Read more!
 Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 2


    'ఎలాగయినా నిన్ను మావాళ్ళు పట్టుకుని తీరతారు మహర్షీ. అప్పుడు నేనే నీ మెడకు స్వయంగా ఉరి బిగిస్తాను. నీలాంటి నరరూప రాక్షసుడి  శరీరంలోంచి ఆఖరి ప్రాణం పోతూ నువ్వు గిలగిలా కొట్టుకుంటుంటే చూసిగానీ నేను నా సర్వీస్ లోంచి రిటైర్ అవను' అని తనలో తానే ఒక శపథం పూనినట్టు అనుకున్నాడు.

   
                                                             2

     కాలింగ్ బెల్ మ్రోగిన శబ్దం వినిపించి చదువుతున్న పుస్తకాన్ని ప్రక్కన పెట్టి వచ్చి తలుపు తీశాడు వర్మ. ఎదుటి వ్యక్తిని చూసి అప్రయత్నంగా అడుగు వెనక్కివేసి "నువ్వా......? అన్నాడు, తన కళ్ళని తనే నమ్మలేనట్టు.

    మహర్షి లోపలికి అడుగు పెడుతూ "ఏమిటీ దెయ్యమై వచ్చానను కుంటున్నావా?" అన్నాడు నవ్వటానికి ప్రయత్నిస్తూ.

    వర్మ గుమ్మం దగ్గరికి వెళ్ళి అటూ ఇటూ  చూసి, ఎవరూ తమ ఇంటిని గమనించడం లేదు అని నిశ్చయించుకున్నాక వెనక్కి తిరిగాడు.

    "జైల్లోంచి తప్పించుకొన్నావా?"

    "తప్పించుకోక పోయుంటే ఈ రోజు ప్రొద్దున్నే ఉరికంబ ఎక్కి ప్రాణాలు పోగొట్టుకొని వుండేవాడిని."

    "కానీ ఇదేమీ పేపర్లో రాలేదే?"

    "తెల్లవారుజామున రెండింటికి తప్పించుకున్నాను. అప్పటికి పేపర్ల ప్రింటింగ్ అయిపోయి వుంటుంది. బహుశా రేపోస్తుంది ఈ వార్త....." అని కుర్చీలో కూర్చుంటూ ".....చాలా అలసటగా వుంది రవివర్మా. నాకో కప్పు కాఫీ కావాలి" అన్నాడు మహర్షి.

    వర్మ కిచెన్ లోకి వెళ్ళి స్టవ్ మీద నీళ్ళు పెట్టి వచ్చాడు. అతడి మనసంతా ఎగ్జయిటింగ్ గా వుంది. వచ్చి మహర్షి ఎదురుగా  కూర్చుంటూ "ఇదంతా నేను  నమ్మలేకపోతున్నాను. నువ్వు ఇంత సాహసం చేస్తావనుకోలేదు" అన్నాడు.

    "నేను చేద్దామనుకోలేదు. దీనివల్ల  ఏ ఫలతం వుండదని తెలుసు. పోలీసులు ఎప్పుడో ఒకప్పుడు నన్ను పట్టుకొని తీరతారు. ఉరికంబం ఎక్కించేవరకూ నిద్రపోరు."

    "మరి అదే నిజమయిన పక్షంలో......"

    మిత్రుడి అనుమానాన్ని అర్థం చేసుకొన్నట్టుగా మహర్షి అన్నాడు- "ఎలాగో ఉరికంబం తప్పునప్పుడు ఇంత కష్టపడి ఎందుకు తప్పించుకున్నావు అన్నది కదూ నీ ప్రశ్న?"

    వర్మ మాట్లాడలేదు.

    మహర్షి గాఢంగా  విశ్వసించి "మరణించే ముందు సిరిచందనని ఒక్కసారి చూడాలనుకున్నాను. జైలు వాళ్ళని అడిగితే ఒప్పుకోలేదు. మరణం సమీపిస్తూన్న కొద్దీ సిరిని చూడాలన్న కోరిక ఎక్కువయింది. ఇంక ఆపుకోలేక పోయాను. బయటపడ్డాను" అన్నాడు.

