Previous Page Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 2


    "పదిహేను రోజులు. మీ ప్రయోగం ఒక రూపుకి రాకపోతే మరో అయిదు రోజులు."

    "ప్రయోగమా?"

    "అవును. శూన్యసాంద్రతలో మనిషిలో పెరిగే బాక్టీరియా గురించి మీ ప్రయోగం ఆఖరి దశలో వుందని రిపోర్టు ఇచ్చారుగా! దాన్నిపరిశీలించిన తరువాత. ఈసారి వెళ్ళే వాళ్ళలో మీ పేరు చేర్చాలని అనుకున్నాం. ఓ ఇరవైరోజులు అక్కడ వుండి మీ ప్రయోగం పూర్తి చేసుకురండి."

    అనూహ్య మనసంతా సంతోషంతోనూ, ఉద్వేగంతోనూ నిండింది.తన పనిని వాళ్ళు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారన్న ఆనందం ఒకవైపు, ప్రతిరోజు "ఉదయించే భూమిని" చూస్తూ శూన్యంలో కొంతకాలం గడపగలిగే థ్రిల్ లభించబోతున్నందుకు ఉద్వేగంమరోవైపు.

    "వీలైతే రేపట్నుంచీ రిపోర్టు చేయండి ఇద్దరూ."

    "ఇంకొకరెవరు సార్?"

    "వాయుపుత్ర అని- మిగతా వివరాలు వేదప్రియ దగ్గర కనుక్కోండి."

    ఆమె ఉలిక్కిపడింది!

    వాయుపుత్ర!!

    అతడు తనని ఏడిపించిన విధానంగుర్తొచ్చింది.

    స్పేస్ షిప్ కి వెళ్ళే ప్రయాణంలో రెండు రోజులూ రాకెట్ లో ఇద్దరే వుండాలి అక్కడికి చేరుకున్నాక మిగతా ఇరవైరోజులూ కూడా తమని ఒకే క్యూబ్ లో వుండమని అక్కడివాళ్ళు కోరవచ్చు.

    "దాన్ని అలుసుగా తీసుకుని అతడేమైనా వెధవ్వేషాలు వేస్తే, తగినట్టు జవాబు చెప్పాలి......"

    .....అనుకుందే గాని - వెనుకనుంచి వస్తూ నవ్విన అతడి మొహమే ఆమె మాటిమాటికీ కనబడుతూంది.


                                 *    *    *


    అనూహ్య స్పేస్ షిప్ కి వెళ్ళటానికి అనుమతి లభించిందన్న  వార్త  తెలిసి అభినందించారు చాలామంది. ఆమె అన్నా వదినలు కూడా! అంతరిక్ష యానాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నపని. మామూలు వాళ్ళకి ఆ ఛాన్సు దొరకదు.

    ఆ మరుసటి రోజు ఆమె శిక్షణ యిచ్బే కార్యాలయానికి వెళ్ళింది. వాయుపుత్ర కూడా 'ట్రెయినింగ్' కి వచ్చాడు. అయితే తనని చూసి అతడి కళ్ళు ఎప్పుడూ నవ్వేలా మెరవలేదు. కాస్త సీరియస్ గా వున్నాడు.

    అనూహ్యకి ఈ "ట్రిక్" తెలుసు. మొదట్లో సరదాగా మాట్లాడిన అబ్బాయి వున్నట్టుండి సీరియస్ అయిపోయి, కాస్త అంటీ అంటనట్టు వుంటే- అమ్మాయిలో ఆసక్తి పెరుగుతుంది. తనవల్ల తప్పేమైనా జరిగిందేమో అని అబ్బాయిని అడగటానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నించటంలో తనంతట తానే దగ్గరవుతుంది. అబ్బాయి కూడా నవ్వేసి మామూలుగా అయిపోతాడు. దాంతో స్నేహం ఒక మెట్టు పెరుగుతుంది. ఇది తెలిసే అనూహ్య అతడి ముక్తసరితనాన్ని గ్రహించి తనుకూడా మౌనంగా వుండి పోయింది. ఆమె ఊహించినట్టే రెండురోజులు చూసి, ఆమెలో ఏ మార్పులేకపోవటంతో అతడే మళ్ళీ మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నించాడు.

