రచ : నువ్వు చెప్పదలచుకున్న దేమిటి ?
ఇం : అదే... జీవితం ఎంత అమూల్యమైందో .... దాన్ని గురించి ఎన్నిరకాల ఆలోచనలు చేస్తామో !
రచ : అంటే నీకు వివాహం చేసుకోవాలని వుంది. కాని అందుకు మానసి సుముఖంగా లేదు. అంతేనా ?
ఇం : అందుకని, ఎప్పుడూ ఆటంబాంబు గురించే ఆలోచిస్తూ కూర్చుంటున్నానని అనుకుంటున్నావా? రాత్రిపూట ఆకాశంలోని నక్షత్రాలను చూస్తున్నప్పుడు, జ్యోతిష శాస్త్రం చదువుతున్న ప్పుడూ ఈ పృథ్వి ఎంత అల్ప మైందో తెలుస్తుంది. అల్పమైన ఈ పృథ్విమీద నివశించే ప్రాణుల్లో ఒకడైన మానవుడు ఎంత అల్పుడో తెలుస్తుంది. కాని అదే ఆలోచన ఎల్లప్పుడూ మనం చేస్తామా? చేస్తే బతగ్గలమా ?
రచ : నువ్వు ఆలోచిస్తూనే వున్నావుగా ?
ఇం : ఏం చెయ్యమంటావ్ ? ఆలోచించకుండా వుండలేను. జీవితం అంటే మహామృత్యవు ముందు మెరిసే క్షణికమైన మెరుపుమాత్రమేనని మర్చిపోతూవుంటాను. ఈ బ్రహ్మాండంలో నా జీవితానికి ఒక యిసుక రేణువుకు వున్న మూల్యంకూడా లేదనే విషయాన్ని విస్మరిస్తూ వుంటాను. నా జీవితం కంటే అమూల్యమైంది మరొకటిలేదని గర్విస్తుంటాను.
రచ : అలా అనుకోగలగటం మానవునికి ప్రకృతి ప్రసాదించినవరం. లేకపోతే మనిషి బ్రతకలేడు.
ఇం : ఆ వరం అన్ని వేళలా రక్షించలేదు. జ్ఞానఫలం రుచి... నక్షత్రమయ ఆకాశం...ఇవన్నీ ఆలోచనల్ని తారుమారు చేస్తుంటాయి... నువ్వూ, నేనూ, మానసి, అమల్ , విమల్ , కమల్....
(వాద్య సంగీతంలో ఇంద్ర స్వరం కలిసిపోతుంది. స్టేజి అంతటా చీకట్లు కమ్ముకుంటాయి. రచయితమీదా, ఇంద్రమీదా కొద్దిగా వెలుతురు పడుతుంది. పల్చటి ప్రకాశరేఖ ఒకటి వెనగ్గా నిల్చున్న మానసిమీద పడుతుంది. వాద్యసంగీతం - కవితాపాఠంగా మారుతుంది.)
కంఠస్వరం :
పృథ్వి కలుస్తుంది సాగరంలో
దూరంగావున్న క్షితిజంలో లీనం అవుతుంది సాగరం.
ఆఖిల బ్రహ్మాండంలో
పృథ్వి ఉనికి అదృశ్యంగా వుంది.
పృథ్వి అస్దిత్వం - రెండు క్షణాల జేవితం
అనంతకాలగతిలో
విలాసమాత్రంగా జీవితధార ప్రవహిస్తోంది.
(జీవిత యితిహాసం, క్షణిక ఆకస్మిక సంఘటన
అర్ధహీనమైన ధరిత్రి స్పందన
క్షణాలదానం
ఈ అనంత సృష్టిలో నేనొక ధూళికణాన్ని.)
అవిరళంగా ప్రవహించే యీ జీవితధారకు
తప్పు తాళం వేయిస్తుంది మృత్యుదేవత
అయినా మానవుడు మూర్ఖుడు - ఇలాగే
ఆలోచిస్తాడు. ఇంతకంటే మానవచరిత్రలో
చిత్రమైన విషయం లేదు.
(స్థబ్ధత ఒక్కసారిగా చీకటి వ్యాపిస్తుంది. మానసి మీద పడుతున్న ప్రకాశం మాత్రం తీక్షణం అవుతుంది.)
అయినా నేను నిర్లజ్జ అధమ కీటకాన్ని
నాలుగు దిక్కుల జీవిత తంతువుల్ని విసురుతున్నాయి.
