కామాక్షమ్మగారికి ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. "జానకమ్మనీ, తన కుటుంబాన్నీ వాళ్ళ పేరెత్తితే అసహ్యించుకునే ఆయనేనా ఈ మాటంటూన్నది? జానకి భర్తపోయినప్పుడు ఆమెనీ, ఆమెబిడ్డల్నీ తెచ్చిపెట్టుకుందామండీ అంటే 'నాకు తెలీదు కామాక్ష్మీ జానకికి అసూయ ఎక్కువ. పైగా వాళ్ళు అష్టదరిద్రాలూ అనుభావిస్తూన్నప్పుడు మన ఐశ్వర్యం వాళ్ళకి అష్టదరిద్రాలూ అనుభావిస్తూన్నప్పుడు మన ఐశ్వర్యం వాళ్ళకి కంటకంగా వుంటుంది. చాతనయిన సహాయం దూరాన్నుంచే చేద్దాం"అన్నారు అటువంటిది ఆయన ఈ రోజు తనని అంతమాటన్నారంటే ముఖ్యంగా సుబ్బలక్ష్మి ముందు ఏం జవాబు చెప్పాలో అర్ధంకాక అవాక్కపోయింది. ఆశ్చర్యం ఆగ్రహంగా, ఆగ్రహం ఆవేదనగా మారి కన్నీరు కాలువలై పారింది.
సుమతి ఆశ్చర్యంగా ఒక పెక్షకురాలిలా వుండిపోయింది.
* * *
సుబ్బలక్ష్మి రాసిన ఉత్తరం పుచ్చుకుని, జానకమ్మ బయలుదేరివచ్చింది. "అన్నయ్యా! ఆ రోజు నువ్వు సుబ్బలక్ష్మిని ఉంచమని బ్రతిమాలితే, ఉంచాను కానీ, నీ డబ్బుని చూసీ నీ హొదాని చూసీ కాదు. ఏనాడైతే నీకూ నాకూ బంధం తెగిపోయిందనుకున్నాను. కానీ, ఉండబట్టలేక చూసి పోదామని వచ్చిన మేము ఈ రకంగా ఇరుక్కుపోయాం" కంటతడి పెట్టింది జానకమ్మ.
"ఊరుకో వదినా, ఆ గొడవంతా ఎందుకు? అయినా ఇప్పుడు ఏం జరిగిందని? ఏదో సంసారాలన్నాక కాస్త మాటా మాటా రాకపోదు."
"అవును, కాసిన్ని నిందలూ, కాసిన్ని అపవాదులూ కూడా రావొచ్చు. అవేవీ రాకముందే నా బిడ్డని నేను తీసుకుపోతాను. మా బ్రతుకేదో మేము బ్రతుకుతాం."
నరసింహారావుగారు ఏమీ మాట్లాడలేదు.
"వాగ్దానాలు చెయ్యగానే సరికాదు అన్నయ్యా! వాటిని నిలబెట్టుకోవాలి. 'నీ బిడ్డ నా బిడ్డ లాంటిదే, చదివిస్తాను ఉద్దరిస్తాను' అని మాటలు చెప్పగానే సరికాదు" నరసింహారావుగారి మీద విరుచుకు పడింది.
"ఇప్పుడు మాత్రం కాదన్నామా? క్లబ్బులూ, పేకాటలూ లాంటి చిల్లర వేషాలు తగ్గింఛమన్నాను. జానకమ్మా నువ్వు అర్ధచేసుకోకుండా ఆవేశపడుతున్నావ్. సుబ్బలక్ష్మి మీద నాకేమైనా పగా? కోపమా? తప్పుచేస్తే దిద్దడం తప్పా? అది నా బాద్యత కాదూ?" నచ్చచెప్పింది కామాక్షమ్మగారు.
"అవును జానకీ! కామాక్షి చెప్పింది నిజం సుబ్బలక్ష్మి మా బిడ్డలాంటిది. ఏ విధంగానూ మీకు సహాయ పడలేకపోయిన నేను ఈవిధంగానైనా కాస్త తోడుందా మనుకున్నాను. సుబ్బలక్ష్మి ఇక్కడుండడం, చదువుకోవడం మా అందరికీ ఇష్టమే. అంత బాధ్యత స్వీకరించిన మేము కాస్త మందలిస్తే తప్పుకాదు. అనవసరంగా నువ్వు బాధపడకు "ఒప్పించడానికి ప్రయత్నం చేశారు నరసింహరావుగారు.
జానకమ్మ మాట్లాడలేదు, మౌనం అంగీకారంగా భావించారు నరసింహారావుగారు.
"ఆఁ.....భోజనాల ఏర్పాట్లు చెయ్యి" అన్నారు కామాక్షమ్మగారి కేసి చూసి.
