Previous Page Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 3


    నిఖిల్ శిలా ప్రతిమలా ఆకాశం కేసి చూస్తూ నిలబడ్డాడు.

    అంతలో ఆ వెలుగు క్రమక్రమంగా ఒక ప్లయింగ్ సాసర్ (ఎగిరే గాలిపళ్ళెం)లా అదృశ్యమైంది. మళ్ళీ మామూలు వాతావరణం నెలకొంది అక్కడ.

    అంత వెలుగూ అన్ని క్షణాల్లో అదృశ్యమవటం బట్టి, ఆ పళ్ళెం కాంతికన్నా ఎన్నోరెట్లు వేగంతో ప్రయాణం సాగించివుంటుందని ఆ ఇద్దరికే అర్థమైంది.

    అంతలో రేడియోలో వాళ్ళకి ఆదేశం అందింది.

    "హల్లో యశ్వంత్"

    "మాట్లాడుతున్నాను సర్"

    "మిగతా ప్రోగ్రాం అంతా కాన్సిల్ చేసుకొని వచ్చేయండి. మిగతా వివరాలు ఇక్కడ మాట్లాడుకుందాం. అవసరమైతే మీరు అర్జెంటుగా స్పేస్ సిటీకి వెళ్ళాల్సి వుంటుంది."

    "అలాగే సార్."

    అరగంట తరువాత వాళ్ళని తీసుకువెళ్ళటానికి మంచు పొరల్ని చీలుస్తూ విమానం గాలిలో వస్తూ కనబడింది.


                                 *    *    *

    పదహారో తారీఖు సాయంత్రం నాలుగైంది. అనూహ్యకి తేదీ బాగా గుర్తుంది. కాగితంమీద వ్రాసుకుందే గానీ - వాయుపుత్రని ఆ రోజు కలుసుకోవాలని ఆమెకి  మాటిమాటికీ  గుర్తొస్తూనే వుంది. ఆమె ఆలోచనల్లో అతడు నొచ్చుకోకుండా ఎలా ఈ విషయం చెప్పాలా అని.

    సరిగ్గా అయిదుంపావుకి ఆమె రాజీవ్ పార్కుకి బయల్దేరింది. ఆమె అక్కడికి చేరుకునేసరికి అయిదు ఇరవై ఎనిమిది అయింది.

    రెండు నిమిషాలు ముందొచ్చిన ఆమె, అక్కడ అతనిని చూసి ఆశ్చర్యపోయింది. అతడు కూడా ముందొచ్చినందుకు కాదు. జుట్టు చెదిరిపోయి, మొహమంతా పీక్కుపోయినట్టూ- అతడు నీరసంగా కనపడుతున్నాడు.

    "అలా వున్నరేమిటి" అప్రయత్నంగా అడిగింది. అతడు నవ్వేడు. ఆమె  కనపడిన ఆనందం అతడి కళ్ళల్లో స్పష్టంగా కనబడుతూంది. "మీరు ఇరవై నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చారు" అన్నాడు.

    ఆమెకి షాక్ తగిలినట్టయింది.

    "ఇరవై....నా...లు.....గ్గం....ట....లా" అంది.

    "అవును. శనివారం సాయంత్రం వస్తానని చెప్పి ఆదివారం వచ్చారు."

    తన ఎలక్ట్రానిక్ కాలెండరులో తేదీకీ వారానికీ మధ్య ఏదో  పొరపాటు జరిగిందని ఆమెకి అర్థమైంది. వాచీలో తేదీ అవసరం ఎప్పుడో గాని వుండదు. అందువల్ల ఏ నెలలోనో 31వ తారీఖు అడ్జస్టుమెంటు చేయడంలో తప్పు జరిగివుంటుంది. అదికాదు ఆమె ఆలోచిస్తుంది. ఒకరాత్రి - ఒక పగలు - ఎముకలు కొరికే చలిలో, మాడ్చేసే ఎండలో తన కోసం ఇతడు-

    "మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. ఇది ఒక ట్రిక్ అనుకుంటున్నారు. అవునా? మీ సానుభూతినీ, తద్వారా మీ ప్రేమని సంపాదించటానికి ఇలా  గంటల తరబడి పార్కులో వుండిపోయాననుకుంటున్నారు కదండీ! అభిమానానికి నమ్మకం ముఖ్యం. నన్ను నమ్మండి.......ఏదో ఒక క్షణం మీరు వస్తారన్న ఆశ ఈ రోజు అంతా నాకు ఊపిరి పోస్తూనే వుంది. ఇలా ణా కళ్ళలోకి చూడండి. అక్కడ కూడా నిజాయితీ కనిపించకపోతే, ఇక నేనేం చేయలేను."

