మరి కొందరికి అపవాదులు వినడం అంటే మహా సరదా - వాటిని మరోవ్యక్తి చెవిలో వూదే దాకా నిద్రపట్టదు. ఈ గుణం ఆడవాళ్ళలోనే ఉంటుందని చాలామంది అభిప్రాయం. కాని చాలామంది మగవాళ్ళు కూడా స్కాండెల్స్ మాట్లాడతారు. అయితే ఆడవాళ్ళలాగా ఎక్కడంటే అక్కడ మాట్లాడి చులకనకారు.
ఇరుగూ -- పొరుగూ మంచిది కావాలంటారు అందుకే. పురుషులు ఆఫీసులకు వెళతారు. ఏ రాత్రికి ఇంటికి వస్తారో? అందువల్ల వాళ్ళకు ఇరుగు -- పొరుగు వాళ్ళను పట్టించుకోవడానికి అంతగా సమయం దొరకదు. కాని భర్తలు ఆఫీసుకి వెళ్ళాక (పిల్లలు కూడా స్కూలుకూ, కాలేజీకి వెళతారు) స్త్రీలకు బోలెడంత తీరిక ఉంటుంది. నలుగురూ ఒక చోట కలిసి అయిదో ఇంటి ఆమె మీద మాట్లాడుతారు.
ఆ నలుగురిలో ఒకామె లేచి వెడితే వెంటనే ఆమెను గురించి మిగిలిన ముగ్గురూ మాట్లాడుతారు. ఆ నాలుగిళ్ళ మధ్య ఒక ఉద్యోగిని ఉంటే ఆమె పడే బాధ చెప్పనక్కరలేదు. ఆమెకు వాళ్ళను గురించి పట్టించుకునే సమయం ఉండదు.
అసలు వెనక ఇంట్లో ఎంతమంది వున్నారో, ఎదురింట్లో ఎంతమంది ఉన్నారో కూడా తెలియని వ్యక్తిని కూడా ఆ ఆడవాళ్ళు వదలరు. ఆమె ఆఫీసుకు వెళ్ళగానే ఇంట్లో వంటమనిషి నో, పనిమనిషినో పరిచయం చేసుకుంటారు.
కిటికీలో కామాక్షమ్మ (ఆమె పని ఎప్పుడూ కిటికీలో నుంచి ఎవరింటికి, ఎప్పుడు వస్తారో లేక ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నిద్ర లేస్తారో, అన్నంతింటారో, పిల్లల్ని కొడతారో చూడడమేపని) మీ ఇంటి పనిమనిషిని పిలిచి "అయ్యో! తల్లీ" వచ్చినప్పటికంటే ఎంత బక్కచిక్కిపోయావ్? నువ్వేనయం రెండు నెలల నుండి ఉన్నావ్. ఈ ఇంట్లో ఒక నెలకు పైన ఒక్క మనిషి నిలవదు" అంటూ ఆమె మనసులో నిప్పు రగిలిస్తుంది.
ఇక వాకిట్లో వనజాక్షమ్మ (ఆమె ఎప్పుడూ గడపలో నిల్చొని ఇరుగుపొరుగు వాళ్ళను గమనిస్తూ వుంటుంది) కిటికీలో కామాక్షమ్మ రగిలించిన నిప్పుకు కట్టెల్ని చేర్చి ఊదుతుంది. "నీకెంత ఇస్తుంది ఈ అమ్మగారు? అయ్యో అంతేనా? ఇంటి చాకిరి అంత చేస్తావు? బాగా కేకలు వేస్తుందనుకుంటాను" అంటూ ఏదేదో మాట్లాడుతుంది.
కర్మం జలక అదేరోజు మీరు ఏ కారణం వల్లనైనా మీ ఇంట్లో పనిమనిషిని విసుక్కున్నారే అనుకోండి -- వాళ్ళ మాటలు ఆమెకు చాలా తియ్యగా తోస్తాయి. వాళ్ళంతా తన మంచికోరే వారనే భ్రమ కలుగుతుంది. ఇంకేం మీ మీద ఉన్నవి లేనివి కల్పించి చెబుతుంది. ఆ సాయంత్రం నుంచే మిమ్మల్ని చీదరించి మాట్లాడడం ప్రారంభిస్తుంది.
మీ ఇంట్లో ఒక భాగం అద్దెకు ఇస్తారనుకోండి. కొత్తగా అద్దెకు వచ్చిన వాళ్ళతో పక్కింటి పంకజం "అయ్యే! ఈ ఇంట్లోకి వచ్చారా? ఇక్కడికి రాకుండా ఉండాల్సింది" అంటుంది అద్దెకు వచ్చిన ఇల్లాలితో. ఆ దెబ్బతో ఆమె గాభరా పడిపోతుంది.
