Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 3


    తనే 'ముందడుగు' వేయాలో, అతనే వచ్చి నడుముచుట్టూ చేతులు వేసి నడిపించుకు వెళతాడో..... తెలియనట్టు ఆమె అక్కడే నించుండిపోయింది కొద్దిసేపు.

    అతని పరిస్థితీ దాదాపు అలాగే వుంది.

    చివరికి ఆమె కదిలింది.

    ఆమె అతని ఎదురుగా వచ్చి తలదించుకుని నుంచుంది.

    ఆ రాత్రి కోసం మనసులో ఎన్నో  రిహార్సల్స్ వేసుకుని, చివరికి అన్నీ మరచి, ఏం చేయాలో  తెలీనట్టు కొద్ది క్షణాలు అలాగే  కూర్చున్నాడు. గడియారంలో సెకన్ల ముల్లు క్షణక్షణానికీ 'ముల్లు' లా గుచ్చుతున్నట్టు తోచి, అతను గొంతు సంవరించుకొని "కూర్చో శ్రీవాణి.....!" అన్నాడు.

    ఆమె నిశ్శబ్దంగా పాలగ్లాసు అందించి మంచం చివరన కూర్చుంది.

    అతను నిశ్శబ్దంగా పాలగ్లాసు అందించి మంచం చివరన కూర్చుంది.

    అతను సగంపాలు త్రాగి గ్లాసు ఆమెకు అందించాడు. ఆమె తాగాక చొరవగా గ్లాసు తీసుకుని ప్రక్కన పెడుతూ  ఆమె ముఖాన్ని  పరిశీలనగా చూసాడు.

    పేరుకుపోతున్న నిశ్శబ్దం అతనికి అనిజీగా అనీపించి, దాన్ని భంగపరుస్తూ "ఏదయినా మాట్లాడు శ్రీవాణీ" అన్నాడు.

    ఏం మాట్లాడగలను? అన్నట్టు ఆమె కనురెప్పల్లో చిన్న కదలిక.

    అతని మాటకు సమాధానం చెప్పకపోతే బావుండదు...... అనుకుందేమో మెల్లగా తలెత్తి "ఏం మాట్లాడను?" అంది.

    "ఏదయినా...... నీ కిష్టమైన టాపిక్" అన్నాడు.

    ఆమె సమాధానం చెప్పలేదు. నేలవైపు చూస్తున్న ఆ కళ్ళలో ఏమాలోచనలు కదులుతున్నాయో అతనికి అర్థం కాలేదు.

    అంత నిశ్శబ్దాన్ని భారించలేనట్టు ఆమె దగ్గరికి జరిగాడు. చనువుగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ "నేను నా గురించి కొంత చెప్పాలను కుంటున్నాను" అన్నాడు.

    ఆమెకేం మాట్లాడాలో తోచలేదు. క్లుప్తంగా "మీ ఇష్టం" అంది.

    ఆమె గొంతునుంచి మాటా వెలువడటమే ఆలస్యం, అతను ఆమెకి మరింత దగ్గరగా జరిగి ఆమె తలను భుజం వంపులో పొదుపు కుంటూ "నేనొక ప్రశ్న అడుగుతాను. తప్పుగా అనుకోవుకదా?" అన్నాడు.

    మొదటిరాత్రి భర్త ఓ ప్రశ్న  వేయడానిక్కూడా 'పర్మిషన్; అడగటం స్త్రీకి గొప్ప సంతృప్తినిస్తుంది.

    "అడగండి" అంది.

    "పెళ్ళికి ముందు....." క్షణం ఆగి పూర్తిచేశాడు. ".......ఎవరినయినా ప్రేమించావా?"

    ముందామెకు ఆ మాట అర్థంకాలేదు. ఆర్థంకాగానే చప్పున అతన్ని వదిలేసి దూరంగా జరుగుతూ "మీ కెందుకొచ్చిందా అనుమానం?" అని అడిగింది.

    అతను నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కి వదిలేస్తూ "అంత కంగారు పడకు. ఉరికే అడిగానంతే. తెలుసుకుందామని" అన్నాడు.

    ఆమె వెంటనే తల అడ్డంగా వూపుతూ "నేను అలాంటివాటికి చాలా దూరం" అంది.