    ఆమె వినటంలేదు. గుండె పొరల్లో ఏదో ఎక్కడో కదులుతున్న భావన. అతడన్నట్టు ట్రిక్ గానీ ప్లాన్ గానీ ఏమీలేవు. అతడు నిశ్చయంగా తన కోసమే వెయిట్ చేశాడు. నిజానికి అతడు అడిగిన రోజే కలుసుకోవచ్చు. కానీ ఏదో  పనున్నట్టు రెండ్రోజుల తరువాత టైమిచ్చింది. దాని ఫలితం ఇంత దారుణంగా వుంటుందని ఊహించలేకపోయింది.

    ఆమె అతనివైపు చూసింది. అతడు చెప్పినా  చెప్పకపోయినా ఆ కళ్ళనిండా అభిమానం.....కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఆ స్వచ్ఛదనం ఆమెకి తెలుసు 'నా మనసంతా నువ్వే' అని కళ్ళు మాత్రమే చెప్పగలిగే భాష.

    అంతటి అభిమానాన్ని అంతకుముందే మరొకరి కళ్ళల్లో చూసింది. కానీ అప్పటికి అర్థం చేసుకునే వయసులేదు. చదువే జీవిత పరమావధి అనుకునేది. ఫలితం.....?

    విడాకులు.


                                            3

    ఆ తర్వాత నెలరోజులపాటు వారికి చాలా ఆధునికమైన శిక్షణ ఇవ్వబడింది. ఈ శిక్షణాకాలంలో వాయుపుత్ర ఆమెతో ఎక్కువ సంభాషించలేదు. క్లుప్తంగా మాట్లాడేవాడు. అయితే ఈసారి ఇది 'ట్రిక్' కాదు. పార్క్ లో సంఘటన జరిగిన తరువాత ఆమె తనకి చేరువవుతుందని అతడు భావించాడు. ఆమెలో స్పందన కలగకపోయేసరికి అతడు బాగా హర్ట్ అయ్యాడు. అది అతడి మొహంలో స్పష్టంగా కనిపించింది.

    అనూహ్య ఇదంతా గమనిస్తూ కూడా ఎటూ నిర్ణయించుకోలేకపోతోంది. వాయుపుత్ర కేవలం స్నేహం కోసమే ఇదంతా చేయడంలేదనీ తనని వివాహం చేసుకోవాలనే కోర్కెతో వున్నాడని ఆమెకు తెలుసు. అంతేకాదు, N.S.R.I. లో సగంమందికి పైగా పెళ్ళికాని అమ్మాయిలు అతడు "ఊ" అంటే ఎగిరి గంతేసి చేసుకుంటానికి సిద్ధంగా వున్నారనీ, మిగతా సగంమందీ, పెళ్ళికాకపోయినా అతడితో పవిత్ర స్నేహం చేయటానికి ఉవ్విళ్ళూరుతున్నారనీ కూడా ఆమెకు తెలుసు. అతడి పర్సనాలిటీ, ప్రవర్తనా అలాంటివి.

    అతడు లేనప్పుడు కంప్యూటర్ ద్వారా అతడి బయోడేటా పరీక్షించింది. ఆ వివరాలు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. పైకి జీవితాన్ని అంత తేలిగ్గా తీసుకునేవాడిలా కనిపించే ఆ యువకుడు కంప్యూటర్ టెక్నాలజీలో భారతదేశం గర్వించదగిన కొద్ది మందిలో ఒకడు. కానీ అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమావేశానికి వెళ్ళకుండా హిమాలయన్ మోటారు పందేలకి వెళ్ళటంవల్ల ఆ సంవత్సరం ఆఖరి నిముషంలో అతడికి ప్రతిష్టాకరమైన బిరుదొకటి రాకుండా పోయింది. జీవితాన్ని అంత తేలిగ్గా  తీసుకుంటాడు అతడు. రోజూ ఒక బాటిల్  తాగుతాడు. నాలుగుపాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు. పార్టీకి కలుస్తే- మిలటరీ కమాండర్ భార్యతోనైనా బాతాఖానీ వేసుకుంటాడు.

