ఈ మధ్య కొందరు పెళ్ళికార్డులమీద "బహుమతులు తీసుకురావద్దు" అని రాస్తున్నారు. అది చూచి కొందరు నవ్వుతూ బహుమతులు మరిచిపోతారేమోనని గుర్తు చేస్తున్నారు అనడం వింటూ వుంటాం. అలా రాసినప్పుడు కూడా వట్టి చేతులతో వెళ్ళడానికి మొహమాటపడి ఏదో ఒకటి పట్టుకెళతాం. తీరా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటే వద్దు అనడం మర్యాద కాదు. కనక తీసుకుంటారు.
కొందరు ఎవరు ఏం తెచ్చారో కూడా పట్టించుకోరు. కొందరు జాగ్రత్తగా పరిశీలిస్తారు. మళ్ళీ తెచ్చిన వాళ్ళకు వాళ్ళ ఇళ్ళలో శుభకార్యాలకు అంతఖరీదులోనే ఇవ్వాలి కనక జాగ్రత్తగా తెచ్చిన వారి పేరూ, వస్తువు వివరాలూ అప్పటికప్పుడే రాసుకుంటారు.
గృహ ప్రవేశాలకు కూడా బహుమతులు తీసుకెళ్ళడం (డెకరేషన్ పీసెస్) ఇప్పటి ఫాషన్స్! "ఎందుకోయ్ అంత బుర్ర బద్దలు కొట్టుకుంటావు? ఇలాంటి బహుమతులు ఇవ్వడం మానెయ్."
"అదెలా సంభవం? అందరూ తెస్తే నేను మాత్రం చేతులు ఊపుకుంటూ వెళితే ఏం బాగుంటుంది. పిసినారి వాళ్లం అనుకుంటారు."
"ఎవరికి వాళ్ళే యిలా అనుకుంటూ ఉంటే ఈ పధ్ధతి ఎలా పోతుంది? పిసినారి వాళ్లు అనుకుంటే అనుకోనివ్వు వాళ్ళేదో అనుకుంటారని అప్పుచేసి బహుమతులు కొని ఆ తరువాత బాధపడటం కంటే అదే మంచిది." లలిత ఆలోచనలో పడింది.
"నేనూ అదే అంటాను. కాని మీరు ఒప్పుకోరు మనం ఇంట్లో ఎన్ని బాధలు పడ్డా పదిమందిలో గొప్పగా ఉండాలంటారు." లలిత ఆలోచనలో నుంచి పూర్తిగా బయటపడకుండానే అన్నది.
ఇటువంటి పద్ధతులు ఎప్పటికి పోతాయో మనకు ఇవ్వాలనిపించినప్పుడు ఇవ్వగలిగినప్పుడు బహుమతి ఇవ్వడం వేరు. బాగుండదనీ, పది మందిలో చిన్నతనం అవుతుందనీ తనకు మించిన భేషజాలకు పోవడం వేరు.
"నీ పనే హాయిగా ఉంది అన్నది లలిత. నాకు ఆ మాటకు అర్థం బోధపడలేదు ప్రశ్నార్థకంగా చూశాను.
"నువ్వు ఎక్కడికి వెళ్ళకపోయినా, ఎవరికీ ఏమి ఇవ్వకపోయినా ఫరవాలేదు. రేపు నీ పిల్లలకు బహుమతులు రావని కానీ, వాళ్ళు నీ ఇంట్లో శుభకార్యాలకు రారని కానీ బెంగ లేదు."
నేను గతుక్కుమన్నాను. మరో క్షణం ఒళ్ళుమండిపోయింది." అంటే నీ పిల్లలకు బహుమతులు రావాలనే కోర్కె నీకూ ఉన్నదన్నమాట. అలాంటప్పుడు ఇవ్వడానికి బాధపడతావెందుకూ? నీకు నలుగురు పిల్లలు ఉన్నారు. నువ్వు ఎవరికెంత ఇస్తున్నావో లెక్క రాసి పెట్టుకుంటూనే ఉంటావ్."
