Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 20

    'సుందరీ ఏమిటా మాటలు పసివాడ్ని పట్టుకొని?' కామేశ్వరరావు మందలించాడు.
    'వాడు... వాడు పసివాడా! మీకూ, నాకూ నీతులు చెబుతున్నావాడు. వాడు.... పసివాడా? మీకూ, నాకూ నీతులు బోధిస్తున్నాడు... నీతులు...
    'అమ్మా!'
    'ఆ! చెప్పరా! ఎప్పుడు వెళ్తావో చెప్పు.'
    'నేనెక్కడికి వెళ్తానమ్మా!'
    సుందరమ్మ కొడుకు ముఖంలోకి చురుగ్గా చూసింది.
    'అవున్రా! మార్చేపోయాను. నువ్వెక్కడికి వెళ్తావు ఇప్పుడే! ఇంకా చదవాలి. ఉద్యోగం రావాలి. పెళ్లి కావాలి. ఇవన్నీ కావాలిగా?'
    'సుందరీ నీకు పిచ్చెక్కిందా? చిన్నవాడ్ని పట్టుకొని ఏమిటా మాటలు?'
    'అననివ్వండి నాన్నగారూ! అమ్మ బాధను నేను అర్ధం చేసుకోగలను.'
    సుందరమ్మ తలెత్తి కొడుకు ముఖంలోకి చూసింది.
    'అమ్మ బాధను అర్ధం చేసుకోగలవా? నిజంగా?'
    'ఎందుకమ్మా అంత బాధపడ్తావ్? అన్నయ్యలందరూ వెళ్ళిపోయారనేగదా? నేను చిన్న కొడుకుని. నేనెక్కడికి వెళ్తానమ్మా మిమ్మల్ని వదిలి? ఎప్పటికి మీరు నాతోనే వుంటారమ్మా!' తల్లి రెండు చేతులూ పట్టుకొని బాధగా అన్నాడు.
    'బాబూ!' సుందరమ్మ కొడుకుని గుండెలకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. 'నిన్ను ఎన్ని మాటలు అన్నానురా కన్నా' అని ఏడుస్తూనే అన్నది.
    'ఊర్కో అమ్మా! అన్నయ్యలకు మాత్రం మీ మీద ప్రేమ వుండదా? చంద్రం అన్నయ్య చాలా మంచి వాడమ్మా! మీరంటే అన్నయ్యకు చాలా ప్రేమ. అందుకే టీచరుగా ఈ ఊళ్లో సెటిల్ అయ్యాడు. ఎందుకు? మీకు దగ్గరగా వుండాలనేగా? మిమ్మల్ని చూసుకోవాలనేగా వేరు కాపురం అంటావా... అన్నయ్య బాగా ఆలోచించే ఆ పని చేసి వుంటాడు. పెద్దన్నయ్యకూ, రెండో అన్నయ్యకూ మాత్రం మీరంటే ప్రేమ లేదా! ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని రమ్మన్నా వెళ్ళరని వాళ్లకు తెలియదా? నాన్న ఉద్యోగం వదిలేసి వెళ్ళరని తెలియదా? పైగా నా చదువు భారం నాన్న మరొకరి మీద వెయ్యరని కూడా వాళ్లకు తెలుసు. అంతే!'
    'చిన్నవాడైనా బాగా చెప్పాడు, ఆలోచించు!' అన్నాడు కామేశ్వరరావు భార్యకేసి జాలిగా చూస్తూ.
    'అవును నేనే అందరి గురించీ ఆలోచించాలి. అర్ధం చేసుకోవాలి. నా బాధ ఎవరూ అర్ధం చేసుకోనక్కర్లేదు. బిడ్డను నవమాసాలు మోసి కని, పెంచి పెద్ద చేసి, ప్రయోజకుడైన బిడ్డను చూసుకొని మురిసిపోతున్న సమయంలో వాడు ఆ అనుబంధాన్ని ఆ తల్లి పేగును తెంచుకొని వెళ్ళిపోతే ఆ తల్లి ప్రాణం ఎంత విలవిల్లాడి పోతుందో మీకు... మీ మగవాళ్ళకేం అర్ధం అవుతుంది!'
    'అమ్మా! నాన్నకు మాత్రం బాధ లేదనుకుంటున్నావా?'
    సుందరమ్మ చివ్వున తలెత్తి భర్త కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్లల్లో ఎంత అలసట! ఎంత దిగులు!
    'అవును! బాబూ! నేను ఏడుస్తాను, అరుస్తాను, సాధిస్తాను. గుండె బరువును దించుకుంటాను. మీ నాన్న మౌనంగా ఆ బరువును మోస్తున్నారు. పాపిష్టిదాన్ని! ఎంతసేపూ నా గొడవే కాని ఆయన గురించి ఆలోచించలేదు'.
    'సరే! పద! భోజనం వడ్డించు. పదరా రమేశ్!' అన్నాడు కామేశ్వరరావు ప్రసంగం మారుస్తూ.
    సుందరమ్మ ఇద్దరికీ భోజనాలు వడ్డించి ఎదురుగా కూర్చుంది.
    'అమ్మా! నువ్వు కూడా వడ్డించుకో!'
    'ముందు మీరు తినండి'.
    'ఉహూ! నువ్వు కూడా తినాల్సిందే!' మారాం చేస్తున్నట్టుగా అన్నాడు.
