సత్యం లోపలకు వెళ్ళిపోయాడు.
'వాడట్లా మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడరేం?'
'ఏం మాట్లాడాలి? చిన్నవాడైనా వాస్తవం చెప్పినప్పుడు వినక తప్పదు'.
'ఏమిటో మీ ఇద్దరి వ్యవహారం నాకు బొత్తిగా అర్ధం కావడం లేదు' అనేసి లోపలకు విసురుగా వెళ్ళిపోయింది సుందరమ్మ.
మంచానికి అడ్డం పడింది సుందరమ్మ. వొళ్ళంతా విరగ్గొట్టినట్టుగా వుంది. పగలంతా అలుపూ సొలుపూ అనుకోకుండా పని చేస్తుంది. రాత్రి మంచం మీద నడుం వాల్చినప్పుడు గాని తెలీదు ఆ శరీరం ఎంత అలసిపోయిందో.
* * *
భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ మరో ఐదుసార్లు తిరిగింది.
కామేశ్వరరావు ఆదాయంలో మార్పు పెద్దగా లేదు. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి.
పెద్దకొడుకు రఘు మెడిసిన్ పూర్తి చేశాడు. హౌస్ సర్జన్ చేస్తున్నాడు. కోలవెన్ను షావుకారు ఐదు లక్షలు కట్నంతో కూతుర్ని ఇస్తానని వచ్చాడు. పిల్ల, పిల్లవాడు ఒకర్నొకరు చూసుకున్నారు ఇష్టపడ్డారు. సుందరమ్మకు కొంతవరకూ భుజాల మీదవున్న బరువేదో దిగిపోయినట్టు తేలిగ్గా నిట్టూర్చింది.
ఆయన బొత్తిగా అలసిపోయాడు. ఈ కట్నంతో పిల్లకు పెళ్ళి చెయ్యొచ్చు. మిగతా పిల్లల్ని కూడా ఒక దారిలో పడెయ్యొచ్చు. ఆయన చేత ట్యూషన్స్ మాన్పించాలి. రామం చదువు కూడా ఈ సంవత్సరంతో అయిపోతుంది. వాడు లాయరవుతాడు. వాడికీ కట్నం వస్తుంది. ఆలోచిస్తున్న సుందరమ్మ కాళ్ళకు నేల తగిలినట్టుగా వుంది. వెన్నెముకలోకి బలం వచ్చినట్టుగా వుంది. అలసిపోయిన శరీరానికి కొత్త రకం పట్టినట్టు వుంది. తమ కష్టాలు తీరాయి. ప్రతిదానికి తవుళ్ళట ఇక వుండదు. పాపం! ఆయన రక్తాన్ని నల్లుల్లా పీల్చేశాం! ఇక పర్వాలేదు. కొడుకు పెళ్ళి నిశ్చయం అయినప్పట్నుంచీ సుందరమ్మ ఆలోచనలు అలా సాగిపోతున్నాయి.
పెళ్ళి అయ్యింది. ఇస్తానన్న కట్నం ఇవ్వలేదు. కామేశ్వరరావు అడగడని సుందరమ్మకు తెలుసు.
'ఏమిటండీ మీరలా బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుంటే ఎలా?'
'ఏం చెయ్యమంటావ్?'
'ఆ కట్నం డబ్బు మనకివ్వాలని చెప్పండి'.
'మనకెందుకివ్వాలి? అది వాడి డబ్బు. కట్నం తీసుకోవడం నేరం. దాన్ని కట్నం అనకూడదు. ఆడపిల్లకు తల్లిదండ్రులు ఇచ్చుకునే స్త్రీ ధనంగా భావించాలి'
'అదేమిటండీ? కట్నం అనకూడదు. నిజమే. అయినా అందరూ మరోపేరుతో తీసుకుంటూనే వున్నారుగా? వాడ్ని కనిపెంచాం. వాడెవడు? మన బిడ్డ. వాణ్ణి ఇంతవాణ్ణి చేసిందెవరు? ఆడపిల్ల ఎదిగి కూర్చుంది. వాడి చదువుతోనే గుల్లయిపోయాం.
'అయితే కన్నందుకు పెంచాలి, ప్రయోజకుల్ని చెయ్యాలి. అది మన బాధ్యత. అందుకు ప్రతిఫలం కావాలంటావా?'
సుందరమ్మ భర్త ముఖంలోకి వెర్రి చూపులు చూసింది.
'పిచ్చిదానా బాధపడకు. సునందకు పెళ్ళి చెయ్యాల్సిన బాధ్యత నాది. నేనుండగా దాని పెళ్ళి వదినలు తెచ్చే డబ్బుతో చెయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు అనవసరంగా కట్నం విషయం కలుగజేసుకోకు' అని బయటికి వెళ్ళిపోయాడు.
సుందరమ్మకు కాళ్ళు ఊబిలోకి దిగబడి పోతున్నట్టుగా అన్పించింది. ఏమిటి ఇలా అయింది? ఆమెకు ఒక పట్టాన భర్త మాటల్లోని లాజిక్కు అంగీకరించాలనిపించలేదు.
