్యి చాచాల్సిన అవసరం ఉండదు మేము స్వతంత్రులము పురుషుడు స్త్రీ కంటే అధికుడు అనే భావం పురుషుడిలో ఉండదు అలాగే స్త్రీ హీనతాభావంతో బాధపడదు" అన్నది ఆ నాయర్ స్త్రీ.
    దీనిని బట్టే స్త్రీ బానిసత్వం ఆమె ఆర్ధిక పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నదనేది అర్థం అవుతుంది మనదేశంలో స్త్రీని బానిసత్వం నుంచి రక్షించడానికి అనేక చట్టాలు పాస్ చేశారు విడాకుల చట్టం వచ్చింది బహుభార్యత్వం నిషేధించబడింది కూతురికి తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వాలనే చట్టం కూడా పాసయింది.  
    వరకట్నం నేరంగా బిల్లుపాసు చేశారు ఒకప్పుడు సంతానంలేని స్త్రీకి భర్త చనిపోతే దత్తత చేసుకొనే అధికారం ఉండేది కాదు ఇప్పుడు అది కూడా ఇవ్వబడింది.
    పైన చెప్పిన చట్టాలన్నీ గొప్పవే. కానీ అవి అమలులోకి ఎప్పుడు వస్తాయి? ఈనాటికీ ఈ చట్టాలు కాగితాల మీద మనదేశంలోని ఆడదాని అదృష్టంలాగే కునికిపాట్లు పడుతున్నాయి.   
    చాలా కాలంగా పురుషులు స్త్రీల కోసం ఆలోచించారు ఇప్పుడు స్త్రీలే తమకు ఏం కావాలో, ఎలాంటి స్థానం సమాజంలో పొందాలో ఆలోచించుకోవాలిసిన తరుణం వచ్చింది.  
                                 పరిష్కారం ఏమిటి?
    "లక్ష్మిగారూ! మీరు ఎంతో కాలం స్టూడెంటు ఫెడరేషన్ లో పని చేశారు. చాలా కాలం ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్సులో కూడా పని చేశారు మీరు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి స్త్రీ జనోద్ధరణకొరకు పాటుపడుతున్నారు సమాజంలో స్త్రీ స్థానం గురించి మీ అభిప్రాయాలు వినాలని ఉంది" అన్నాను ఆమె మధ్యప్రదేశ్ కు సంబంధించిన స్త్రీ.
    "నేను దాదాపు యూరప్ దేశాలన్నీ చూశాను కాని ఎక్కడా కూడా స్త్రీ మనదేశంలో ఉన్నంత దీన, హీన స్థితిలో నాకు కనిపించలేదు ఆఫ్రికా ఆర్ధిక, పారిశ్రామిక విషయాల్లో ఇతర దేశాలకంటే చాలా వెనకబడి ఉన్నదనే చెప్పాలి కాని అక్కడి స్త్రీలో మనదేశపు స్త్రీ కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని చూశాను.
    యుగాలుగా బానిసత్వానికి అలవాటు పడిన మన స్త్రీలకు సంకోచం ఎక్కువ చదువుకున్న స్త్రీ కూడా ఎక్కువ సాహసించలేకపోతున్నది కాళ్ళకూ, చేతులకూ తగిలించిన సంకెళ్ళను తెగగొట్టడం తేలిక మానసిక బానిసత్వాన్ని నిర్మూలించడం చాలా కష్టమైనపని. తిట్లకూ, దెబ్బలకూ తప్పు చెయ్యకపోయినా తప్పు చేసినట్లు తలవంచడానికి మన స్త్రీలు అలవాటు పడ్డారు.
    స్త్రీకి ధర్మంతో పాటు పై చెప్పిన వన్నీ సహించే వోర్పును ఉగ్గుపాలతో రంగరించి పోశారు. మా ఇంటి దగ్గిరలో ఒక స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు ఆడపిల్లలు మగపిల్లవాడు కలగలేదు అత్తగారు ఆ తప్పంతా ఆమెదే అన్నట్లు సాధించేది వంశోద్ధారకుణ్ణి ఇవ్వలేనందుకు భర్త భార్యను నిర్లక్ష్యంగా చూసేవాడు ఆమె కూడా అపరాధ భావంతో కృంగిపోతూ ఉండేది అంతేకాని ఒక్క మాట అనేది కాదు.    