    'వడ్డించుకోరాదూ వాడంతగా అడుగుతుంటే?' కామేశ్వరరావు అన్నాడు.
    సుందరమ్మ కొడుకు కేసి తనివితీరా చూసుకుంది. ఆమెకు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని జయించినట్టు సంతోషంగా, గర్వంగా వుంది.
    వీడు అందరిలాంటి వాడు కాడు.
    చివరి రోజుల్లో తమకంటూ మిగిలేవాడు వీడొక్కడే. ఆ సత్తిగాడు అందరికంటే దుర్మార్గుడు. వాడికి తల్లి దండ్రులు ఉన్నారనే ధ్యాస కూడా లేదు. తప్పపుట్టాడు. బొత్తిగా ప్రేమంటే ఏమిటో తెలియదు. పెళ్ళికి వచ్చి పట్టుమని పది నిముషాలైన వుండకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడా? ఆ మాటకొస్తే వాడొక్కడే మరీ కర్కోటకుడు.
    ఎక్కడున్నాడో? ఎలా వున్నాడో? ఏం చేస్తున్నాడో? పోలీసులు వెంటబడడం ఏమిటి? అలగా జనంతో చేరి దొంగతనాలు చెయ్యడం లేదు గదా!
    'ఏమిటమ్మా ఆలోచిస్తున్నావ్' పళ్లెం తెచ్చి తల్లి ముందు పెడ్తూ అడిగాడు చిన్న కొడుకు.
    'ఏం లేదు రా!' అన్నం పెట్టుకొని, ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంది. ముద్ద నోటికి చేదుగా తగిలింది.
                                *   *   *
    సంక్రాంతి పండక్కు కూతురూ, అల్లుడూ వచ్చారు. ఊళ్లో వున్న చంద్రం, కమల కూడా పిల్లలతో వచ్చారు. చంద్రానికి నాలుగేళ్ల కొడుకు. రెండేళ్ల కూతురు. చంద్రం కొడుకు కుణాళ్ నానమ్మ కొంగు పట్టుకొని వదలడు. తాతయ్య అన్నా, నాయనమ్మ అన్నా వాడికి చాలా ఇష్టం. వారంలో సగం రోజులు ఆ పిల్లవాడు నాయనమ్మ దగ్గిరే వుంటాడు.
    'వీణ్ణి కాస్త ఆడించండి. నాతో వంటింట్లోకి వస్తున్నాడు.' అంటూ పిల్లవాడ్ని కామేశ్వరరావుకు అప్పగించింది సుందరమ్మ. 'రారా తాత! అలా పోయి వద్దాం.' అంటూ కామేశ్వరరావు మనవడ్ని తీసుకొని వీధి వాకిట్లోకి వెళ్ళాడు. ఆయన మనవడ్ని 'తాతా!' అని పిలుస్తాడు సరదాగా.
    సుందరమ్మ పిండి వంటల పనిలో మునిగిపోయి వుంది.
    కమల రోటి దగ్గర కూర్చుని పిండి రుబ్బుతున్నది. ఎండుగా వుండటం వల్ల చెమటలు పడ్తున్నాయి. ముఖం మీద స్వేద బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి.
    వరండాలో సూర్యనారాయణ ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. ఎదురుగా కూర్చుని సునంద తమ్ముడు రమేశ్ తో కబుర్లు చెబుతోంది.
    'అలా కూర్చోకపోతే వెళ్ళి మీ అమ్మకు సాయం చెయ్యరాదూ! మీ వదిన కూడా పని చేస్తున్నది.' అన్నాడు సూర్యనారాయణ భార్యతో.
    సునంద చిరుకోపంతో భర్తకేసి చూసింది. మూతి సున్నా చుట్టింది. జడ విసిరి భుజం మీదకు వేసుకుంది. చివ్వున లేచి, చర చర లోపలకు వెళ్ళిపోయింది.
    సునంద కమల దగ్గరకు వెళ్ళి 'ఆ పిండి నేను రుబ్బుతాను లే వదినా' అంది.
    'ఇదికాక మరొక వాయి రుబ్బాలి. ఆ తర్వాత పూర్ణాలకు రుబ్బాలి. పూర్ణాల పిండి నేను రుబ్బుతానులే' అంటూ లేచి నిల్చుంది కమల. పిండి గిన్నె తీసుకొని లోపలకు వెళ్ళింది. 'మీరు వేరే పనుంటే చూసుకోండి అత్తయ్య, గారెలు నేను వేస్తాను.' అంది కమల.
    'పిండి రుబ్బడం అయిపోయిందా?'
    'ఇంకా రెండు వాయిలు రుబ్బాలి. సునంద రుబ్బుతుంది.'
    'అయ్యో! అది రుబ్బుతుందా?' అంటూ చేతిలో వున్న అట్లకాడ కోడలకు అందించి వంటింట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది సుందరమ్మ.
    అలా వెళ్తున్న అత్తను నిరసనగా చూసింది కమల.
    'అయ్యో! అదేమిటే తల్లీ, రాక రాక పుట్టింటికి వచ్చావ్. నీచేత చాకిరీ చేయించుకోవడం ఏమిటి? లే! లే! నేను రుబ్బుతాను. సుందరమ్మ రోటిదగ్గరకు వచ్చి అన్నది లబలబలాడిపోతూ.  

 Previous Page Next Page