Previous Page Next Page 
సంధియుగంలో స్త్రీ పేజి 12


    అసలు సంగతి ఏమిటో చెప్పమంటారా? పై ముగ్గురు అమ్మాయిలకూ కరాటే తెలుసు. కరాటే అంటే "వట్టిచేతులు" అని అర్థం. కరాటే ట్రైనింగ్ అనగానే దాదాపు అందరూ ఉలిక్కిపడతారు. ఆడపిల్లల్ని రౌడీలుగా తయారు చేయడం అనే భావం చాలామందిలో ఉన్నది.
    ఆ మధ్య ఇద్దరు లేడీ లెక్చరర్స్ తో మాటల సందర్భంలో అన్నాను - "కరాటే ట్రైనింగ్ ఇక్కడ మీ కాలేజీ తరపున ఎందుకు ఏర్పాటు చేయకూడదు?" అని. అందుకు ఇద్దరూ ఒకేసారి అదేదో పెద్ద తప్పు మాట అయినట్టు "నో కరాటే, నో బాక్సింగ్" అన్నారు అదోలా తలలు వంచుకొని నవ్వుతూ, ఒక విధంగా సిగ్గుపడుతూ.  
    కరాటే ట్రైనింగ్ ఆడపిల్లలకు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందనే విషయాన్ని ఎందుకు ఆలోచించరో అర్థం కాదు. వాళ్లలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా స్త్రీ అపహరణలూ, మానభంగాలూ అసంఖ్యాకంగా జరుగుతున్న ఈ రోజుల్లో స్త్రీలకు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో నేర్పించడం తప్పా? కరాటే ట్రైనింగ్ అనగానే ఏ సినిమాలోనో "డిష్యుం, డిష్యుం" చేసే ఆడపిల్ల కళ్ళముందు మెదిలి తల్లిదండ్రులు భయపడుతున్నారనుకుంటాను.
    'ఆడది అబల' అంటూ మనదేశంలో స్త్రీలకు ఉగ్గుపాలతో పిరికితనం నూరి పోశారు మగవాడు కన్పిస్తూనే మెలికలు తిరిగిపోయే ఆడపిల్ల పట్టుకోగానే నీరుకారిపోయి, డీలాపడిపోతుంది.
    ఈ మధ్య నర్సుల క్వార్టర్స్ మీద దాడిచేసి, మూకుమ్మడిగా మానభంగాలు చేశారట. ఇది తప్పని ఇంకా మనలోని మానవత్వం సిగ్గు పడలేదంటే, ఆ జాతికి, ఆ సంస్కృతికి జోహార్లు. మానభంగం చేసినవాడికి హంతకుడితో సమాన శిక్ష విధించే అవకాశం న్యాయశాస్త్రంలో చోటు చేసుకునేంతవరకు ఈ దేశంలో స్త్రీలకు ఈ అవమానాలు తప్పవు.
    అందుకే కనీసం స్త్రీలను సుందరీ, సుకుమారీ అంటూ పొగడటం మానేయండి. ఆమెను సబలగా నిలబడే అవకాశం కల్పించండి.  
    పైన అవంతి గురించి చెప్పాను. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఆ యువకుడు వెనకనుంచి పట్టుకోగానే" స్టమక్ త్రో" (కరాటేలో ఒక ట్రిక్)ఇచ్చింది. ఆటో రిక్షా అమ్మాయి అరచేతిని కత్తిలా ఉపయోగించింది.
    కరాటేలో క్విక్ మూవ్ మెంట్సు అలవడతాయి. అంతేగాని, అమ్మాయిలలోని సౌకుమార్యం పోతుందనీ, మొరటుగా తయారు అవుతారనీ భావించనక్కరలేదు.
    ఆ మధ్య కరాటే ట్రైనింగ్ నేర్చుకున్న అమ్మాయిలతో మాట్లాడాను. దానివల్ల వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంపొందింది అనిపించింది. మగవాడిని చూడగానే ముడుచుకుపోయే మనస్తత్వం మారింది. మగవాడు తగిలితే చాలు ఏదో జరగరానిది జరిగిపోయిందని భావించే కాంప్లెక్స్ తగ్గింది. ఆడపిల్లల్లో ఈ మార్పు చాలదా?
    ఇకపోతే చాలామందికి ఒక సందేహం పీడిస్తూ ఉంటుంది -- మగపిల్లలు కూడా కరాటే నేర్చుకుంటేనో అని! అందువల్ల నష్టం లేదు. కరాటే ట్రైనింగ్ అయిన యువకుల్లో ఒక రకమైన డిసిప్లిన్ వస్తుంది. వాళ్ళకు కొన్ని నీతి సూత్రాలు ఉన్నాయ్. వాటిని పాటిస్తారు వాళ్ళు ఆడపిల్లల్ని చూడగానే వెకిలి వేషాలు వెయ్యరు.
    స్కూలు చదువుతో పాటు ఆడపిల్లలకు కరాటే నేర్పించడం ముఖ్యంగా మనదేశంలో చాలా అవసరం అని భావిస్తున్నాను.  
