Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 17

    "పేకాటకోసం క్లబ్బుకెందుకు అంకుల్. ఇక్కడే మన మంతా కలిసి ఆడితేపోలా" అన్నాడు డే.
    డబ్బుపెట్టి ఆడందే ఆ 'థ్రిల్' వుండదోయ్. జీవితంలోని సుఖదుఃఖాల్లా, పేకాటలోని గెలుపు ఓటిమిలో కూడా ఒకరకమైన ఫిలాసఫీ వుంది. ఓడిపోయినవాడు, నిరుత్సాహపడి మానెయ్యక ఈసారి గెలవాలని, రెట్టింపు పట్టుదలతో మళ్ళీ ఆడతాడు. గెలుస్తే సాధించానన్న తృప్తి, ఓడితే గెలవాలన్న పట్టుదల మనిషి మనుగడకి కావలసిన 'హొప్' ఆశ, ఈ పేకాటలో వున్నంత  మరెక్కడా కనిపించదు. ఆశలేనిదే మనిషిలేడు 'హొప్' చచ్చిపోతే మనిషి చచ్చిపోయినట్టే లెఖ్క జీవచ్చవంలా వుంటాడు అంతే. నన్నడిగితే ఈ జూదం మనిషికి ఎప్పటి కప్పుడు కొత్త ఆశలు కలిగిస్తూ మనిషిని అశాజీవిగా బ్రతికిస్తుంది.  ఈ వ్యసనం అంటు వ్యాధిలా పీడిస్తుందనుకో! అది వేరే విషయం" అంటూ ఒక చిన్న ఉపన్యాసాన్ని దంచారు నరసింహారావుగారు.
    "యు.... ఆర్ ... రైట్ ..... అంకుల్. మీరు చెప్పింది అక్షరాలా నిజం డబ్బు పెట్టి ఇక్కడే ఆడుకుందాం" అన్నాడు డే.
    "వద్దు బాబూ! నువ్వు కుఱ్ఱాడివి. డబ్బులు పెట్టి ఆడితే బావుండదు. గెలిస్తే ఫరవాలేదు. కానీ  ఓడిపోతే నాకు బాధగా వుంటుంది. నీ చదువుకోసం మీ అమ్మ నాన్నా పంపేడబ్బుని పెకాటకి ఖర్చు పెట్టడం న్యాయంకాదు."
    "మామయ్యా.....డేకి డబ్బుకేం లోటులేదు. వాళ్ళ నాన్నగారు నాగపూర్ లో గొప్పలాయరు బోలెడంత ఆస్తి వుంది. ఒక్కడే కొడుకు, ఇద్దరు చెల్లె ళ్ళున్నారు. వాళ్ళ నాన్నగారు పంపే డబ్బుకాక వాళ్ళ తాతగారి ఆస్తి ఇంటద్దెలూ అవీ డేకే వస్తాయి. మీరు పేకాట ఆడినా  ఆడకపోయినా పార్టీలకీ, సినిమాలకీ రోజుకో యాభయ్యో అరవయ్యో ఖర్చు పెడుతూనే వుంటాడు." డేసంగతంతా వివరించింది సుబ్బలక్ష్మి.

    "నిజమేనా" అన్నట్టు చూశారు నరసింహారావుగారు, "లక్షిచెప్పింది నిజమే" అన్నాడు డే నవ్వుతూ.

    "బాబూ! చేతినిండా డబ్బుందని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు ఇప్పుడంటే కుఱ్ఱవాడివి బాధ్యతలు తెలీవు. బాధ్యతలు తెలిపే నాటికి అలవాట్లకి బానిసవై పోతావు. చేతినిండా డబ్బుండి చెప్పుకోవలసిన బాధ్యత లేక పోవడం మంచిది కాదు బాబూ!"
    "నాకు తెలుసు అంకుల్. ఏదో స్నేహితులతో సరదాగా ఖర్చుపెడతానే కానీ,  అలవాట్లకి బానిసై పోయికాదు. అక్కరచేదను కుంటే నయాపైసా ఖర్చుపెట్టను."
    "ఆ శక్తి, ఆత్మదైర్యం వుంటేచాలు. మనిషి ముందుకు పోగలడు. జీవితంలో దేన్నైనా సాదించ గలడు. ముఖ్యంగా యువకులు జాగ్రత్తగా వుండాలి, ఇప్పుడు నాసంగతంటావా పెద్దవాణ్ణయి పోయాను గోవిందు గురించీ సుమతి గురించి నాకేం బెంగలేదు. నా భార్యకి కూడా ఏలోటూ వుండదు. ఇంటి ఖర్చులతో పాటు నెలకి పేకాట కింతా అని కేటాయిస్తాను అంటే ఆ డబ్బు పోయినా ఫర్వాలేదన్న మాట."
