వీళ్ళ కథలన్నీ ఇలాగే ఉంటాయి సాధారణంగా, మనం కష్టాలన్నీ మధ్యతరగతి స్త్రీలకే అని అనుకుంటాం వర్కింగ్ క్లాసు స్త్రీలకు స్వేచ్చ అధికం అని భ్రమపడతాం కాని శ్రమజీవి స్త్రీలసమస్యల్ని దగ్గరగా చూస్తే మనసు చాలా బాధపడుతుంది.
ఆ స్త్రీలు ఇంట్లో పని చూసుకుంటారు పిల్లల పని చూసుకుంటారు ఆ తర్వాత భర్తతో పాటు కాయకష్టం చేస్తారు. ఉదయం ఆరుగంటలకు పసివాణ్ణి పెద్ద దానికి (దానికి ఎంతో వయసు ఉండదు ఏడో ఎనిమిదో సంవత్సరాలు ఉంటాయి) అప్పగించి, జర్మన్ సిల్వర్ కొక్కెం డబ్బాలో జొన్నన్నం గొడ్డుకారం వేసుకుని ఫాక్టరీకి వెళుతుంది ఏడు గంటలకు తిరిగి వచ్చేసరికి ప్రపంచంలోని యావత్ మాతృత్వం ఆమె పెదవుల మీద మూలుగుతుంది. కాయ కష్టం చేసి వళ్ళంతా హూనం చేసుకొని వచ్చిన ఆమె, ఇంటికి రాగానే పడుకోదు విశ్రాంతి తీసుకోదు. మళ్ళీ ఇంటి పనులూ, పిల్లల పనులూ చూసుకోవాల్సి ఉంటుంది. భర్త తప్ప తాగి ఇంటికి వచ్చినరోజు అలసిపోయిన ఆమెను వంగదీసి బాదడం కూడా జరుగుతూ ఉంటుంది స్త్రీ కష్టాల గురించి ఆందోళన లేవదీసే వారి దృష్టిలో ఈ స్త్రీలు ఉండరు.
శ్రమజీవి స్త్రీలు సంఖ్యలో మధ్యతరగతి స్త్రీలకంటే ఎంతో అధికం వారిలో చైతన్యం రాకుండా, మనం చేసే నినాదాలు అర్థం కానివే అవుతాయి స్త్రీకి ఆస్తి హక్కు కావాలని మనం ఆందోళన జరుపుతున్నాం, కాని దానివల్ల ఈ స్త్రీలకు లభించే దేమిటి? తండ్రి నుంచి దారిద్ర్యం భర్త నుంచి దారిద్ర్యం, అదే దారిద్ర్యాన్ని తన బిడ్డలకు ఇస్తుంది.
ఈ స్త్రీలలో ముఖ్యంగా చైతన్యం రావాలి అందుకు కృషి జరగాలి వారి హక్కులు ఏమిటో వారు తెలుసుకోవాలి ఆ స్త్రీ మధ్య తరగతి స్త్రీలా గృహానికి అలంకారం మాత్రమే కాదు తన పొట్ట తాను నింపుకుంటూనే పురుషుడి చేత దారుణంగా హింసింపబడుతుంది చదువుకున్న స్త్రీలు వారిని జాగృతుల్ని చెయ్యాలి.
స్త్రీ, ఈనాటి స్త్రీ, కోరుకొనేది ఒకరిమీద విజయం కాదు ఆమెకు ఎవరి మీదా శాసించే అధికారం అక్కర్లేదు ఆమె మీద మరొకరు అధికారం చెయ్యడాన్ని భరిస్తూ ఉండనక్కర్లేదు సమాజంలో ఆమె స్థానం ఆమెకు కావాలి పురుషులతో సమానంగా, సమాజంలో సమాన బాధ్యతగల వ్యక్తిగా గుర్తించబడాలి. ఇందుకోసం చదువుకున్న స్త్రీలు కృషి చెయ్యాలి గాంధీజీ చెప్పినట్లు అర్థరాత్రి 12 గంటలకు స్త్రీ నిర్భయంగా బయటికి వెళ్ళగలిగిన రోజే మనదేశంలో స్త్రీ జాతికి నిజమయిన విముక్తి లభించిందని మనం భావించాలి.
భర్త రోజులు - భార్య రోజులు! ఆ తర్వాత! వైవాహిక జీవితాన్ని మూడు కాలాల్లో విభజింపవచ్చును ముందు భర్తకాలం, ఆ తర్వాత భార్యకాలం మిగతా కాలం సంఘర్షణ కాలం.