"మరి రాసుకోకపోతే ఎలా?"
"పోయిన సంవత్సరం మీ పాపకు పుట్టినరోజు చేశావుగా? అప్పుడు చాలా బహుమతులు వచ్చాయి. ఎన్నో బొమ్మలు వచ్చాయి అందులో ఒకటి రేపు వాళ్ళకియ్యి" అన్నాను.
"అవన్నీ పాతబడిపోయాయి. కొన్ని విరిగి కూడా పోయాయి.
"పోనీయ్ మళ్ళీ నువ్వూ ఒక పుట్టినరోజు పండగ చెయ్. బోలెడన్ని బహుమతులు వస్తాయి."
"ఎందుకూ నెత్తినకొట్టుకోనా? బర్త్ డే చెయ్యాలంటే బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాలి."
"చూడు లలిత! నేను మనుషుల్లోనే ఉంటున్నాను. మరీ ముఖ్యులనుకున్న వాళ్ళ ఇంటికి శుభకార్యాలకు వెళుతూనే ఉంటాను. నాకు తోచింది ఏదో తీసుకెళతాను. కాని మళ్ళీ అంత ఖరీదు గల వస్తువేదో నాకు మరోనాడు వస్తుందనే భావంతో మాత్రం నేను యివ్వను. డబ్బు లేకపోతే వట్టి చేతులతో వెళతాను. వాళ్ళు ఏమనుకుంటారనే బెంగ నాకు లేదు" అన్నాను.
"ఏమో బాబూ. అలా నేను చెయ్యలేను" అంటూ సాగదీసింది.
ఇటువంటి అర్థంపర్థం లేని ఆచారాలకు స్వస్తి వాచకం ఏనాటికి జరుగుతుందో?
మీరు ఇంట్లో వంటరిగా ఉంటారా?
మీ పిల్లలు స్కూలుకు వెళ్తారు. మీ భర్తగారు ఆఫీసుకు వెళ్తారు. మధ్యాహ్నం మీరు ఇంట్లో వంటరిగా ఉంటారు. చిటపటలాడుతూ ఎండ కాస్తూంది. ఇరుగు పొరుగు ఇళ్ళ తలుపులు మూసి ఉన్నాయి. రోడ్డు మీద జనసంచారం లేదు. కుక్కలు కూడా రొప్పుతూ నీడను వెతుక్కుని పడుకున్నాయి.
అకస్మాత్తుగా మీ ఇంటి కాలింగ్ బెల్ మ్రోగుతుంది. మీరు ఒక్కసారిగా లేచి నిలబడతారు ఎవరొచ్చారో తెలుసుకోగానే ఉత్సుకత మీకు తెలియకుండానే మీలో కలుగుతుంది వెంటనే తలుపు తీస్తారు. ఖాకీ దుస్తుల్లో, నల్ల కళ్ళద్దాలతో ఒక వ్యక్తి కన్పిస్తారు అతను పోస్టుమాన్ గా కనిపిస్తాడు.
ఉత్సాహంగా ఉత్తరాలకోసం చెయ్యి చూస్తారు ఉత్తరాలు అందుకోవడంలో ఉండే ఆనందం ప్రతి ఒక్కరికీ అనుభవమే.
"మీ భర్తగారి పేరు మీద రిజిస్టర్ పార్సిల్ వచ్చింది. "పోస్టుమాన్ సమాధానం. రిజిస్టర్డ్ పార్సిల్ అనగానే మీలో కుతూహలం మరీ ఎక్కువ అవుతుంది. "నేను సంతకం పెడితే ఇస్తారా?" అని అడుగుతాడు.
"ఇవ్వకూడదు." అని కొంచెం సందేహిస్తున్నట్లు నటించి" ఫర్వాలేదు తీసుకోండి ఇస్తాను" అంటాడు.