    "మాడమ్! ఈ దుస్తుల వెనుక క్లిప్ పట్టటం లేదు కాస్త పెడతారా?"- ఏదో సీరియస్ పని వుండబట్టి మాట్లాడవలసి వచ్చినట్టు మొహం పెట్టి అడిగి వెనుతిరిగి నిలబడ్డాడు. వెనుక క్లిప్స్ పెట్టటం అయిపోయాక, తిరిగి "థాంక్స్" అనబోతూ ఆగిపోయాడు. ఆ పని రాబో (ట్) కప్పజెప్పి వెళ్ళిపోయింది ఆమె అప్పటికే. ఆమె మొహంలో నవ్వు కదలాడిందో లేదో అతడు గమనించలేకపోయాడు.

    అతడికి కోపం వచ్చింది. విసురుగా ఆమె దగ్గరికి వెళ్ళి అన్నాడు.

    "మీతో నేను కొంచెం మాట్లాడాలి."

    "ఏమిటి" అందామె.

    "ఇక్కడ కాదు"

    "మీరు మాట్లాడబోయేదేమిటో మీకు తెలుసు అని నాకూ తెలుసు. అందుకే ఉపోద్ఘాతాలు లేకుండా .... ఏదో ఒక టైమ్ ఇవ్వండి, ఎక్కడో స్థలం కూడా చెప్పండి. ఎదురుచూస్తూ వుంటాను."

    ఆమె అక్కడే, అప్పుడే "నో" అని చెప్పేద్దామనుకుంది కాని సంస్కారం అడ్డుపడింది. ఒక ఐదు నిముషాలు అతడితో కూర్చుని, తన మనసులో భావాల గురించీ, తన ప్రేమరాహిత్యం గురించీ చెప్పేస్తే మంచిది. తొందర్లోనే ఇద్దరూ ఒకే  రాకెట్ లో స్పేస్ స్టేషన్ కి వెళ్ళబోతున్నారు. అటువంటుప్పుడు ఈ విధమైన ముసుగులో గుద్దులాట కన్నా అంతా మాట్లాడుకోవటమే మంచిది కదా.

    ఆమె కాలెండర్ వైపు చూసింది. "నవంబర్- 14" అని చూపిస్తోంది. ఆరోజు గురువారం.

    అతడివైపు తిరిగి "శనివారం సాయంత్రం" అని పదహారో తారీఖు రోజుతీసి డైరీలో కాగితం రాసుకుంటూ "సాయంత్రం అయిదున్నరకి" అన్నది.

    "నాతో కలుసుకోవటాన్ని కూడా కాగితం మీద రాసి గుర్తుంచుకోవలసినంత చిన్న విషయంగా మీరు భావించటం నాకు విచారంగా వుంది" అన్నాడు అతడు  వెళ్ళటానికి సిద్ధపడుతూ. "సరే..... శనివారం సాయంత్రం సరిగ్గా అయిదున్నరకి రాజీవ్ పార్క్ లో......"

    అతడు వెళ్ళినవైపే ఆమె చూస్తూ కుర్చుండిపోయింది. వాయుపుత్ర.....అందమైన, చురుకైన అబ్బాయి. సాధారణంగా అయిదు నిముషాలు మాట్లాడితే 'నో' అని ఏ అమ్మాయి అనలేనంత హుషారుగా, మిలమిలలాడే కళ్ళతో - అప్పటికప్పుడు కొత్త కొత్త అల్లర్లు సృష్టించగలిగే  అబ్బాయి!!!

    .....అతడు పార్కులో ఆగడబోయేది తెలుసు.
   
    'నో అనగలదా?'
   
    అనాలి.

    ఆమెకు తన భర్త గుర్తొచ్చాడు.


