"ఏమిటి?" అయిష్టంగానే అడిగాను.
"ఆత్మహత్య చేసుకుంది. నల్లుల మందు తాగింది. "నేను తుళ్ళిపడ్డాను. నా నోటి నుంచి మరో ప్రశ్న రావడం లేదు.
"పెళ్ళి చేసే స్తోమతు లేదు. వయసుతో పాటు కోర్కెలూ పుట్టుకొస్తాయి. ఎవడో నమ్మించి మోసం చేశాడు. పోస్టుమార్టంలో ఆ పిల్ల గర్భవతి అని తేలిందట!"
"పాపం!" నా మనసంతా ఎలాగో అయింది. ఆ విషయం నాతో చెప్పుకోవాలని నా దగ్గిరకు వచ్చి ఉంటుంది. ఆమె కేసి సరిగా చూడని నాతో చెప్పడానికి మొదటిసారిగా జంకి ఉంటుంది.
అందుకేనేమో "ఏడిస్తే ఒంటరిగా ఏడువు, నవ్వితే పదిమందితో నవ్వు" అంటారు పెద్దలు. తను నవ్వుతూ, చుట్టూ వాళ్ళను నవ్వించగల వ్యక్తులకు ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. అలాంటివారు ఎప్పుడో తప్ప తమ కష్టాలను ఇతరుల ముందు చెప్పుకోరు. మనకష్టాలను కనిపించిన వాళ్ళందరికీ చెప్పుకోవడం, కనిపించినప్పుడల్లా కష్టాలే చెప్పడం మంచిది కాదు. మనల్ని చూడగానే ప్రతివాళ్లూ తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు.
కొందరికి గోరంత కష్టం కొండంతగా కన్పిస్తుంది. కన్పించిన ప్రతి వాళ్ళ ముందూ తమ కష్టాలను చాలా గొప్పగా చిత్రిస్తూ ఉంటారు.
"నేను ఇంత పెద్ద చదువు చదివానా? అయినా చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నాకేమైనా రికమెండేషన్లు ఉన్నాయా? లేక లంచాలు గుమ్మరించగలనా:"
"మా పెద్దవాడు బొత్తిగా మాట వినటం లేదు. మా ఆవిడ ఆరోగ్యం అసలే అంతంత మాత్రం. పైగా వాడి దిగులు ఒకటి జీతం పదిహేనో తారీఖుకి ఖతం. ఆ తర్వాత అప్పులే."
"నాకు ఎప్పుడో ప్రమోషన్ డ్యూ. నాకు ఇవ్వాల్సిన ప్రమోషన్ ఆ సుబ్బారావు (అతనెవరో వినేవాడికి తెలియదు) కు ఇచ్చారు. సుబ్బారావు కాలాంతకుడు ఏ డైరెక్టర్ వచ్చినా ఇట్టే పట్టెస్తాడు. ఆ టెక్నిక్ నాకు తెలిస్తేగా? అంతా మోసం, దగా!"
కొందరి కష్టాలు ఇలా ఉంటాయి.
కొందరిని ఆరోగ్యం ఎలా ఉందని పొరపాటున అడిగామా చచ్చి ఊరుకుంటాం. కొందరు అడక్కుండా కూడా చేస్తారనుకోండి. "బొత్తిగా బాగుండడం లేదండీ! కొంచెం తిన్నా అరగదు. (కొందరు తీపి ఎలా అరగదో చూపిస్తారు) కీళ్ళు నొప్పులు -- ఒక కన్ను కొంచెం మసకమసకగా ఉంటుంది. ఈ మధ్య కుడిచెయ్యి పీకుతున్నది. ఎక్కువసేపు కూర్చోలేను...." ఇలా పోతూనే ఉంటుంది ధోరణి. మనం బిక్కమొహం వేసి ఎప్పుడు ఆపుతాడా అన్నట్టు కూర్చుంటాం.
రెండోసారి అతన్ని తప్పించుకు తిరగడానికి ప్రయత్నిస్తాం. దగ్గరి వాళ్లూ, తప్పించుకోలేని వాళ్లూ అయితే లోలోపల తిట్టుకుంటూ వింటాం. వాళ్లు నిజంగా పడే బాధ కూడా గమనించం.
ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. మన సమస్యలు మనకు కనిపించినంత జటిలమైనవిగా ఎదుటివాళ్ళకు కనిపించవు. కనిపించినా సాధారణంగా పట్టించుకోరు. కొందరు పట్టించుకొన్నట్టు నటిస్తారు. అంతే! నిజమే! మనిషికి కష్టంలో సానుభూతి కావాలి.
