Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 14

    రామనాథం అక్కడ ఒక చెయ్యి విరిగిపోయి వున్న చెక్క కుర్చీలో కూర్చున్నాడు.
    'ఇంతకాలం ఏమయ్యావయ్యా?' కామేశ్వరరావు స్నేహితుణ్ణి ఆప్యాయంగా చూస్తూ అడిగాడు.
    'ఎంతకాలం అయింది? మూడు నెలలేగా?'
    'ఎంతో కాలం అయినట్టుగా వుంది సుమా?' అన్నది సుందరమ్మ.
    'ఇంతకూ ఎక్కడి కెళ్ళావయ్యా? తీర్ధయాత్రలా?'
    'కాదు. మామేన కోడలి పెళ్ళికి వెళ్ళాం. అలాగే బంధువులందర్నీ ఊళ్ళు తిరిగి మరీ చూసొచ్చాం. నేనా రిటైర్ అయ్యాను. పిల్లా పీచు లేనివాళ్ళం. ఎక్కడ తిరిగినా బెంగేమీ ఉండదు.'
    'నువ్వు అదృష్టవంతుడివయ్యా రామనాధం'
    'నేను అదృష్టవంతుడివయ్యా రామనాధం'
    'నేను అదృష్టవంతుడినా? పెద్దవాళ్ళం అవుతున్నాం. రేపు ఏకాలో చెయ్యో పడిపోతే మమ్మల్ని చూసే వాళ్ళెవరు?'
    'ఏదో మన పిచ్చిగాని ఈ రోజుల్లో పిల్లలు మాత్రం పట్టించుకుంటున్నారా? రెక్కలు వచ్చేంత వరకే. లేకపోతే ఒకటే బాధ. ప్రయోజకులైన బిడ్డలు వుండీ - దిక్కులేని వాళ్ళలా బతకడం ఎంత నరకమో ఒక్కసారి ఊహించుకో' అన్నాడు కామేశ్వరరావు ఆలోచిస్తూ, తనకు తనే చెప్పుకుంటున్నట్టుగా.
    సుందరమ్మ తృళ్ళిపడి, చివ్వున తలతిప్పి భర్త ముఖంలోకి చూసింది.
    'ఊరుకుందురూ! మీరు మరీనూ. పిల్లలెందుకు చూడరు? ఎక్కడో ఒకడు దుర్మార్గుడుండాడేమో? అన్నయ్యా ఎందుకలా ఇదై పోతారు? మిమ్మల్ని మేం చూసుకుంటాంగా?'
    'చాలమ్మా చెల్లమ్మా! అంతమాట అన్నావు అంతే చాలు. అది సరే! రఘుకు హౌస్ సర్జెన్సీ అయిపోయిందా?'
    'ఆ! అయిపోయిందన్నాయ్యా! వచ్చే నెల్లో విజయవాడలో నర్సింగ్ హోమ్ ప్రారంభించబోతున్నాడు.' 'ఆహా! అయితే వచ్చేనెల మీ ఇద్దరికీ ప్రయాణం అన్నమాట!'
    'అయ్యో మేం వెళ్ళకుండా ఎలా వుంటాం? అన్నయ్యా, మీరూ వదినా కూడా రాకూడదా? మీరు చిన్నప్పుడు వాడ్ని ఎంత ప్రేమగా చూసేవారు? వాడు కూడా సంతోషిస్తాడు.'
    'అలాగేనమ్మా! మాకు మాత్రం ఇక్కడ జరగందేముంది? ఈ రెండు రోజులు కాలక్షేపం మీ అందరితో, అంటూ కామేశ్వరరావు ముఖంలోకి చూసాడు. కామేశ్వరరావు మౌనంగా, వినిపించుకోనట్టే ఉండిపోయాడు.