                                 వేశ్యావృత్తిని చట్టబద్ధం చెయ్యాలా?
    ఆ మధ్య స్త్రీలకు సదస్సు ఒకటి జరిగింది హైదరాబాద్ నగరంలో. వేరు వేరు గ్రూపులుగా ఏర్పడి స్త్రీలకు సంబంధించిన విషయాల మీద చర్చలు జరిగాయి. అందులో ఒక గ్రూపు (మేధావులు అనబడేవారు - ముఖ్యంగా న్యాయ శాస్త్రం చదివి లాయర్లుగా పనిచేస్తున్నవారు - ఉన్నారు ఆ గ్రూపులో) వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయాలని తీర్మానించింది ఆ తీర్మానం చదవగానే సభలో కలకలం బయలుదేరింది.
    నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. "ఇదేమిటి అన్యాయం?" అన్నాను. "అవును తప్పేముంది? వేశ్యా వృత్తి మనదేశంలో ఆదికాలం నుంచీ ఉన్నది. అది ఒక జాతికి మాత్రమే పరిమితమయి ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూచినా వ్యభిచారమే కనిపిస్తున్నది. దాన్ని అరికట్టాలంటే సమాజంలో రోజురోజుకూ వ్యాపిస్తున్న కుళ్లును అరికట్టాలంటే, వేశ్యావృత్తిని చట్టబద్ధం చెయ్యాలి.
    "కొందరు స్త్రీలు స్వాభావికంగానే చంచల బుద్ధులై ఉంటారు. ఏ పరిస్థితుల ప్రోద్భలం లేకుండానే వ్యభిచరిస్తారు." అంటూ వాదించింది బాగా చదువుకున్న ఒకామె. ఆమె పక్కనే ఉన్న మరో ఇద్దరు స్త్రీలు (పెద్ద ఉద్యోగాలు చేసేవారు) సమర్థించారు ఆమె అభిప్రాయాన్ని. నాకు దాదాపు మతిపోయినంత పని అయింది.
    వారికి నిజమైన సాంఘిక అవగాహన ఉందా? స్త్రీ తత్వం మీద గౌరవం ఉందా? తోటి దగాపడిన సోదరి మీద సానుభూతి ఉందా? ఉంటే అలా మాట్లాడగలరా అని అనిపించింది.
    ఒకనాటి స్త్రీ కాలేజీలకు వెళ్ళలేదు. ఆఫీసుల్లో ఉద్యోగాలు చెయ్యలేదు కోర్టుల్లో వాదించలేదు. అన్ని అవకాశాలను పొంది బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టి ఒకవైపు పురుషుడితో సమానమైన స్థానం కోసం పోరాడుతూ ఉన్న మేధావి వర్గానికి చెందిన స్త్రీలే వేశ్యావృత్తి లీగలైజు చెయ్యాలని కోరడం అంత దారుణం మరొకటి ఉండదు.
    వీరికి సామాజిక అవగాహన ఉన్నదనుకోవాలా? వాళ్ళ తర్కంలో అజ్ఞానం తప్ప మరేమీ కన్పించదు. చాలామంది స్త్రీలు పెద్ద పెద్ద చదువులు చదివి, ఉద్యోగాలు చేస్తున్నా వాళ్ళ ఆలోచనా సరళి చాలానేలబారుగానే ఉంటుంది ఆడలెక్చరర్లు ఎందరో చౌకబారు ప్రేమ కథల్ని చదివి ఆనందించడమే కాక విద్యార్థినులతో ఆ కథల్ని గురించి చర్చిస్తారు. చాలా మంది నా మీద విరుచుకు పడవచ్చును ఇది చదివి, కాని ఇది అక్షరాల నిజం.   
    చరిత్ర పరిజ్ఞానం సాంఘిక అవగాహనగల ఏ స్త్రీ కూడా వేశ్యావృత్తిని చట్టబద్ధం చెయ్యవలసిందిగా కోరడం జరగదు. తనతోటి స్త్రీకి పతిత అనే ముద్రవేసి సమాజానికి దూరంగా, అదొక కులంగా పరిగణింపబడుతూ, బ్రతకమనడం దారుణం.    