    ఆమె గొంతులో ప్రతిఫలించిన అమాయకత్వానికి ముగ్ధుడై పోతూ- ఆమెను పొదివి పట్టుకుని "నిజానికి ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవడం నా కిష్టం లేదు. కానీ నిన్ను చేసుకుని నేను తప్పు చేయలేదనిపిస్తోంది" అన్నాడు.

    ఆమె వెంటనే "ఒకవేళ నేనెవరినైనా ప్రేమించానని చెబితే మీరెలా ఫీలయ్యేవారు?" అని అడిగింది.

    క్షణం అతను తెల్లబోయాడు. ఆమె అలా అడుగుతుందని అతను ఊహించలేదు. తరువాత నవ్వటానికి ప్రయత్నిస్తూ "అలా  జరగదు" అన్నాడు.

    "ఒకవేళ జరిగింది.....?"

    అతను స్థిరంగా "తిరిగి మిమ్మల్ని కలపడానికి ప్రయత్నించేవాడిని" అన్నాడు.

    ఆమె అతని ముఖంలోకి చూసి తలదించుకుని చిన్న స్వరంతో అంది  "అయినా నేనింతవరకూ అలాంటి ఆలోచనలే చేయలేదు. నా ఇరవైయ్యేళ్ళ జీవితమూ చదువుకే సరిపోయింది. వేరే ఆలోచన చేయటానికి తీరికే లేదసలు. కానీ జీవితంలో పెళ్ళంటూ జరిగితే నా సర్వస్వాన్ని అతనికే అర్పించాలని మాత్రం  అనుకునేదాన్ని."

    ఆ మాటలకి అతను పరవశించిపోయాడు. అతడి కళ్ళు అర్థమయ్యాయి. ఆమెని పొదివి పట్టుకున్న అతని చేతులు  కంపించాయి. ఆనందంతో వణికాయి.

    చప్పున ఆమె బుగ్గన ముద్దు  పెట్టుకున్నాడు.

    తరువాత నెమ్మదిగా దూరంగా జరిగాడు. ఆమె పవిత్రత ముందు తన నిజాయితీ చెప్పాలనింపించింది. మనమూ మనసూ కలవాలంటే ముందు తెరలు తీయాలి!

    "వాణీ....." అన్నాడు ".....నేనో అమ్మాయిని ప్రేమించాను"

    అగ్ని పర్వతాలు బ్రద్ధలవలేదు. లావా ఉప్పోంగలేదు. కనీసం చిన్న కంపనం కూడా లేకుండా తలెత్తి అతని కళ్ళలోకి వెదుకుతూ "నన్నేడిపించాలని చూస్తున్నారా?" అని అడిగింది.

    ఆమె నమ్మకాన్ని వమ్ముచేయటం ఇష్టం లేకపోయినా, ముందే 'అన్నీ' చెప్పేసి, దాచుకోవటానికి ఏమీ లేదనుకున్నాకే వైవాహిక జీవితాన్ని ప్రారంభించాలని అనుకోవటం వల్ల అతను మొత్తమంతా చెప్పేశాడు.

    "నిజం వాణీ! నేనో అమ్మాయిని ప్రాణప్రదంగా ప్రేమించాను. ఆ అమ్మాయిని నా కాబోయే భార్యగా ఊహించుకున్నాను."

    "ఆమె......ఆమె మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిందా?" ఆమె కంఠంలో తీవ్రత లేదు. సానుభూతి వుంది. అది గమనించి అతను రిలాక్సయ్యాడు.

    "లేదు. ఆమె అసలు నన్నా దృష్టితో చూడలేదు. ఎంత సేపూ నేనూ నా ఆరాధనే తప్ప, ఆమె నా స్నేహాన్ని ఎలా రిసీవ్ చేసుకుందో తెలుసుకోలేకపోయాను. తెలుసుకునేసరికి ఆమె స్నేహం, స్నేహం మాత్రమేనని అర్థమైంది. నా ప్రేమ నాలోనే సమాధి చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఒక్కటి, ఇప్పటికీ నే నామెను ప్రాణప్రదంగానే ప్రేమిస్తున్నాను."