    వీడేమిటలా మౌనంగా ఉండి పోయాడు? నేను నిజంగానే తమ వెంటబడి కొడుకింటికి వచ్చి తిష్ట వేస్తాననుకున్నాడేమో! ఛ! కామేశం అంత తక్కువ స్థాయిలో ఆలోచించే మనిషి కాదు. మొయ్యలేని బరువుతో సతమతమై పోతున్నాడు పాపం! అంతే!
    'ఆ రామం లా పూర్తి చేశాడుగా. ఇక ట్యూషన్స్ మానెయ్ కామేశం. ఇద్దరు కొడుకులు ప్రయోజకులయ్యారు. సంపాదిస్తున్నారు. తమ్ముళ్ళ బరువు బాధ్యతలు వాళ్ళే చూసుకుంటారు.
    'నేనూ అదే ఆలోచిస్తున్నాను' సుందరమ్మ రామనాధం మాటతో మాట కలిపింది.
    'చిన్నవాళ్ళు. ఇప్పుడే వాళ్ళ మీద బరువు బాధ్యతలు ఎందుకు పడెయ్యాలి? నాకింకా ఓపికుందిగా? అదీగాక రామం ఎవరి దగ్గరో జూనియర్ గా చేరాడు. ఒక లాయర్ కు ఈ రోజుల్లో నిలదొక్కుకుని, పేరు తెచ్చుకోవాలంటే అంత తొందరగా అయ్యే పనా? వాడి ఖర్చులకు వాడు సంపాదించుకుంటే చాలు. నన్ను డబ్బు పంపించమని అడగకుండా' అన్నాడు కామేశ్వరరావు.
    'చంద్రం బి.ఏ. తరువాత ఏం చేస్తానంటున్నాడు. ఇంజనీరింగుకి పంపిస్తే బాగుండేది.'
    'కాని వాడే చదవనన్నాడు!'
    'అవునన్నాయ్యా! వాడి బుద్దే వేరు. ఇంజనీరింగు చదవను అన్నాడు. టీచర్ ట్రైనింగై వాళ్ళనాన్న బరువు బాధ్యతల్ని కూడా పంచుకోవాలంటున్నాడు'
    'మీకేం! రత్నాల్లాంటి బిడ్డలు!'
    'అందరూ ముందు అలాగే అనుకుంటారులే' అనాలనుకున్నాడు కామేశ్వరరావు. కాని పైకి అనలేకపోయాడు.
    'నాకు మా నాలుగో వాడిదే దిగులు' అంది సుందరమ్మ.
    'అవును! అడగడం మర్చే పోయాను. వాడు ఇంకా తిరిగి రాలేదా?'
    'లేదన్నయ్యా! నాకు వాడు తిరిగి వస్తాడనే నమ్మకం కూడా లేదు. వాడి మాటలూ, వాడి చేష్టలూ తల్చుకుంటే నాకు భయం వేస్తూ ఉంటుంది. ఏమైపోయాడో? సరిగా తింటున్నాడో లేదో? చిన్న సన్నాసి' సుందరమ్మ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.  
    'రాక ఎక్కడికి పోతాడమ్మా. వాడే తిరిగొస్తాడు తొందర్లోనే. చూస్తుండు'
    'ఏమో అన్నయ్యా! వాడికి మహా అభిమానం. పరీక్ష తప్పాడని ఆయన చితక బాది, 'పో! నాయింట్లోనుంచి' అని బయటికి నెట్టారు. వాడు... రాడు... రాడు...' వచ్చే దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తూ కొంగుతో నీళ్ళు తుడుచుకుంది.
    'నాకు మాత్రం ప్రేమలేదా?పది తప్పాడని కోపంతో కొట్టాను. భయపెట్టాలని బయటికి నెట్టి వెళ్ళి పొమ్మన్నాను. నిండా పదహారేళ్ళు లేవు. వెళ్ళిపొమ్మనగానే వెళ్ళిపోతాడని నేను మాత్రం అనుకున్నానా?' ఎంత దాచుకోవాలని ప్రయత్నించినా కామేశ్వరరావు గొంతులో బాధ ధ్వనించింది.
