వూళ్ళో కి ఒక బాబా వచ్చారని విన్నది. వారి దర్శనార్థం వెళ్ళింది అందరితోపాటు వీణ కూడా పాదాలకు నమస్కరించింది. "నీ అభీష్టం నెరవేరుతుంది" అని బాబా ఆశీర్వదించాడు. ఆ రోజు నుంచి వీణ బాబా ఫోటోలతో గదిని నింపేసింది ఒక గదిని ప్రత్యేకంగా పూజాగదిగా మార్చింది భర్తకు వీటిమీద నమ్మకం లేదు. లోకాన్ని మార్చాలనీ, మరమ్మత్తు చెయ్యాలనీ, పాత భావాలనూ, బూజు పట్టిన భావాలనూ పూడ్చి పెట్టాలనీ వేదికల మీద ఉపన్యాసాలిచ్చే వీణ భర్త భార్యను మందలించలేకపోయాడు. "నాకు నమ్మకం లేదు. కాని నా భార్యకు నమ్మకం ఉంది. అని ఆమె నమ్మకాన్ని ఖండించి ఆమె స్వతంత్రాన్ని అరికట్టడం బూర్జువాయీ లక్షణం. అందుకే ఆమె మీద గౌరవంతోనే ఆమెకు తోడుగా తిరుపతి వెళ్ళాను." అని చెప్పే అభ్యుదయవాదుల్ని మనం చూస్తూనే ఉన్నాం. వీణ భర్త కూడా అటువంటి కోవలోకే వస్తాడు.
వీణకు ప్రసవం కష్టం అయింది. ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. ఆమె రెండు రోజులు మత్తులోనే ఉన్నది ఆ తరువాత తనకు మగపిల్లవాడు పుట్టలేదని తెలుసుకుని నమ్మలేకపోయింది. బాబా ఆశీర్వాదం అబద్ధం కావడానికి వీల్లేదు. తను మత్తులో ఉన్నప్పుడు నర్సు మగపిల్లవాడిని మరొక ప్రక్కన పడుకోబెట్టి, ఎవరికో కలిగిన ఆడపిల్లను తన ప్రక్కన ఉన్న ఉయ్యాల తొట్టిలో ఉంచిందని ఆమె అనుమానం. అలా పిల్లల్ని మారుస్తుంటారని చాలా గొడవ చేసింది. భర్త ఆమెకు ఎంత నచ్చచెప్పినా నమ్మకం కుదర్లేదు.
ఇప్పుడు ఆ పిల్లకు మూడేళ్ళు ఎంతో అందంగా ఉంటుంది. ఆ పిల్లలో తన భర్త పోలికలు కానీ, తన పోలికలు కానీ లేవంటుంది పిల్లను ప్రేమగానే చూస్తుంది కాని అప్పుడప్పుడు తన కొడుకు ఎవరి దగ్గర పెరుగుతున్నాడో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకసారి నా దగ్గర ఆ మాటే అన్నది నేను చివాట్లు పెట్టాను.
ఈ మూఢనమ్మకాలనే శవాన్ని భుజంమీద నుంచి దించనంతకాలం స్త్రీలు ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, నిజమైన ప్రగతిని సాధించలేరు.
ఇలాంటి వాళ్ళను ఏం చెయ్యాలి? ఆలోచించండి!
మీనాక్షి ఒక ఆఫీసులో క్లర్క్ గా పనిచేస్తోంది. ఉత్సాహంగా జోక్సు వేస్తూ, తాను నవ్వుతూ, చుట్టూ ఉన్న వాళ్ళను నవ్విస్తూ ఉండేది. జీవితం ఆమె చుట్టూ కలకలమంటూ తిరుగుతున్నదా అనిపించేది మీనాక్షి పెద్ద అందగత్తె కాదు బొద్దుగా వుండే మీనాక్షిలో ఏదో వింత ఆకర్షణ వుండేది.
ఒకరోజు తన పెళ్ళి శుభలేఖ తీసుకుని నా దగ్గరకు వచ్చింది. పెళ్ళికి మరీ మరీ రమ్మని చెప్పింది. తను ఆఫీసులో పనిచేస్తున్న ఒక జూనియర్ ఇంజనీర్ని వివాహం చేసుకుంటున్నానని చెప్పింది. ప్రేమించుకున్నారట ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆమె కళ్ళలో కాంతిరేఖలు వింత వెలుగుల్ని విరచిమ్ముతూ కదిలిపోయాయి. నేను పెళ్ళికి వెళ్ళాను పెళ్ళి కొడుకు ఎంతో అందంగా - హుందాగా ఉన్నాడు ఆడపిల్లలంతా అతన్ని చూసి "మీనాక్షి అదృష్టవంతురాలు" అన్నారు.
"ఎలా ఉన్నారు? మీ కథల్లో హీరోలా వున్నారా?" మీనాక్షి వివాహం తంతు పూర్తయ్యాక నా దగ్గరకు వచ్చి చిన్నగా అడిగింది.