    ఈ ఇరవయ్యో శతాబ్దపు అంతంలో స్త్రీ ఇప్పుడిప్పుడే తన హక్కులను తెలుసుకుని పోరాటం సాగిస్తున్న ఈ తరుణంలో స్త్రీ తన సౌందర్యాన్నీ, శరీరాన్ని, మార్కెట్ లో పెట్టి ఉప్పు చింతపండుకంటే హీనంగా అమ్ముకోవడానికి చట్టబద్ధమైన అవకాశాలను కలిగించవలసిందిగా ప్రభుత్వానికి మేధావి వర్గానికి చెందిన స్త్రీలు సిఫారసు చేయడం ఎలా ఉందో? ఒకసారి మీరు ఆలోచించండి:-
    అంటే ఇంతవరకూ అపహరించిన ఆడపిల్లల్ని రహస్యంగా ఉంచి, వాళ్ళ శరీరాల మీద డబ్బు సంపాదించి బ్రతికే దళారులకు (కాశింలకూ అనంతమ్మలకూ) పూర్తిగా స్వేచ్చను ఇవ్వడం అన్నమాట. ఇక వీధికొక బ్రోతల్ హవుస్ వెలిసినా ఆశ్చర్యం లేదు. ఆ మధ్య ఒక అమ్మాయిని (రెస్క్యూ హోంలో ఉన్న అమ్మాయిని ) కలుసుకోవడం జరిగింది. ఆ పిల్లకు తండ్రి లేడట. సవతి తల్లి నానాయాతనా పెడుతూంటే భరించలేక మరో అమ్మాయితో కేరళ నుంచి పారిపోయి బెంగుళూరు వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయి వయసు పన్నెండేళ్ళు. ఆ అమ్మాయిని తీసుకొచ్చిన అమ్మాయికి ఇరవై ఏళ్ళ దాకా వయసు ఉంటుంది. ఆ యువతితో పాటు మరో మగాడు కూడా వచ్చాడట. అతను ఈ పన్నెండేళ్ళ పిల్లను ఒక ముసలిదానికి అమ్మాడు. ఆమె మరో మగవాడికి అమ్మింది. అతను విశాఖపట్నం తీసుకొని వచ్చి మరో ఆడదానికి అమ్మాడు. ఆవిడ వ్యాపారంలో దించింది . కోర్టు శిక్ష మరో రెండు నెలల్లో ముగుస్తుంది. ఆ అమ్మాయి అపరాధం చేసినట్టు ఎవరైనా వెళ్ళి పలకరిస్తే ముఖం చాటు చేసుకుని, తనలో తను కుంచించుకుపోతూ చిన్నగా సమాధానాలు ఇస్తుంది. ఇలాంటివారు కోకొల్లలు.  
    ఇకపోతే కొందరు స్వభావ సిద్దంగానే ఎక్కువ సెక్స్ లైఫును కోరుకుంటారట. అందుకే వేశ్యావృత్తిని చట్టబద్ధం చెయ్యాలట ఇది మరో వాదన అలాంటి వారు పెద్ద అంతస్తుగల కుటుంబాల్లో ఉన్నప్పుడు వారు తమ కోర్కెల్ని తీర్చుకోవడానికి వేశ్యాగృహాలకు వెళ్ళక్కర్లేదే. చదువుకున్న వారిలో, ఉద్యోగాలు చేసేవారిలో కూడా కొందరు (చాలాకొద్ది మంది) ఇలాంటివారు ఉంటారు.
    అసలు ఈ వృత్తి ఇంతగా పెరగడానికి కారణం ఎవరూ ఆలోచించడం లేదే. ఆర్ధిక సంబంధమైన పరిస్థితిలే దీనికి కారణం. వేశ్యా గృహాల్ని నడిపేవాళ్ళు ఆ పని ఎందుకు చేస్తున్నారు? డబ్బుకోసం, ఒకసారి, ఏ క్షణిక ఆవేశంలోనో మోసంతోనో బయటపడిన ఆడపిల్లకు ఈ సమాజంలో తక్షణ అవకాశాలను కల్పించిందా? ఒక బ్రోతల్ హవుస్ నుంచి ఎలాగయినా తప్పించుకుని బయటపడిన ఆడపిల్లకు, ఎవరైనా తమ కుటుంబంలో ఆశ్రయం గలిగిస్తారా?   
    వేశ్యావృత్తిని చట్టబద్ధం చేస్తే, స్త్రీని హీనపరచడమే అవుతుంది. హోటలు గదుల్లో విచ్చలవిడిగా జంటలు కనిపిస్తాయి. స్త్రీల అపహరణలు మరీ ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. ఆడవాళ్ళ మాంసాన్ని అమ్మే కటికవాళ్ళు వీధివీధికీ వెలుస్తారు.     
                                     ఇరుగూ - పొరుగూ
    "నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది" అనే సామెత తెలుగు వారందరికీ తెలిసిందే. అంటే మన నోరు మంచిది అయితే, మనం మృదువుగా, ఇతరులను గౌరవించి మాట్లాడితే వూళ్ళో వాళ్ళంతా మనల్ని గౌరవిస్తారు - ప్రేమిస్తారు అని సామెత అంతరార్థం. ఇందులో నిజం లేకపోలేదు.    
    కాని కొంతవరకే నిజం ఉన్నది. మీరు ఎవరి గురించి చెడుగా మాట్లాడరు. మీ మనసులోకి చెడు తలపులు రావు. ఎవరి మీదా స్కాండెల్స్ వెయ్యరు. అందువల్ల మీ గురించి అందరూ మంచిగా మాట్లాడతారని అనుకోవడం పొరపాటు. కొందరికి ఎప్పుడూ ఎవరో ఒకరిని ఆడిపోసుకోవడం అలవాటు ఉంటుంది.

 Previous Page Next Page