    వీరు మాట్లాడు కుంటూండగానే సుబ్బలక్ష్మి టేబిలూ, పెకముక్కలూ తెచ్చేసి పంచడం మొదలెట్టింది.
    "సిస్టర్.... సిస్టర్.... మీరూరావాలి" గట్టిగా అరిచాడు డే.
    "నేనాడను. మీరాడుకోండి" అంది సుమతి.
    "నో....నో....నో... మీరూ ఆడాలి" బలవంతం చేశాడు.
    "లక్ష్మి.... సిస్టర్ కీ ముక్కలు పంచు" అంటూ మరోకుర్చీవేశాడు.
    "పోనీ నువ్వూ ఆడమ్మా ఆటలో పడితేనైనా కాస్త మనసు కుదుట పడుతుంది." అంది కామాక్షమ్మగారు.  ఎలాగైనా సుమతి మనసులోని దిగులును పోగొట్టాలనీ, ఆమె నవ్వుతూ తిరగాలనీ ఆమె కోరిక.
    "రా అమ్మా...." పిలిచారు నరసింహారావుగారు.
    అందరి బలవంతంమీదా అడ్డానికి వెళ్ళింది సుమతి. తను డబ్బుతో ఆడకూడదను కుంది. కానీ సుబ్బలక్ష్మి, డే  వదిలి పెట్టలేదు. సుబ్బలక్ష్మి "పిసినాసితనం చెయ్యకు" అంటూ హేళన చేసింది. విధిలేక డబ్బుతోటి ఆడింది సుమతి.
    ప్రతి ఆటా  సుమతే గెలుస్తూవొచ్చింది. అందరూ సుబ్బలక్ష్మి. "ష్యూర్....." అన్నాడు డే. రాత్రి తొమ్మిది దాటింది.
    ఆ రోజుకింత ఆట చాలించి, అందరి దగ్గరా శెలవు తీసుకుని వెళ్ళి పోయాడు.
    "భలే కలువుగోలు మనిషి" అన్నారు నరసింహారావుగారు.
    "నిజమే" అంది కామాక్షమ్మగారు.
                             *        *        *
    కొద్దిరోజుల్లోనే, ఆ ఇంట్లోవారిలో ఒకడిగా కలిసిపోయాడు డే. రోజూ ఇట్లోనే పేకాట. సుమతి కూడా అలవాటు పడిపోయింది. ఒక్కరోజు డే రాకపోతే అందరూ కాలుకాలిన పిల్లిలా తిరుగుతూ వుంటారు ఇటూఅటూ. పేకాట కాలక్షేపంలో సుమతి కాస్త నవ్వుతూ కనబడ్డం కామాక్షమ్మగారికి త్పప్తినిచ్చింది.
    రోజులు గడుస్తున్నాయ్. సుమతికి ఏడోనెల వచ్చింది. ఈ పారి ఏ ఆర్భాటాలూ వద్దంది సుమతి. ఉండబట్టలేక చీరా, రవికె పసుపు కుంకుమ ఇచ్చి తలంటి నీళ్ళుపోసి ఏదో పిండివంటలు చేయించింది ఒక మంచి రోజున కామాక్షమ్మగారు. అయా రోజున గతస్మృతులలో మళ్ళీ  దిగాలుపడింది సుమతి. తండ్రిని తలుచుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. గోవింద్ ని జ్ఞాపకం చేసుకుని మధనపడింది.
    సుమతి వాలకం చూసి డే ఎప్పుడోస్తాడా, ఎప్పుడు పేకాట మొదలెడతారా అని ఎదురు చూసింది కామాక్షమ్మగారు.
    డే ఒక పట్టుచీర బహూకరించాడు సుమతికి. సుమతి ఎంత వద్దన్నా వినలేదు. "ఫరవాలేదు తీసుకోమ్మా 'సిస్టర్, సిస్టర్' అని ప్రేమగా పిలుస్తాడు నిన్ను. ఏనాటి బుణానుబంధమో అంది కామాక్షమ్మగారు. సుమతికి పుచ్చుకొక తప్పలేదు.
    "కట్టుకునిరా అక్కా" అంది సుబ్బలక్ష్మి.
    ముదురాకుపచ్చని చీరకి లేతగులాబీ రంగు బార్డర్ ఎంతో అందంగా వుంది చీర. "చాలా బావుంది" అన్నరందరూ.