ఈ సమయంలో మీరు పోస్ట్ మెన్ అనబడే వ్యక్తిని పరిశీలనగా చూడరు. చూస్తే రోజూ వచ్చే వ్యక్తికాదని తెలిసిపోతుంది. అతను మీకు రసీదు మీద సంతకం ఎక్కడ చెయ్యాలో చూపిస్తాడు. "పెన్ తెస్తాను" అంటూ మీరు లోపలకు వెళ్తారు. మీరు వెనక్కు తిరుగుతారు. ఆ వ్యక్తి ఆ అవకాశం కోసమే నిరీక్షిస్తాడు ఏం జరుగబోతోందో మీరు కలలో కూడా వూహించి ఉండరు. వెనక నుంచి మీ మీదకు దుముకుతాడు మిమ్మల్ని పట్టుకుంటాడు. మీకు అరిచే అవకాశం కూడా ఇవ్వడు. నోట్లో గుడ్డలు కుక్కేస్తాడు కాళ్ళూ చేతులూ కట్టేస్తాడు కింద పడేస్తాడు మీరు వణికిపోతూ, గుడ్లప్పగించి చూస్తుంటారు. మీ కళ్ళముందే మీ విలువైన వస్తువులన్నీ మూట కడ్తూ ఉంటాడు. మీరు నిస్సహాయంగా పడి ఉంటారు. వాడు మరీ నీచుడైతే మీ శీలాన్ని కూడా హరిస్తాడు మీరు ఇంట్లో వంటరిగా ఉన్నారని తెలుసు మీరు గుర్తుపట్టే అవకాశం ఉన్నట్టయితే చంపడానికి కూడా వెనుదీయడు.
ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో వింటుంటాం. పేపర్ లో చదువుతుంటాం అయినా మనం జాగ్రత్తగా సాధారణంగా ఉండము. ఆ మధ్య హైదరాబాద్ లోని మలక్ పేట కాలనీలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే కరెంటు రీడింగ్ కోసం వచ్చినట్లు నమ్మించి ఇంట్లో జొరబడ్డాడు. ఇంట్లో ఉన్న ఒంటరి యువతిని చంపేశాడు.
ఈ మధ్య నార్తులో ఒక సంఘటన జరిగింది. రాత్రి తొమ్మిది గంటలకు భర్త (రైల్వే గార్డు) డ్యూటీకి బయలుదేరాడు. భార్య వీధి మలుపు వరకూ అతనితో వెళ్ళింది ఆమెతోపాటు ఆమె ఏడేళ్ల కూతురు కూడా ఉన్నది ఆ పిల్ల తండ్రిని వదలడంలేదు పిల్లను బుజ్జగించి తండ్రి వెళ్ళిపోయాడు ఏడుస్తున్న బిడ్డను సముదాయిస్తూ ఆమె తిరిగి ఇంట్లో ప్రవేశించి శిలలా నిలబడిపోయింది ఆమె లోపలకు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు కుర్చీలలో కూర్చుని ఉన్నారు.
ఒకడి చేతిలో రివాల్వర్ ఉన్నది. రెండోవాడు ఏడుస్తున్న పిల్లనోట్లో గుడ్డలు కుక్కి మంచానికి కట్టేశాడు. అరవడానికి ప్రయత్నించిన తల్లి మీద రివాల్వర్ పేల్చాడు ఆమె చనిపోయింది ఆమె వంటి మీద నగలూ, నగదు తీసుకొని పలాయనం చిత్తగించారు. ఆ పసిబిడ్డ తెల్లవారి పనిమనిషి వచ్చేంత వరకూ అలాగే మంచానికి కట్టేసి ఉన్నది.
సాధారణంగా స్త్రీలు తలుపులు వెయ్యకుండా ఇరుగుపొరుగు స్త్రీలతో గంటలకొద్దీ కబుర్లలో పడిపోతారు. తిరిగి వచ్చేసరికి ఇల్లు బావురుమంటూ ఖాళీగా కనిపిస్తుంది.
