Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 13


    "హల్లో....డాడీ...." కరచాలనం చేశాడు గోవింద్.
    "అమ్మా.... బావున్నావా?" పసిపిల్లాడిలా చుట్టేశాడు.
    "ఏయ్....సుమ్మీ.....కమాన్.... " అంటూ కౌగిలించుకున్నాడు.
    "ఉష్!....ఇది ఏర్పోర్టు" అంటూ దూరం జరిగింది సుమతి.
    "ఏడీ చింటూ?"
    "ఇడుగో" అంటూ అందించింది సుబ్బలక్ష్మి.
    బాబుకేసి, సుబ్బలక్ష్మికేసి మార్చిమార్చి చూశాడు గోవింద్. "మీరూ.....మీరూ...."
    పగలబడి నవ్వింది సుబ్బలక్ష్మి.
    అర్ధంకాక సుమతికేసి చూశాడు. సుమతి చిన్నగా నవ్వి ఊరుకుంది.
    "నేనే బావా ! గుర్తు పట్టలేదా? సుబ్బలక్ష్మిని." నవ్వుతూనే చెప్పింది.
    ఈసారి మరింత ఆశ్చర్యంగా చూశాడు ఆమెవంక. కట్టూ, బొట్టూ, భాషా అంతా వేరుగా వుంది. "డాడీ! జనకమ్మత్తయ్య కూతురు సుబ్బలక్ష్మేనా?" అని అడిగాడు నమ్మలేనట్టుగా.
    "అవునురా! ఇంకే సుబ్బలక్ష్మి" అన్నా రాయన.
    "వేషం మారిందికదూ! గుర్తుపట్టలేక పోతున్నాడు వెఱ్ఱి నాగన్న" అంది కామాక్షమ్మగారు అదోలా.
    చింటూ నెత్తుకుని ముద్దులవర్షం కురిపించాడు. మీసాలు గుచ్చుకున్నాయేమో కెవ్వుమన్నాడు వాడు తల్లివైపుకి వంగుతూ.
    గోవిందు చేతుల్లోంచి చింటూని అందుకుంది సుమతి. వెంటనే ఏడుపుమాని నవ్వేశాడు.
    "ఒరేయ్....నేనురా....పప్పా ....నా దగ్గరకు రావా .... ఉండు నీ పని  చెప్తా.....నీ దగ్గరినుంచి నీ మమ్మీని వేరుచేస్తే సరి, నువ్వే నా దగ్గరి కోస్తావ్" అన్నాడు వాడిబుగ్గలు నొక్కుతూ.
    మళ్ళీ 'క్యారు' మన్నాడు వాడు.
    అందరూ  గొల్లున నవ్వారు.
    సామాను తెచ్చి కారులో పెట్టాడు డ్రైవరు. కారుని చూడగానే వాసుదేవరావుగారు జ్ఞాపకం వచ్చారు గోవిందుకి.
    "పాపం! మామయ్య బతికివుంటే ఎంత సంతోషించేవారో నన్ను చూసి."
    "అవును పాపం" అన్నారు నరసింహారావుగారు.
    సుమతి కళ్ళలో నీళ్ళు తిరగడం చూసి ఈ సమయంలో ఆ సంభాషణ పెంచడం ఇష్టంలేక చింటూకో ఆడడం మొదలెట్టాడు. సుమతి ఆనందంతో ఉక్కిరిబిక్కి రావుతోంది. ఇన్నాళ్ళ  వియోగం తరవాత గోవిందుతో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలీక మౌనంగావుంది సుమతి గోవిందుకేసి చూస్తూ. అతనిలో ఏ మార్పూ లేదు. అదే ఉత్సాహం, అదే మాట. కాకపోతే కొంత ధోరణి మారింది మాట్లాడేతీరులో.
    ఇంటిముందు కారాగగానే ఆయమ్మ ఎదురొచ్చింది. పలక రింపుల తరువాత లోపలికొచ్చా రందరూ, డ్రైవరు సామాను లోపల పెట్టాడు. ఎన్నో సంవత్సరాలయినట్టు ఇల్లంతా ప్రదక్షిణం చేసోచ్చాడు గోవిందు.
    పెట్లోంచి మూడు పట్టుచీరలు  తీశాడు. "చూడు సుమతీ! ఎలా వున్నాయో! ఈ 'బ్లూ' నీది. ఈ 'గ్రీన్' అమ్మది. ఈ 'రెడ్' సుబ్బలక్ష్మికి ఎలావుంది. సెలక్షన్."
     "చాలా బావున్నాయ్. 'బ్లూ' ఎంతో ఇష్టం. ఇంత నుంచి సెలక్షన్ ఎలా చేశారు?" అంది.
    "ఒక స్నేహితుడి భార్యను తోడు తీసుకెళ్ళాను."
    "అవునుకానీ బావా! ఏర్ పోర్టులో  నన్ను గుర్తుపట్టని వాడివి నాకు చీరెలా తెచ్చావ్ ?  నేనిక్కడున్నట్టు తెలుసా?" అడిగింది సుబ్బలక్ష్మి.
    "చూడు సుబ్బూ...."
    "కాదు.... లక్ష్మి....."