అంతటితో ఈ ప్రసక్తిమాని వేరే విషయాలేవో మాట్లాడుకుంటూ భోజనాలు చేశారు. రెండ్రోజులుండి సకల మర్యాదలూ పొంది వెళ్ళి పోయింది జానకమ్మ.
రోజులు గడుస్తున్నయ్. సుమతికి రోజు గడవడం కష్టంగా వుంది. పొద్దున్న లేవడం స్నానం, ధ్యాన్నం, భోజనం, పడక ఏం మార్పులేని జీవితం ఏదో నిరుత్సాహం ఆమెలో చోటు చేసుకుంటోంది. జీవితంమీద ఒకరకమైన విరక్తి పుడుతోంది. దానికి తోడు నెల తప్పిందన్న విషయం మరింత వేదిస్తోంది. మొదటి సారి చింటూమాట ఈ విషయం తెలిసినప్పుడు గోవిందూ. తనూ ఎంత సంబరపడి పోయారూ! వాసుదేవరావుగారు సంతోషం పట్టలేక కన్నీరు కార్చారు. 'ఏడుస్తున్నావా నాన్నా' అంటే 'కాదమ్మా ఆనందం ఎక్కువయి గుండె పట్టు తప్పుతోంది.' అన్నారు నవ్వుతూ.
అత్తయ్యా, మామయ్యా సరేసరి. గోవింద్ తరువాత ఇన్నేళ్ళకి తమ ఇంట్లో చిట్టిపాపడు తిరగాడ బోతున్నాడని వాళ్లు పడ్డహడావిడి ఇంతా అంతాకాదు. కానీ ఈ సారి? తన సంతోషం పంచుకోవడానికి గోవింద్ దగ్గరలో లేడు. ఇప్పుడప్పుడే రాలేడు కూడా. తండ్రి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. అత్తగారికి అనారోగ్యం తలచుకున్న కొద్దీ సుమతికి దుఃఖం ముంచుకోస్తోంది. హాయిగా జీవించవలసిన ఈ వయస్సులో అసంతృప్తి అలుముకుంటోంది. ఈ పరిస్ధితుల్లో మరో బిడ్డని మొయ్యడానికి మనస్సు దిక్కరిస్తోంది. ఒక నిర్ణయాని కొచ్చిన సుమతి డాక్టరు దగ్గరికి వెళ్ళేముందు సంగతి అత్తగారికీ, ఆయమ్మకీ చెప్పింది.
ఆ నిర్ణయం నిన్న ఆయమ్మ 'వద్దమ్మా' అంటూ కంటతడి పెట్టింది. "గోవిందు తరువాత ఒక్క ఆడపిల్ల పుట్టాలని మేము ఎంత తపించినా మాకు ఇంక బిడ్డలు పుట్టలేదు. భగవంతుడిచ్చిన సంతానాన్ని నిరోదించడం పాపం. కోరుకుంటే సంతానం కలుగుతుందా? వద్దని నిరోధించడానికి? నా మీద ఒట్టే నువ్వు ఆబార్షన్ చేయించుకుంటే" చేతిలో చెయ్యేసి ఒట్టు పెట్టించుకుంది. కామాక్షమ్మగారు.
"అత్తయ్యా" అంటూ ఆమెను కౌగలించుకుని వెక్కివెక్కి ఏడ్చింది సుమతి.
గోవిందు దగ్గర లేడన్న బాధతో సుమతి కృంగిపోతోందని తెలుసు కామాక్షమ్మగారికి. దానికితోడు తండ్రిని కూడా పోగొట్టుకుని ఒంటరి తనంతో బాధపడుతోందని తెలుసు. కానీ, తనేం చెయ్యగలదు? ఊరడించడం తప్ప! సుమతి ఏడుస్తూంటే తనకీ ఏడు పోచ్చింది. చాటుగా కళ్ళొత్తుకుంది కామాక్షమ్మ.
గోవిందు దగ్గరనుంచి ఉత్తరాలోస్తున్నాయి తన ఖర్చుపోనూ సుమతికి అయిదారు వందలు పంపిస్తున్నాడు. ఆ రోజు వచ్చిన ఉత్తరంలో అంతా తనకు కూతురేకావాలి అంటూ వ్రాశాడు ఉత్తరాన్ని పదేపదే చదువుకుంది సుమతి. ఎండా వానా కలిసిన చినుకుల్లా దుఃఖమూ, సంతోషమూ కలిసిన వెలుగు చీకట్లలో కన్నీళ్ళు జలజలా రాలాయి.
ఉత్తరాన్ని లోపలపెట్టి ఇవతలకొచ్చింది సుమతి. తప్పడడుగులతో పడుతూ లేస్తూ నడుస్తూన్న చింటూని చూసి నవ్వుకుంటున్నారు ఆయమ్మా, కామాక్షమ్మగారు. సుమతి కూడా వాడివి చూస్తూ నించుంది. స్కూటర్ చప్పుడైతే అందరూ అటుకేసి చూశారు. ఎవరో ఒకతను పొడుగ్గా వున్నాడు. సుబ్బలక్ష్మి అతన్ని లోపలికి తీసుకోస్తోంది. అతన్ని డ్రాయింగ్ రూంలో కూర్చో బెట్టి "అక్కా ! మామయ్యా లేరా?" అడిగింది.