    "ఎందుకింత ఖర్చు పెట్టి తెచ్చారు?" అంది సుమతి.
    "బావాగారు రానీండి, ఆయన దగ్గరనుంచి నేను తీసుకుంటాను. సిస్టరుకి ఇవ్వడం నా ధర్మం" నవ్వుతూ అన్నాడు డే.
     ఆ రోజు పేకాటలో సుమతికి యాభై, డేవిడ్ కి ముప్పై, నరసింహారావుగారికి వందాపోయింది. సుబ్బలక్షిదే గెలుపు. పదిగంటలవరకూ ఆడారు. మరి కూర్చోలేక పోయింది సుమతి. మిగతావాళ్ళు ఒంటిగంట వరకూ ఆడారు. ఆ రాత్రికి డే అక్కడే పడుకుని పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు.
    ఒకరోజు పేకాట మధ్యలో ఉన్నట్టుండి "అంకుల్! మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి" అన్నాడు డే.
    "చెప్పుబాబూ! ఏమిటది?" అన్నారు నరసింహారావుగారు.
    "మీకు అభ్యంతరం లేకపోతే, చదువు పూర్తయ్యాక లక్ష్మిని నేను పెళ్ళి చేసుకుంటాను" అన్నాడు.
    ఈ మాటలకి ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. సుబ్బలక్ష్మి అతడు తరచు కలుసుకోవటం వారి మాటలను బట్టి ఎవరికీ వారే, ఊహించుకున్నారు.
    "ముందు మీ నాన్నగారికీ, అమ్మగారికీ ఇష్టమవునో కాదో తెలుసు కోవడం మంచిది బాబూ!" అన్నారాయన.
    "మా వాళ్ళ ఒప్పుకోరులెండి. దానికి కారణం మీకేదో తక్కువయిందని కాదు. నాకో మేనరికం వుందిలెండి. నా కిష్టంలేదు. మేనరికం పెళ్ళిళ్ళు అసలు శాస్త్రప్రకారం మంచిదికూడా కాదు. మా నాన్న, మా అమ్మ మేనరికమే. మళ్ళీ నేనూ ఆ అమ్మాయి, రేపు నాకు పుట్టబోయే పిల్లలూ మా చెల్లెళ్ళ పిల్లలూ, ఇలాంటి పెళ్ళిళ్ళు ఎంతో హానికరం కూడా."
    "నిజమే!.... కానీ పెద్ద వాళ్ళని......"
    "వాళ్ళని ఒప్పించటానికి ప్రయత్నం చేస్తాను. ఒప్పుకొకపోతే. వారితో తెగతెంపులు చేసుకునైనా, లక్ష్మిని చేసుకుంటాను."
"అంత మాటనకు బాబూ!"
"అయితే, లక్ష్మికి అన్యాయం చెయ్యమంటారా?"
    "ఒద్దు. అసలే అది తండ్రిలేని పిల్ల. దానికి అన్యాయం చెయ్యాకు."
    "చెయ్యాను. చెప్పానుగా అవసరమయితే లక్ష్మికోసం కన్న వారినైనా వదులుకుంటాను."
    ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు నరసింహారావుగారికి.
    "లక్ష్మి తల్లికీ, అన్నయ్యలకీ చెప్పమంటావా?"
    "మీ  ఇష్టం చెబితే చెప్పండి, లేకపోతే తరువాత చెబుదురు గాని, ఇంకా ఏడాది టైముందిగా! చదువు పూర్తవ్వొద్దు?"
    "అంత వరకూ మీరు....."
    "జాగ్రత్తగా వుంటాం. పొరపాటు పన్లేమీ చెయ్యం. మీకాభయం అక్కరలేదు. ప్రామిస్" చేతిలో చెయ్యేసాడు డే.
    "థాంక్యూ" అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరిరయ్యారు నరసింహారావుగారు ఆరోజు పేకాట చాలాసేపే జరిగింది.  గెలుపు డే దే.
    ఉత్తరం చదువుకుని వెంటనే బయలు దేరి వచ్చారు జానకమ్మా, రాఘవ మిగతా వాళ్ళంతా. 'తెలుగుదేశం కొల్ల బోయిందా, ఆ మరఠీ వాడికిచ్చి కట్టబెట్టడానికి' గొణిగింది జానకమ్మ.
    "మా దగ్గరుంటే ఇలా కానివాళ్ళతో సంబంధానికి సంప్రదింపులు జరిగి వుండేనా? వాళ్ళ భాషవేరు మన భాషవేరు" ఏదో చెప్పబోయాడు రాఘవ.     

 Previous Page Next Page