"నా కథల్లో అందమయిన హీరోలు ఉండరు. మీ ఆయన సినిమా హీరోలా వున్నాడు" అన్నాను నవ్వుతూ.
మీనాక్షి ముఖంలో ఆనందం అలలు అలలుగా ఉవ్వెత్తున లేచింది.
తర్వాత మీనాక్షి లక్ డికాపూల్ బస్సు స్టాండులో కన్పించింది. బాగా చిక్కిపోయి వుంది కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి పది సంవత్సరాలు ఒక్కసారిగా పైన పడినట్టూ అన్పించింది నవ్వుతూ, తుళ్ళుతూ కన్పించే మీనాక్షి నీరసంగా - దిగులుగా కన్పించింది.
"ఏమిటి అలా వున్నావు?" అన్నాను.
కళ్ళలో నీరు తిరిగింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద దిగమింగుకుంటూ ఆదివారం మా ఇంటికి వస్తానని చెప్పింది. మీనాక్షి వస్తూనే నన్ను పట్టుకొని బావురుమని ఏడ్చింది. నేను గాభరా పడ్డాను ఆమెను వూర్కో పెట్టడం ఎంతో కష్టం అయింది.
వీపు మీదా, చేతి జబ్బల మీద, ఛాతీ మీద వున్న మచ్చలని చూపించింది. గుండ్రటి మచ్చలు, కొన్ని మానిపోయి తెల్లగా ఉన్నాయి. కొన్ని పచ్చిగా వున్నాయి. కాలిన మచ్చలు తొడల నిండా వున్నాయట. నేను తెల్లపోయాను ఆ మచ్చలు ఏమిటని అడిగితే, తెలిసిన విషయం భర్త సిగరెట్ తో కాలుస్తాడట సాయంత్రం అవుతూ వుంటే భయంతో వణుకు వచ్చేస్తుందట ఆమె నవ్వుతూ ఉంటే, అతను సహించలేడట. ఆమె ఎంత ఏడిస్తే అతనికి అంత ఆనందం కలుగుతుందట ఇలాంటి వాళ్లు ఉంటారని ఎక్కడో చదివాను కాని ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే మతిపోయింది.
ఆమె భర్త శాడిస్టు అని అర్థమయింది. శాడిస్టులు అనేక రకాలుగా ఉంటారు.
మానసిక వికాసం మనిషిని పశువు నుంచి వేరుచేస్తుంది. ఈ వికాస క్రియ ఎంత మందకోడిగా సాగుతుందో చరిత్ర చదివితే తెలుస్తుంది. ఒక మనిషి మరో మనిషి మీద చేసిన అత్యాచారాలూ, అన్యాయాలూ చరిత్ర నిండుగా కన్పిస్తాయి. మనుషులు స్థూలంగా చూస్తే రెండు రకాలు బలవంతులు, బలహీనులు; బలవంతుడు బలహీనుణ్ణి హింసిస్తాడు. శాసించే స్వభావం కలవాడికి ఎప్పుడూ తనకింద అణిగిమణిగి పడి ఉండే బలహీనులు కావాలి.
"మనిషికో రుచి పుర్రెకో బుద్ధి" అంటుంటారు కొందరు వ్యక్తుల్లో ఈ రుచులు వికృత రూపాన్ని ధరిస్తాయి దాన్నే 'పర్వర్షన్' అంటారు. అందులో నుంచే శాడిజం పుడుతుంది అంటారు మానసిక శాస్త్రవేత్తలు ప్రపంచ చరిత్ర తిరగేస్తే ఇలాంటి క్రూరులు ఎందరో కన్పిస్తారు.
ఫ్రెంచి రచయిత "దశేడ్" మొట్టమొదటిసారిగా ఈ ప్రవృత్తికి అక్షర రూపాన్ని ఇచ్చాడు. అతని పేరు మీదనే ఈ క్రూర కృత్యాలకు శాడిజం అనే పేరు ఏర్పడింది. అతని రచనల్లోని ఈ భయంకర కృత్యాలు అతని జీవితానికి సంబంధించినవే అని అంటారు. దశేడ్ ఇరవై సంవత్సరాలు కఠినకారాగార జీవితాన్ని అనుభవించాడు అతని రచనలు నిషేధించబడ్డాయి అతను చనిపోయాక - నూరేళ్ళ తరువాత అతని రచనలు వెలుగులోకి వచ్చాయి.
ఒక రచనలో హీరో ఏమంటాడో చూడండి.
