Previous Page Next Page 
ప్రియతమా! ఓ ప్రియతమా పేజి 13


    "మరీ ఇంత పిరికితనమా!" ఆమె కవ్వించింది.
    అతడు కళ్ళు తెరిచి, "ఆ!" అన్నాడు.
    "పిరికితనం కాకపోతే ఏమిటీ? నా అందం చూసి ఎక్కడ చలిస్తానో అన్నట్లు, కళ్ళు మూసుకుని దొంగజపం!" అనేసి కిలకిలా నవ్వింది.
    అభినవ్ మొహం ఎర్రబడింది!
    "మీరు అందంగా ఉన్నారని అనుకుంటున్నారా?" అడిగాడు.
    "ఏమిటీ? మళ్ళీ అనండి" ఆశ్చర్యంగా అడిగింది మంజీర.
    "చూడగానే 'బావుంది' అనిపించడం ఆకర్షణ. చూస్తున్న కొద్దీ పెరిగి, వారిమీద 'ఇంట్రెస్ట్' కలిగితేనే అది అందం అని నా అభిప్రాయం. సృష్టిలో ప్రేమికులందరూ అందమయిన వాళ్ళే అయి ఉండరు. ఒకరి మీద ఒకరికి ఎందుకు ఇష్టం కలుగుతుందో, ఎందులో అందం కనిపిస్తుందో వాళ్ళకే తెలుస్తుంది. మా ఇంటి ఎదురుగా ఉండే ఎత్తు పళ్ళ సుబ్బారావుగారూ, మెల్లకన్ను సుబ్బలక్ష్మిగార్లదీ ప్రేమ వివాహమే! పెద్దల్ని ఎదిరించి మరీ చేసుకున్నార్ట. ఇప్పటికీ ఒకరి మీద ఒకరికి తగని ప్రేమానురాగాలు! ఇద్దరూ అందంగానే ఉంటారు. వారి కళ్ళతో మనం చూడకలిగితే..." చెప్పాడు, మీసాల చాటున సన్నని చిరునవ్వు దాస్తూ.
    మంజీరకి ఒళ్ళు మండిపోయింది. "ఇరవైలో అరవై' గాడు అనుకుంది కసిగా. మాట్లాడకుండా సీరియస్ గా డ్రైవ్ చెయ్యసాగింది.
    అభినవ్ కూడా మౌనంగా బైటికి చూస్తూ కూర్చున్నాడు.
    కాసేపటికి చిన్న జర్క్ తో కారు ఆగిపోయింది!
    అతను తల తిప్పి చూసేసరికి మంజీర 'స్టీరింగ్' మీద తల పెట్టి, కడుపు చేత్తో అదుముకుంటూ, 'అమ్మా, అమ్మా!' అంటోంది బాధతో పెదవులు బిగబడ్తూ.
    అతనికి ఏమైందో అర్థం కాలేదు... "మంజీరా! ఏమైంది?" అంటూ ఆమె భుజం పట్టి కుదిపాడు.
    ఆమె తల ఎత్తి చూసింది, "నేను ఈ నొప్పి.. భరించలేకపోతున్నాను... చచ్చిపోతానేమో!" అంది కడుపు నులిమేసుకుంటూ. ఆమె చెంపల మీద నుండి ధారగా కన్నీరు కారిపోతోంది. "అబ్బా!" అంది ముందుకి వంగిపోతూ.
    అభినవ్ ఇంక ఆలస్యం చెయ్యలేదు. గబుక్కున క్రిందికి దిగి, ఆమెని కూడా దించాడు. ఆమె నిలబడే సత్తువ లేక, తోటకూర కాడలాగా అతని భుజం మీద వాలిపోయింది. అతను చుట్టూ పరికించి చూసాడు.
    ఎదురుగుండా 'శృతీ నర్సింగ్ హోమ్' కనిపించింది. అందులో ఉండే డాక్టర్ వైద్యనాధన్ అతనికి బాగా తెలుసు! ఆయన మేనల్లుడి తనకి ఇంటర్ లో క్లాస్ మేట్. ఎప్పుడూ ఆయన దగ్గరకి వెళ్తుండేవారు. ఆయన యాభయ్యో వడిలో పడినా, మంచి ఉషారుగా, చిన్నవాళ్ళతో చిన్నవాడిగా కలిసిపోయే స్వభావం!