భర్త రోజులు! భార్య కొత్తగా కాపరానికి వస్తుంది భర్త ఆలస్యంగా స్నేహితులతో ఏ సినిమాకో వెళ్ళి వస్తాడు అత్తగారు ఇంట్లో ఉంటే-- "ఏమిటిరా అబ్బాయ్! నీకు బొత్తిగా బుద్ధి లేకుండా పోయింది. ఆ పిల్ల అన్నం కూడా తినలేదు ఇంతకుముందులా తిరిగితే ఎలా?" అంటూ తల్లి కొడుకును మెత్తమెత్తగా మందలిస్తుంది తలుపు చాటు నుంచి వింటూ ఉంటుంది కొత్తకోడలు తన భార్య తన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని అన్నం కూడా తినకుండా ఎదురుచూస్తున్నదని విన్నప్పుడు ఆ యువకుడి హృదయం తమాషా అనుభూతితో నిండిపోతుంది. ఆ సమయంలో ఇద్దరి హృదయాలూ అమృత కలశాల్లా మాధుర్యంతో, కలలతో తొణికిస లాడుతూ ఉంటాయి.
భార్య సిగ్గుపడుతూ వడ్డిస్తుంటే తను ఆలస్యంగా వచ్చినందుకు సంజాయిషీ ఇచ్చుకుంటాడు భర్త. "నేను ఆలస్యంగా వస్తే నువ్వు భోజనం చెయ్యకుండా కూర్చోవద్దని చెప్పానుగా?" అంటాడు మృదువుగా అయినా తనకోసం భోజనం చెయ్యకుండా భార్య ఎదురు చూస్తూ కూర్చోవడం అతనికి సంతోషాన్ని కలిగిస్తుంది. భర్త తెచ్చే మల్లెపూలు, పకోడీలు పొట్లాలు ఎంతో అపురూపంగా అందుకొంటుంది భార్య భర్త కొంచెం తలనొప్పిగా ఉన్నది అంటే చాలు హడావుడి పడిపోతుంది 'వద్దు' అన్నా వినకుండా అమృతాంజనం రాస్తుంది తల వత్తుతూ కూర్చుంటుంది కాళ్ళ నొప్పులు అంటే చాలు కాళ్ళు లాక్కున్నా వినకుండా కాళ్ళు పడుతుంది రోజుల్లా భర్త చెప్పే కబుర్లను శ్రద్ధగా వింటుంది ప్రతి చిన్నదానికీ కిసుక్కున నవ్వుతుంది.
ఆ యువకుడికి కవిత్వం రాసే పిచ్చి ఉందనుకుందాం కాసేపు అతను ఎంత చెత్త కవిత్వం రాసినా శ్రద్ధగా విని చాలా గొప్పగా ఉందని పొగిడేస్తుంది. వూరికే పైపైకి పొగడడం కాదు ఆమెకు నిజంగా తన భర్త చాలా గొప్పవాడనే భావం ఉంటుంది.
తన అదృష్టానికి గర్విస్తుంది అతను నిద్ర లేచేటప్పటికి కాఫీ కప్పుతో దర్శనం ఇస్తుంది స్నానానికి వెళుతుంటే తువ్వాలు అందిస్తుంది వచ్చేటప్పటికి బట్టలు రడీగా పెడుతుంది బూట్లు తుడిచి సిద్ధంగా కుర్చీ ముందు పెడుతుంది కొసరి కొసరి తినిపిస్తుంది ఆఫీసు నుంచి త్వరగా వచ్చెయ్యమని చెబుతుంది.
ఆ భార్యకు భర్తదేలోకం. చుట్టూ ఉన్న ప్రపంచం కన్పించదు ఆ కాలం మగవాడి జీవితంలో అత్యంత ఆనందకరమయినది అతను ఏదో చెబుతాడు ఆమె శ్రద్ధగా వింటుంది అతను కోపం నటిస్తాడు ఆమె హడలిపోతుంది అతని కనుసైగల్లో ఆమె నాట్యం చేస్తుంది.
సంవత్సరం గడిచిపోతుంది పాల పొంగు తగ్గుతుంది ఇక భార్య రోజులు ప్రారంభం అవుతాయి. భర్త దగ్గర చనువు ఏర్పడుతుంది సంకోచం తగ్గుతుంది ఆమె దృష్టి ఇరుగుపొరుగు వారి మీదకు కూడా వెళ్తుంది.
భర్త జీవితాన్ని గురించిన ఆలోచన వస్తుంది భర్త కవిత్వం వినిపిస్తూ వుంటే కళ్ళు మూసుకుని పడుకుంటుంది నిద్ర వస్తున్నట్టు నటిస్తుంది తలనొప్పిగా ఉందంటే "అమృతాంజనం రాసుకోండి" అంటూ సలహా ఇస్తుంది భర్త ఆలస్యంగా యింటికి వస్తే తినేసి నిద్రపోతుంది లేకపోతే మూతి సున్నా చుట్టి అలిగి కూర్చుంటుంది.
