Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 15


    మరో పదిహేను రోజులు ఇట్టే గడిచిపోయినయ్. జానకమ్మ కొడుకులూ, కోడళ్ళతో సహా వచ్చి నాలుగురోజులు మకాం పెట్టింది. ఈ పదిహేను రోజులూ క్లబ్బులూ, షికార్లూ, సినిమాలతో గడిచిపోయింది. గోవిందుమాత్రం ప్రతిరోజూ పగలో, రాత్రో ఏదో  ఒకటైములో 'డ్రింక్స్' పుచ్చుకుంటూనే వున్నాడు. తాగుడు అతనికి ఎంత అలవాటయిందో తలుచుకుంటే సుమతి భయంతో కంపించిపోతోంది. ఈవిషయంలోనే ఒకసారి క్లబ్బులోనే వాదన జరిగింది సుమతికీ, గోవిందుకీ.
    పక్కనేవున్న సుబ్బలక్ష్మి "తప్పేమి టక్కా, ఈ రోజుల్లో సిగరెట్టూ, తాగుడూ లేందే ఏ మాగాడూ వుండడు. పూర్వకాలంలో వ్యాసనాలుగా పరిగణించేవారు. కానీ ఈ కాలంలో ఇవి అవసరాలు. నలుగురూ కూర్చుని సరదాగా మాట్లాడుకోవాలంటే డ్రింక్స్ టేబుల్ ఒక్కటే సరైన ప్లాట్ ఫారం.
    "కరెక్ట్ అది అర్ధంచేసుకోరు మనవాళ్ళు. వెంటనే 'తాగుబోతూ' అని ఒక 'టైటిల్' పారేస్తారు. సరదాగా,   సోషల్ గా ఆడవాళ్ళుకూడా తాగే ఈ రోజుల్లో మడికట్టుకు కూర్చున్న  మగాణ్ణి చూసి గాజులు తోడుకున్న ఆడదానిలా చూస్తారు, నవ్వుతారు."
    "అవును నిజం. మొన్న  మా కాలేజీలో ఏమైందో తెలుసా?" పగలబడి నవ్వుతూ చెప్పడం ఆపేసింది సుబ్బలక్ష్మి.
    "ఏమైందో చెప్పి నవ్వు" చిన్నగా  నవ్వుతూ అడిగాడు గోవింద్.
    "మా  బొటనీ లెక్చరర్ రిటైరైపోతూ వుంటే ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేశాం. కాఫీ తాగాక మా కెమిస్ట్రీ ప్రొఫెసర్ సిగరెట్టు ఆఫర్  చేస్తే మా తెలుగు లెక్చరర్ గారు సిగరెట్టు తీసుకొక పోగా, సిగరెట్టువలన నష్టాలను గురించి అరగంట ఉపస్యాసం దంచారు. మా ఇంగ్లీషు లెక్చరర్ మిస్ సుభాషిణి అతని ఉపన్యాసానికి సంకెళ్ళు వేసింది. "ఏమండోయ్! మీ రిప్పుడు 'పొగతాగుటవలన నష్టములు' అని వ్యాసం వ్రాయించేటట్టున్నారు. మా చేత" అని. దాంతో అతనా ప్రసంగం ఆపేరు. బావా! మా తెలుగు మాష్టరంటే పంచె, పిలక, నామాలూ వుంటాయనుకుంటున్నావేమో అదేం కాదు. చక్కగా పాంటూ, బుష్ కోటూ వేసుకుంటాడు. పెద్ద క్రాపుంటుంది. వేషంచూస్తే  ఇలాగా, భావాలు చూస్తే పాత  చింతకాయ పచ్చడే." పకపకా నవ్వింది సుబ్బలక్ష్మి.
    గోవింద్ కూడా  గట్టిగా నవ్వేశాడు.
    సుమతికి ఒళ్ళు మండుకొచ్చింది. "కొత్తభావా లంటే సిగరెట్టు కాల్చడం, కల్లు త్రాగడం కాదు. షోకుగా డ్రెస్ చేసుకోవడమూ కాదు.  సాంప్రదాయం పేరిట, అర్ధంలేని ఆచారాల పేరిట జరుగుతూన్న అన్యాయాలూ, కలుగుతూన్న నష్టాలూ రూపుమాపడానికి అవసరమయిన మార్పు కలిగించడం. మీ తెలుగు లెక్చరరు గారు చెప్పినదాంట్లో తప్పేముంది? పొగ తాగడం ఎంత హనికరమో నిత్యం పత్రికల్లో చదువుతూనే వున్నాం. డాక్టర్లు చెబుతూనే వున్నారు. షోకులకోసం ఆత్మవంచన చేసుకుంటూ, పెడతోవలు పట్టడం తమని తాము నాశనం  చేసుకోవడ మవుతుంది ఇంతకీ  ఏ అలవాటయినా ముదిరి అంటువ్యాధిలా తయారయివెంటాడకపోతే ఫరవాలేదు. కొన్ని విషాలు కూడా కొద్దిగా మందులాగా తింటే కొన్నివ్యాధులకి మంచిదేనట అదే విషం ఎక్కువయితే ప్రాణం తీస్తుంది అలవాట్లవలన అగచాట్లపాలు కాకూడదు" తీవ్రంగా అంది సుమతి.
