మంజీరా మంచి హుషారుగా ఉంది. జోరుగా వెస్ట్రన్ మ్యూజిక్ పెట్టి, దానికి అనుగుణంగా ముందుకీ, వెనక్కి వూగుతూ డాన్స్ చేస్తోంది. ఎందుకో అరుంధతికి మంజీరని అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది.
తనీ వయసులో ఉన్నప్పుడు... ఆమెకి తన జీవితం గుర్తొచ్చింది. మళ్ళీ స్నానాలూ, ఉపవాసాలూ, కార్తీక మాసాలూ, వైకుంఠ ఏకాదశిలూ, పురాణ శ్రవణాలూ, నెల మాసికాలూనూ, ఛీ, ఛీ, ఏమిటీ జీవితంలో అనుభవించిందీ?" అని మొదటిసారిగా అనిపించింది.
"గ్రానీ కయ్! నీకు కూడా రెండు స్టెప్స్ నేర్పిస్తాను. యూ రియల్లీ ఎంజాయ్ ఇట్" అంటోంది మంజీర.
"హయ్యో రామా! అవన్నీ చెయ్యకపోయినా, కనీసం ముందు ఆ గోచీపోసి తెల్ల పంచె కట్టుకోవడం మానేసి, చక్కగా లోపల లంగాతో మంచి చీరలు కట్టుకుంటే అంతే చాలు! చెప్తే వింటారు గనుకనా! అసలు ఏమంత వయసు మించిపోయిందనీ, ఈ వేషం? చూడలేక చచ్చిపోతున్నాను" అంటూ రుసరుసలాడింది, అక్కడికి వచ్చిన సుమిత్ర.
సుమిత్ర అన్నమాట! "అసలు ఏమంత వయసు మించిపోయిందనీ?" అన్నమాట అరుంధతికి నచ్చింది. తను కూడా ఎదురింటి ఆవిడలాగా, గుంటూరు జరీ చీరలో, వెంకటగిరి జరీ చీరలో కట్టుకుంటే అమ్మాయి హోదాకి తగినట్లుగా ఉంటుందని అమ్మాయి అభిప్రాయం అనుకుంది. ఆలోచనగా తలమీద చెయ్యి వేసి నిమురుకుంది. సిటీకి వచ్చాక ఇంతవరకూ కేశఖండన జరగలేదేమో! చాలా జుట్టు పెరిగిపోయింది. గదిలో అద్దం ముందు నిలబడి, తల మీద నుంచి కొంగు తీసింది. నల్లని జుట్టు, ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించడం లేదు.
అరుంధతికి అప్పన్న పంతులు బావ గుర్తొచ్చాడు. చాలా ఏళ్ళు అతని కబురు తెలియలేదు. కొంతకాలమయ్యాక ఒక ఉత్తరం వ్రాసాడు. "అరూ! నువ్వు లేని జీవితం వద్దు అనిపించింది. కానీ, ఒక్కగానొక్క కొడుకుని కాబట్టి కన్నవాళ్ళని బాధపెట్టలేక వారిష్ట ప్రకారమే అన్నీ చేస్తున్నాను. పెళ్ళి చేసుకున్నాను. 'రీసెర్చి' చెయ్యడానికి విదేశాలకి వెళ్ళాల్సి వస్తోంది. నాకూ అదే మంచిది అనిపిస్తోంది. నువ్వు పక్కన లేకుండా, గోదారి ఒడ్డున నడిచినా, గొబ్బిళ్ళ పాటలు విన్నా, పున్నమి చంద్రుడ్ని చూసినా, మనసుని ఎవరో పిండినట్లు అవుతోంది. అందుకే మరిచిపోవాలని దూరంగా వెళ్ళిపోతున్నాను... 'నిన్ను కాదు, ఆనాటి మన జ్ఞాపకాలని. నువ్వు మాత్రం నన్ను మరిచిపోకు నేస్తం. ఏ తులసమ్మలో నీళ్ళు పోసేటప్పుడో, వత్తులు చేసుకునేటప్పుడో, పిండి విసురుకునేటప్పుడో, ఒక్కమారు నన్ను జ్ఞాపకం చేసుకో!
ఎప్పటికయినా, ఆఖరి ఘడియల్లో అయినా, చిన్ననాటి నా నెచ్చెలి 'అరూ' కోసం తప్పక వస్తానని ఆశగా ఎదురుచూడు. ఆశలేని నాడు బ్రతుకు వ్యర్థం అనిపిస్తుంది. అందుకే ఏదైనా విడిచిపెట్టు కానీ ఆశని మాత్రం విడవకు.
