రచ : అంటే బాగానే వున్నావన్నమాట.
విమల్ : బాగేమిటిలే ! బండి నడుస్తూనే వుంది. వస్తాను. కొంచెం కల్పలతకు వెళ్ళాలి. లాస్ట్ అవర్ షాపింగ్ మిగిలిపోయింది. నువ్వు అటు వస్తే చెప్పు, లిప్ట్ యిస్తాను.
రచ : నాకు యిక్కడ కొంచెం పనివుంది.
విమల్ : అయితే నేను వెళ్ళి వస్తాను.
(విమల్ వెళ్ళిపోతాడు. కమల్ ప్రవేశిస్తాడు.)
కమల్ : ఏమయ్యా కవీ! ఎలా వున్నావ్ ?
రచ : బాగానే వున్నాను.
కమల్ : ఇంకా రాస్తున్నావా? మానేశావా?
రచ : మానేశాను.
కమల్ : అవున్లే. ఇన్ని గొడవల్లో హాబీని ఎక్కడ పట్టుకొని కూర్చుంటాంలే. నేను మౌతర్గన్ వాయించే వాణ్ణా ! పూర్తిగా వదిలేశాను. అవునుగాని-నువ్వు యిన్సూ రెన్స్ చేయించావా?
రచ : లేదు.
కమల్ : లేదా? ఎంత తాఫీగా చెబుతున్నావ్? ఒక సెక్యూరిటీ అంటూ వుండాలి. ఈ జేవితం శాశ్వతమా? Insure చేయించు- కనీసం పదివేలకయినా-
రచ - ఎవరికోసం Insurance చేయించను ?
కమల్ : అదేమిటి? యింకా పెళ్ళి చేసుకోలేదా ?
రచ : లేదు.
కమల్ : పెళ్ళి చేసుకోవటం ఎంతసేపులే! వెంటనే పిల్లాజల్లా తయారవుతారు. మరీ వయస్సు ముదిరితే ప్రీమియం కట్టాల్సి వుంటుంది. (పెద్దతనంలో కూడా ఇంత ఆధారం కావాలిగా ) ఎంత కడతావో చెప్పు. మిగతా విషయాలు నేను మానేశావా?
రచ : నువ్వు ఉద్యోగం మానేశావా?
కమల్ : నీకేమైనా మతిపోయిందా? ఈ రోజుల్లో ఎవడైనా ఉద్యోగం వదిలేస్తాడా? బిజినెస్ చెయ్యాలనే ఆలోచన కూడా వుందనుకో !(అందులో స్ధిరపడితే నౌకరీ, భీమా చేయించే బాధ అన్నీ వదిలించుకుంటాననుకో) కనీసం ఒక ఇరవైఐదు వేలు పెట్టగలిగే పయనీర్ ఎవరైనా నీ దృష్టితో వుంటే చెప్పు. గలిగే చాలా మంచిది. ఫార్టీ పర్నంట్ ప్రాఫిల్ గ్యారంటీ! కావాలంటే వివరాలు యివ్వగలను.
రచ : అలాంటి వాళ్ళెవరూ నాకు తెలిసినంతవరకూ లేరు.
కమల్ : బాధపడకు. ఎవరో ఒకరు దొరక్కపోరులే! బంగారాన్ని కక్కే స్కీం అనుకో! అలాంటి దానికి ఎవరైనా పెట్టుబడి పెడతారు. నువ్వు మాత్రం ఇన్పూరెన్స్ విషయం సీరియస్ గా ఆలోచించు. (కమల్ వెళ్ళిపోతాడు.)
రచ : వీళ్ళంతా చిన్న చిన్న కణాలు. వీటి చిన్నా పెద్ద సంఘర్షణలే నా నాటకానికి ఇతివృత్తం. అమల్, విమల్, కమల్, ఏవం ఇంద్రజిత్.
(ఇంద్రజిత్ ప్రవేశం.)
ఇం : ఏమిటయ్యా కవీ ! ఏమిటో సంఘర్షణ అంటున్నావ్?
రచ : ఏంలేదు. మానసిని కలుసుకున్నావా?
ఇం : ఇంకా లేదు. కలుసుకుంటాను. ఆ మైదానంలో... (ఇంద్ర వెనక్కు తిప్పుకుంటాడు.)
రచ : ఆ మైదానంలో అదే చెట్టునీడలో
తృణ తృణం తరు తరువులో
నిండి వున్నాయి గతస్మృతులు.