ఒక చల్లని మాట కావాలి. చెప్పుకోకపోతే ఎదుటివారికి ఎలా తెలుస్తుంది. అని అంటారు గదూ? నిజమే? ఆప్తుల దగ్గరా సన్నిహితుల దగ్గరా, మిత్రుల దగ్గిరా నిజమైన సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. పరిష్కారం అడగవచ్చు. పెద్ద కష్టం వచ్చినప్పుడు మనం చెప్పుకోకుండానే ఎలా సన్నిహితులకు తెలుస్తుంది.
చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్ద కష్టాలుగా చిత్రించి కన్పించిన ప్రతి ఒక్కరి దగ్గరా ఏ కరువు పెట్టే వాళ్లు అంటే గ్రీవెన్సెస్ కలెక్టర్సు) ఎవరూ ఇష్టపడరు. మీకు ఆ అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
ఈ శవాన్ని ఇంకెంత కాలం మోద్దాం?
గత గౌరవాన్ని గురించి గొప్పలు చెప్పుకోవడంలో మనకు మనమే సాటి. ఈ విషయంలో ఏ దేశవాసులు కూడా మనముందు నిలవలేరు. సాంస్కృతిక, ధార్మిక, సామాజిక, ఆఖరికి రాజకీయ సంబంధమైన వేదికల మీద నిలుచుని మన పండితులు, నాయకులు, మేధావులు మన పవిత్ర భారతదేశపు గౌరవాన్ని గురించి ఉపన్యాసాలు దంచుతారు.
మన సంస్కృతి ప్రపంచంలోని అతి ప్రాచీన సంస్కృతుల్లో ఒకటనీ, విశ్వ నాగరికతలన్నీ కాలగర్భంలో కలిసిపోయినా, మన నాగరికత, సంస్కృతి మాత్రం చెక్కు చెదరకుండా నిలిచిపోయిందనీ డంబాలు కొడుతూ ఉపన్యాసాలు ఇస్తారు.
ప్రాచీన సంస్కృతిని కీర్తించడంలో మైమరచి ఉన్న మన దృష్టి వర్తమానం మీద నిలవడం లేదు.
"ప్రపంచంలో సర్వోత్తమమైనటువంటి అన్ని దశల్నీ మనపూర్వులు అనుభవించారు. మన మునీశ్వరులు అన్ని విషయాలను ఎప్పుడో తెలుసుకున్నారు. ఈనాడు పాశ్చాత్యులు పరిశోధిస్తున్న విషయాలనన్నింటినీ మన పూర్వులు ఏనాడో సాధించారు.
అసలు మనదేశం నుంచి తిస్కరించిన గ్రంథాల ఆధారంతోనే ప్రాచీనులు వైజ్ఞానిక పరిశోధనల్ని చేస్తున్నారు. ఈనాడు మనం కొత్తగా పరిశోధించవలసిందీ, తెలుసుకోవలసిందీ ఏదీ లేదు." ఇదీ మన ధోరణి మన మస్తిష్కాలలోని అన్ని ద్వారాలనూ బంధించి, గతాన్ని గుడ్డిగా నమ్ముతున్నాము.
అందుకే మన మస్తిష్కాల్లోకి కొత్త భావాలూ, ఆలోచనలూ దూరడం లేదు. కొత్త అంటే మనకు చచ్చేంత భయం. పాత అంటే వల్లమాలిన అభిమానం. మానసిక బానిసత్వం నుంచీ, జడత్వం నుంచీ బయటపడలేని మన సమాజం రోగగ్రస్తం అయింది. పని పాటలు చెయ్యకుండా సోమరి పోతుల్లా కాలక్షేపం చేస్తూ, పూజలను అందుకుంటున్న మన సన్యాసులూ అమ్మవార్లూ సామాన్య మానవుల బుర్రల్లోకి మూఢవిశ్వాసాల్ని చొప్పిస్తున్నారు.
సామాన్యుడు ఆలోచించడం మొదలు పెడితే వీళ్ళకు బతుకు ఉండదని తెలుసు. ఉదాహరణకు - ఒకస్వామి లేక బాబా (పేర్లు అనవసరం అనుకుంటాను) పాదుకల్ని బంగారు, వెండి సింహాసనాల మీద పెట్టి పూజించేవారు ఇంకా ఉన్నారు. కొందరు వింజామరలు విస్తుండగా, మరికొందరు ఆ పాదుకలకు పూజచేస్తారు.
అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించేదేమిటంటే సమాజంలో మేధావి వర్గంగా గుర్తించబడే విద్వాంసులూ, రచయితలూ, లాయర్లు, డాక్టరులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులూ మొదలైనవారు. ఎందరో బాబాల చుట్టూ అమ్మవార్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు వారి పాదాలు కడిగిన నీటిని తీర్థంగా పుచ్చుకుంటారు. (స్నానం చేసిన నీటిని కూడా పుచ్చుకుంటారని విన్నాను.)
రాజులూ, మహారాణులూ చరిత్రలో కలిసిపోయారు. సామ్రాజ్యవాదానికి సమాధి కట్టబడింది. అయినా ఈ సాధు సన్యాసులు పదభ్రష్టులు కాలేరు. వారి ఎక్స్ ప్లాయిటేషన్ రోజు రోజుకూ పెరిగిపోతున్నది.
మన పురాతన గ్రంథాల (ధర్మ వేదాది గ్రంథాలు)ను ప్రామాణిక గ్రంథాలుగా ఈనాటికీ నమ్ముతున్నాం: నమ్మిస్తున్నాం. ఏది చెప్పాలనుకున్నా ఆ గ్రంథాలను ఉటంకించకుండా చెప్పలేకపోతున్నాం. జ్ఞానం అనంతమైనదనీ నిన్నటి వరకూ లభించిన జ్ఞానం ఈనాటి పరిస్థితులకు ఉపయోగకరంగా లేనప్పుడు దాన్ని వదిలెయ్యవలసి ఉంటుందనీ మనం భావించడం లేదు. కొత్త ప్రయోగాలూ, పరిశోధనలూ పాత ప్రమాణాల్ని ఖండిస్తున్నాయి.
కొత్త సమస్యల్నీ, సవాళ్ళనూ కొత్త కోణం నుంచి చూసి పరిష్కరించుకోవాలనే విషయాన్ని విస్మరిస్తున్నాం. మూఢనమ్మకాలు స్త్రీలలో మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదువుకున్న స్త్రీలు కూడా (చాలాకొద్దిమందిని మినహాయిస్తే) ఈ నమ్మకాల నుంచి బయట పడలేకుండా ఉన్నారు.
విమలకు ముగ్గురు సంతానం. అందరూ ఆడపిల్లలే వంశోద్ధారకుడు లేడనే దిగులు ఆమెను పీడించసాగింది. విమల బి.ఎస్.సి పాసయింది మగపిల్లవాడికోసం ఒక అమ్మను ఆరాధించసాగింది. ఇంటినిండా అమ్మవారి బొమ్మలే. ఎప్పుడూ పూజలూ, వ్రతాలూ చేసేది. ఒక రోజుకలలో అమ్మకనిపించి నీకు కొడుకు పుడతాడని వరం ఇచ్చింది. (ఆమె మనసులోని కోరిక అలా కలరూపంలో కనిపించింది) అమ్మవారు ప్రత్యక్షం అయినందుకు విమల సంతోషానికి అంతులేదు. కొంతకాలానికి ఆమెకు గర్భం వచ్చింది కాన్పు చాలా కష్టం అయింది.
అత్తగారూ, మామగారూ, భర్తా అందరూ వంశోద్ధారకుడి ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు. విమలైతే నెల తప్పినట్టు తెలుసుకున్న రోజునుంచే కొడుకు పుట్టినట్టే ఆనందించసాగింది. చివరకు మళ్ళీ ఆడపిల్ల జన్మించింది ఆ రోజు ఆ ఇంట్లో పీనుగు వెళ్ళిపోయినట్టు వాతావరణం ఏర్పడింది. విమల భరించరాని అవమానం ఏదో తనకు జరిగినట్టు బాధపడింది ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే కసిగా అమ్మవారి బొమ్మలన్నింటినీ తీసి పారేసింది. పాపను ఎంతోకాలం ప్రేమగా గుండెకు హత్తుకోలేకపోయింది.
వీణ (పేరు మార్పే కాని ఆమె నాకు పరిచితురాలు) అభ్యుదయ భావాలు కలిగిన యువతి అనే భ్రమ నాకు ఉండేది. బాగా చదువుకున్నది. ఆమె పెద్ద ఉద్యోగం చేస్తున్నది ఇద్దరు ముద్దులు మూటకట్టే కూతుళ్లు. వాళ్ళను బాగా చదివించి, పెద్ద ఆఫీసర్లను చెయ్యాలని ఆమె కోరిక. కొడుకు లేడన్న బాధ ఆమెలో ఉన్నట్టు నేను పసికట్టలేదు.