ఆమెకు అనేక అనుమానాలు వస్తాయి. "ఇల్లు మంచిది కాదేమో. అరిష్టం జరుగుతుందేమో. ఇంటి యజమానురాలు రాక్షసేమో. ప్రతి చిన్నదానికి కల్పించుకుని పెత్తనం చలాయిస్తుందేమో." ఇలాంటి అనుమానాలతో సతమతమైపోతుంది. పాపం కొత్తగా ఇంట్లో చేరిన ఇల్లాలు కొంతకాలం ప్రాణాలు బిగపట్టుకుని భయం భయంగా ఉంటుంది. అంతా సవ్యంగానే నడుస్తుంది.
అప్పుడు పంకజం మనస్థత్వం ఆమెకు అర్థమవుతుంది. ఆమె కాస్త చదువుకున్నదీ, సంస్కారం గలదీ అయితే పంకజంతో జాగ్రత్తగా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది.
ఇలాంటి వారివల్ల ఒకోసారి చాలా అనర్థాలు జరుగుతాయి. కొందరు పెళ్ళి కావలసిన పిల్లల మీద కూడా అభాండాలు వేస్తారు. భార్యాభర్తల మధ్య తగాదాలు పెడతారు. ఇలాంటి స్త్రీలు పెల్లెటూరిలోనే ఉంటారని భావించనక్కరలేదు.
బస్తీలలో ముఖ్యంగా, కాలనీలలో చాలామంది ఉంటారు. ఇక్కడ ఒక ముఖ్యమయిన విషయం తెలుసుకోవాలి స్త్రీలు మాట్లాడే మాటలూ, వాళ్ళు వేసే అపనిందలూ కనీసం ఆ చుట్టుపట్ల ఇళ్ళవరకే పరిమితం అయి వుంటాయి.
ఇక మగవాళ్ళ సంగతికి వద్దాం. వాళ్లు ఆఫీసులకు బయలుదేరి బస్సులో కాలక్షేపం ప్రారంభిస్తారు. వెనక సీట్లో ఆడవాళ్ళు ఉన్నారనే విషయం కూడా మరిచిపోయి కొందరు అసభ్యంగా మాట్లాడతారు. ఆడది అపనింద వేస్తే ఇరుగు పొరుగు ఆడవాళ్ళ మధ్యనే ఉండిపోతుంది.
మగవాడు వేస్తే ఊరంతా పాకిపోతుంది. అతను బస్సులో మాట్లాడతాడు. ఆఫీసులో మాట్లాడుతాడు. బజార్లో కనిపించిన, తెలిసిన వాళ్ళతో మాట్లాడతాడు. చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఆడవాళ్ళను గురించి అపనిందలను ప్రచారం చేసే మగవాళ్ళు తమ సంస్కారాన్ని ఇలా బయట పెట్టుకోవడమే అవుతుంది. యిలాంటి వాళ్ళను దూరంగా ఉంచడం కంటే చెయ్యగలిగింది ఏమి వుండదు.
కాలక్షేపం లేక స్త్రీలు యిలాంటి చెత్త కబుర్లు వాగుడుకూ అలవాటుపడతారు. మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. అన్నింటికంటే మంచి వ్యాపకం పుస్తకాలు చదవడం. ఈ అలవాటు వున్న వాళ్లు తమ టైమును వ్యర్థమయిన కబుర్లతో పాడుచేసుకోరు. వయసు మళ్ళిన వాళ్ళకు చెయ్యాలే కాని మనవలూ మనవరాళ్ళతో బోలెడంత కాలక్షేపంతోపాటు పని ఉంటుంది.
గృహిణులు కుట్టు మిషన్ నేర్చుకోవచ్చును. వేన్నీళ్ళకు చన్నీళ్ళ ప్రాయంగా ఇంటి ఆదాయానికి తోడ్పడే ఏ చిన్న చిన్న పనులు (అప్పడాలు చెయ్యడము, వడియాలు పెట్టడం మొదలయినవి.) అయినా చేసుకోవచ్చు.
ఆ మధ్య నా స్నేహితురాలు వనజ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ అన్నది "నా మీద ఏవేవో పుకార్లు పుట్టిస్తున్నారు. లలిత దగ్గర కూడా ఆ రామారావు అన్నాడట. నా గురించి నీకు తెలియదా? పెళ్ళి కానంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమేనా?" లలిత ఆవేశం చూస్తే నాకు జాలి వేసింది.
"నీ గురించి నీకు తెలుసు. నీ దగ్గర వాళ్ళకు తెలుసు. ఎవరో ఏదో వాగారని ఎందుకు బాధపడతారు? నువ్వెంత జాగ్రత్తవున్నా ఎవరో ఒకరు ఏదో ఒక పుకారు లేవదీస్తారు. ఇలాంటి మనస్తత్వం గల వారు ఎప్పుడూ అన్నిచోట్ల ఉంటూనే ఉంటారు." అన్నాను.
