Previous Page Next Page 
ఏవమ్ ఇంద్రజిత్ పేజి 17


    మా : అలా తిరిగొద్దాం పద!
    ఇం : పద!
    [ఇద్దరూ లేచి వెళ్ళిపోతారు. రచయిత అలిసిపోయినట్లు ప్రవేశిస్తాడు.]
    బాధ!.... బాధ! నేను  బాధితుడను
    అర్ధం లేని ప్రశ్నల్ని అలాగే ఉండనియ్ !
    సంధ్యాకాలపు నీడలో
    నన్ను విశ్రామించనియ్
    వాక్చాతుర్యంవల్ల ప్రయోజనం?
    తర్కవితర్కాల వల్ల ప్రయోజనం ?
    తర్కించి తర్కంచి అలిసిపోయాను.
    నాకు మిగిలిపోయింది బాధ ఒక్కటే
    శూన్య నిర్జవ చాయలో పన్ను నిద్రపోనియ్.
    [రెండో అంకం సమాప్తం]
        తృతీయాంకం
    [ఒక టేబుల్ చుట్టూ కూర్చొని అమల్ , విమల్ , కమల్ , చీట్లపేక ఆడుతున్నారు. ముగ్గురూ వాళ్ళ వాళ్ళ మాటలు పూర్తిచేసి పేకముక్కలు వేస్తుంటారు.]
    అమల్ : 1947 ఆగష్టు 15వ తేదీన భారతదేశం స్వతంత్ర అయింది.
    విమల్ : ఇంగ్లీషు వాడి సామ్రాజ్యావాద పంజాలనుండి. విముక్తి అయింది.
    కమల్ : ఇప్పుడు మనం  స్వాధీన ఆదర్శ సమాజాన్ని నిర్మించుకోవాలి.
    అమల్ : పెట్టుబడిదారీ వ్యవస్ధ నాశనం కావాలి. ఫాసిజం సమాజాన్ని వినాశనంవైపుకు తీసుకుపోతూంది.
    కమల్ :  కమ్యూనిజం వ్యక్తిస్వాతంత్ర్యానికి గొడ్డలిపెట్టు.
    అమల్ : డెమోక్రసీ ద్వారా మార్పుల్ని వెంటనే సాధించలేం.
    విమల్ : డెమోక్రసీ  అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో శాపంలాగా పరిణమించింది.
    కమల్ : సామాన్య మానవుడికి ఏ వ్యవస్ధలోనూ సుఖం వుండదు.
    అమల్ : దేశంలో ఎక్కడ చూసినా ఆస్తవ్యస్తం, అరాజకం.
    విమల్ : ఈ ప్రభుత్వం లాభంలేదు.  
    కమల్ : అధికారం హస్తగతం కాగానే అందరూ ఒకటిగానే ప్రవర్తిస్తున్నారు. అందరూ తోడుదొంగలు.
    అమల్ : రాజకీయాల్లో వున్న మురికి ఇంకెక్కడా వుండదు.
    విమల్ : నా పని - ఏ గూటి చిలక ఆ పాటగా వుంది.
    కమల్ : తాతముత్తాతల పేరు నిలబెట్టటానికి, నేను ఎంతో కాలం బ్రతుకననిపిస్తుంది.
    అమల్ : ప్రమోషన్ రాలేదు.
    విమల్ : క్వార్టరు బొత్తిగా బాగాలేదు.
    కమల్ : జీవితం గతుకుల రోడ్డు మీదే నడుస్తోంది.
    అమల్ : మా ఇంట్లో జబ్బుగా వుంది.
    విమల్ : మావాడు పరీక్ష  తప్పాడు.
    కమల్ : నాన్నగారు పోయారు.
    అమల్ : అందరికీ అన్నీ...
    విమల్ : ఛి, ఛి, చీ ...
    కమల్ : తస్సాదియ్యా.
    అమల్ : విమల్.
    విమల్ : కమల్.
    కమల్ : అమల్.
    అమల్ : విమల్.