గంభీర సమస్యల్ని విస్మరించి వున్నాను.
నిగూఢ తత్వ చింతలో నిమగ్నమైవున్నాను.
క్షణిక ధూళి కణాలు
తీవ్ర ప్రాణశక్తిని
అనంత ఘోషతో వెల్లడిస్తున్నాయి.
(మానసిమీదవున్న వెలుగు ఆరిపోతుంది. స్టేజిమీద వెలుతురు పడుతుంది. రచయిత వంటరిగా స్టేజిముందు భాగంలో నిల్చుని వుంటాడు.)
రచ : ప్రాణాల ఉధృత అధికారం ఎవరిప్రాణం? ఇంద్రజిత్, మానసి, నేను. ఇంకాఎవరు ? అమల్, విమల్, కమల్......
(అమల్ ప్రవేశం)
అమల్ : ఏమయ్యా ! కవీ ? ఎలావున్నావు?
రచ : బాగానే వున్నాను.
అమల్ : రాతకోతలు జరుగుతున్నాయా ? లేక మానేశావా?
రచ : అప్పుడప్పుడు రాస్తూనే వున్నాను.
అమల్ : నాటకం పూర్తయిందా?
రచ : ఇంకాలేదు. నువ్వెలా వున్నావు?
అమల్ : నా పరిస్దితులేమీ బాగాలేవు.
రచ : ఏం ? ఏమయింది?
అమల్ : ఏం చెప్పమంటావ్ ? ఈ ఎ . బి . సి . కంపెనీలో ఏమని చేరానో అన్నీ బాధలే ! (సీనియర్ అసిస్టెంటుగా నాలుగు సంవత్సరాలనుంచి చేస్తున్నాను.) ఆరుసంవత్సరాల అనుభవం తర్వాత, అసిస్టెంట్ మేనేజరుగా ఎవర్నో మద్రాసునుంచి తెచ్చిన వ్యక్తిని వేశారు.
రచ : అరే!
అమల్ : ఎందుకడుగుతావులే ? (ఇప్పుడు మద్రాసు వాళ్ళ ప్రాబల్యం ఎక్కువగా వుంది.) బంగాలీ బంగాలీవాడి చేతిలోనే చస్తానంటాడు. అసలు తప్పంతా నాదేలే! P . R . Q కంపెనీనుండి వచ్చిన ఆఫర్లు తిరస్కరించాను. ఇక్కడ ప్రమోషన్లు వుంటాయి. అనవసరంగా ఎందుకు యిక్కడికీ అక్కడికీ తిరగాలనుకున్నాను. నిజం కవీ ! నాకు జీవితంమీద విరక్తికలుగుతోంది.
రచ : ఇంట్లో అంతా కులాసాగా వున్నారా?
అమల్ : ఆఁ, ఏం బాగులే ! ఇలాంటి పరిస్దితిల్లో ఎవరు మాత్రం ఉద్యోగంలోనే వుండిపోవడం) వస్తాను. కొంచెం తొందరపని వుంది.
(అమల్ వెళ్ళిపోతాడు. విమల్ ప్రవేశిస్తాడు.)
విమల్ : ఏమయ్యా కవీ ! ఎలా వున్నావు ?
రచ : బాగానేవున్నాను.
విమల్ : ఏదైనా రాస్తున్నావా? లేక మానేశావా?
రచ : అప్పుడప్పుడూ రాస్తూనే వున్నాను.
విమల్ : నాటకం పూర్తయిందా ?
రచ : ఇంకాలేదు. నువ్వెలావున్నావ్ ?
విమల్ : బాగానేవున్నాను. మా ఫర్మ్ కు హైవే యింజనీరింగ్ కాంట్రాక్ట్ దొరికింది. నాకు రాంచీ ట్రాన్స్ ఫర్ అయింది, రేపు వెళుతున్నాను.
రచ : ఫామిలీని తీసుకెళుతున్నవా ?
విమల్ : తీసుకెళుతున్నాను. క్వార్టర్స్ యిచ్చారు. ఫామిలీ అంటే ఎవర్లే! నా మిసెస్ ను మాత్రం తీసుకెళుతున్నాను. మాకుర్రాణ్ణి పబ్లిక్ స్కూలో చేర్పించాను. అక్కడ నుంచి స్కూల్స్ ఉంటాయో ? ఉండవో?