    'బాధ పడకండి. సత్యం మంచి కుర్రాడు. వయసుకు మించిన ఆలోచన వాడిది. ఎవరు బాధపడ్డా చూడలేని మనస్తత్వం. తప్పక వస్తాడు. ఆ మాటల్లో కూర్చుండి పోయాను. పొద్దు పోయింది. మీ వదిన నాకోసం చూస్తూ ఉంటుంది. వస్తానమ్మా! వస్తారా కామేశం!' అంటూ లేచి వెళ్ళిపోతున్న అతని వెంట భార్యాభర్తలు వీధి తలుపు దాకా వెళ్ళి సాగనంపారు.
                               *   *   *
    పోస్టుమాన్ ఉత్తరాలు ఇచ్చి వెళ్ళాడు. అందులో ఆహ్వాన పత్రికలా వున్న కవరు తీసి చూసింది సుందరమ్మ. ముందు పెళ్ళి కార్డు అనుకుంది. తీరా చదివి నిశ్చేష్టురాలే అయింది. కొద్ది నిమిషాలు అయోమయంగా ఆ అక్షరాల కేసి చూస్తూ వుండిపోయింది.
    ఎల్లుండి నర్సింగ్ హోమ్ ఓపెనింగా? ఆరోగ్యశాఖ మంత్రి హైదరాబాదు నుంచి వస్తున్నాడా? మామగారు పేరు మీద ఆహ్వానాలు వేశారా? రోజూ తన కొడుకు ఉత్తరం కోసం ఎదురు చూస్తూనే వుంది. ఎంతో మందితో చెప్పింది తను విజయవాడ వెళ్తున్నట్టు.
    ఆ రోజంతా మనసు మనసులో లేదు. ఒక యంత్రంలా ఇంటిపని చేసింది. పిల్లలకు అన్నాలు పెట్టింది. రమేశ్, సునందా అన్నాలు తిని హోంవర్కు చేసుకుంటున్నారు.
    కామేశ్వరరావు ట్యూషన్స్ ముగించుకుని ఇంటికి వచ్చాడు. అలసిపోయి వున్నాడు. రోజూ ఎదురుగా వచ్చే భార్య రాలేదు. వరండాలో ఈజీ చైర్లో కూర్చున్నాడు. పక్కగదిలో నుంచి పిల్లలు కీచులాడు కోవడం విన్పిస్తూ వుంది. సుందరమ్మ గొంతు విన్పించలేదు. ఏమైంది? వంట్లో బాగా లేదా? ఆతృతగా లేచి లోపలకు వెళ్ళాడు. గోడకి చేరబడి, ఏదో ఆలోచిస్తూ కూర్చున్న సుందరమ్మను చూసి ఆశ్చర్యపోయాడు.
    'ఏమిటి సుందరీ? ఏమైందీ?'
    సుందరమ్మ గబుక్కున లేచి నిల్చుంది. 'అయ్యో మీరు వచ్చారా? నేను చూడలేదు. ఇంతసేపూ బయటే నిల్చుని ఇప్పుడే లోపలికి వచ్చాను. ఇవ్వాళ మరీ ఇంత ఆలస్యం అయిందేం?'
    'ఇవ్వాళ ఆలస్యం అవ్వడం ఏమిటి? గంట ముందే వచ్చాను. భద్రయ్య గారి కొడుకు ట్యూషన్ కు రాలేదు. అది సరే! ఏం జరిగిందో చెప్పు. ఎందుకలా వున్నావ్.
    'ఎలా వున్నాను? బాగానే వున్నాను. కాస్త తలనొప్పిగా వుంటే... మీరు పదండి. నీళ్ళు తోడ్తాను స్నానానికి'
    'ఇవ్వాళ ఉత్తరాలు ఏమీ రాలేదా?'

 Previous Page Next Page