Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 21

    'పర్వాలేదమ్మా! నేను రుబ్బుతున్నానుగా?'
    'మంచి పనేలే. లే! చెమట్లు కారిపోతున్నాయి. లే తల్లీ' అంటూ బలవంతం చేసింది.
    సునంద రోటి దగ్గర నుంచి లేచి, లోపలకు రాబోతూ మనవడ్ని భుజాన వేసుకుని గడపలో నిల్చుని వున్న తండ్రిని చూసింది.
    'నిద్రపోయాడా నాన్నా! ఇలా ఇవ్వు' అంటూ తండ్రి దగ్గర్నుంచి కుణాళ్ ను తీసికెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది సునంద.
    భోజనాలయ్యాయి.
    'వెళ్ళొస్తాం! అత్తయ్యా!' అంది కమల.
    ఆ పక్కనే కొడుకుని ఎత్తుకొని చంద్రం నిలబడి వున్నాడు. కూతురు కమల భుజం మీద నిద్రపోతున్నది.
    'అయ్యో! అదేమిటర్రా! ఇప్పుడు వెళ్ళడం ఏమిటి! రాత్రికి భోజనాలయ్యాక వెళ్ళండి.' సుందరమ్మ నొచ్చుకుంటూ అన్నది.
    'వెళ్ళాలి'.
    'ఇవ్వాల్టికి వుంటారనుకున్నాను. ఇంత ఎండలో వెళ్ళకపోతేనేం పిల్లల్ని వేసుకొని. చల్లబడ్డాక వెళ్ళొచ్చుగా, ఏరా చంద్రం! ఏం తొందరొచ్చిందిరా! రాత్రి భోజనాలు చేసి వెళ్ళకూడదూ!'
    'పనుందమ్మా, వెళ్తాం!' అన్నాడు చంద్రం.
    'సరే మీ ఇష్టం. నేను ఉండమంటే వుంటారా ఏం? ఇప్పుడు మీరంతా ప్రయోజకులయ్యారు. పనుంటే వెళ్ళండి' అంది సుందరమ్మ నిష్టూరంగా.
    'వాళ్ళకు పని వుందంటుంటే ఏమిటా నిష్టూరపు మాటలు?' కామేశ్వరరావు విసుక్కున్నాడు.
    'అమ్మాయినీ, బావగార్నీ రేపు మా ఇంటికి భోజనానికి పిల్చాం, నువ్వూ, నాన్నగారూ కూడా రావాలి' అన్నాడు చంద్రం తల్లిని చూస్తూ.
    'వాళ్ళు వస్తార్లే. మీ నాన్నగారికి స్కూలుందిగా!'
    'స్కూలు నుంచి వచ్చి భోజనం చేసి వెళ్తారు. ఏం నాన్నా!'
    'అలాగే వస్తాలే' అన్నాడు కామేశ్వరరావు.
    'అమ్మాయి వాళ్ళతో నువ్వొచ్చెయమ్మా!'
    సుందరమ్మ మాట్లాడలేదు.
    'ఏమ్మో మాట్లాడవ్!'
    'వస్తుందిలే! కామేశ్వరరావే బదులు ఇచ్చాడు.
    చంద్రం భార్యా, పిల్లలతో వెళ్ళిపోతుంటే సుందరమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి.
    'చూశారా? సాయంకాలందాకా అయినా వుండకుండా వెళ్ళిపోయాడు. పైగా పిల్లలిద్దరీన్న తీసుకెళ్ళిపోయారు.
    'ఏం? ఎందుకుండాలి?'
    సుందరమ్మ నోరు వెళ్ళ బట్టింది. భర్త ధోరణి అర్ధం కాలేదు.
    'అత్తవు అనిపించావుగా?'
    సుందరమ్మ భర్త ముఖంలోకి అయోమయంగా చూసింది.
    'నిజమే! కోడలు పరాయి పిల్ల కదా? ప్రేమ ఎలా వుంటుంది'
    సుందరమ్మ వెర్రి చూపులు చూసింది.
    'అర్ధం కాలేదా?'
    'మీ ధోరణి నాకేం అర్ధం కాలేదు. కోడల్ని నేను పరాయి పిల్లలా చూస్తున్నానా? మీకు అలా అనడానికి నోరెలా వచ్చింది?'
    'వచ్చినప్పట్నుంచి కోడలు ఏదో ఒక పని చేస్తూనే వుందిగా?'
    'ఇంటి కోడలు. ఆ మాత్రం చేయడం, చేయించుకోవడం తగని పనా?'
    'దీన్నే అత్త మనస్తత్వం అంటారు. కోడలు కనక చాకిరి చెయ్యాలి. కోడలి చేత చాకిరి చేయించుకోవడం అత్త హక్కు. మరి కూతురు. ఈ ఇంట్లో పుట్టి పెరిగిన కూతురు ఈ ఇంట్లో పని చేస్తే అరిగిపోతుందా? చెయ్యాల్సిన అవసరం లేదా!'
    'మీరనేదేమిటో అర్ధం అయేలా అనండి.'