    మధ్యప్రదేశ్ లో సాధారణంగా భార్తభార్యను కొట్టడం కనిపిస్తుంది ఒకసారి మా ఫామిలీ ఫ్రెండు భార్యను కొడతాడని తెలిసి మందలించారు అతను సిగ్గుపడ్డాడు మరెప్పుడూ భార్య మీద చెయ్యి చేసుకోనని మాట ఇచ్చాడు.   
    ఆ తరవాత కొంత కాలానికి ఆ స్త్రీ నాతో ఏమన్నాదో తెలుసా?" అక్కయ్యా: మావారు బొత్తిగా మారిపోయారు నన్ను నిర్లక్ష్యంగా చూస్తున్నారు ఎవర్నయినా ప్రేమిస్తున్నారో ఏమో? ఇంతకుముందు కొట్టనా వెంటనే లాలించేవారు సినిమాలు తీసుకు వెళ్ళేవారు ఎంతో కాలంగా ఒక్క చెంప దెబ్బ కూడా కొట్టలేదు" అన్నది నేను తెల్లబోయి ఆమె వంక చూశాను.   
    "లక్ష్మిగారూ! మనదేశంలో ఏ ప్రాంతం స్త్రీ మరీ హీన పరిస్థితుల్లో బతుకుతుందో చెప్పగలరా?" దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఒకే పరిస్థితి ఉన్నది కాకపోతే పరిస్థితులు తాలూకు ప్రతి క్రియ భిన్నంగా ఉండవచ్చును సౌరాష్ట్రలో స్త్రీలు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడతారు ఆత్మహత్యను నేరంగా పరిగణిస్తారు.   
    అందుకే మేము ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడిన స్త్రీ కాక, ఆ పరిస్థితికి దోహదం చేసిన వ్యక్తులు శిక్షార్హులని అలజడి లేవదీశాం కొంతకాలం క్రితం కట్నం సమస్య దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నది విధవా వివాహానికి పెద్దగా ప్రోత్సాహం లభించడం లేదు డైవర్స్ తీసుకున్న స్త్రీకి మళ్ళీ వివాహం కావడం మరీ కష్టం.
    స్త్రీల హత్యలు పంజాబులో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మెట్లమీద నుంచి తోసేసి స్త్రీలను (భార్యల్ని) చంపడం నాకు తెలుసు పిల్లల్ను లాక్కుని, భార్యను ఇంటి నుంచి తరిమెయ్యడం అతి సామాన్యమైన విషయం పంజాబులో చాలా వరకు స్త్రీ హత్యలను ఆత్మహత్యలుగా నిరూపించడం జరుగుతూ ఉంటుంది స్త్రీ అపహరణలూ, మానభంగాల గురించి ఇక చెప్పనే అక్కర్లేదు."   
    "అయితే లక్ష్మిగారూ! వీటన్నిటికీ గల మూలకారణం ఏమంటారు?"
    "ఆర్ధిక స్వాతంత్ర్యం లేకపోవడం తన కాళ్ళమీద తాను నిలబడ్డ స్త్రీకి ఎన్ని అంధ విశ్వాసాలున్నా, ఆమె వెన్నుముకలో బలం ఎక్కువ కనిపించడం లేదూ? స్త్రీ ఆర్థికంగా పురుషుడి మీద ఆధారపడాల్సిన అవసరం పూర్తిగా (అంటే స్త్రీలందరికీ) పోయిన రోజు మాత్రమే ఈ దేశంలో స్త్రీ విముక్తి సాధ్యం అని నా నమ్మకం"  
    "ఆ రోజు వస్తుందంటారా?"
    "వస్తుంది వికాస క్రమంలో వచ్చి తీరాలి ఇది సంధియుగం ఉద్యోగాలు చేసే స్త్రీలకు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది అందుకు భయపడకూడదు అనాదిగా పురుషుడిలో గూడు కట్టుకున్న ఆధిక్యతా భావానికి ప్రతిక్రియల వల్ల కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తున్నది క్రమంగా పురుషుడిలోని ఆధిక్యతా భావం తగ్గుతుంది.  
    స్త్రీలోని హీనతాభావం పోతుంది ఒకనాడు పురుషుడి లాగే స్త్రీ సంపాదించి తీరాల్సిన అవసరం ఏర్పడుతుంది స్త్రీ పురుషులిద్దరూ సమాజంలో సమాన స్థానాన్ని ఆక్రమించుకుంటారు." ఎంతో దృఢ విశ్వాసంతో అన్నది లక్ష్మి.

 Previous Page Next Page