జేవితంలో ప్రధమ
యవ్వనపు ఆగమనం
హృదయ కుహరంలోని గుప్తాభావాలు
మూల మూలలా విస్తరించి వున్నాయి.
[ఇంద్రజిత్, మానసి మళ్ళీ అక్కడ కూర్చుంటారు. కబుర్లు చెప్పుకుంటుంటారు. కబుర్లు చెప్పుకుంటుంటారు.]
రోజులు వారాలు గడిపోతాయ్
నెలలు సంవత్సరాల గాడిలోపడి
అన్నీ పాతబడిపోతాయ్
మళ్ళీ అదే కొత్తరూపంలో
తిరిగి తిరిగి వస్తూనే వుంటాయ్
అయినా ఒక్కసారి
అక్కడ ఆ మూల కూర్చుందాం.
ఎన్నో ఎన్నో కబుర్లతో
క్షణాల్ని దోర్లిద్దాం.
[మానసి వచ్చి ఇంద్రజిత్ పక్కనే కూర్చుంటుంది. సంభాషణ ప్రారంభం అవుతుంది. రచయిత పక్కకు తప్పుకుంటాడు.]
ఇం : ఇప్పట్లో ఇక నిన్ను చూడవని అనిపిస్తుంది.
మా : ఏం ?
ఇం : బహుశా దూరం వెళ్ళిపోతాను.
మా : దూరం అంటే ? ఇప్పుడూ దూరంగానే వున్నావుగా?
ఇం : ఇంకా దూరం !
మా : ఇంకా దూరమా ? ఎక్కడికి?
ఇం : లండన్.
మా : లండనా ? అక్కడ ఉద్యోగం దొరికిందా?
ఇం : ఉద్యోగం దొరకలేదు. కానీ అంతవరకు వెళ్ళగలిగే డబ్బు వుంది. ఇంజనీరింగ్ కోర్స్ సీటు వచ్చింది. పాస్ పోర్టుకూడా వచ్చింది. అక్కడికి వెళ్ళాక ఏదైనా ఉద్యోగం కూడా చూసుకుంటాను.
మా : ఉద్యోగం దొరక్కపోతే?
ఇం : దోరుకుతుంది.
మా : ఒకవేళ దొరకకపోతే ?
ఇం ? ఏదో ఒకటి దొరక్కపోదు. నా ఒక్క పొట్టకు ఎంత కావాలి?
మా : ఇలా తాడు బొంగరం లేని బ్రతుకు ఎన్నాళ్ళని?
ఇం : బ్రతకగలిగినంతకాలం!
మా : నీకు యిలా బ్రతకడం యిష్టంగా వుందా?
ఇం : లేదు.
మా : మరి ?
ఇం : మరి ఏమిటి ?
మా : ఒకచోట ఎందుకు స్ధిరపడవు ?
ఇం : స్దిరపడితే సుఖంగా వుంటుందంటావా?
మా : తెలియదు.
ఇం : నాకూ తెలియదు. ఆ మాటకొస్తే యిష్టం అనే శబ్దం అర్ధం లేనిది. ఇష్టానిష్టాల ప్రశ్నే లేదు.
మా : (కొంచెంసేపు మౌనంగా వుండి ) ఇంద్ర!
ఇం : ఊఁ! చెప్పు !
మా : నన్ను వివాహం చేసుకుంటే ఒక చోట స్ధిరంగా వుండగలవా?
ఇం : ఇప్పుడు నేను చెప్పలేను. ఒకప్పుడైతే నీ ప్రశ్నకు సమాధానం యివ్వగలిగేవాణ్ణి.
మా : నీకు నా మీద కోపం రావటంలేదూ?
ఇం : లేదు. ఒకప్పుడు వస్తూవుండేది. వివాహం అయితే ఎలా వుంటామో చెప్పలేం! బహుశా ఈ మాత్రం ఆత్మీయత కూడా వుండకపోవచ్చును.
మా : ఆత్మీయత యింకా పెరిగే అవకాశం కూడా వుండవచ్చుగా?
ఇం : ఎలా చెప్పగలం ? ఈ విషయంమీద నేను చాలా చాలా ఆలోచించారు. నా ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. అలసిపోయాను. ఇప్పుడు ఆలోచించాలని లేదు. ఏమీ చెయ్యాలనిపించదు. ఏదో బాధ! కళ్ళు మూసుకొని పడుకోవాలనిపిస్తుంది (మౌనంగా వుండిపోతాడు.]