    సుమతి మొహం కోపంతో ఎర్రబడింది.
    అది గ్రహించిన గోవిందు "నువ్వు చెప్పింది నిజమే. నేను కాదనడం లేదు. అనవసరంగా నువ్వు ఉడ్రేకపడుతున్నావు. ఊఁ......ఇంక పోదాం పద" అన్నాడు.
    సుమతి గబగబా నడిచి కారుదగ్గరి కొచ్చింది ముగ్గురుమౌనంగా ఇల్లు చేరుకున్నారు. ఆ రోజంతా కోపంగానే వుంది సుమతి. క్షమాపణ చెప్పుకుంటూ చివరకి కాళ్ళబేరాని కొచ్చిన గోవిందుని క్షమించకుండా వుండలేకపోయింది. సంతోషంతో కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేశాడు గోవిందు.
    పోస్టింగ్ ఆర్డర్స్ 'ఫీల్డు ఏరియా'లో  'లడాక్' కి రావడం వల్ల కుటుంబాన్ని తీసికెళ్ళలేకపోయాడు గోవిందు. ఈసారి గోవిందు రావడానికి ఐదు సంవత్సరాలు  పడుతుంది. సుమతిగుండె  చెరువయిపోతోంది? ఇలా ఎన్నాళ్లు? ఈ జీవితానికి గమ్యం  ఎక్కడ? ఆస్తీ, అంతస్తూ అన్నీ  వుండి ఈ అశాంతి నెలా భరించాలి? పైగా  గోవిందులోని మార్పులు రానురాను ఎలాంటి పరిణామాలకి దారి తీస్తాయో ఊహ కందకుండా  వుంది మూగగా బాధ  ననుభావిస్తూ ఏడవడం తప్ప ఏమీ  చెయ్యలేకపోయింది ఇప్పుడు "వెళ్ళకండి" అని చెప్పడానికికూడా లేదు. ఇష్టమైనా, కష్టమైనా చచ్చినట్టు అయిదేళ్ళూ నోరు మూసుకుని భరించవలసిందే.

    వెక్కివెక్కి ఏడుస్తూన్న సుమతిని ఎలా ఓదార్చాలో తెలీలేదు గోవిందుకి. సుమతి ఇంత బాధపడుతుందంటే అసలు వెళ్లే వాడేకాదు. ఇంటిల్లి పాదినీ ఏడిపించి ఏం సాదించాలని చేరాడు మిలటరీలో? తలుచుకున్నకొద్దీ  గోవిందుకీ బాధగానేవుంది. కానీ ఇప్పుడు తనూ నిస్సహాయుడే అదివరకటి ఉద్యోగాలలా అఖ్కరలేదను కుంటే రాజీనామా చెయ్యడానికి విల్లేదే!
    తమ వలపులపంట "చింటూ" నొదిలి వెళ్ళాలని లేదు. వాడి బోసినవ్వులూ, ఊసులూ పదేపదే జ్ఞాపకం వస్తున్నాయి. చేజేతులా తెచ్చిపెట్టుకున్న ఈ పరిస్ధితికి తనమీద తనకే కోపం వచ్చింది దుఃఖం వచ్చింది. "తనే అదైర్యపడిపోతే ఇంట్లో వాళ్ళని ఓదార్చేవాళ్ళే వుండరు!" అనుకుని చాటుగా కళ్ళు తుడుచుకున్నాడు గోవిందు.
    ఏడ్చి ఏడ్చి అలసిపోయిన తల్లిని కౌగిలించుకుని, బుగ్గలు ముద్దు  పెట్టుకున్నాడు. చింటూని ముద్దులతో నింపేసి గుండెలకి హత్తుకున్నాడు. సుమతికి అనేకవిధాల దైర్యంచెప్పి, తండ్రి దగ్గర శలవుతీసుకుని బయలుదేశాడు గోవిందు.
