Previous Page Next Page 
ప్రియతమా! ఓ ప్రియతమా పేజి 15

                                 


    ఇంతలో అర నిమిషం ఎదురింటి కిటికీ పైన ఆమె దృష్టి నిలిచింది.
    ఎదురింట్లో ఉండే కమలమ్మ గారికి తన వయస్సే ఉంటుంది.
    ఆవిడ భర్తకి చిలకలు చుట్టి అందిస్తోంది! ఆయన వాటిని నోటితో అందుకుంటూ... అలాగే ఆమెపైకి వంగి...
    అరుంధతి చివాల్న తల తిప్పుకుంది. ఏమిటీ ఈ వయసులో కూడా! ఖర్మ అనుకుంది. కానీ, అనుకోకుండా మళ్ళీ అటు చూసింది. ఆ దృశ్యం ఆమె మనోఫలం మీద ముద్రించుకుపోయింది. నెమ్మదిగా క్రిందికి దిగి వచ్చింది.
    తన గదిలో వాష్ బేసిన్ దగ్గరున్న అద్దం దగ్గరికెళ్ళి, తల మీద నుంచి ముసుగు తీసి చూసుకుంది. నల్లని ఒత్తైన శిరోజాలు పట్టుకుచ్చులా ఉన్నాయి. మెడదాకా పరుచుకున్న జుట్టుతో, పచ్చని అరుంధతి ముఖం మబ్బుల మాటునుంచి బైటపడ్డ చంద్రబింబంలా వుంది. వయసులో ఉన్నప్పుడు అరుంధతి మంచి అందగత్తె. బావ బహుశా, తనని అలాగే అందంగా ఊహించుకుంటాడేమో, కానీ, తనిలా తలబెడి తెల్లచీరలో ఎలా ఎదురువెళ్ళకలదు? అనుకోగానే ఉప్పెనలా దుఃఖం ముంచుకొచ్చేసింది. ఆమె ఆపుకునే ప్రయత్నం చెయ్యకుండా, అలాగే పక్కమీద వాలి వెక్కివెక్కి ఏడ్చింది.
    అప్పన్న పంతులూ... అరుంధతీ చెయ్యీ చెయ్యీ పట్టుకుని పరిగెడ్తున్నారు... అరుంధతి చెయ్యి అతను విడవగానే ఆమె బోర్లా పడిపోయింది. అతను మళ్ళీ వెనక్కి వచ్చి చెయ్యి అందించి లేపుతున్నాడు. అరుంధతి నవ్వుతోంది! అతను కూడా గట్టిగా నవ్వుతూ ఆమెని దగ్గరగా తీసుకుంటూ ఉండగా... చటుక్కున మెలుకువ వచ్చింది అరుంధతికి. ఒళ్ళంతా చెమట్లు పట్టాయి. భయంతో సన్నగా వణికింది. టైము నాలుగు కూడా అవలేదు.

 

                           

    అబ్బా! ఇంకా తెల్లవారదేం? ఇవాళ అనుకుంది.
    మనసుతో పోటీపడి కాలం పరిగెత్తలేదు. ఆమె సహనాన్ని పరీక్షించి, పరీక్షించి ఎట్టకేలకు తెల్లవారింది!
    తూరుపురేఖలు భూమి మీద మెల్లగా పరుచుకుంటున్న వేళ, ముత్యాల తలంబ్రాలు పోసుకుని, ముసిముసిగా నవ్వుకుంటున్న మధువరుల్లా ఊగుతున్నాయి. మంచు బిందువులతో ఆకులు, ఆనాటి ప్రకృతి రమణీయంగా వుంది.
    అరుంధతికి చాలా ఉద్వేగంగా వుంది. ఆనందంగా వుంది. అదోరకమైన బాధగా వుంది. తన పరిస్థితి మీద తనకే కోపంగా కూడా వుంది.
    దేవుడు కూడా ప్రశాంతతని అందివ్వలేకపోయాడు. ఆమె చెవులు కారు హారన్ చప్పుడు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి.
    గేటు మీద వాలిన కాకి 'కావు, కావు' మని అరుస్తూంటే అరుంధతికి వీనులవిందుగా వినిపిస్తోంది. చిన్నప్పుడు టూరింగ్ టాకీసులో బావతో కలిసి చూసిన సినిమాలో పాట స్మృతి పథంలో చటుక్కున మెరిసింది. "ఎందుకే నీకంత తొందరా?" అంటూ.
    ఇంతలో కారు చప్పుడు.
    చటుక్కున లేచి పరిగెత్తుకుని వెళ్ళాలనిపించినా, బలవంతంగా నిగ్రహించుకుని అక్కడే కూర్చుంది అరుంధతి.
    ఏ మొహం పెట్టుకుని ఎదురు వెళ్ళాలా? శుభమా అని అన్ని సంవత్సరాల తరువాత స్వదేశానికి తిరిగివస్తున్న అతనికి తను ఎదురు వెళ్ళడమేమిటీ? వెళ్ళదు. వెళ్ళలేదు.
    హాలులోంచి నారాయణా, సుమిత్రా, మంజీరా గొంతులతో బాటు మరో గొంతు వినిపిస్తోంది. కానీ, స్పష్టంగా ఏమీ అర్థం కావడం లేదు.
    కాసేపు ఓర్చుకుంది కానీ చాలా ఉక్రోషంగా అనిపించింది. 'తన గురించి అడగడేం? లోపలికి రాడే?"
    "కాఫీ తీసుకోండి" సుమిత్ర అంటోంది.
    "దైవ దర్శనం కాకుండానే?" ఆ మాటకి అరుంధతి గుండె లయ తప్పింది.
    అతని అడుగుల శబ్దం చేరువవుతుంటే, గబుక్కున అక్కడ నుండి తప్పుకోవాలనుకుంది. కానీ, అంతలోనే అతను దగ్గరకి వచ్చేసాడు.
    ఆ అడుగుల శబ్దం ఆమెకి గుర్తే!
    "అరూ!" సృష్టిలో ఉన్న స్నేహం, ప్రేమా, ఆప్యాయతా అంతా ఆ పిలుపులో ప్రోది చేసుకున్నదా? అన్నట్లుందా పిలుపు.
    అరుంధతి ఇక ఆగలేక, వెనక్కి తిరిగింది.
    ఎదురుగా తన ప్రియాతి ప్రియమైన బావ! అప్పన్న పంతులు.
    అతని కళ్ళల్లో ఆనందంతోబాటు సన్నని విషాద వీచిక! తన అరుంధతి, తన చిన్ననాటి నెచ్చెలి, ఇన్నాళ్ళ నుంచి కలలు కన్న ఊహాసుందరి, ఒకనాటి ప్రేయసి, కొంచెం తప్పిపోయిన అర్ధాంగి... ఈ విధంగా సంఘ దురాచారాలనే పరిహసిస్తున్నట్లుగా, మారిన కాలంతోపాటు మారని మూర్ఖపు మనసుల్ని ఎత్తి చూపుతున్నట్లుగా, కడిగి ముగ్గు పెట్టకుండా వదిలివేసిన ఇల్లులా, దీపంలేని గర్భగుడిలా, ఇలా.... ఏమిటీ ఘోరం? ఎందుకీ వేషం? అతని గొంతు మూగపోయింది. చేతిలోని ప్యాకెట్లు నెమ్మదిగా పట్టుతప్పి జారిపడిపోయాయి.
    వాటిలోంచి బయటికి రెపరెపలాడుతూ ఎగురుతున్న రంగు రంగుల చీరలు.