    పూర్తిగా చెప్పాక అతను, మొదటిరాత్రే తన పాత 'ఎఫయిర్' గురించి చెప్పి ఆమెను హార్ట్ చేసానేమో అన్న గిల్టీ ఫీలింగువల్ల "నన్ను క్షమించు వాణీ" అన్నాడు.

    ఆమె అతని ఛాతీమీద తలాన్చి వుంది. అతడు చెప్పటం పూర్తయ్యాక అతనికి మరింత దగ్గరగా జరుగుతూ "నేనెంత అదృష్టవంతురాల్నండి! పెళ్ళికి ముందు ఎన్నో చెడు తిరుగుళ్ళు తిరిగి, అవన్నీ కప్పి పుచ్చుకుని ఏమీ  తెలీనట్టు నటించే వాళ్ళకన్నా ఎన్నోరెట్లు గొప్పవారు మీరు. ఈ విషయం మీరు చెప్పకపోయినా నాకు తెలిసే అవకాశం లేదు. అయినా చెప్పారంటే, దాంట్లో నన్ను మోసం చేయకూడదు అన్ననిజాయితీ కనిపిస్తోంది."

    ముందు ఆమె ఏమందో అతనికి అర్థంకాలేదు. అర్థమయ్యాక ఆశ్చర్యపోయాడు. అటువంటి సమాధానం ఆమెనించి వస్తుందని ఆశించక పోవటంవల్ల కలిగిన ఆశ్చర్యమది. కానీ వెంటనే తేరుకున్నాడు. తనని ఓ  మోసగాడుగా భావిస్తుందేమో అనుకున్న అతనికి, ఆ మాటలు విభ్రాంతిని కలిగించాయి.

    ఆమె చెప్పటం పూర్తయ్యేసరికి అతను పూర్తిగా కదిలి పోయాడు.

    ఆ తరువాత ...... ఒకరిమీద ఒకరు వెన్నెలలా పరుచుకుని ...... మథనంలో అమృతాన్ని వెదికికొని...... 'ఇరువురిని ఒక్కటి చేసిన ఆ నిమిషమ్ము...... సృష్టి రహస్యమ్ము.'

    తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకోబోయేమందు అతని ఛాతీమీద జుట్టును సవరదీస్తూ "ఆ అమ్మాయి పేరేమిటి?" అని అడిగిందామె.

    "సరిచందన"

   
                               4

    మేఘాలు తొలిగిపోతే ఆకాశం నిర్మలమవుతుంది. సుడిగాలి ఉధృతం తగ్గితే దారి స్పష్టమవుతుంది. అపార్థాలు తొలగిపోతే ఆ సంసారం స్వర్గమే  అవుతుంది.

    అతడు తన ప్రేమ విషయం భార్యకు చెప్పాక చాలా రిలీఫ్ గా ఫీలయ్యాడు. ఆమె కూడా ఆ విషయాన్ని స్పోర్టివ్ గా తీసుకోవడంతో ఆమెపట్ల అతని అభిమానం రెట్టింపయ్యింది.

    అయితే సిరిచందనను మరిచిపోవడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏ రాత్రో..... మనసూ, తనువూ రసాస్వాదనలో ఉండగా ఆమె చప్పున గుర్తుకు వచ్చేది. భార్యపట్ల తప్పు చేస్తున్నా భావం అతన్నప్పుడు దహించి వేసేది అతను పసిబాలుడై ఆమె గుండెల్లో తలదాచుకునేవాడు.

    సిరిచందన పట్ల అతని తాలూకు ఆరాధన మామూలు ఆకర్షణ కాదు  ఆకర్షణ తాత్కాలికం. ఆమె అందం చూసే  ఆరాధించిన వాడయితే,  శ్రీవాణి అంతకన్నా అందంగా వుంటుంది. అందమే కొలమానంగా తీసుకుని ఆరాదించేంత మామూలు ఆరాధన కాదతనిది. అతని దృష్టిలో ప్రేమంటే 'ఎత్తునుంచి పల్లానికి ప్రవహించే ఏటి నీరు లాంటిది కాదు...... నిశ్చలంగా ఒకచోట నిల్చుని పద్మాలకూ కలువలకూ నిలయమైన అందమైన సరస్సు' లాంటిది. అందుకే అతను అనుకున్నాంత సులభంగా ఆమెని మరచిపోలేక పోయేవాడు.