    "కానీ ఇది ఎంత రిస్కో ఆలోచించావా?"

    "మరణం పట్ల నాకేమీ భయంలేదు. మరణించే ముందు ఆమెను చూడాలన్నదే నా కోరిక."

    "నిన్ను పిచ్చివాడనాలో, ప్రేమకి ఎవరూ ఇవ్వనంత విలువిస్తున్నందుకు ఒక అద్భుతమైన వ్యక్తి అనుకోవాలో నాకర్థం కావటంలేదు."

    చాలాసేపటి తరువాత మహర్షి నవ్వాడు. "నువ్వేమైనా అనుకో కానీ నేను మాత్రం సిరిచందనని చూడాలి."

    "ఆమె ఎక్కడుంది?"

    "తెలీదు."

    "ఒకవేపు పోలీసులు నీ కోసం వెదుకుతూండగా ఆ అమ్మాయి ఎక్కడుందో ఎలా తెలుసుకోవటం? ఎవర్నైనా పెళ్ళి చేసుకుందో, అసలీ రాష్ట్రంలో వుందో లేదో ఏమీ తెలీదు కదా?"

    "కాలేజీకి వెళ్ళి పాత రికార్డ్సు పరిశీలిస్తే ఆమె పర్సనల్ అడ్రస్ దొరకొచ్చు. అక్కణ్ణించి ఎంక్వైరీ చేసుకుంటూ వెళితే ప్రస్తుతం ఎక్కడుందో తెలియవచ్చు."

    "ఇదంతా జరగటానికి కనీసం వారం పదిరోజులు పడుతుంది."

    "నెలరోజులు పట్టినా సరే, నేను చూడాలి."

    వర్మ మహర్షి వైపు చిత్రంగా చూసాడు. "ఆమెతో చదువుకున్నంత కాలం నీప్రేమని ఆమె ముందు వెల్లడి చేయలేదు. అసలు మీ పేరుకూడా ఆ అమ్మాయికి గుర్తుందో లేదో నీకు తెలీదు. ఇప్పుడు చచ్చిపోయే ముందు ఆమె నొకసారి చూడాలనుకుంటున్నావ్" అని గాఢంగా  విశ్వసించి "......సరే, నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. కానీ ఈ పది రోజులూ ఎక్కడుంటావ్?" అనడిగాడు. "ఎక్కడుంటే మంచిదంటావ్?" తిరుగు ప్రశ్న వేశాడు మహర్షి.

    "నా దగ్గరుంటే ప్రమాదం. నిన్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నేను నీకు బాగా సహాయం చేసానని అందరికీ  తెలుసు. నువ్వు తప్పించుకున్నావనగానే వాళ్ళ అనుమానం నా మీదికే వస్తుంది. ఇక్కడుండటం మంచిదికాదు."

    "ఏదన్నా హోటల్లో వుంటాను" అన్నాడు మహర్షి.

    "హొటల్లోనా" ఆశ్చర్యంగా అడిగాడు వర్మ.

    "అవును. సాధారణంగా జైలునుంచి ఎవరైనా తప్పించుకుంటే ఎక్కడైనా దాక్కుంటారని, బయటికి రావటానికి భయపడతారని అందరూ అనుకుంటారు. నేను మామూలుగా హొటల్లో వుంటే ఎవరికీ అనుమానం రాదు. కొద్దిగా రూపురేఖలు మార్చుకుంటాను. ఈ అమ్మాయి ఎక్కడుందో నువ్వు ప్రయత్నం చేయి. తెలియగానే నాకు చెప్పు. వెళ్ళి ఓసారి చూపిసి ఆ తర్వాత అటునుంచటే తిరిగి జైలుకి వెళ్ళిపోతాను."