    మంజీర గిలగిలా తన్నుకుంటోంది!
    అతను ఆలోచించకుండా, ఆమెని భుజాన వేసుకుని గబగబా నర్సింగ్ హోమ్ వైపు అడుగులు వేసాడు.
    లోపలికి అడుగు పెడ్తూనే, "డాక్టర్ గారు ఉన్నారా? అర్జెంట్!" అన్నాడు.
    నర్స్ మంజీర పరిస్థితి చూస్తూనే, స్ట్రెచర్ తెప్పించి, మంజీరని పడుకోబెట్టి, డాక్టర్ గారికి కబురు చేసింది.
    డాక్టర్ వైద్యనాధన్ వచ్చి, "వాట్ అభీ! ఏమైంది?" అడిగాడు.   
    "ఈ అమ్మాయి నా క్లాస్ మేట్, కడుపునొప్పితో గిలగిలా తన్నుకుంటోంది" అన్నాడు కంగారుగా అభినవ్.
    ఆయన మంజీరని గదిలోకి తీసుకెళ్ళి పరీక్ష చెయ్యసాగాడు.
    మంజీర అరిచే అరుపులు వింటున్న అభినవ్ కి 'టెన్షన్'గా ఉంది. "ఏం చేద్దాం?" అని ఆలోచిస్తున్నాడు. కనీసం వాళ్ళ నాన్నగారి ఫోన్ నెంబరు కూడా అతనికి తెలియదు.
    ఇంతలో నర్స్ వచ్చి, "ఆ అమ్మాయి మిమ్మల్ని పిలుస్తోంది" అని చెప్పింది.
    అభినవ్ ఆమెని అనుసరించాడు.
    అభినవ్ ని చూడగానే, మంజీర "నేను చచ్సిపోతానేమో! ఈ నొప్పి తట్టుకోలేకుండా ఉన్నాను" అంటూ ఏడవసాగింది.  
    అభినవ్ ఆమె దగ్గరకి వెళ్ళి, మీద చెయ్యి వేసి "మంజీరా బీ బ్రేవ్!" అన్నాడు.
    ఆమె మరింత హిస్టీరిక్ గా తన్నుకుంటూ ఏడుస్తోంది.
    ఆమెని ఆపడానికి అతను రెండు చేతులూ పట్టుకున్నాడు.
    ఆమె కాళ్ళతో అతన్ని తన్నసాగింది.
    అతను అసంకల్పితంగా చేతులు వదిలేసి కాళ్ళు పట్టుకున్నాడు.
    ఆమె కాళ్ళు కదపడం ఆపేసి, పకపకా నవ్వడం మొదలెట్టింది.
    అభినవ్ షాక్ తిన్నట్లు చూసాడు.
    "డియర్ ఫ్రెండ్! నువ్వు చాలా గ్రాండ్ గా ఫూల్ అయ్యావు. నా చేత కాళ్ళు పట్టించుకుని దండం పెట్టించుకుంటానని ప్రతిజ్ఞ చేసి, నువ్వే కాళ్ళు పట్టుకున్నావు. వెనక్కి తిరిగి చూడు. ఎంతమంది చూస్తున్నారో" అంటూ మళ్ళీ విరగబడి నవ్వసాగింది.
    అభినవ్ కి అర్థం అయీ, కాకుండా ఉంది. ఇంకా ఆమె కాళ్ళు అతని చేతిలోనే ఉన్నాయి.
    "మంజూ, వెరీగుడ్! మాట నిలబెట్టుకున్నావ్!"
    "ఇప్పటికైనా క్షమించవే, దాసుడి తప్పులు దండంతోసరి!" ఆమె ఫ్రెండ్స్ ఒక్కసారిగా దాడి చేసారు వెనకనించి.
    అప్పుడు పడింది అతని భుజం మీద, డాక్టర్ వైద్యనాధన్ చెయ్యి.