"నా అందమైన భార్య జబ్బల నుంచి ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి రక్తాన్ని లాగే వాణ్ణి ఆమె అంటే నాకు కోపంగానీ, అసహ్యంగానీ లేదు రక్తం చూసినప్పుడు నేను ఉద్రేకం పొందుతాను నా మెదడును వింతమత్తు చుట్టివేస్తుంది. ఆమెకు నిండా ఇరవై ఏళ్లు లేవు నేను పెళ్ళి చేసుకుని మూడేళ్లు పూర్తి కాలేదు ఆమెకు మంచి ఆహారం ఇస్తాను. ఎందుకంటే ---- ఆమె ఇంకొంత కాలం బ్రతకాలి ఆమె నాకు నాలుగో భార్య అయిదో భార్య త్వరలోనే వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది ప్రపంచంలో ఆడవాళ్ళ కొరత లేదు" అని అంటాడు ఈ మాటలు తన పాత్ర ద్వారా అనిపించినా అవి దశేడ్ మాటలే.
అతను రక్తం ఎలా తీస్తాడో చూడండి.
బహుమతులు
ఆదివారం లలితను చూడటానికి వెళ్ళాను వాకిట్లోనే విజిటర్స్ వెళ్ళిపోతూ ఎదురైనారు, వాళ్ళకు నన్ను పరిచయం చేసింది. "వీరిని కూడా తీసుకురా. తప్పక రావాలి మీరు కూడా రండి" అంటూ ఒక ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు. తెరిచి చూశాను వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారట చాలా కాలానికి కొడుకు పుట్టాడు సంవత్సరం పూర్తి అయిందట వాళ్ళు వెళ్ళిపోయారు. లలిత కార్డు చేతిలో పట్టుకొని పరధ్యానంలో పడిపోయింది.
"ఏం చెప్పమంటావ్? ఈ నెలలో ఇది మూడో ఇన్విటేషన్" అన్నది.
"అయితే?" ఆశ్చర్యంగా అడిగాను.
"వీళ్ళందరి ప్రేమ పిలుపుల్ని చూసి సంతోషించాలో బాధపడాలో అర్థం కావడం లేదు. ఈ నెలలో అసలే డబ్బుకు కటకటగా ఉంది. మొన్ననే మా దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్ళి జరిగింది వంద రూపాయలు ఖర్చు పెట్టాను ఒక స్నేహితురాలి పెళ్ళికి ఒక పాతిక ఖర్చు పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఈ బర్త్ డే. వీళ్లూ మేమూ చాలా దగ్గరగా ఉంటాం. సురేంద్ర గారూ, మా ఆయనా కలిసి చదువుకున్నారు నెల చివర వట్టి చేతులతో వెళితే బాగుండదు అప్పో సొప్పో చేసి ఏదో ఒక బహుమతి తీసుకెళ్ళాలి" అన్నది లలిత.
నేను ఆలోచనలో పడ్డాను. లలిత బాధ నాకు అర్థం అయింది. బహుమతుల కోసం పెళ్ళిళ్ళూ, పుట్టినరోజులూ వగైరా జరుపుకోరు. కాని వెళ్ళే వాళ్ళువట్టి చేతులతో వెళ్ళాలంటే చచ్చేంత మొహమాటంగా ఉంటున్నది వెళ్ళకపోతే బాగుండదు వెళ్ళాలంటే బహుమతుల బాధ ఆ బహుమతులు ఇవ్వడం ఒకటే బాధకాదు, ఏది ఇవ్వాలో నిర్ణయించుకోవడం కూడా బాదే బహుమతి ఎంతలో ఉండాలనేది మన ఆర్ధిక స్థోమతను పట్టే కాక ఇద్దరి మధ్యా ఉండే సంబంధాన్ని బట్టి ఉంటుంది. కొనడానికి బజారుకు వెళతాము ఏది చేతిలోనికి తీసుకున్నా ధర విన్నాక టక్కున పెట్టేస్తాం ఏది నిర్ణయించుకోలేక విసుక్కుంటాం చివరకు తోచిన డబ్బు ఇస్తే సరిపోతుందనుకుంటాం కాని వెంటనే డబ్బు కంటే వస్తువు ఇస్తే మనం ఇచ్చినట్టు వాళ్ళకు గుర్తుంటుందనే ఆలోచన వస్తుంది చివరకు ఏదో ఒకటి కొంటాం.
బాగా పరపతి ఉన్న వాళ్ళకైతే ఆ బహుమతులు ఒకోసారి పెద్ద సమస్య అయి కూర్చుంటాయి ఒకే రకం నాలుగు, మూడు వస్తాయి. నా స్నేహితురాలి కూతురి పెళ్ళికి రెండు ఇస్త్రీ పెట్టెలూ, నాలుగు లెమన్ సెట్సూ, పదిపదిహేను షోపీసులూ స్టీలు సామానులూ వచ్చాయి అవన్నీ ఏం చెయ్యాలో వాళ్ళకూ తోచదు మరొకరికి బహుమతిగా ఇద్దామంటే వాటిమీద ఇచ్చిన వాళ్ళ పేర్లు ఉంటాయి.