    "ఆ అమ్మాయిని చూసిన తరువాత తిరిగి జైలుకి వెళతావో, లేకపోతే మళ్ళీ  ప్రాణం మీద ఆశ పుడుతుందో ఎవరు  చెప్పోచ్చారులే. అయితే ఆ అమ్మాయి వెతకటం మొదలు పెడతాను." అంటూ లేచి "..... పద నిన్ను హొటల్లో దింపుతాను" అన్నాడు వర్మ.

    "వద్దు" అన్నాడు మహర్షి. ".......నువ్వూ నేను కలిసి బయటికి వెళితే నువ్వనట్టు ఎవరికైనా అనుమానం వస్తే ప్రమాదం  నేనొక్కడినే వెళ్ళి రూమ్ తీసుకుంటానులే. రేప్పొద్దున నేను పట్టుబడినా ఈ కేసులో నీ పాత్ర ఉన్నట్టు రుజువు కాదు" అని బయటికి నడిచాడు మహర్షి.

    అతడు తలుపు తీసి బయటికి అడుగు పెట్టబోతుండగా "మహర్షీ" అని వెనకనించి వర్మ పిలుపు వినబడింది.

    ఆగి వెనుతిరిగి చూశాడు.

    "ఒక్క నిమిషం" అంటూ వర్మ లోపలికి వెళ్ళాడు.

    దాదాపు అయిదు నిమిషాలపాటు వెదికి పెట్టెల అడుగు నుంచి ఒక పుస్తకం తీసుకొని ముందు గదిలోకి వచ్చాడు.

    "ఏమిటిది?" అడిగాడు మహర్షి.

    "నీకు ఉరిశిక్ష పడగానే ఇక దీని అవసరం  రాదనీ పెట్టె  అడుగున ఎక్కడో పడేసాను. ఇప్పుడు నువ్వు బయటపడ్డావు కాబట్టి దీన్ని చదివితే మంచిది."

    మహర్షి ఆశ్చర్యంగా దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. మొదటి పేజీ తిప్పాడు అది ఒక డైరీ. మొదటి పేజీలో పేరు చూడగానే అతడి  మొహం వివర్ణమైంది.

    "శ్రీవాణి"

    తన భార్య!

    మొహంమీద నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ "ఈ డైరీ చదివి కొత్తగా నేను తెలుసుకోవలసింది ఏముంది వర్మా?" అనడిగాడు.

    "చదువు. చదవడం వల్ల నష్టమేం లేదుగా?" క్లుప్తంగా అన్నాడు వర్మ.

    "సరే మంచిది. వెళ్ళొస్తాను" అని మహర్షి ఆడైరీ చేత్తో పట్టుకుని బయటకు నడిచాడు.

    అక్కణ్ణించి అతడు సరాసరి హొటల్ కి వెళ్ళాడు. జీవితపు ఆఖరి పదిరోజులూ మంచి హొటల్లో గడపాలని నిశ్చయించుకున్నాడు. వర్మ యిచ్చిన డబ్బు జేబులో  వుంది.

    'జైలునుంచి తప్పించుకున్న ఖైదీ అని పెద్ద బొమ్మ మొదటి పేజీలో వేయటం, పట్టుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి  అని ప్రకటించడం కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతూంటుంది' అని అతనికి తెలుసు. 'ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ విషయం ఇంకా బయటికి పొక్కలేదు. కాబట్టి తనేమీ భయపడనవసరం లేదు' అనుకున్నాడు.

    మామూలుగా నడుచుకుంటూ వెళ్ళి కౌంటర్లో సంతకం పేట్టి రూమ్ తీసుకున్నాడు. మూడు అంతస్థుల హొటల్ అది. మూడో అంతస్థులో చివరి రూమ్ అతనిది. అదీ ఒకందుకు మంచిదే అనుకుంటూ రిసెప్షన్ నుంచి రూమ్ తాళం చెవులు తీసుకుని  అక్కడికి చేరుకున్నాడు.

