అభినవ్ ఆమె ఫోన్ నెంబర్ అడిగి తీసుకుని, 'నేవస్తా! నువ్వు జాగ్రత్త. మినిమమ్ రెండు వారాలు కాలేజ్ మానెయ్యాల్సి ఉంటుందేమో! ఐయామ్ సారీ!" అతని కంఠంలో సిన్సియారిటీ ధ్వనించింది. పెదవుల మీద చిరునవ్వు చెరగని అభినవ్ బాధగా మొహంపెట్టి గంభీరంగా మాట్లాడాడు.
అతను వెళ్ళిపోయాక కూడా మంజీరా అతని గురించే ఆలోచిస్తూ పడుకుంది. తను చేసిన పనికి అతనికి కోపం రాలేదా? అవునూ! అసలా ఆపరేషన్ హడావుడీ అంతా అనవసరం కదా! మరి తనకి ఎందుకు అతని మీద కోపం రావడం లేదూ?
మంజీరకి అప్పుడు తెలీదు. తను దారుణంగా ప్రేమలో పడిపోతున్నానని. ఎవరిమీదన్నా ఇష్టం ఏర్పడుతున్నప్పుడు వారి తప్పులు వైపు దృష్టి సారించము.
అభినవ్ వెళ్ళిపోతున్నప్పుడు మంజీరకి, "అప్పుడే ఎందుకు వెళ్ళిపోవడం? ఇంకాసేపు ఉండచ్చు కదా!" అనుకుంది. ఆమెకి ఆ క్షణంలో కాలేజీలో రేగింగ్, తను అతన్ని ఏడిపించడానికి చేసిన ప్రయత్నం ఏవీ గుర్తుకురాలేదు.
అభినవ్ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే వుంది. ఆమెని వదిలి రావాలని లేదు. కానీ అతనికి తన పరిధి తెలుసు! తల్లి గుర్తొచ్చింది. నేను మాట తప్పానా? అని తన్ను తాను ప్రశ్నించుకున్నాడు. అతను తప్పు చేసినట్లు అంతరాత్మ ఒప్పుకోలేదు. 'ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే సహాయం చెయ్యబోతారు. అక్కడ ఆమె యాగీ చెయ్యడం... డాక్టరు గారూ... ఆపరేషన్ హడావుడీ... నా పూచీలేదు' అనుకున్నాడు.
అతను ముందుగా మంజీర స్నేహితురాలికి ఫోన్ చేసాడు. "మంజీరకి కాస్త మతి చలించింది. ఎందుకో ఇంటికి వెళ్ళనంటోంది. శృతీ నర్సింగ్ హోమ్ లో ఉంది. మీరు అందరూ వచ్చి తీసుకెళ్ళండి" అంటూ.
అతనికి తెలుసు, ఆమె ఒక్కత్తే రాదు. మిగిలినవాళ్ళకి ఈ వార్త చేరవేసి అందర్నీ కూడగట్టుకుని వస్తుంది. ఈ వార్త కాలేజ్ మొత్తం వ్యాపించడానికి ఎక్కువ సమయం పట్టదు.
అతను సన్నగా, "దీవానా హుహ బాదల్" అని 'హమ్' చేసుకుంటూ తన ఇంటివైపు అడుగులు వెయ్యసాగాడు.
కడుపులో ఆకలిగా అనిపించింది మంజీరకి. అంతలోనే భయమేసింది... "అమ్మో! ఏమీ తినకూడదేమో, ఆపరేషన్ అయి ఇంకా రెండు గంటలన్నా కాలేదుగా" అనుకుంది. నర్స్ కోసం ఎదురు చూస్తుండగా.
"మంజూ!" అన్న గొంతులు వినిపించాయి.
తల తిప్పి చూసింది. స్నేహబృందం లోపలికి వస్తోంది. "అదేమిటే? నువ్వు ఇక్కడే ఉండిపోయావా? ఇంటికి వెళ్ళలేదా?" అని కుతూహలంగా అడుగుతున్నారు.
వీళ్ళ మాటలకి సమాధానం చెప్పే ఓపిక లేనట్లు, తల విదిలించి, కడుపు వైపు వేలు పెట్టి చూపించింది. ఆమెకి అతని మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. "కడుపంతా పచ్చిపుండులా ఉండి ఉంటుంది" మళ్ళీ అదే ఫీలింగ్!
"ఏమైందీ?" వాళ్ళు అడుగుతున్నారు ఆరాగా.
"ఎపైండిసైటిస్ ఆపరేషన్" నీరసంగా చెప్పింది.
"ఆ!!!" అందరూ ఆశ్చర్యబోయారు.
ఇంతలో నర్స్ లోపలికి వస్తూ, "మీరు అందరూ మళ్ళీ ఇక్కడ ఏం డ్రామా చేస్తున్నారూ? డాక్టర్ గారికి కోపం వస్తుంది, వెళ్ళిపోండి" అంది కోపంగా.
"అదేవిటి అలా కసురుకుంటారూ... మా ఫ్రెండ్ కి ఆపరేషన్ జరిగితే...." అంటున్న అమ్మాయిని ఎగాదిగా చూసి,
"ఏం ఆపరేషన్? ఈసారి ఎవర్ని ఫూల్ చేద్దామనీ? ఆ అబ్బాయి ఈ అమ్మాయిని కార్లోంచి తీసుకొస్తూ ఉండగా, కారు డోర్ కడుపు దగ్గర తగిలి, కాస్త బ్లడ్ 'క్లాట్' అయిందని 'డ్రెస్సింగ్' చేసాను అంతే! దానికే ఇంత హడావుడా?" అంటూ పకపకా నవ్వడం మొదలుపెట్టి, అది చాలదు అన్నట్లు వార్డు బోయ్ నీ మరో సిస్టర్ ని పిలిచి ఈ విషయం చెప్పింది. వాళ్ళు కూడా నవ్వసాగారు.