                                         2

    'ఆర్కిటోస్' అంటే గ్రీకు భాషలో ఎలుగుబంటి. ప్రపంచ ప్రసిద్ది పొందిన పోలార్ ఎలుగుబంట్లు ఆ ప్రాంతంలో విరివిగా వుండటం వల్ల ఆ పేరు  వచ్చిందో లేక ఉత్తరధృవం మీద ఎలుగుబంటి ఆకారంలో కనిపించే నక్షత్ర మండలం వల్ల ఆ  పేరు వచ్చిందో తెలీదు కాని డానికి 'ఆర్కిటిక్ ' అని పేరొచ్చింది.

    అంతా మంచు! తెల్లటిమంచు!!

    చదువుతున్న పుస్తకం మూసేసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు యశ్వంత్. గ్యాస్ లాంప్ వెలుతురుతో పాటు వేడిని పుట్టిస్తోంది. పక్క  స్లీపింగ్ బ్యాగ్ లో పడుకొని నిద్రపోతున్నాడు నిఖిల్. పగలుకీ రాత్రికీ భేదంలేని సమయం అది!

    లేచి బయటకు వచ్చాడు యశ్వంత్. తెల్లటి తివాచీ కప్పినట్టు వుంది భూమి. ఏ క్షణంలోనైనా మంచు తుఫాను వచ్చేలా వుంది గాలి. కొన్ని వందల మైళ్ళవరకూ మనుష్య సంచారం లేని ప్రాంతం అది. ఒకవేళ అక్కడ మరణించినా కొన్నివందల సంవత్సరాలవరకూ శరీరం పాడవదు. అదొక్కటే అదృష్టం. దూరంగా ఎస్కిమోల గుడిసెలాగా చిన్న గుడిసె వుంది.

    అంతా మంచు సముద్రం! అడుగుతీసి అడుగు వెయ్యటంలో జాగ్రత్త చూపించకపోతే మంచుపెళ్ళ ఎక్కడన్నా బలహీనంగా వుండి లోపల నీళ్ళలోకి జారిపోతే.....అంతే.....విశాలమైన సముద్రం తనలో కలిపేసుకుంటుంది!

    యశ్వంత్ ఆస్ట్రానమీలో పోస్టుగ్రాడ్యుయేట్. గత అయిదేళ్ళుగా, ధృవప్రాంతాల్లో మారుతున్న నక్షత్రమండలాల రూపురేఖల రహస్యాల్ని పట్టుకోవటానికి అతడు అది అయిదోసారి అక్కడికి రావటం, ఎండాకాలం అక్కడ బావుండేది. మంచు సముద్రం మధ్యలో నెమ్మదిగా పడవల్లా కదిలే పాలిన్యాస్* మీద నిలబడిన తెల్లటి ఎలుగుబంట్లనీ, సీల్ చేపల్నీ గమనించటం, ఒకపక్క సూర్యుడూ-మరోపక్క నక్షత్రాలూ- ఒకేసారి ఉదయించి ఆర్నెల్లు అలాగే అలాగే నిలబడిపోయే సూర్యబింబం- తొలిసిగ్గు తెరలు తొలిగిపోయాక ప్రకాశవంతమయ్యే ముఖారవిందంలా.....

    అతడు జేబులోంచి ఒక ఫోటో తీసి చూశాడు. చాలా అందమైన అమ్మాయి. పెద్ద పెద్ద కళ్ళతో నవ్వుతూ చూస్తోంది. తడికి పాడయిపోకుండా ప్లాస్టిక్ కవర్ లో వున్నాకూడా, ఎన్నో సంవత్సరాల నుంచీ అతడి జేబులో శాశ్వత స్థానం ఏర్పర్చుకోవటంవల్ల అది బాగా నలిగిపోయింది. అయినా కూడా ఆ ఫోటోలో అమ్మాయి అందం ఏ మాత్రం చెడలేదు. ఆమెకి పదహారేళ్ళు వుండవచ్చేమో. కానీ దాదాపు ఆరు సంవత్సరాలక్రితం ఫోటో అది. ఆమె అతడి భార్య!