"లేరు. ఇప్పుడే వస్తానని చెప్పి ఎటో వెళ్ళారు" అంది సుమతి.
"అక్కా ! అతడు నా ప్రెండు. పరిచయం చేస్తానురా" అంటూ సుమతిని చెయ్యిపట్టి లాక్కుపోయింది సుబ్బాలక్షి.
"ఇతను నా క్లాస్ మేట్ డి.పి.డే. ఈమె మా అక్క అంటే మా మామయ్య కోడలు మిసెన్ గోవింద్ తన పేరు సుమతి."
"నమస్కారమండీ" అంటూ లేచినుంచున్నాడు డే.
"నమస్కారం" కూర్చోండి అంది సుమతి.
"మీ అక్క పేరులోనే సుమతికాదు ఆచరణలో కూడా అచ్చు సు....మతే. చెడు వినరాదు, చెడు కనరాదు, చెడు చెప్పరాదు. గాందీగారి శిష్యురాలే మీ అక్క" పకపకా నవ్వింది సుబ్బలక్ష్మి. "గుడ్! అలాగే వుండాలి. చాలామట్టుకు నాకు తెలిసిన వాళ్ళలో పేరు 'సుందరి' మనిషి 'కురూపి,' పేరు సుశీల మనిషి అశ్లీలం, ఇలాగే వుంటోంది ఇన్నాళ్ళకి పేరుకుతగ్గ మనిషిని చూశాను" నవ్వుతూ అన్నాడు డే.
అందరూ నవ్వేరు.
"మీరు భలే చమత్కారంగా మాట్లాడుతారే నా పేరు సరే. కానీ మీ పేరు సంగతేమిటి? 'డే' అంటే 'రోజు' అనా 'పగలు' అనా అర్ధం? ఏ ఆంగ్లపురుషుడి పేరు?" కొంటెగా అంది సుమతి.
"అదీ జోకు. కూర్చోండి చెబుతాను."
సుమతి ప్రక్కనేవున్న సోపాలో కూర్చుంది.
"నాపేరు దేష్ పాండే. మేము మహారాష్ట్రులం. 'డి' అంటే దేష్ 'పి' అంటే పాం. 'డే' కలుపుతే డి.పి.డే." అన్నాడు.
పకపకా నవ్వింది సుమతి.
"నిజమేలేండి. మొన్న నెక్కడో చూశాను ఒక బోర్డు 'ఎ.వి. లూ.' అని. ఏమిటా ఈ పేరు అని ఎవర్నో అడిగితే చెప్పారు-ఇతను పదహారణాల వచ్చి ఆంధ్రుడే సూరి వెంకటేశ్వర్లు అతనిపేరు. దాన్ని ఎన్.వి.లూ అని పెట్టుకున్నాడు అని ఆ రోజంతా నవ్వలేక చచ్చాను" అంది సుమతి ఇంకా నవ్వుతూనే. నిజంగా ఆమెకి నవ్వు ఆగడంలేదు.
'డే' కొంచెం చిన్నబుచ్చుకున్నా, తనూ నవ్వేశాడు. సుబ్బలక్ష్మి రెండు ప్లేట్లలో చేగోడీలు, మూడు కప్పులు కాఫీ తీసుకొచ్చింది. సుమతికి అక్కడ కూర్చోక తప్పలేదు. ప్రస్తుత రాజాకీయాలగురించి జరుగుతూన్న అక్రమాల గురించీ, ఇప్పుడోస్తూన్న చెత్త సినిమాల గురించీ మాట్లాడుకుంటూ కాఫీలు త్రాగారు. అంతలో నరసింహారావుగారు రావడంవల్ల మళ్ళీ పరిచయాలు, పేరు మీద వ్యాఖ్యానాలూ జరిగాయి.
డే, చనువుగా మాట్లాడే స్వభావం కలవాడేమో ఆ కొద్ది పరిచయంతోటే 'అంకుల్' ఆంటీ అంటూ నరసింహారావుగారినీ, కామాక్షమ్మగారినీ, 'సిస్టర్' 'సిస్టర్' అంటూ సుమతినీ పిలుస్తూ ఎంతో పాత స్నేహితుడిలా కలిసిపోయాడు.
కాస్సేపయ్యాక "నేను క్లబ్బు కెళ్ళాలోయ్. పేకాట టైమయింది. మా వాసూపోయాక - అంటే మా సుమతికి నాన్నగారన్న మాట. అతను పోయాక నాకు కాలక్షేపం ఈ పేకాటే" అంటూ లేచారు.