    'కూతుర్ని ఒకలా కోడల్ని మరోలా చూడడాన్నే అత్తల మనస్తత్వం అంటున్నాను.'
    'నేను కమలను ఒకలా? సునందను మరోలా చూస్తున్నానా? నాకు కోడలైనా కూతురైనా ఒకటే...'
    'అని నువ్వనుకుంటున్నావ్. కాని చేతల్లో చూపించేదేమిటి?'
    'నేనేం చేశాను? కోడల్ని నేను ఏమీ అనలేదే? సుందరమ్మ ఆశ్చర్యంతో తలమునకలైపోతూ అన్నది.
    'ఒకసారి ఆలోచించు. నీకే తెలుస్తుంది నువ్వు చేసిందేమిటో?'
    'ఏం చేశానో చెప్పరాదూ?' విసుగ్గా అంది సుందరమ్మ.
    'కోడలు వచ్చినప్పట్నుంచి ఏదో ఒక పని చేస్తూనే వుంది. కాని నీకు ఏమీ అనిపించలేదు'.
    'అవును. నేనూ చేస్తున్నాను. నాకు పనిలో సహాయం చేసింది. ఇందులో అనిపించడానికి ఏముంది. ఏ బరువు పనులు చేసిందని...?'
    'అవును. బరువు పని చెయ్యలేదు నీ కోడలు. కాని నీ కోడలు చేసిన ఆ తేలిక పని నీ కూతురు చేస్తే మరి లబలబ లాడాపోయావేం?
    సునంద రోటి ముందు నుంచి లేచిందాక విలవిలలాడిపోయావు. కూతురు ఏదో మోయలేని బరువును నెత్తిమీద వేసుకున్నట్టు నీ ప్రవర్తన కమలకు ఎలా అనిపిస్తుందో ఆలోచించు. నీ వియ్యపురాలు అదే పని చేసిందనుకో ఆలోచించు..'
    'అయ్యో! అదా సంగతి! ఆడపిల్ల! రాక రాక పుట్టింటికి వచ్చింది. నాలుగు రోజులు వుండి వెళ్ళిపోతుంది. ఏ తల్లయినా తన బిడ్డ ఆ నాలుగురోజులైనా సుఖంగా కూర్చోవాలని కోరుకుంటుంది. అది కూడా తప్పేనా?' సుందరమ్మ తను తప్పు చెయ్యలేదన్నట్టు చెప్పేసింది.
    'తప్పని నేనూ అనడం లేదు. కాని కూతురు, కోడలూ ఇద్దరూ వున్నప్పుడు కూతుర్ని ప్రత్యేకంగా చూస్తున్నట్టుగా కన్పించకూడదు. కొడుకు వేరే కాపరం పెట్టినందుకు చాలా బాధ పడ్డావు. ఇలాంటివి వస్తాయనే భయంతోనే వాళ్ల జాగ్రత్త వాళ్లు పడ్తారు'.
    సుందరమ్మకు కళ్ళల్లో నీరు తిరిగింది. ఎలా సంజాయిషీ ఇచ్చుకోవాలో ఆమెకు తెలియలేదు. తన మనసులో ఆ భావం లేదు. కోడళ్ళంటే కూడా తనకు ప్రేమే. కాని తను మరి అలా ఎందుకు ప్రవర్తించింది. అలా ప్రవర్తించడంలో అసహజత్వం వుందా? ఏమో!
    అంతలో కూతురు, అల్లుడూ లోపలకు వచ్చారు. వాళ్ల ముఖాలు గంభీరంగా వున్నాయి. ఏదో విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చినట్టుగా అన్పిస్తుంది. వాళ్ల ముఖాలు చూస్తుంటే ఏదో విషయంలో ఇద్దరూ ఘర్షణ పడ్డారనీ, తీర్పు కోసం తమ దగ్గరకు వచ్చారనే వాళ్ళను చూడగానే కామేశ్వరరావుకు అర్ధం అయింది.
    'మామయ్యగారూ! ఒక విషయంలో మీ సలహా కావాలి' అని 'అడగనా?' అన్నట్టు సునంద ముఖంలోకి చూశాడు సూర్యం.
    సునంద మూతి తిప్పింది
    సుందరమ్మ కూతుర్నీ, అల్లుడ్నీ మార్చి మార్చి చూసింది.
    'చెప్పనా?' భార్యను చూసి అడిగాడు సూర్యం.
    'చెప్పండి నాకేం భయమా? నేనూ చెప్పుకోగలను' రోషంగా అంది సునంద.
    'ఏంటి బాబూ! ఏం జరిగింది? సుందరమ్మ ఆతృతగా అడిగింది.
    'చెప్పనా!' అన్నట్టు భార్యముఖంలోకి చూశాడు సూర్యం.
    "చెప్పుకోమన్నానుగా!" అన్నట్టు చూసింది సునంద.
    "చెప్పు బాబూ! ఏమిటి విషయం?" కామేశ్వరరావు, కూతుర్నీ, అల్లుడ్నీ మార్చి మార్చి చూస్తూ అడిగాడు.

 Previous Page Next Page