భర్త ఆమెను బ్రతిమాలి ప్రసన్నురాల్ని చేసుకోవడానికి తలప్రాణం తోకకు వస్తుంది కాఫీ వెళ్ళి అడిగితేగాని ఇవ్వదు స్నానానికి వెళ్తూ టవల్ అడిగితే "అక్కడే వుంది తీసుకోండి" అంటుంది మల్లెపూలు తెస్తే మొదటిలా పరుగెత్తి కొచ్చి అందుకోదు. "ఆ బల్లమీద పెట్టండి" అంటుంది ఏమయినా వస్తువులు కొని తెస్తే బొత్తిగా సెలక్షన్ తెలియనివాడి కింద కట్టేసి మూతి విరిచేస్తుంది.
అలా మరో రెండు మూడు సంవత్సరాలు గడుస్తాయి ఒకరో ఇద్దరో పిల్లలు కూడా కలుగుతారు పక్కింటి వెంకట్రావు భార్యకు తెచ్చిన చీర గురించి చెబుతుంది ఎదురింటి కాంతమ్మ మొగుడు ఎంత మంచివాడో వివరిస్తుంది అతని తెలివితేటల్ని పొగుడుతుంది.
అతను నీ ఉద్యోగం లాంటిదే చేస్తున్నాడు అయినా భార్యకు కొత్త నెక్ లెస్ కొన్నాడు అంటూ అతన్ని ఇన్ డైరెక్టుగా అసమర్థుడి కింద కడుతుంది మరి కొంతకాలం పోయాక డైరెక్టుగా అంటుంది అనుకోండి, "ఎందుకొచ్చిన పిచ్చి రాతలు కూటికా గుడ్డకా" అంటూ కవిత్వం రాయడానికి కూర్చుంటే సాధిస్తుంది.
కొంతకాలం భరిస్తాడు భార్యలో సౌందర్యం కన్పించదు ఆమెలో గయ్యాళి తనమే కన్పిస్తుంది ఆఫీసులో వచ్చే జీతానికి ఇంటి ఖర్చులకూ లంగరు కుదరదు విసుగు ప్రారంభం అవుతుంది ఇక కలహం రోజులు ప్రారంభం అవుతాయి.
ఆమె ఒకటి అంటే అతను రెండు అంటాడు ఇంట్లో మహాభారతపారాయణం ప్రారంభం అవుతుంది.
"నా రాతా! నా గీత! నా వాళ్ళు నా గొంతు కోశారు:" అంటూ రాగాలు ప్రారంభిస్తుంది భార్య.
"ఛీ! వెధవకొంప:" అనుకొంటూ అర్థరాత్రి తలుపు తీసుకొని భర్త బయటికి వస్తాడు రాత్రంతా చలిలో వరండాలో గడుపుతాడు భార్య ఇంట్లో ముక్కు చీదేస్తూ ఉంటుంది మధ్యలో పిల్లలు లేస్తే వీపు అంటిస్తుంది పిల్లల ఏడ్పు వినలేక వుద్రేకంతో లేచి భర్త మళ్ళీ లోపలకు వస్తాడు మళ్ళీ యుద్ధం మరో మలుపు తిరుగుతుంది.
అన్ని కుటుంబాలూ కాదు - సాధారణంగా పట్నాల్లో చిన్న ఉద్యోగాలు చేసే మధ్యతరగతి వ్యక్తుల జీవితాలు ఇలాగే ఉంటాయి అలా కాకుండా వివేకంతో స్త్రీ పురుషులు ఒకర్ని ఒకరు అర్థం చేసుకొని సహజీవనాన్ని సాగిస్తే ఈ కుటుంబాలు ఇలా ఉండకపోవచ్చు.
ఎవరికి ఎలా రాసిపెట్టిఉందో?
వేణూ, రఘు ఇద్దరూ ఆ ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకు వెళ్ళారు. వేణు ఎం.ఏ. ప్రథమ శ్రేణిలో పాసయ్యాడు రఘు బి.ఏ.లో యూనివర్సిటీకి ప్రథముడిగా వచ్చి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు వేణు బీదవాడు.
పెద్దగా అండదండలు కలవాడు కాదు. రఘూ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యాడు ఉద్యోగంలో చేరాడు వేణు తప్పక తనకా ఉద్యోగం వస్తుందనుకున్నాడు.
అంత తెలివైన వేణు, అంత చదువుకున్న వేణు కర్మ సిద్ధాంతంలో పడ్డాడు అడిగిన వాళ్ళతో "నా అదృష్టం బాగాలేదు కేవలం తెలివితేటలూ అర్హత ఉన్నంత మాత్రాన మంచి పదవులు లభించవు దానికి అదృష్టం కూడా కావాలి. ఆ భగవంతుడు నొసటన ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది." అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడసాగాడు.