Previous Page Next Page 
ప్రియతమా! ఓ ప్రియతమా పేజి 16


    అరుంధతి పెదవుల పైకి కూడా పలుచగా నవ్వుపాకి, "నువ్వేం తక్కువ వాడివా? అన్నింటిలో దొంగ ఆటేగా! చిన్నదాన్ని చేసి మోసం చేసేవాడివి" అంది.
    మేనత్త అలా స్వచ్చంగా నవ్వుతూ, తెచ్చి పెట్టుకున్న ఆరిందాతనం వదిలేసి, ఆనందంగా మాట్లాడడం, నారాయణమూర్తి అబ్బురంగా చూస్తున్నాడు.
    మంజీర మంచి ఉత్సాహంగా వీళ్ళ కబుర్లలో పాలు పంచుకుంటోంది.
    సుమిత్ర లేచి వంట ప్రయత్నం చెయ్యడానికి వంటింట్లోకి వెళ్ళగానే, అరుంధతి మనసు ఆగలేదు. తను కూడా లేచి వంటింట్లోకి నడిచింది.
    "వంకాయలున్నాయిగా! బావకి గుత్తి వంకాయకూర ఇష్టం. నేను చేస్తాను" అంది.
    సుమిత్ర తప్పినదల్లా మంచి మాట అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది.