    విమల్ : కమల్.
    కమల్ : అమల్.
    [నేపథ్యంలో- "ఏవం ఇంద్రజిత్" అనే మాటలు వినిపిస్తాయి. రచయిత ప్రవేశిస్తాడు.]
    అమల్ : ఏమయ్యా కవీ-ఏమిటి విశేషాలు ?
    విమల్ : ఏమయ్యా కవీ-ఏమిటి విశేషాలు ?
    కమల్ : ఏమయ్యా కవీ-ఏమిటి విశేషాలు ?
    రచ : నిన్న ఇంద్రజిత్ ఉత్తరం వచ్చింది.
    అమల్ : ఏం రాశాడు?
    విమల్ : విదేశం వెళ్ళాడు గదూ ?
    కమల్ : ఇంకా తిరిగి రాలేదా?
    రచ : పరీక్ష పాసయాడట.
    అమల్ : శుభవార్త.
    విమల్ : తిరగి రాగానే  ఉద్యోగం దోరుకుతుంది. ఇంజనీరింగ్ లైను- చాలా మంచిది.
    కమల్ : ఇంకా విదేశ డిగ్రీకి మన దేశంలో చాలా మోజువుంది.
    రచ : వింటారా ? ఏం రాశాడో ?
    అమల్ :  ఆఁ వినిపించు.
    విమల్ :  చాలా పెద్ద ఉత్తరంలా వుంది.
    కమల్ : అయితే నేం?
    (రచయిత ఉత్తరం చదువుతూ వుంటాడు. ముగ్గురూ పేక ఆడుతూ వుంటారు మౌనంగా)
    రచ : కలకత్తా - భోపాల్ - బొంబాయి- జలంధర్- మిరఠ్- మద్రాసు -లండన్ - గడచిపోయిన కాలరథపుచక్రాలు- గిర్రున తిరుగుతున్నాయి. అయినా చక్రంలా తిరగడం లేదు. ప్రతి ఆవర్తం - క్రొత్తచక్రంలా వేర్ గా తిరుగుతూవుంది. అదే ట్రాజడీ- ఒకదాన్ని పట్టుకొని - పాతదాన్ని పారేస్తున్నాను. మళ్ళీ కొత్తదాన్ని పట్టుకొంటున్నాను. ప్రతిసారీ ఏదో  ఆశించని సంఘటన జరుగుతుందని ఆశిస్తూ వుంటాను. తప్పక జరుగుతుంది. దాని ప్రకాశంలో గతాన్ని పూర్తిగా మర్చిపోతాను. మర్చిపోయిన స్వప్నంలా - నిద్రమెలకువ వచ్చినా - ఆ స్వప్నం తాలూకు- మత్తు వదలనట్లూ మర్చిపోతాను. (ఇంతలో ఇంద్రజిత్ వచ్చి, రచయిత ప్రక్కనే నిలుచుంటాడు. అమల్ - విమల్ - కమల్ , పూర్వంలాగే- పేక ఆడుతూ వుంటారు.)
    ఇం : కావాలనుకున్నదంతాపొందాను. కాని - ఈ పొందటంలోవున్న , అర్ధహీనతను అర్ధంచేసుకున్నాను. ఇంకా పొందగలననుకోవటం -  ఆ పోందినదాన్ని పోగుచేసుకోవటానికి, నాలుగుచేతులు వస్తాయనుకోవటం ఎంత తెలివి తక్కువ. భూత భవిష్యత్తులు ఒకే తాటికి, రెండు చివర్లు. ఒకదానితో ఒకటి కలవదు - లేకపోతే - భవిష్యత్తును చుట్టి గతంలో పారేశేవాణ్ని. వర్తమానం, ఎప్పుడూ, కనీ కనిపించని భవిష్యత్తుకేసే చూస్తూవుంటుంది. అంటే  మృత్యువును వరిస్తుంది.
    (అంతకుముందే మానసి వచ్చి వింటూంది.)    

 Previous Page Next Page