Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 14

    "అరె! ఇటెటు వెళుతున్నారూ?" అంది వేరే తోవలో వెడుతూన్న గోవిందుని చూసి?
    "కాస్సేపు ఆఫీసర్సు క్లబ్బు కెళదాం."
    "ఇప్పుడా? ఇప్పుడెవ  రుంటారు? సాయంత్రం అయితే నలుగురూ వుంటారు ప్రెండ్సంతా."
    "ఎవరూ వుండకపోతేనేం? మనం వుందాం."
    "సరే " అంది నవ్వుతూ సుమతి.
    కారు పోర్టికోలో ఆగింది. డోర్ తెరచి సుమతి చెయ్యి అందుకుని దింపాడు గోవిందు. కారుకి తాళంవేసి లోపలికి నడిచారు.
    సాధారణంగా సాయంత్రాలు క్రిక్కిరిసి వుండే ఆక్లబ్బు అక్కడా, అక్కడా, ఇద్దరు ముగ్గురు మనుష్యులతో నిర్మానుషంగా వున్నట్టనిపించింది. ఒక మూలగావున్న టేబుల్ దగ్గిర గోవిందూ, సుమతీ కూర్చున్నారు.
    "ఏం కావాలి సార్?" అడిగాడు బేరర్.
    "ఏం తీసుకుంటావ్ సుమ్మీ! కాఫీ.....కూల్ డ్రింక్."
    "కూల్ డ్రింక్, ఫాంటా."
    "ఒక ఫాంటా.....ఒక లార్జి ఆరిస్ట్రోకాట్ విస్కీ."
    గోవింద్ వైపు ఆశ్చర్యంగా చూసింది సుమతి.
    "విస్కీయా!...."
    "అవును"
    "ఇదెప్పుడు మొదలెట్టారు?"
    "ఎప్పుడో అప్పుడు మొదలెట్టాలిగా."
    "ఏం అవసరమా?"
    "అవును."
    "ఎందుకని?"
    "ఒంటరితనాన్ని పోగొట్టి తోడుగా వుండడానికి."
    "ఒంటరితనం అంత కష్టంగా వుందా?" కటువుగా వుంది సుమతి గొంతు.
    "అవును భరించ శక్యంకాకుండా వుంది."
    "కోరుకుని, కోరుకుని వెళ్ళారే" ఈసారి ఆమె కంఠంలో హేళన ధ్వనించింది.
    "దిగితేకానీ లోతు తెలీదు."
    "దిగి లోతు తెలుసుకోవాలంటే మునిగిపోయే అవకాశం కూడా వుంది."
    "నిజమే."
    "అలాంటప్పుడు దిగాలనుకోవడం తెలివితక్కువ తనం."
    "అదీ నిజమే.....కానీ....."
    "కానీ  ఏమిటండీ! ప్రతీది కోరి తెచ్చుకోవడం, ఆ తరవాత ఖర్మ అని బాధ పడడం. ఇదేగా మీరుచేసే ప్రతీది." సుమతి గొంతు కోపంతో జీరబోయింది. ఈ లోపల బేరర్  రెండు గ్లాసులూ పట్టు కొచ్చాడు. సోడాసీసాలు ప్రక్కన పెట్టాడు సోడాగ్లాసులూ పోస్తూ "ఊఁ తీసుకో" అన్నాడు సుమతి చేతికి ఫాంటా గ్లాసు నందిస్తూ సుమతి గ్లాసు నందుకోకుండా కూచుంది.
    ఊఁ..... తీసుకో."
    అంతలో ఎవరో అటుకేసీ వెడుతూ తమనే చూడండం గ్రహించిన సుమతి గోవింద్ చేతిలోని గ్లాసు నందుకుంది.
    "చియర్స్" అంటూ విస్కీ సిప్ చేశాడు గోవింద్ సుమతిని చూసి, చిన్నగా నవ్వుతూ.
    సుమతికి ఒళ్ళు మండుతోంది మౌనంగా కూల్ డ్రింక్ తాగుతూ కూర్చుంది.
    ఒకటి, రెండు, మూడు, నాలుగు గ్లాసులయింది. గడియారం రెండుకొట్టింది. గోవింద్ కదలడంలేదు.
    "పోదాం," అన్నప్పుడల్లా "ఒక్కఅరగంట" అంటూ ఆపుతున్నాడు. "చింటూ ఏడుస్తున్నాడేమో అంటే," "అమ్మవుంది ఆయమ్మవుంది. ఏం ఫరావాలేదులే, అంటున్నాడు. అతను అంత ఆనందంగా తాగే వైనం చూస్తూవుంటే సుమతికి అతనిలోని మార్పుకి ఆశ్చర్యం, కోపం కూడా కలుగుతున్నాయి. లేచి వెళ్ళిపోదామా అంటే డ్రైవరులేడు. పైగా అందరూ వున్నారు. సభ్యత కాదని ఊరుకుంది.