    పుట్టబోయే బిడ్డల్లో ఆరోగ్యాన్నీ, తెలివితేటల్నీ పెంచే జెనెటిక్ కోడ్ ని అర్థర్ బ్రాస్ ఇరవై రెండో శతాబ్దపు మొదటి దశాబ్దంలో కనుక్కున్నాక (ఆ పరిశోధనల తొలి దశలో) అది కేవలం స్త్రీ మెచ్యూర్  అయిన మొదటి పది వివాహాలు ఒక్కసారిగా పెరిగాయి.

    ఆ విధంగా యశ్వంత్ చదువుకుంటూ వుండగానే అతడికి వివాహమైంది. భార్య ఇంకా చిన్నపిల్ల!

    తిరిగి అర్థర్ బ్రాసే, ఏ వయసులో గర్భవతి అయిన స్త్రీ కయినా జెనెటిక్ కోడ్ వల్ల లాభం పొందగలిగేట్టు తన పరిశోధనల్ని విస్తరించి నోబుల్  బహుమతి పొందాడు. కానీ అప్పటికే రెండుకోట్ల బాల్యవివాహాలు జరిగినట్టు అంచనా! ప్రపంచం మళ్ళీ మామూలు గాడిలో పడింది. ఈ లోపులోనే యశ్వంత్ భార్యనుండి విడాకులు పొందాడు.

    గాయపడ్డ మనసే అద్భుతాల్ని సృష్టిస్తుంది. ఆస్ట్రోఫిజిక్స్ లో అతడు అద్భుతమైన విద్యార్థిగా రాణించాడు. అతడి మనసులో మాత్రం అతడి భార్య తాలూకు రూపం ఏ మాత్రం చెరిగిపోలేదు. రోజురోజుకీ అది విశ్వవ్యాప్తమవుతూ వచ్చింది.

    తెలివైన వాళ్ళందరూ ఇంట్రావర్డ్ లు అతడు అదే కోవకు చెందినవాడు రోజైణా ఆ అమ్మాయిలో ప్రేమ అంకురిస్తుందనీ, తనని గుర్తిస్తుందనీ వేచి వున్నా కానీ  అప్పటికే అతడు ఆమె నుంచి విడిపోయి సుదూర తీరాలకి వచ్చేశాడు. ఆమెను కలుసుకొనే ప్రయత్నం చేయలేదు.

    భూమికి ఒక కొసన, ఈ ఉత్తర ధృవ ప్రాంతంలో, మామూలు ప్రజలకి కొన్ని వేల మైళ్ళ దూరంలో వుండి, తన  విడిపోయిన ప్రేయసి కోసం మంచుగాలు నేపథ్యంలో ఆర్తగీతి ఆలపించే అతడి మనసుని ఆమె గుర్తిస్తుందా? మనిషి చదువూ- విజ్ఞాన తృష్ణేకాదు- అంతకన్నా ముఖ్యమైనది ప్రేమించే మనసు ప్రేమింపబడే అదృష్టమూ వుండాలని ఈ ఆరేడేళ్ళలోగ్రహించిందా?

    అసలు తను ఆమెకి జ్ఞాపకం వున్నాడా? లేక జరిగిపోయిన పెళ్ళిని ఒక చెడ్డ జ్ఞాపకంగా మిగుల్చుకుని మార్చిపోయిందా?

    అతడు తిరిగి ఫోటోవైపు చూశాడు. లేలేత చీకట్లో కూడా మిలమిల మెరిసే అందమైన రెండు కళ్ళు, నిర్దయ నిండిన కళ్ళు!


                               *    *    *

    గాఢమైన నిద్రలోంచి నిఖిల్ మేల్కొన్నాడు, స్లీపింగ్ బ్యాగ్ లోంచి బయటకు వచ్చి బద్ధకంగా వళ్ళు విరుచుకున్నాడు. బయట చలిగాలి శబ్దం హొరున వినిపిస్తోంది. పక్కన యశ్వంత్ లేకపోవటంతో బయటకొచ్చాడు. దూరంగా కనిపించాడు అతడు..... దీర్ఘాలోచనలో మునిగి వున్నట్టు! అతనెప్పుడూ అలాగే వుంటాడు.....ఏదో పోగొట్టుకొన్నట్టు.