    చేతిలోని డైరీ పక్కమీదకు పడేసి  బాత్ రూమ్ లోకి వెళ్ళి దాదాపు గంటసేపు స్నానం చేశాడు. చాలా రోజుల తరువాత వెచ్చని నీళ్ళతో స్నానం శరీరానికెంతో ఆహ్లాదకరంగా అనిపించింది.

    తిరిగి గదిలోకి వచ్చాడు. కళ్ళమీద నిద్ర కమ్ముకు వస్తోంది. అందులోనూ గతరాత్రి జైలునించి తప్పించుకునే పనిలో అసలు నిద్ర లేదు. అలాగే పక్కమీద వాలాడు. చేతికి డైరీ తగిలింది. దాన్ని విసుగ్గా ప్రక్కకి విసిరేశాడు.

    భార్య తాలూకు వస్తువులే కాదు, ఆలోచనలు కూడా అతడిని చిరాకు పరుస్తున్నాయి. అప్పటివరకూ ముంచుకు వచ్చిన నిద్ర దూరమైంది. బలవంతంగా  నిద్ర పోవటానికి ప్రయత్నం చేశాడు. నెమ్మది నెమ్మదిగా నిద్రలోకి జారుతూండగా అతడి ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి.

   
                                                           3

    స్త్రీ పురుషులు జీవితపు రెండో స్టేజిలో అడుగు పెట్టే మొదటి రాత్రి...... శోభనం రాత్రి.

    వధూవరుల కలల హర్మ్యాలకు పునాదులు పడాలన్నా, భవిష్యత్ భవంతులు పేకమేడల్లా కూలిపోవాలన్నా ఆ రాత్రే ఆరంభం. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికీ, ఒకరంటే ఒకరు విముఖత్వం ప్రదర్శించుకోవటానికీ ఆ రాత్రే  జీవితపు పుస్తకపు  మొదటి వాక్యం.

    అనాఘ్రాణిత పుష్పాలు సంపూర్ణత్వాన్ని పొందాలన్నా, శలభాల్లా వాడిపోవాలన్నా డానికి అంకురం ఆ రాత్రే.

   
                           *    *    *


    ఆ గదిలో....! జాజిపూల అత్తరు వాసనలూ, అగరొత్తుల పరిమళమూ, పందిరిమంచమూ, పట్టు పరుపూ..... అన్నీ విరహంతో వేగిపోతున్నాయి.

    శోభనమనగానే, అంతవరకూ బద్ధకంగా రెస్ట్ తీసుకుంటున్న పరుపు కూడా హడావుడిగా రొమ్ము విరుచుకుని దుమ్ము దులిపించుకుని కొత్త దుప్పటి పరమయింది.

    ఇక ఆ మంచం ఆరాటమైతే చెప్పనవసరం లేదు. కదలికలకు అరిస్తే ఆ జంట ఎక్కడ సిగ్గుపడతారోనని బోల్టులన్నీ బిగించుకుంది.

    ఇక కుసుమాలయితే మా కన్నా సుకుమారంగా వున్న వధువు శరీరం అతని బరువుకు ఎక్కడ కందిపోతుందోనని పరుపు నిండా చేరిపోయి ముగ్ధత్వంతో పేరంటాల్లా కూర్చున్నాయి.

    ధూపానికి విరహమెక్కువై మెలికలు తిరిగిపోతూ గదంతా ఆమె ఉనికి కోసం వెదుకుతోంది.

    అన్నింటికన్నా  విషాదంగా వున్నది ఆ గదిలో ఒక లైటు మాత్రమే. ఆ రాత్రి తన అవసరం వారికి లేదనే బాధతో అదికుంచించుకుపోయి 'డిమ్ గా' వెలుగుతోంది.

    సరిగ్గా అప్పుడు..... ఆడంగుల నవ్వులు తలుపుల్ని నెట్టాయి. గాజుల గలగలలు  ఆమెని లోపలికి తోసాయి. నవ్వులతోనే తలుపు మూసుకు పోయింది.

 Previous Page Next Page