కాల్ బెల్ మోగగానే తలుపు తియ్యకండి. ముందు కిటికీలో నుంచి చూసి తెలిసిన వాళ్ళయితేనే తలుపు తెరవండి. కొత్త వ్యక్తిని బయటనుంచి పంపించి వెయ్యండి. మీరు వారు తెలిసినట్లుగానీ, వూరి నుంచి ఎవరి ద్వారానో వచ్చినట్టు కాని చెబితే మీ భర్త ఆఫీసు నుంచి తిరిగి వచ్చాక రమ్మని చెప్పండి. ఉత్తరాలూ వగైరా కిటికీలో నుంచి కూడా తీసుకోవచ్చును.
ఒకసారి ఇంట్లో టెలిఫోన్ ఉంటే తమాషా కాల్స్ వస్తాయి. మీ భర్తకు యాక్సిడెంట్ అయింది మీరు వెంటనే బయలుదేరి ఫలానా ఆసుపత్రికి రండి" అని టెలిఫోన్ లో వార్త అందవచ్చును స్కూలు నుంచి వస్తూ మీ బిడ్డ ఏదో ప్రమాదానికి గురి అయిందని చెప్పవచ్చును. అది వినగానే ఏ స్త్రీ అయినా ఘొల్లున ఏడుస్తూ బయటకు పరుగు తీస్తుంది. అది ఎంతవరకు నిజమో ఆమె భర్త పనిచేసే ఆఫీసుకు ఫోన్ చేసి కనుక్కోవాలనే ఆలోచన కూడా రాదు. పిల్లవాడు స్కూలు నుంచి ఒంటరిగా బయలుదేరాడు. ఇంకా ఆ స్కూలుకు సంబంధించిన పిల్లలు ఉంటారు. ఈ విషయాల్లో ఇంట్లో ఫోన్ ఉంటుంది కనక దగ్గరలోని పోలీసు స్టేషన్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చును.
ఇంట్లో పనిచేసే వాళ్ళను పూర్తిగా నమ్మడం మంచిది కాదు. మీ విలువైన వస్తువుల్ని ఎక్కడ దాస్తారో నౌకర్లకు తెలియకూడదు. ఒక సంఘటన గురించి ఆ మధ్య ఎక్కడో చదివాను పనిమనిషి మీద ఇల్లు వదిలేసి ఒక గృహిణి బయటికి వెళ్ళింది తిరిగి వచ్చేసరికి పనిమనిషిని ఎవరో కట్టిపడవేశారు. నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయ్ బీరువా తెరిచి ఉంది నగలతో పాటు డబ్బు కూడా పోయింది. వెండి సామాను కూడా పోయింది బీరువా తాళం చెవులు ఇంట్లోనే ఎవరూ వూహించని చోట దాస్తుంది ఆ ఇల్లాలు. ఆ విషయం ఆ పనిమనిషికి తప్ప మరొకరికి తెలియదు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఆ పనిమనిషి తాలూకు వాళ్ళే దొంగతనం చేసినట్లు తేలింది తన మీద అనుమానం కలగకుండా ఉండేందుకు, తన కోరిక మీదే వాళ్లు తన నోట్లో గుడ్డలు కుక్కి, తాళ్ళతో కాళ్ళూ చేతులూ కట్టివేశారని ఆమె అంగీకరించింది.
స్త్రీలు సాధువులు మీదా, మందు మాకులు తెచ్చే కోయవాళ్ళమీదా, సోది చెప్పే వాళ్ళ మీదా ఎంతో ఆసక్తిని చూపిస్తారు వాకిట్లోకి వచ్చిన వాళ్ళను కూర్చోపెట్టి గంటల కొద్దీ కబుర్లు చెప్పించుకుంటారు వాళ్లు రెండుమూడు విషయాలు భవిష్యత్తు గురించి చెప్పగానే సంభాషణలో పడిపోతారు. ఇలా కష్టాలు కోరి తెచ్చుకుంటారు అంతా అయిపోయాక కళ్లు తెరుస్తారు.