'ఒరే రఘూ!' కొడుకును కేక పెట్టింది.
పెళ్ళి పందిట్లో స్నేహితుల మధ్య కూర్చుని వున్న రఘు లేచి లోపలకు వచ్చాడు.
'ఏమిటమ్మా?'
'అదేరా! ఆ కట్నం డబ్బు! మీ మామగారి దగ్గర వుండటం ఏమిటి?'
రఘు తల్లి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
'ఏమిట్రా అలా చూస్తావ్?'
'ఆ అది... అది... నాన్నా... మా మామగారు చూసుకుంటారు. మనకెందుకమ్మా?' తడబడుతూ అన్నాడు.
'అయ్యో రాత! మీనాన్న ఆమాత్రం కూడానా? మీ నాన్న సంగతి నీకు తెలియదా? ఆయన ప్రాణం పోయినా అడగరు.'
'మా మామగారి దగ్గరున్నా ఎక్కడికీ పోదమ్మా. విజయవాడలో నర్సింగ్ హోం కట్టిస్తానంటున్నారు. ఈ లోపల హౌస్ సర్జన్సీ పూర్తి అవుతుంది. అక్కడే ప్రాక్టీసు పెట్టిస్తానంటున్నారు.'
సుందరమ్మ ఓ క్షణం వీడు నా కొడుకేనా అన్నట్టు రఘు ముఖంలోకి చూసింది.
'అది కాదురా! చెల్లాయి పెళ్ళి చెయ్యాలి. మిగతా పిల్లలకు చదువులు పూర్తి కాలేదు. మీ నాన్నకా ఓపిక సన్నగిల్లింది. ట్యూషన్స్ చెప్పలేకపోతున్నారు. కట్నంలో కనీసం సగమైనా ఇస్తే కాస్త ఊపిరి సలుపుతుంది' మనసును చంపుకుని అన్నది సుందరమ్మ.
'అమ్మాయి పెళ్ళికి అప్పుడే తొందరేమొచ్చిందమ్మా? అయినా నాన్న నా డబ్బ తీసుకోవడానికి ఒప్పుకోరు'
'నీ డబ్బా. నీ డబ్బేమిటిరా! నువ్వు అప్పుడే పెళ్ళి పీటల మీద నుంచి లేచి కొన్ని గంటలయినా కాలేదు నీదీ... నాదీ అంటున్నావా? ఈ మాటలు సుందరమ్మ పెదవులు దాటి బయటకు రాలేదు.
'వస్తానమ్మా! స్నేహితులు నాకోసం చూస్తున్నారు' అంటూ బయటకు వెళ్ళిపోయాడు రఘు.
బయటకి వెళ్ళిపోతున్న పెద్ద కొడుకును కళ్ళప్పగించి చూస్తూ నిల్చుండే పోయింది సుందరమ్మ.
వీడు... వీడు... తన పాలు తాగి... తన అడ్డాలో పెరిగిన బిడ్డేనా? తను నవమాసాలు ఆనందంగా మోసి కన్న బిడ్డేనా? 'డాక్టర్ చదవాలని వుంది! నాన్నకు చెప్పి ఎలాగయినా ఒప్పించమ్మా' అంటూ తన వెనుక వెనక తిరిగిన కొడుకేనా వీడు? ఎంత మారిపోయాడు? కొన్ని గంటల్లోనే? ఎంత దూరంగా జరిగిపోయాడు?
సుందరమ్మ కాళ్ళల్లో సత్తువను ఎవరో లాగేసినట్టుగా అయింది. నిల్చోలేనట్టు గోడకు చేరబడి కూర్చుండి పోయింది.
* * *
'ఎక్కడ్నుంచి ఉత్తరం?' కొంగుకు చేతులు తుడుచుకుంటూ వంటింట్లోనుంచి బయటి కొచ్చింది సుందరమ్మ.
కామేశ్వరరావు మౌనంగా వుండిపోయాడు.
'మాట్లాడరేమండీ?'
'నువ్వే చదువు.' అని ఉత్తరం అందించాడు భార్యకు.
సుందరమ్మ గోడకు చేరబడి కూర్చుని చదవసాగింది.
'రఘు నర్సింగ్ హోం పూర్తయింది. ప్రారంభం వచ్చేనెల ఐదో తేదీ అని రాశాడు. మీరు వెళ్తారా?'
'చూద్దాంలే!'
'చూద్దాంలే ఏమిటి? మనం వెళ్ళకపోతే వాడు బాధ పడడూ?'
'కరెక్టు తేదీ మళ్ళీ రాస్తానన్నాడు కదా! రాయనియ్!' నిర్లిప్తంగా అన్నాడు కామేశ్వరరావు.
'ఏమిటిద్దరూ చాలా దీర్ఘాలోచనలో వున్నట్టున్నారు?'
ఇద్దరూ చివ్వున తలెత్తి చూశారు. సుందరమ్మ లేచి నిల్చుంటూ 'రండి అన్నయ్యా! అబ్బ! ఎంత కాలం అయింది మిమ్మల్ని చూసి' అన్నది లోపలికి వచ్చిన రామనాధంతో.