వస్తాను! తప్పకుండా వస్తాను.
నీ బావ.
ఆ ఉత్తరం భాగవతం అట్ట మీద పెట్టి, వేరే దళసరి పాటి కాయితం అట్ట వేసేసింది. మనసు బాగా లేనప్పుడల్లా తీసి చదువుకుంటుంది. భారతం కాదు! బావ ఉత్తరం! ఎంత ప్రేమగా రాశాడూ! ఇప్పుడు కూడా అలాగే ఉంటాడా? దాదాపు ఇరవై ఏళ్లుగా దేశం కాని దేశంలో స్థిరపడి ఎంతగా మారిపోయాడో!
పిల్లలు కలగలేదుట. భార్య పోయిందని మళ్ళీ ఉత్తరం ద్వారా తెలియబరిచాడు. అందులో తన చిరునామా కూడా వ్రాసాడు.
ఒక్కసారి కాస్త ఓదార్పుగా ఒక్క ఉత్తరం ముక్క రాసి పడేద్దాం! అనుకుంది. కానీ మనసు అది తప్పు అంది. అలాంటి పనులు చెయ్యరాదు అంది. ఎందుకు తప్పు? బాధలో ఉన్న ఆప్తుడికి కాస్త ఓదార్పుని ఇవ్వడం తప్పెలా అవుతుందీ? అని ఆలోచించే జ్ఞానం అరుంధతికి లేదు. అందుకే తనలో తాను బాధపడి ఊరుకుంది.
అరుంధతి ఆలోచనలు దూరం చేసుకోవడానికి, భాగవతం తీసుకుని కూర్చుంది. కానీ మనసు లగ్నం కాలేదు! ఇరవై నాలుగో తారీఖు అంటే ఇంక మూడు రోజులు.
బావని తను అసలు గుర్తుపట్టకలదా? చిన్నప్పటిలా పొట్టిలాగూ, ఉంగరాల జుట్టూ, ఎర్రగా బొద్దుగా ఉంటే గుర్తుపట్టగలదు. ఆమె ఆలోచనలకి ఆమెకే నవ్వు వచ్చింది.
* * * *
అభినవ్ తలతో బలంగా 'ఢీ' కొట్టాడు బంతిని. అది వెళ్ళి సరిగ్గా బాస్కెట్ లో పడింది.
వెనక నుంచి గట్టిగా చప్పట్లు వినిపించాయి.
ప్రాక్టీసు ఆపి, తల తిప్పి చూసాడు.
మంజీర నిలబడి 'క్లాప్స్' కొడ్తోంది. ఆమె ఒక్కత్తే ఉంది. గ్రౌండ్ అంతా ఖాళీగా ఉంది. "ఒక్కరూ ప్రాక్టీసు చేస్తున్నారా" అడుగుతూ వచ్చింది.
"ఇప్పుడే అంతా వెళ్ళిపోయారు. నేను కూడా బయల్దేరుదామనే అనుకున్నాను. కానీ బస్ కి ఇంకా పది నిముషాలు 'టైం' ఉంది" చెప్పాడు, బనీన్ మీద షర్టు వేసుకుంటూ.
మంజీర రెప్ప ఆర్పకుండా తననే చూడడం అతనికి ఇబ్బందైన హాయి కలిగించింది.
"చాలా విశాలంగా ఉంది" అంది.
"వాట్!"
"అదే గ్రౌండ్ బావుంది! ప్రాక్టీస్ చెయ్యడానికి."
అతనికి కాస్త సిగ్గుగా అనిపించింది.
ఆమె మళ్ళీ అంది, "మీకు అభ్యంతరం, సిగ్గూ లాంటివి లేకపోతే, ఇద్దరి ఇళ్ళూ ఒకే దగ్గర కనుక, మిమ్మల్ని నా కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను."
"అభ్యంతరం ఉంది కానీ, భయం లేదు" చెప్పాడు.
"పెద్దగా తేడా లేదు లెండి" నవ్వేసింది వ్యంగ్యంగా.
అభినవ్ కి ఇది సూటిగా తగిలింది. "పదండి" అన్నాడు తల దువ్వుకుంటూ.
"దట్స్ గుడ్! అబ్బాయిలంటే అలా ఉండాలి" చెప్పింది ఆమె నవ్వుతూ.
సన్నని కుదుపుతో వెళ్తున్న కార్లో, చక్కని పాశ్చాత్య సంగీతం మృదుమధురంగా విన్పిస్తోంది.
అభినవ్ కళ్ళు మూసుకుని వెనక్కివాలి కూర్చుని ఆస్వాదించసాగాడు.