    మరో గ్లాసు పుచ్చుకున్నాక "పద మైడియర్" అంటూ లేచాడు గోవింద్. అతని కళ్ళు ఎఱ్ఱగా  వున్నాయి. జేబులోంచి సిగరెట్టు పాకెట్టుతీసి అంటించి, కారువైపు నడిచాడు సుమతి భుజాలపై చేతులు వేసి పట్టుకుని. ఆ క్షణంలో సుమతికి తన  భుజంమీంచి అతని చేతులు తీసేసి  దూరంగా  పోవాలనిపించింది. కానీ అతను తూలిపోకుండా ఆసరాకోసం అలా పట్టుకున్నాడేమోనన్న ఆలోచన కలిగేసరికి కిక్కురుమనకుండా వెంటనడిచింది. మెల్లగా కారుడోరు తెరిచి 'స్టార్ట్' చేశాడు గోవింద్.
    "ఈ  వేషంలో ఇంటికెళితే అత్తయ్యా. మామయ్యా. ఏమనుకుంటారు?" కోపంతో అడిగింది సుమతి.

    "ఏమనుకుంటారు? ఏమిటా చచ్చుప్రశ్న? అంతమాత్రం తెలీదూ? తాగాననుకుంటారు." పెద్దగా నవ్వుతూ సమాధానం చెప్పాడు గోవింద్. ఇప్పుడతనితో ఏం మాట్లాడినా లాభం లేదని ఊరుకుంది సుమతి.
    ఇంట్లో అందరూ భోజనాలకెదురు చూస్తూ కూర్చున్నారు. విశాఖ క్లబ్బులో పేకాట పూర్తిచేసుకుని, నరసింహారావుగారు కూడా వచ్చేశారు. గబగబా బట్టలు మార్చుకువచ్చి భోజనానికి కూర్చున్నాడు గోవింద్.
    సుమతి కసలు భోంచెయ్యాలని లేదు. ఏదో అల్లరిపడడం ఇష్టంలేక వచ్చి కూర్చుంది.
    'ఇద్దరి మధ్యా ఏమైనా ఘర్షణ జరిగిందేమో' ననుకుని ఆమాటే మెల్లగా సుమతి నడిగింది కామాక్షమ్మగారు.
    "అబ్బే ఏంలేదు" అంది మనసులోని బాధని పైకి కనబడనీయకుండా సుమతి.
    నరసింహారావుగారు మాత్రం గోవింద్ కేసి తదేకంగా చూడటం సుమతి చూసింది.
    అప్పుడే మజ్జిగలో కొచ్చిన కొడుకుని చూసి "అదేం భోజనంరా, ఏమీ  ముట్టనే లేదు. వేసినవన్నీ వేసినట్టే వున్నాయ్" అంది కామాక్షమ్మ.
    "ఆకలిగా లేదమ్మా క్లబ్బులో ఏవోతిన్నాను."
    "తిన్నావా? తాగావా?" వ్యగ్యంగా, కోపంగా వుంది నరసింహరావుగారి గొంతు.
    "ఐ....హాడ్....ప్యూ.....డింక్స్ .....డాడీ!"
    "ఓహొ.... ఇదన్నమాట ఇప్పుడు నువ్వు కొత్తగా నేర్చుకున్నది?"
    ".... .... ...."
    "త్రాగడం అలవాటు చేసుకోవడం సులభమే బాబూ! ఆ అలవాటుని మానుకోవడమే కష్టం మొదట్లో స్నేహితులతో సరదాకి మొదలవుతుంది. ఆ తరువాత అలవాటై ప్రాణం తీస్తుంది."
    "అంత అలవాటు కాలేదులెండి. ఏదో సరదాగా...."
    "అదేబాబూ! ఆ సరదాయే ముదిరిముదిరి అలవాటవుతుంది. ఆ తరువాత ఆ అలవాటుకి మనిషి బానిపై పోతాడు.బజారున పడతాడు నీకు పుణ్యముంటుంది ఈ అలవాటు చేసుకోకురా."
    "అలాగేనండి" గబగబా తినేసి లేచి చెయ్యి కడుక్కుని తన గదిలోకి వెళ్ళిపోయాడు.
    అందరూ అయిందనిపించుకుని భోజనాల మీంచి లేచారు.
    తను బట్టలు  మార్చుకుని, చింటూకి పాలుపట్టి వచ్చి చూసే సరికి, గోవింద్ గుర్రుపెట్టి నిద్దరపోతున్నాడు.
    బుఱ్ఱనిండా  ఆలోచనలు గిర్రున తిరుగుతూంటే అచేతనంగా అన్యమనస్కురాలై పడుకుంది సుమతి.