    "ఓ....తమరు చదువుకుంటున్నారు, మారిపోయారుకదూ. అందుకని పిలుపూ మార్చుకోవాలి. పాత అలావాటు ప్రకారం 'సుబ్బా' అని వచ్చింది."
    "ఆఁ....ఫరవాలేదులే, చెప్పు."
    "నువ్విక్కడున్నట్టు మమ్మీ, నాన్నగారూ కూడా రాశారు. అందుకని తెలుసు. కానీ, నువ్వింత మారిపోయావనీ, ఏరో  పోర్టుకి వస్తావనీ అనుకోలేదు కనుక నిన్ను గుర్తు పట్టలేకపోయాను. ఓ.....కె" అన్నాడు. ఒక వెంకటగిరి జరీచీర తీసి ఆయమ్మ కిచ్చాడు.
    "నా కెందుకు బాబూ?" అంది ఆనందంతో ఆయమ్మ. 
    "అందరికీ తెచ్చి నీకు మానేస్తాననుకున్నావా? సుమతిని తల్లిలా పెంచావు. కనురెప్పలా కాపాడుకున్నావు. ఈ మాత్రం నీకు చెయ్యడం తప్పా?" అన్నాడు ఆప్యాయంగా.
    తృప్తిగా తీసుకుంది ఆయమ్మ. చింతూకి తెచ్చిన ఒక్కొక్క డ్రెస్సూ బయటికి తీశాడు. ఎంతో అందంగా ముద్దోస్తున్నాయ్ రకరకాల డిజైన్లలో డ్రెస్సులు.
    "ఇవి మీకూ" అందించాడు పొగాకు చుట్టల ప్యాకెట్టు.
    "ఓరినీ.....నాకూ తెచ్చావా?" అందుకున్నారు నరసింహరావుగారు.
    అందరికీ వడ్డించింది ఆయమ్మ. గోవిందు వెళ్ళిన దగ్గర నుంచీ ఈనాటివరకూ సంగతులన్నీ చర్చించారు భోజనాల దగ్గర, సుమతి శ్రీమంతం, సుబ్బలక్ష్మి రావడం, చింటూ పుట్టుక, వాసుదేవరావుగారి మరణం, లైబ్రరీ విషయాలు అన్నీ కలగూర గంపలా మాట్లాడుతున్నారు.
    పక్కమీద పడుకున్న గోవిందుకి పక్కపొడి అందిస్తూ, కొత్త పెళ్ళికూతురిలా సిగ్గుపడింది సుంతీ. చందమామకాంతిలో వెలిగిపోతూన్న ఆమె  ముఖంలోని కొత్తదనాన్ని వింతగా చూస్తూ తన్మయుడై పోయాడు గోవిందు. అమృతం కురిపిన ఆరాత్రి గువ్వ పిట్టలా ఒదిగిపోయి ఒకరికౌగిట్లోఒకరు నలిగిపోయారు. తెల్లవార్లూ కబుర్లలో మునిగిపోయారు.
                                                              *        *        *
    గోవింద్ లేచేసరికి బాగా పొద్దెక్కింది. సుబ్బలక్ష్మి కాలేజీకి  బయలుదేరుతోంది. తొందరగా టిఫిన్ పెట్టమని  ఆయమ్మమీద అరవడం, హడావిడిగా బీరువాలోంచి డబ్బు తీసుకోవడం చూస్తూ వుంటే 'ఆ పాప సుబ్బలక్ష్మేనా' అనిపించింది గోవింద్ కి, ఆమె చనువుకి ఆశ్చర్యంవేసింది  కూడా.
    "ఏమిటి బావా అలా చూస్తున్నావ్? ఇంకా నన్ను చూస్తే  నమ్మలేకుండా వున్నావా?"
    "నిజం, నా కళ్ళని నేనే నమ్మలేక పోతున్నాను. బంగారాని కైనా మెరుగు పెట్టకపోతే కంటికి నచ్చదన్నమాట నిజమే  ననిపిస్తుంది."
     నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి.
    స్నానపానాదు లయ్యాక వాసుదేవ్ లైబ్రరీకి  బయలుదేరారు గోవిందు, సుమతి గతస్మృతులతో గదులన్నీ కలియజూశాడు గోవిందు. మామయ్య పోయినా, మామయ్య పేరుమీద ఈ లైబ్రరీ వచ్చేపోయే జనంతో నిండుగా కలకలలాడుతూ వుండడం జీవకళ  వుట్టిపడుతూ వుంది. "లైబ్రరి కివ్వడం మంచివని చేశావు సుమతీ!" అన్నాడు మెచ్చుకుంటూ.
    "నాన్నగారి దగ్గర ఎన్నో పుస్తకాలుండేవి, అవన్నీ పది మందికి పనికోచ్చేలా వుండాలంటే ఇదొక్కటే మార్గమనిపించింది. పైగా నాన్నగారి పేరు మరుగున పడిపోకుండా పదిమంది  నోటా పలుకుతూ వుంటుంది.
    "కరెక్ట్!"
    కాస్సేపు కూర్చుని కొన్ని పుస్తకాలూ, పత్రికలూ తిరగేకారు, టైము పన్నెండు దాటింది.
    "ఇక వెళదామా?" అంది సుమతి.
    "సరే" అంటూ లేచాడు గోవిందు.

 Previous Page Next Page