                                                     *    *    *    *


    "గ్రాండ్ పా, కాఫీ" అంటూ వచ్చింది మంజీరా కాఫీ కప్పుతో.
    "పద అరూ! హాల్లో కూర్చుందాం" అంటూ అరుంధతిని ఉద్దేశించి చెప్పాడు 'లూ'.
    అందరూ హాలులోకి దారితీసారు. చివరగా బెరుకు బెరుకుగా అరుంధతి కూడా!
    ఇష్టమైన వారి సమక్షంలో మనసు మూగపోతుంది, బహుశా ముందు ఏదీ మాట్లాడాలో నిర్ణయించుకోలేక కాబోలు!
    "అరూ! నువ్వు కూడా తీసుకో" లూ తన కప్పులోంచి కాఫీ సాసర్ లోకి పోసి అందిస్తూ అన్నాడు.
    అరుంధతి ఆ చర్యకి బిత్తరపోయింది. కంగారుగా నారాయణమూర్తీ, సుమిత్రలవైపు చూసింది. అంతలోనే తల అడ్డంగా ఊపుతూ, "నేను కాఫీ తాగను" అనేసింది.
    "ఒక్కసారికి ఏం కాదులేండి! ఆయన అడిగినందుకన్నా తీసుకోండి" అనేసింది సుమిత్ర.
    నారాయణమూర్తి కళ్ళల్లో కూడా అదే భావం కనిపించింది.
    అరుంధతి మొహమాటంగానే సాసర్ అందుకుంది. అందుకునేతప్పుడు అతని వేళ్ళు తగలగానే కలిగిన ప్రకంపనలకి ఆమె శరీరం సన్నగా వణికింది. అరుంధతి మొదటిసారిగా కాఫీ తాగింది.
    మంజీర ఎక్సైట్ అయిపోతూ, "గ్రానీ, గ్రాండ్ పా చెప్తే ఏదైనా వింటావన్నమాట!" అంది.
    అరుంధతికి తగని సగ్గనిపించింది. అందరూ నవ్వేసారు.
    ఆమె మాన్సులో అంతర్యుద్ధం సాగుతోంది. "ఛీ, ఛీ ఇదేమిటీ అతను అడగగానే తను ఒప్పేసుకోవడం? తనకి ఏమయిందీ వేళ? ఎందుకీ తబ్బిబూ, సంతోషం?
    'లూ' మాత్రం మంచి ఉషారుగా కబుర్లు చెప్తున్నాడు.
    "అరూ సంగతి మీకేం తెలుసు? చిన్నప్పుడు నన్ను ఎన్ని గుంజీలు తీయించేదో? దాగుడు మూతలూ, చింతపిక్కలూ, వామనగుంటలూ, ఏది ఆడినా తనే గెలిచేది. లేకపోతే ఆరునొక్క రాగం మొదలుపెట్టేసేది. మీ మావయ్య ఇంతలేసి మీసాలతో పౌరాణిక నాటకాలలో హిరణ్యకశిపుడి 'టైపు'లో వచ్చి నన్ను బాదేసేవాడు."

 Previous Page Next Page