ఈసారి స్నేహితులందరూ మంజీరని అదో రకమైన 'ఎక్స్ ప్రెషన్'తో చూసారు.
"మంజూ ఆర్ యూ ఆల్ రైట్?" అడిగింది అభినవ్ ఫోన్ చేసిన అమ్మాయి.
మంజీరకి తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది.
"డాక్టర్ గారు ఎక్కడ? ఆయనే కదా ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పారు. ఆయన్ని ఓసారి పిలవండి!" అంది అతి కష్టం మీద.
"ఈ రోజు కేసులు ఏమీ లేవని, ఆయన ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయారు. మీరు కూడా ఆ బేండేజ్ విప్పి పారేసి, ఇంటికి వెళ్తే సంతోషిస్తాం!" వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చెప్పింది నర్స్.
మంజీరకి ఇదంతా నమ్మశక్యంగా లేదు. ఆపరేషన్ అబద్ధమా? మరి తనకి ఎందుకింత 'అనీజీ'గా వుందీ? బహుశా, అభినవ్ మాటల వల్ల తను ఆపరేషన్ జరిగిపోయిందని మానసికంగా సంసిద్ధమయిపోయినందుకేనేమో, లేస్తుంటే ఒళ్ళు తూలింది.
నెమ్మదిగా షార్ట్ ఎత్తి కట్టు విప్పి పారేసింది.
ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. లోకం అంతా తనని 'ఫూల్' అని వేలెత్తి చూపుతున్నట్లుగా అనిపించింది. ఆ నిమిషంలో అభినవ్ పీక నులిపెయ్యాలన్నంత కసి కలిగింది. "ఈసారి నీ అంతు తేలుస్తా" అనుకుంది మనసులో.
తల వంచుకుని బైటికి నడిచింది స్నేహితురాళ్ళతో కలిసి.
* * * *
ఒక్కొక్కసారి మన మనసే మన మాట వినని పరిస్థితి వస్తుంది. బలవంతంగా నా పీక నొక్కే హక్కు నీకు ఎవరిచ్చారు? నన్ను సుఖంగా ఉండనీయకపోతే నీ అస్తిత్వానికి అర్థం ఏమిటి? అని నిలదీస్తుంది.
పువ్వులలో మకరందం మధుపం గ్రహించినట్లే, స్త్రీలలోని సౌకుమార్యం, సౌశీల్యం పురుషుడి కళ్ళు ఇట్టే పట్టేస్తాయి. ఎదుటివాళ్ళు మన సమక్షం ఇష్టపడుతున్నారా లేదా అని తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు! పరీక్షగా చూస్తే కనుపాపల మధ్య చిన్న వెలుగు వీరి ఇష్టాన్ని ఇట్టే పట్టిచ్చేస్తుంది. ఎంత నిరాసక్తతా, నిర్లక్ష్యం పైకి అభినయించినా ఆ కళ్ళల్లో వెలుగుని దాచలేదు!
పైకి ఎంతో అహంభావిగా, పెంకిగా కనిపించే మంజీరలోకి అమాయకత్వాన్నీ, అనురాగాన్నీ అభినవ్ కళ్ళు ఇట్టే పట్టేసాయి. తను వచ్చేటప్పుడు ఆమె చూసిన చూపు చాలు! ఆమె ప్రేమని కనుగొనడానికి. ఆ కళ్ళల్లో కనపడిన విన్నపం అతనికి అర్థం అయింది. కానీ, ఆ అభ్యర్ధన పెదవి దాటి రావడానికి అభిమానం అడ్డుపడింది.
ఈ అభిమానాలూ, అహాలూ ఎన్ని అందమైన అనుభూతుల్ని అణచివేస్తాయో కదా!
"చలిగా లేదూ! లోపలికి వచ్చెయి" అంది జానకి తలుపు దగ్గరకి వస్తూ.
అతనికి కదలాలనిపించలేదు. "అమ్మకు ఈ విషయం తెలిస్తే?" అనుకున్నాడు. అంతలోనే వద్దు అతిగా భయపడుతుంది, చెప్పకపోవడమే మంచిది అనుకున్నాడు.
అభినవ్ కి నిన్నటిదాకా తల్లి దగ్గర అరమరికలు లేవు. కానీ, ఇప్పుడే ఓ 'అర' ఏర్పడి, అందులో మంజీరకి సంబంధించిన జ్ఞాపకాలు పేర్చబడుతున్నాయి.
ఆమె సాన్నిధ్యం తల్లిని సైతం పరాయిగా చూపిస్తోందంటే, ఎంత బలమయినదో అర్థం చేసుకోవచ్చు! దానికి 'అమ్మ బాధ పడ్తుందీ' అనే ముసుగు వేస్తున్నాడు అభినవ్. ప్రేమ ఎటువంటి వాళ్ళనైనా నిస్సహాయులనీ, బలహీనులనీ చేసి ఒక ఆట ఆడించకల 'శక్తి'.
* * * *
అరుంధతికి ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. ఏదో తెలియని ఉద్వేగం ఆమెని ఓ చోట నిలువనియ్యడం లేదు. అర్థరాత్రి డాబా మీద పచార్లు చేసింది. అంతలోనే, ఎవరైనా చూసి 'ఇదేమిటీ' అంటారేమోనని చటుక్కున మెట్లు దిగిపోసాగింది.