                                                   *    *    *    *


    మంజీరా, ఆమె ఫ్రెండ్స్ కలిసి అభినవ్ మీద జోకులు పేల్చుకుని, గొడవ గొడవగా నవ్వుతూ, మాట్లాడుతున్నారు.
    నర్స్ లోపలికి వచ్చి, "డాక్టర్ గారు మీ అందర్నీ తక్షణం ఆస్పత్రి వదిలి బైటికి పొమ్మంటున్నారు. లేకపోతే న్యూసెన్స్ కేస్ పెడ్తారుట!" అంది చిరాగ్గా.
    అందరూ నవ్వు ఆపి, బైటికి నడిచారు.
    చివరగా మంజీర కూడా రాబోయింది.
    "నువ్వుండు అమ్మా!" గంభీరంగా వినిపించింది డాక్టర్ గారి గొంతు.
    మంజీర "ఏమిటి?" అన్నట్లు చూసింది.
    "నీకు ఆపరేషన్ చెయ్యాలి. అపెండిక్స్ వెంటనే రిమూవ్ చెయ్యకపోతే ప్రమాదం!" చెప్పాడు డాక్టర్.
    "వాట్ నాన్సెన్స్ యూ ఆర్ టాకింగ్?" మంజీర కోపంగా అరిచింది. "నాకు ఏ రోగమూ లేదు. నిక్షేపంగా ఉన్నాను. కేవలం అతన్ని ఏడిపించడం కోసం అలా చెప్పాను, అంతే!"
    "అది చెప్పాల్సింది నువ్వు కాదు! నేను" ఆయన మాట్లాడ్తూనే ముక్కుకి మాస్కు వేసుకుని, చేతులకి గ్లౌజెస్ వేసుకుంటున్నారు.
    "నో!!!" మంజీర వేగంగా కదిలింది తలుపు వైపు.
    కానీ, అప్పటికే ఆలస్యం జరిగింది. నర్స్ ఆమె వైపు 'సిరంజి'తో వచ్చి, ఒక చేత్తో గట్టిగా పట్టుకుని, మరో చేత్తో చేతి మీద ఒడుపుగా ఇంజెక్షన్ చేసేసింది.
    మంజీర 'కె...వ్వు' అని అరుస్తూ, "మిమ్మల్ని, నేనూ... ఒదలను... అస్సలు" అంటూ ఉండగానే, కనురెప్పలు మూతపడిపోయాయి.
    ఆ తరువాత ఏం జరిగిందో మంజీరకి తెలిసే ఆస్కారం లేదు!


                                                         *    *    *    *


    నెమ్మదిగా కళ్ళు తెరవటానికి ప్రయత్నించింది మంజీర. ఇంకా మత్తుగానే అనిపిస్తోంది. ఆసుపత్రి వాసన ముక్కుకి ఘాటుగా తగిలింది. చప్పుడ్లూ, మాటలూ బట్టి పరిచితమైన ప్రదేశం కాదు అనిపిస్తోంది. బలవంతంగా రెప్పలు విప్పి చూసింది. లీలగా ఎవరో తన దగ్గరగా కూర్చుని కనిపించారు. మళ్ళీ ఓసారి కళ్ళు మూసి, తెరిచింది. ఈసారి ఆ ఆకారం కాస్త సరిగ్గానే కనిపించసాగింది.
    "ఎలా ఉంది?" తన మీదకి ఆతృతగా వంగి అడుగుతున్నాడు అభినవ్.
    "నాకు ఏమయిందీ?" అంటూ గబుక్కున లేవబోయింది.
    "ఆ...ఆ...లేవకు! ఆపరేషన్ జరిగి, రెండు గంటలు కూడా కాలేదు. కుట్లు తెగిపోతాయి. నీకు రెస్ట్ చాలా అవసరం!"
    మంజీర అయోమయంగా చూస్తూ, కడుపు మీద చెయ్యి వేసుకుంది. ఎత్తుగా బాండేజ్ కట్టిన కట్టు చేతికి తగిలింది. 'మైగాడ్' అనుకుంది.
    "నీ పొత్తి కడుపు అంతా పచ్చిపుండులా ఉండి ఉంటుంది బహుశా! ఎక్కువ మాట్లాడినా, నవ్వినా, ఏడ్చినా, దగ్గినా ప్రమాదం! కదలకుండా పడుకో. మీ ఇంట్లో కావలిస్తే నేను ఇన్ ఫార్మ్ చేస్తాను" అని మంద్రమైన స్వరంతో అతను చెప్తూ ఉంటే,
    మంజీరకి కడుపు అంతా బిగబట్టినట్లూ, లోపల అంతా పుండులా ఉన్నట్లూ అనిపించసాగింది. గట్టిగా అరిచి అతడ్ని తిడ్తే అతను అన్నట్లు కుట్లు ఊడిపోవడం మళ్ళీ ఆపరేషన్ అదీ, ఎందుకొచ్చిన తంటా! అని కోపం దిగమింగింది.

 Previous Page Next Page