    నిఖిల్ కి అతనంటే గౌరవం. భారతదేశంలో ఆస్ట్రోఫిజిక్స్ లో అతడికి మించిన వారు లేరు అన్నది నిర్వివాదాంశం. చాలా చిన్న వయసులోనే అతడు ఆ  స్థానాన్ని సంపాదించాడు. అయినా అతడి కళ్ళల్లోకి లోతుగా చూస్తే ఏదో తెలియని విషాదపు పోర.....

    చనువు తీసుకుని అడుగుదామనిపిస్తుంది. కానీ అంత చనువు అతనివ్వడు. 'విజ్ఞానం నిండిన ఆ కళ్ళ వెనుక లీలగా కదలాడే ఆ విషాదపు పోరని తొలగించటానికి నేను ఆడపిల్లనై వుంటే ప్రపంచం మొత్తం కాదన్నా సరే అతడిని ప్రేమించి వుండేవాడిని' అనుకున్నాడు నిఖిల్. తన ఆలోచనలకి అతడికే నవ్వొచ్చింది. ఎప్పుడూ మౌనంగా, గంభీరంగా వుండే యశ్వంత్ ని చూస్తే అతడికి భక్తితో కూడిన ఇష్టం.

    అతడు యశ్వంత్ దగ్గరికి నడవబోతూ చప్పున ఆగిపోయాడు. అదే సమయానికి యశ్వంత్ కూడా అక్కడంతా, ఒక్కసారిగా వెలుగు నిండడంతో ఆకాశంవైపు చూశాడు.

    ఆకాశంలో సూర్యుడున్నాడు!!!

    ఆర్కిటిక్ లో నవంబరు నెలలో సూర్యుడు? ? ?

    ఇద్దరూ స్థాణువుల్లా నిలబడిపోయారు.

    క్రమంగా వారికర్థమైంది. అది సూర్యుడు కాదని, మరో గాలక్సీ తాలూకు గ్రహమో-నక్షత్రమో అని, కాని అదికూడా నిజం కాకపోవచ్చు. భూమ్మీద ఏ మార్పూ లేకుండా అంత వెలుగు అసాధ్యం.

    ఇద్దరు మెరుపులా టెలిస్కోపు దగ్గరికి పరుగెత్తారు.

    ఒక వెలుగు సమదాయం దూరంగా వెళ్ళిపోతోంది.

    నిఖిల్ చకచకా ఫోటోలు తీస్తున్నాడు.సరిగ్గా అరగంట తర్వాత అది మాయమైంది.

    "సర్ అది పల్సర్* అంటారా?" నిఖిల్ అడిగాడు.

    "కాదు. పల్సర్  అయితే రేడియేషన్ వుండేది. బహుశా న్యూట్రిన్ స్టార్ ** అయి వుండవచ్చు. అయితే మాత్రం ప్రమాదం."
________________________________________________________________


    *రోదసీలో తిరిగే ఒక రకం నక్షత్రాన్ని న్యూట్రిక్సి స్టార్స్ అంటారు. 75 కోట్లు నూర్యుళ్ళు నూటయాభై సంవత్సరాల్లో ఇచ్చేటంత కాంతిని ఇవి ఒక్క సెకనులో ఇస్తాయి. ఆ లెక్కన ఒక అంగుళంలో వందో వంతు ముక్క చాలు భూమిని దగ్ధం చేయటానికి. అంగుళం 'న్యూట్రాన్ స్టార్" పాతిక కోట్ల లక్షల టన్నుల బరువు వుంటుందని అంచనా.

    **పల్సర్ అన్నా  న్యూట్రాన్ స్టార్ అన్నా ఒకటేనని శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు. ఇవ్వాల్టి సిద్ధాంతం ప్రకారం అవి రెండూ ఒకటే.

 Previous Page Next Page