ఇలాంటి అపవాదుల్ని విని ఆనందించి, మరొకరికి మోసే వాళ్లు, అపవాదులు వేసే వాళ్ళకంటే మంచివాళ్ళు అనుకోవడం పొరపాటు.
మనిషిగా జన్మించినందుకు ఎంతమంది మంచిగా బ్రతకాలని కోరుకుంటారు.
ఎవరి ఏడుపు వాళ్ళదే
"ఏమిటోయ్! అలా తప్పించుకొని పారిపోతున్నావ్?" లీల బస్ స్టాండులో అడ్డంవచ్చి చెయ్యి పట్టుకుంది.
"నువ్వా! అరే, చూడలేదు. ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారని పక్క స్టాపుకు వెళ్తున్నాను. నువ్వూ రా! మాట్లాడుకుంటూ నడుద్దాం!" అన్నాను.
"అంతదూరం నడవలేను బాబూ! పెద్దగా జనంలేరు. ఇక్కడే నిల్చుందాం!" అన్నది లీల. నా కళ్ళు దూరంగా నిల్చున్న వసంత వైపు తిరిగాయి. ఏది జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది. వసంత నన్ను చూడనే చూసింది. ఆమె అంటే నాకు భయం. ఆమెతో మాట్లాడిన రోజు నాకు తలనొప్పి వస్తుంది. సారిడాన్ వేసుకొంటేగాని రిలీఫ్ రాదు. చూడగానే కష్టాల లిస్టు చదవడం ప్రారంభిస్తుంది.
"మా ఆయనకు ఈ మధ్య బొత్తిగా ఒంట్లో బాగుండటం లేదు. రోజూ బత్తాయ్ కాయలు కొనుక్కొని వెళ్ళాలి. పిల్లలు చూడకుండా ఆయనకు పెట్టాలి నా జీతం అన్ని కట్సూ పోగా వంద కూడా పూర్తిగా రావడం లేదు. డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంది. పెద్ద పిల్లవాడు ఇంట్లో నుంచి పారిపోయాడు.
మా అమ్మగారికి ఆపరేషన్ అయిందట. ఉత్తరం వచ్చింది వెళ్దామంటే మా ఆయనకు ఆరోగ్యం సరిగాలేదు. మా అన్నయ్య కూతురు పరీక్ష తప్పిందట. "మా పెద్దనాన్నగారి అబ్బాయికి మతిస్థిమితం లేదని తెలిసింది." ఇలా మాట్లాడుతూనే పోతుంది.
ఒకసారి నా దగ్గిర డబ్బు అప్పు తీసుకుంది. కొంతకాలం అది అడుగుతాననే భయంకొద్దీ నన్ను చూడనట్టూ, నేను ఎవరో తెలియనట్టూ బస్ స్టాండులో దూరంగా నిల్చునేది. నాకు డబ్బు పోతే పోయింది. ప్రాణం కుదుటపడింది అనిపించింది. ఇప్పుడు తనకు అప్పు ఇచ్చిన సంగతి మరిచిపోయానని ఆమెకు బాగా నమ్మకం కలిగి ఉంటుంది.
మళ్ళీ ప్రాణం తోడటం ప్రారంభించింది అందుకే ఆమె బస్ స్టాపులో ఉంటే, నేనే తప్పించుకొని పారిపోతున్నాను.
"నమస్కారమండీ! బాగున్నారా?"
"నమస్కారం! బాగానే ఉన్నాను."
"మీరు ఎలా ఉన్నారూ?" అని మర్యాదకు కూడా నేను అడగలేదు.
అలా అడిగితే కుషాల పంచాంగం విప్పుతుందని నాకు తెలుసు. ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నది. నేను వెళ్తున్న ఆటో ఆపి ఎక్కేశాను. లీల కూడా నా పక్కన వచ్చి కూర్చుంది. లీల గూడా బేగంపేటలోనే ఉంటుంది. వసంత గబగబ దగ్గిరకు వచ్చింది. వసంత ఎర్ర మంజిల్ లో ఉంటూంది. నేను ఆటోను "ఛలో!" అన్నాను.
"పాపం తనను కూడా ఎక్కించుకొని ఎర్రమంజిల్ లో దింపేస్తే బాగుండేది" అన్నది లీల. నాకు ఒళ్ళు మండిపోయింది ఆటో ఆపి ఆమెను కూడా దిగుమని చెప్పాలనిపించింది.
"వసంత పెద్దకూతురు సంగతి తెలుసుగా!"