    'హైదరాబాద్ వెళ్ళి, అక్కడినుండి డిల్లీ వెళ్ళి. అక్కణ్ణుంచి జమ్మూ శ్రీనగర్  మీదుగా లడాక్ చేరుకోవాలి. వాడు వెళ్ళడానికి నాలుగురోజులు పడుతుంది. అందుకని వాడిదగ్గరనుంచి ఉత్తరం రావడానికి కనీసం, వారంరోజులైనా పట్టొచ్చు' తనలో తను అనుకొంటున్నట్టుగా పైకే అనేశారు నరసింహరావుగారు హైదరాబాదు విమానం  వెళ్ళిపోతూంటే కన్నీళ్ళతో చెయ్యూపారు కామాక్షమ్మగారు, సుమతీ, మరసింహారావుగారు.
    ఇల్లంతా బోసిపోయింది. అందరి మనసులా శ్రావణ మేఘాల్లా బరువుగా వున్నాయ్. నరసింహారావుగారు క్లబ్బుకి బయలు దేరారు. ఏమీ తోచడంలేదని సుబ్బలక్ష్మి కూడా అతని వెంటవెళ్ళింది. తనూ పేకాట గుంపులో చేరింది నరసింహరావుగారు ఆరోజు వంద రూపాయలు పోగొట్టుకున్నారు ఆటలో సుబ్బలక్ష్మిని అభినందించారు, ఆమెలో కొత్తఉత్సాహం చోటుచేసుకుంది తరుచు క్లబ్బుకీ వెళ్ళడం అలవాటయింది. ఒక్కొక్కసారి సుబ్బలక్ష్మి స్నేహితుల్ని పిలిచి ఇంట్లోనే ఆట మొదలెట్టేవారు సాధారణంగా గెలుపు సుబ్బలక్ష్మిదో, లేకపోతే స్నేహతులదో. నరసింహరావుగారు ఎప్పుడూ ఓడడమేగానీ, గెలవడంలేదు. రోజుకి వందా రెండొందలూ ఎగిరిపోతన్నాయ్. నరసింహారావుగారు బ్యాంకు బాలెన్సులెక్కలు చూసుకుంటున్నారు. ఇంటి  ఖర్చు కొంచెం తక్కువచెయ్యమని కామాక్షమ్మగారికి వార్నింగ్ ఇచ్చారు. "ఏం తక్కువ చెయ్యమంటారు? ఇప్పుడు చేస్తున్న దుబారా  ఏమిటి ఇంకపొదుపు చెయ్యడానికి? మీ సుబ్బలక్ష్మి ఖర్చూ పేకాటఖర్చూ తగ్గిస్తేసరి" అంటూ  ఎదురుతిరిగింది కామాక్షమ్మగారు.
    "నా వల్ల మీకు భరించలేని ఖర్చు అవుతూవుంటే నేనుండను. నన్ను పంపించేయండి మామయ్యా నాకేం దిక్కులేక రాలేదు. ఉండమంటే ఉంటాను. ఇప్పుడు పొమ్మంటే పోతాను." ఏడుపు లకించుకుంది సుబ్బలక్ష్మి.
    "కామాక్షి! సుబ్బలక్ష్మిని మనమే వుండమని బ్రతిమాలుకున్నాం. మన అవసరంకోసం ఉన్నది. కనుక చదివించాం. సుమతీ, ఆయమ్మ లేనన్నాళ్ళూ నీకు వంట్లో బాగాలేనప్పుడు సుబ్బలక్ష్మే కదూ ఇల్లుచూసుకుంది. ఆడపిల్ల సరదాపడి ఏదో కాస్త ఖర్చుపెడితే ఆ అమ్మాయిని అనడం సబబుకాదు. మనకే ఒక ఆడపిల్ల వుంటే ఇలా అనే వాళ్ళమా?"
    "మనకే ఆడపిల్ల వుంటే ఈ రకంగా పెంచేదాన్ని కాను."
    "అంటే? ఇప్పుడు నాకేమయిందని?" ఏడుస్తూనే అడిగింది సుబ్బలక్ష్మి.
    "కామాక్షీ! జానకంటే మొదటినుంచీ గిట్టదు. అందుకేవాళ్ళు దూరామంటూ వచ్చారు. ఇప్పుడు సుబ్బలక్ష్మి వుండడం కూడా నీ కిష్టంలేదు" కోపంతో నొక్కినొక్కి చెప్పారు నరసింహారావుగారు.    

 Previous Page Next Page