    కానీ ఆమెను మరచిపోవాలనిమాత్రం బలంగా అనుకున్నాడు. శ్రీవాణి మెడలో తాళి కట్టిన మరుక్షణం నుండీ అతను కేవలం ఆమెను మాత్రమే  భార్యగా ప్రియురాలిగా ఊహించుకునేవాడు. ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడేవాడు ఆమె పరోక్షంలో కూడా సిరిచందన గురించిన జ్ఞాపకాల్ని దాదాపు మరచిపోవడానికే ప్రయత్నించేవాడు.

    ఆ విధంగా సిరిచందన ఆలోచనల్నించి దాదాపుగా అతను దూరమవుతున్న సమయంలో అనుకోని సంఘటన అతని జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది.

    కాలం కృపాణమయింది.

    అతని నమ్మకాన్ని ముక్కలు చేసింది.

    ...... అతను తరచూ క్యాంపులకి వెళ్ళేవాడు. కొత్తలో శ్రీవాణిని వదిలి దూరంగా వెళితే సిరిచందన ఆలోచనలు ఎక్కడ ఆవహిస్తోయో అనే భయంతో ఆమెను కూడా వెంట రమ్మనేవాడు.

    ఒకటి రెండుసార్లు ఇద్దరూ అలా బయటి వూళ్ళు క్యాంప్ కి వెళ్ళాక ఆమె ఇక రానంది. "క్యాంపులో మీరు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు. అంతవరకూ  నేను మీ కోసం  ఎదురుచూస్తూ కూర్చోవాలి" అనేది.

    "ఒక్కోసారి ఎదురుచూడ్డంలోనే ఆనందముంటుందోయ్".

    "ఆ ఎదురుచూడ్డమేదో ఇంటిదగ్గరే చేస్తాలెండి. ఊరుకాని ఊళ్ళో ఆ హొటల్ గదిలో ఒక్కత్తినీ ఉండాలంటే నాకు భయం" అంటూ తప్పించుకుంది.

    ఆ తరువాత క్యాంపుకెళితే రోజుకి నాలుగుసార్లు ఇంటికి ఫోన్ చేయండి. రోజుకు ఆమె ముద్దుగా విసుక్కునేది. "రోజూ ఒక్కసారి మాత్రమే ఫోన్ చేయండి. రోజుకు నాలుగైదుసార్లు ఫోన్ చేసుకుంటే మాట్లాడ్డానికి మాటలు దొరకవు" అనేది.

    అతనికి నిజమేననిపించింది.

    క్యాంపునించి వస్తూ ఆమెకోసం ఏవేవో బహుమతులు తీసుకొచ్చేవాడు. క్యాంపు కెళ్ళినప్పుడు ఏ ఆలోచనలూ చుట్టుముట్టకుండా ఆమెకు రోజుకో ఉత్తరం రాస్తూ కూర్చునేవాడు.

    ఆ రోజు..... అతను పని త్వరగా పూర్తి చేసుకుని చెప్పిన రోజుకన్నా ఒకరోజు ముందే తిరిగివచ్చాడు.

    తలుపు తట్టబోయి ఆగిపోయాడు. లోపల్నుంచి రెండు స్వరాలు వినిపిస్తున్నాయి. ఒక గొంతు ఎవరిదో మొగవాడిది.

    రెండో గొంతు మాత్రం  తన భార్యది.

    ఈ సమయంలో తన ఇంట్లో ఎవరున్నారా అన్న అనుమానంతో లోపలి అడుగుపెట్టబోయి, ఆ సంభాషణ విని, తన ప్రయత్నం  విరమించుకున్నాడు.

    లోపల్నుంచి మగగొంతు వినిపిస్తోంది.

    "మీ ఆయన ఇలా తరచూ క్యాంపులకి వెళ్ళడం మన అదృష్టం."

    "ప్లీజ్...... అక్కడ చెయ్యి తియ్యి."

 Previous Page Next Page