    అనూహ్యకి రాత్రిళ్ళు నిద్ర సరిగ్గా  పట్టడం మానేసింది. వాయుపుత్రకి అటో ఇటో చెప్తే తప్ప తన పనిలో ముందు ముందు ఏకాగ్రత కుదరదు. ఏం చెప్పాలి?

    తన మనసులో సంఘర్షణ అర్థం చేసుకోగలడా? అసలు తన మనసులో ఘర్షణ తనకి సరిగ్గా అర్థం అవుతుందా? ఏ నిర్ణయాన్నీ తీసుకోలేక, ఆమె  ఆ రంగంలో నిష్ణాతుడైన మరో మనిషి సలహా తీసుకోవాలనుకుంది.

    అప్పటికి వాళ్ళిద్దరూ కలిసి సిటీకి ప్రయాణం చేయడానికి ఇంకా నాలుగు రోజులుంది.

                               *    *    *

    ఆ గది నీట్ గా వుంది. "నీట్" అనేది సరైన పదంకాదు. ఆహ్లాదకరంగా వుంది.

    అది ప్రముఖ మానసిక శాస్త్రవేత్త గది. ఆయనకి అరవై ఐదేళ్ళుంటాయి. దాదాపు రెండు గంటలపాటు అనూహ్యని రకరకాల ప్రశ్నలతో పరీక్షించాడు. స్కానింగ్ జరిపాడు. చాలా మామూలు ప్రశ్నల్నుంచి క్లిష్టమైన ప్రశ్నలవరకూ అడిగాడు.

    "ఏ వయసులో మీకు వివాహం జరిగింది?"

    "పదిహేనో ఏట?"

    ఆయన గాఢంగా  విశ్వసించాడు. అర్థర్ బ్రాస్ కొత్త జెనిటిక్ కూడా కనుక్కుని ప్రపంచానికి చాలా మేలు చేస్తే చేసి వుండవచ్చుగాక! కానీ ఆ పదేళ్ళలో ఆ ప్రయోగానికి ఎంతోమంది చిన్నపిల్లలు వివాహమనే చట్టంలో ఇరుక్కోలేక మానసికంగా క్రుంగిపోయి, విడాకులు పొందారు.

    "మీ భర్త?"

    ".........యశ్వంత్! ప్రస్తుతం అతను ఎక్కడున్నాడో తెలీదు. ఆస్ట్రానమీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడని మాత్రం తెలుసు."

    "మీరిద్దరూ గొడవపడి విడిపోయారా?"

    "లేదు లేదు. అతడు చాలా మంచివాడు. నెమ్మదస్తుడు. కానీ......కానీ....."ఆమెకెలా చెప్పాలో అర్థంకాలేదు. ఆమె పని సులభం చేయడం కోసం ఆయనే ప్రశ్నలు అడగటం ప్రారంభించాడు. ఆమె చెప్పసాగింది.

    "నాకప్పటికి ఏమీ తెలీదు. చిన్నపిల్లను. బాగా చదువుకోవాలని వుండేది వీటన్నిటికన్నా ముఖ్యంగా...."

    "ఊ.....ముఖ్యంగా?"

    "యశ్వంత్ ని చూస్తే ప్రేమకన్నా అదో రకమైన భయంతో కూడిన గౌరవం కలిగేది. పెద్దమావయ్యను చూస్తే ఎలా వుంటుందో - అలా......"