                                              *    *    *    *


    "అరూ! ఒక్క మాట చెప్తాను. ఏమీ అనుకోవుగా" అడిగాడు 'లూ'
    "చెప్పు బావా! నీకంటే నాకు ఎక్కువ ఎవరూ?" అలా అనేటప్పుడు అరుంధతి గొంతు వణికింది. దుఃఖం ముంచుకొచ్చింది.
    డాబా మీద పేము కుర్చీల్లో కూర్చున్నారు అరుంధతీ, లూ.
    "నీకోసం నేను తెచ్చిన చీరలు కట్టుకోవా?"
    అరుంధతి ఏం మాట్లాడలేకపోయింది. రంగు రంగుల చీరలు ఆమె కళ్ళల్లో కదలాడి, నీటి తెరని మాత్రం మిగిల్చి అవి తప్పుకున్నాయి.
    "ఏం మాట్లాడవు?"
    "నేను అలాంటి చీరలు కట్టుకోను బావా!"
    "అదే ఎందుకు కట్టుకోవూ? ఈ తెల్ల పంచెలేమిటీ? చాదస్తం కాకపోతేనూ. నాకంటే బాగా చిన్నదానివి, ఏదో వయసు ముంచుకుపోయి, సన్యాసం తీసుకున్నవాళ్ళలా ఏమిటీ వేషం?" అన్నాడు 'లూ' కటువుగా.
    చల్లని గాలి తగిలో లేక అతని మాటలు వాడికో ఆమె చిగురుటాకులా కంపించింది.
    "నిన్నిలా చూడలేను. నువ్వు నా మాట వినేటట్లయితేనే నేనిక్కడ ఉంటాను" చెప్పాడు.
    అతని గొంతులో తీక్షణత ఆమె గమనించింది.
    కాదంటే నిజంగానే వెళ్ళిపోతాడేమో! ఔనంటే అందరూ ఏమనుకుంటారో? ఆమెలో సంఘర్షణ మొదలయింది.
    అతను మంద్రమైన స్వరంతో సున్నితంగా చెప్పసాగాడు.
    "నువ్వు సాంప్రదాయ బద్ధంగా అనుకునే ఈ వేషంలో నిండుతనం లేదు. ఏ కొంటె వెధవో నిన్ను రోడ్డు మీద ఏదైనా అంటే నువ్వు బాధపడతావు. అర్థనగ్నంగా, అశ్లీలంగా వయసులో ఉన్న స్త్రీలు ఉండాలని ఏ దేవుడు 'రూల్' పెట్టడూ? చక్కని చీర, రవికా ధరించు. ఎంత గౌరవప్రదంగా ఉంటావో తెలుసా?"
    అరుంధతికి గుర్తొచ్చింది. మొన్న గుడికి వెళ్తూంటే, 'అరే సిటీ పోలీస్' అన్న ఓ కుర్ర వెధవ పిలుపు. చప్పున కళ్ళల్లో నీళ్ళూరాయి.
    "నారాయణ నిన్ను తల్లిలా మన్నిస్తాడు. అతను నీతో చెప్పలేదు. అలాంటి మాటలు నేను నీకంటే పెద్దవాడిని కాబట్టి చెప్తున్నాను" అతని కంఠంలో ఆప్యాయతతో కూడిన శాసింపు ధ్వనించింది.
    "నన్ను చూడు! ఎలా ఉన్నానో? నీకంటే చిన్నవాడిగా లేనూ!"
    అరుంధతికి నిజమే అనిపించింది. టీ షర్ట్ వేసుకుని, నల్లని ఒత్తైన క్రాఫ్ తో, ఉత్సాహంగా ఉన్న అతన్ని పెళ్ళికొడుకంటే నమ్ముతారు. యాభయ్ పైబడ్డ వాడంటే ఎవరూ నమ్మరు.
    "నా మనసుని యవ్వనంగానే ఉంచేస్తాను. నెత్తి మీద వెంట్రుకలు నెరిసినా కూడా. మన ఆలోచనలూ, భావాలూ ముసలివైపోనఖ్కరలేదు!" అన్నాడు.
    అతని మాటలు వింటూ ఆమె ఈ లోకాన్నే మరిచిపోయింది. అవి ఎంత కర్ణాపేయంగా ఉన్నాయి.
    "ఏవిటలా మూగగా కూర్చున్నావూ? చిన్నప్పటి అరూలా మారిపో! గలగలా మాట్లాడు. ఏదీ ఆ 'కోతి బావకు పెళ్ళంటా' పాట పాడు!" అన్నాడు.
    అరుంధతి నవ్వేసింది.
    అతను కళ్ళు మూసుకుని, వెనక్కివాలి, "ఊ... పాడు" అన్నాడు.
    అరుంధతి అప్రయత్నంగా నోరు తెరిచి పాట మొదలుపెట్టింది. పాట పూర్తయ్యాక ఆమెకే ఆశ్చర్యం వేసింది. "ఇదేమిటి ఇలా చిన్నపిల్లలా ప్రవర్తించేస్తోంది? అతను పాడమంటే మాత్రం పాడడమేనా? ఎవరైనా వింటే ఏమనుకుంటారూ?"
    'లూ' ముందుకి వంగి, అరుంధతి చెయ్యి అందుకుని, "తిరిగి మళ్ళీ ఇలా దగ్గరగా గడుపుతామని అనుకోలేదు అరూ!" అన్నాడు.
    అతని చేతిలో తన చెయ్యి ఇమిడి ఉందనే విషయం అరుంధతికి కూడా అసహజంగా అనిపించలేదు.
    "నువ్వు ఇలా, ఇన్నేళ్ళ తరువాత కూడా నన్ను ఇంతగా గుర్తుంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది బావా!" అంది.
    "గుర్తుంచుకోవడమనే ప్రసక్తి, అసలు మరిచిపోతే కదా, నిన్ను నేను మరిచిపోయిన క్షణం, నన్ను నేను మరిచిపోయినట్లే" అన్నాడు చనువుగా ఆమె నెత్తిమీద మొట్టి.
    అరుంధతి చిత్రంగా స్పందించింది. ఇన్నేళ్ళ తర్వాత వచ్చి కూడా, "రోజూ నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాగా, నువ్వేం నాకు కొత్తా?" అన్నట్లుగా ఉంది అతని ప్రవర్తన.
    "అరూ... అటు చూడు!" లూ నవ్వుతూ ఆమెకి ఎదిరింటి కిటికీ వైపు చూపించాడు.
    అరుంధతి అటు చూసింది.
    ఎదురింటి కమలమ్మ ఒడిలో పడుకుని, ఆమె భర్త గారాలు పోతున్నాడు.
    అరుంధతి సిగ్గుగా కళ్ళు తిప్పేసుకుంది!
    "అదేమిటి అలా చూపిస్తాడు? మరీ చిన్నపిల్లాడిలా" అని ముద్దుగా విసుక్కుంది.
    "వాళ్ళకీ బహుశా మన వయసే ఉంటుంది కదూ!"
    ఆమె ఔనూ కాదూల మధ్య తల ఆడించింది.
    "అదే జీవితం అంటే, చూడు! చిన్న చిన్న సంతోషాలు వారిని ఎలా నిత్య యవ్వనవంతులుగా ఉంచుతున్నాయో! ఎంత ఆనందంగా ఉన్నారో! ఒకరి సాహచర్యం ఒకళ్ళు ఎంత ఇష్టపడ్తున్నారో వారి మొహాల్లో వెలుగు చెప్తోంది. అదీ ప్రేమంటే! దానికి వయసు అడ్డం రాదు" అన్నాడు.
    అరుంధతి సిగ్గుపడకుండా ఈసారి ఎదురింటి కిటికీ వైపు దృష్టి సారించింది.
    "అది కామం కానఖ్కరలేదు. ఒకరి మీద ఒకరికున్న అనురాగం అలాంటి చర్యల ద్వారా తెలియజేసుకోవచ్చు."
    "నిజమే! ఎంత ఆనందంగా ఉన్నారూ?" దృశ్యం చాలా అపురూపంగా అనిపించింది.
    నిన్న ఇదే వేళకి అరుంధతి ఇదే దృశ్యం చూసి చీధరించుకుంది!
    చూసిన కళ్ళు అవే! దృశ్యాలు కూడా పెద్ద మార్పు లేదు. కానీ, నిన్నటి అరుంధతి వంటరిది! ఈ వేళ అరుంధతి పక్కన ఒక తోడు! చూసిన దృశ్యాన్ని చక్కగా విశ్లేషించే తోడు ఉండడమే, ఆమెకి ఆ దృశ్యం మనోహరంగా కనిపించడానికి కారణం.
    "ఏమిటి అంతగా చూస్తున్నావు? వాళ్ళకి దిష్టి తగిలేను. పద, క్రిందికి వెళ్దాం" అంటూ ఆమె భుజాల మీదుగా తను తెచ్చిన శాలువా కప్పాడు.
    అరుంధతి మేను పులకించింది. అతని స్పర్శవల్ల కాదు! అతని మాటల్లో, చేతల్లో ప్రదర్శిస్తున్న దగ్గరతనం వల్ల!


                                                      *    *    *    *

 Previous Page Next Page