    సాయంత్రం అయిదు దాటింది. తెల్లవారు ఝాము నెప్పుడో ఇల్లు విడచిన సూర్యభగవానుడు మెల్ల మెల్లగా గూడు చేరుకుంటున్నాడు. సుబ్బలక్ష్మి కాలేజీనుంచి తిరిగోచ్చింది. గోవింద్ నిద్రలేచాడు.
    "ఏంటి బావా? ఇప్పటివరకూ పడుకున్నావా?" గేలి చేసింది సుబ్బలక్ష్మి.
    "మరేం చెయ్యమంటావ్ ? పనిలేకపోతే నిద్దరోస్తుంది."
    "బావా....సినిమాకి తీసికెళ్ళవూ?"
    "ఓకే....మీ అక్కయ్య నడుగు" అన్నాడు కాఫీ సిప్ చేస్తూ.
    "ఇవ్వాళంతా తిరగడమే అయింది. ఇంకోరోజు వెళదాం లెండి" అంది  సుమతి.
    "అక్క ఎప్పుడూ ఇంతే బావా! చింటూ లేకపోతే లైబ్రరీ .....ఈ  రెండూ తప్ప ఇంకేం అక్కర్లేదు. అందుకే నేను సినిమాలకి నా ఫ్రెండ్స్ తో పోతాను అప్పుడప్పుడు మామయ్యని లాక్కెళతాను."
    "మీ అక్కయ్య పద్నాలుగో శతాబ్దంలో పుట్టవలసింది పొరపాటున అప్పుడు మిస్సయి ఇప్పుడు పుట్టేసింది."
    ఇద్దరూ పకపకా నవ్వేశారు.
    లోపల సుమతి కొంచెం చివుక్కుమన్నా పైకి తనూ నవ్వేసింది.
    "ఏ సినిమా కెళ్ళాలో అదంతా అనుకోవడం అయిపోయింది. అందుకే సుమ్మీ! రెడీ అవు" అని  గోవింద్ అన్నప్పుడు"సరే" నని తయారయింది.
    అసలే గోవిందు అతి ఉత్సాహవంతుడు, దుడుకు స్వభావం కలవాడూనూ. సుబ్బలక్ష్మి ప్రేరేపణలో మారిపోతాడేమో నన్న భయంలేకపోలేదు సుమతికి. నిన్న మొన్నటి వరకూ పల్లెటూళ్ళో, చదువూ సంధ్యా లేకుండా, వంటినిండా సరైన బట్టలు లేకుండా, ఏదో తిని తల్లిచాటున, అన్న వదినల అదుపాజ్ఞలలో పడుండే సుబ్బలక్ష్మి ఈ రోజున అధునాతనంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ తననే పనికి దానికింద జమకట్టి మాట్లాడ్డం ఆశ్చర్యాన్నీ, అసహ్యాన్నీ కూడా కలిగించింది సుమతికి. కానీ ఏం జేస్తుంది? ఈ మాటంటే గోవిందుకూడా మామగారిలాగే తను అసూయ పడుతున్నాననుకుంటే. అందుకని నోరుమూసుకు నూరుకుంది. నరసింహారావుగారు పేకాట కెళ్ళిపోయారు. కామాక్షమ్మ రానంది. సుమతి, సుబ్బలక్ష్మి, గోవిందూ ముగ్గురూ బయలుదేరారు. సినిమా జరుగుతూన్నంత సేపూ ఒకటే కామెంట్రీ సుబ్బలక్ష్మి. సరదా అయిన సీనోస్తే పక  పకా నవ్వడం, ఏడుపు సీనోస్తే  తెగ జాలి వొలకబోయ్యడం, మధ్యమధ్య నటీనటులని విమర్శించడం, అసలు సినిమాకన్నా సుబ్బలక్ష్మిగోల ఎక్కువయిపోయింది సుమతికి. ప్రతివారూ సుబ్బలక్ష్మి కేసి తిరిగి చూస్తున్నారు. అది గమనించిన సుబ్బలక్ష్మి అంత మందినీ తను ఆకర్షిస్తున్నా ననుకుంటోందే తప్ప, వారు ఎలా ఎగ తాళి చేస్తున్నారో  గమనించడం లేదు. బహుశః రకరకాల మనుష్యులతో తిరగడం అలవాటవాడం వల్లనేమో గోవింద్ ఇవేవీ పట్టించుకుంటూన్నట్టు లేదు. సుమతికి మాత్రం ఒంటినిండా గొంగళి పురుగులు పాకుతూన్నట్టుంది ఎలాగో సినిమా చూసి ఇంటికొచ్చారు.
                            *        *        *  

 Previous Page Next Page