    "పెద్దన్నయ్యలాగా కూడా అర్థమైంది. "లేదు. అతడు ముద్దు పెట్టుకుంటే బాగానే వుండేది. సెక్స్ కూడా అంత అభ్యంతరం వుండేదికాదు. కాని మిగతా సమయాల్లో అతడి దగ్గిర చనువు వుండేది కాదు. అతడు అఖండమైన తెలివి తేటలున్నవాడు. నడుస్తున్న కంప్యూటర్ లాగా కనపడేవాడు. ఎప్పుడూ పుస్తకాలు చదువుతూనే గడిపేవాడు. చెప్పానుగా....అతడంటే రోజు రోజుకీ గౌరవం హెచ్చేది!" కంఠం బాధగా ధ్వనిస్తూండగా ఆమె అంది. "భార్యా భర్తకి మధ్య కావాల్సింది  గౌరవం కాదు. అపరిమితమైన ఇష్టం.....పిచ్చి ప్రేమ.....నాకేమో బాగా అల్లరి చేయాలని వుండేది. కానీ అతడికి మూడు అడుగుల దగ్గిరకి వెళ్ళగానే ఎందుకో నాకు తెలియని భయంతో బిగుసుకుపోయేదాన్ని."

    ఆయన అర్థం చేసుకున్నట్టు తలూపాడు. భార్యాభర్తల మధ్య వయసులో గానీ, మానసిక స్థాయిలోగానీ  ఎక్కువ వ్యత్యాసం వుంటే కలిగే పరిణామమే ఇది ఆ పొర తొలగించటం కష్టం.

    ఆమె తల దించుకుని "అతడిని చూస్తుంటే ....." అని ఆగింది.

    "......చూస్తుంటే?"

    "......సర్ ఐజాక్ న్యూటన్నో, ఐన్ స్టీన్ నో చూస్తున్నట్టు వుండేది. అతడు యువకుడే..... కానీ ఎందుకో నాకలా అనిపించేది! అతడంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని ఎలా ప్రదర్శించాలో ఆ వయసులో తెలిసేది కాదు. క్రమక్రమంగా ఇద్దరం మానసికంగా దూరమయ్యాము. మమ్మల్ని కలిపే ప్రయత్నంగా ఎవరు చేయలేదు. ణా న్యూనతాభావాన్ని నేను ఇంకోలా ప్రదర్శించసాగాను. ఈ పెళ్ళే భవిష్యత్తుని నాశనం చేసింది అన్నట్టు ప్రవర్తించాను. దాంతో......విడాకులు తీసుకున్నాము" నెమ్మదిగా అంది.

    "ఎన్నాళ్ళయింది ఇది జరిగి?"

    "ఆరేడేళ్ళు" అందామె, "........తరువాత నేను నిజంగానే చదువులో మునిగిపోయాను. నేను విడాకులు తీసుకున్న అమ్మాయినని ఎక్కువమందికి తెలీదు. యశ్వంత్ జ్ఞాపకాలు కూడా ఎప్పుడో గానీ బలంగా వచ్చేవి కావు. పునర్వివాహం.... సెక్స్ ..... ఇలాంటి ఆలోచన్లు కూడా ఏమీ లేవు. ఇలా  సాగుతున్న సమయంలో అనుకోకుండా నా జీవితంలో ప్రవేశించాడు-"

    "ఎవరు?"

    "వాయుపుత్ర..... అని..... కంప్యూటర్ ఇంజనీర్" ఆమె  చెప్పటం ప్రాంభించింది. "అతడెంత హుషారైనవాడో మాటల్లో చెప్పలేం. నా  ఉద్దేశం బహుశా అతడితో పరిచయమైన ఏ అమ్మాయీ అతడితో స్నేహాన్ని అభిలషించకుండా వుండలేదని! అతడి అల్లరిలో కూడా తెలివితేటలు కనపడతాయి. అదీ  అతడిలో ప్రత్యేకత! మొదట్లో అతడి అల్లరిని నేను పట్టించుకోలేదు కానీ క్రమక్రమంగా  అతడంటే ఇష్టం ఏర్పడసాగింది. అతడు నన్ను అమితంగా ప్రేమిస్తున్నాడనేది నిర్వివాదాంశం. వారంరోజుల క్రితమే అతడు తనను వివాహం చేసుకొమ్మని నన్ను కోరాడు."

    "మరి మీ సమస్య ఏమిటి?"

    ఆమె తల అడ్డంగా ఊపుతూ, "లేదు డాక్టరుగారూ, నేనెందుకో సరిపెట్టుకోలేకపోతున్నాను. వాయుపుత్రతో పరిచయం తరువాత యశ్వంత్ మరింత జ్ఞాపకం వస్తున్నాడు. ఒక రకమైన గిల్టీఫీలింగ్ నాలో బలంగా నాటుకుంది. అలా అని వాయుపుత్ర ఆకర్షణ నుంచి తప్పించుకోలేకపోతున్నాను. నేను ఆ రోజుల్లో చాలా చిన్నపిల్లని. ఆ విషయం అర్థం చేసుకుని యశ్వంత్ కొద్దిగా సున్నితంగా ప్రవర్తించి వుంటే ఈ గొడవలు లేకపోవును. లేక నాదే తప్పేమో! యశ్వంత్ ఆరాధనా భావాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానేమో! కానీ ఇప్పుడు వాయుపుత్రని చూస్తున్నకొద్దీ నాకు యశ్వంత్ గుర్తొస్తున్నాడు. ఉహూ - కాదు - వాయుపుత్ర అంటే కూడా  నా కిష్టమే...........అయ్యో........నేను మీకెలా చెప్పను?"

    "నాకర్థమైంది" అన్నాడాయన. ఆమె మౌనంగా వుండి పోయింది.

    "మనిషి విద్యావంతుడయ్యేకొద్దీ మానసికంగా సంక్లిష్టమవుతున్నాడు మిస్ అనూహ్య! పంథొమ్మిదో శతాబ్దంలో పరాయి వ్యక్తివైపు చూడడమే అపరాధంగా భావించేవారట. ఇరవయ్యో శతాబ్దంలో మనుష్యులు తమ గత ప్రేమని ఒక మధురమైన జ్ఞాపకంగానో, మర్చిపోదగిన అనుభవంగానో మిగుల్చుకొని జీవితాన్ని కొనసాగించేవారట. ఒకసారి ప్రేమించినా, పాత ప్రేమను  గుండెల్లో దాచేసుకుని మరొకర్ని మళ్ళీ ప్రేమించడం తప్పుకాదు అన్న భావం క్రమంగా హెచ్చింది. తమ జీవితకాలంలో నలుగురైదుగుర్ని ఒకరి తరువాత మరొకర్ని మనస్ఫూర్తిగా ఇష్టపడడం సర్వసాధారణం అయిపోయింది. ఇంకొంతకాలం పోయాక ఒకే సమయంలో ఇద్దర్నీ సమానంగా  ప్రేమించడం కూడా మనిషి అనుభవంలోకి వస్తుందేమో! చిక్కేమిటంటే ప్రేమనీ, ఆకర్షణనీ ఏ పాయింట్ దగ్గిర విడగొట్టాలన్నది ఏ ఐన్ స్టీనూ కనుక్కోలేకపోవడం! ఇక నీ  విషయానికొస్తే నువ్వు యశ్వంత్ ని ప్రేమించలేదేమో అని నా అనుమానం. భర్తపట్ల చూపించాల్సినంత ఇష్టాన్ని ఆ రోజుల్లో చూపించలేదే అని గిల్టీగా ఫీలవుతున్నావు. అంతే! పోగొట్టుకున్నదెప్పుడూ గొప్పదే! వీలైనంతవరకూ అతడి గురించి ఆలోచించకు. జీవితాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మొదలుపెట్టడంలో తప్పులేదు. యశ్వంత్ తాలూకు వస్తువులన్నీ వదిలేసెయ్యి. విడాకులు తీసుకోవడం అనేది పెద్ద తప్పు అన్న భావాన్ని నీ మనసులోంచి చెరిపెయ్యి. అన్నిటికన్నా ముఖ్యంగా నీ కిదివరకే వివాహం జరిగిన విషయాన్ని వాయుపుత్రకి చెప్పు."

    "చెప్పాను."

    "చెప్పావా?"-ఆశ్చర్యంగా అడిగాడు.

    "అంటే యశ్వంత్ పేరూ, వివరాలూ అవేమీ చెప్పలేదు. వాయుపుత్ర దానిమీద ప్రశ్నలు కూడా ఏమీ అడగలేదు."నాక్కావలసింది నువ్వు" అంతే అన్నాడు. అసలప్పటినుంచీ అతడంటే అభిమానం ఏర్పడింది."

 Previous Page Next Page