అదే పుస్తకాన్ని సరోజకు నోట్సు రాసుకోవడానికి ఇచ్చింది. ఆ వుత్తరం సరోజ చేతిలో పడింది. అది ప్రేమలేఖ కింద సంతకం లేదు. సరోజ నివ్వెరపోయింది. గీత మీద కోపం వచ్చింది. ఇలాంటి కారెక్టర్ లేని దానితో తన అన్న వివాహం జరుగకూడదు. అన్నకు ఆ వుత్తరం ఇచ్చింది.
రమేశ్ గీతను వివాహం చేసుకోనన్నాడు - కారణం తెలియక గీత తల్లిదండ్రులు బాధపడ్డారు. సరోజ గీతతో మాట్లాడడం మానేసింది. ఎంత ఆలోచించినా గీతకు కారణం అర్థం కాలేదు.
రమేశ్ పెళ్ళి వేరే అమ్మాయితో నిశ్చయం అయింది. గీత తల్లిదండ్రులు రమేశ్ తల్లిదండ్రులను నిలదీసి అడిగితే ఆ ఉత్తరం చూపించారు. గీత తల్లిదండ్రులు అవమానంతో కుంగిపోయారు. గీతను నానా మాటలు అన్నారు. గీత ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఆ తర్వాత గీత విరక్తితో వివాహమే వద్దు అన్నది. టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. ఒకసారి మాటల సందర్భంలో నాకు ఈ విషయం చెప్పి ఎంతో బాధపడ్డది చిన్న పొరపాటుతో గీత సుందర స్వప్నం కుంగిపోయింది.
మద్రాస్ లో వుంటున్న రోజుల్లో రాణికి నాతో పరిచయం అయింది. ఎం.ఏ.లో వుండగా ఆమె వివాహం జరిగింది వివాహం అయాక కూడా ఆమె చదువుతానని పట్టుబట్టింది. భర్తకు యిష్టం లేదు. చివరకు ఎలాగో అంగీకరించాడు. రాణి బి.ఏ. చదివే రోజుల్లో ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆమె ప్రేమించిన కుర్రవాడు చెప్పాపెట్టకుండా ఫారిన్ వెళ్ళిపోయాడు. రాణికి వివాహం జరిగింది. పుస్తకంలో పెట్టిన ఫోటో మర్చిపోయింది.
ఆ ఫోటో ఎక్కడో పోయింది అనుకుంది. అత్తవారింటికి తన పుస్తకాలన్నీ తెచ్చుకున్నది. రాణి పుస్తకాలు ఎక్కువ చదివేది. ముఖ్యంగా నవలలు ఒకరోజు రాణి మరిది రాణి పుస్తకాలలో నుంచి ఒక నవల చదవడానికి తీసుకున్నాడు. అందులో నుంచి ఫోటో కింద పడింది. ఆ ఫోటో చూసి అతను ఆశ్చర్యపోయాడు.
"వదినా: రమణ నీకు తెలుసా?" అని ప్రశ్నించాడు.
రాణి ఉలిక్కిపడింది. రమణ ఆమె మరిది క్లాసుమేట్. అతను ఎందరో ఆడపిల్లల్ని మోసగించాడని అతనికి తెలుసు.
"ఏ రమణా? నాకు తెలియదే?" తడబడుతూ అన్నది.
ఆమె మరిది ఫోటో చూపించాడు. ఆమె ఉలిక్కిపడింది. నిలువెల్లా కంపించిపోయింది ఒక క్షణం వదిన ముఖాన్ని చూసి ఆ ఫోటోను చిన్న చిన్న ముక్కలుగా చింపి పారేశాడు. ఆమె ఇంకా వణికిపోతూనే వుంది.
"వదినా ఇతరుల కళ్ళలో పడకూడని వస్తువుల్ని పుస్తకాలలో దాచుకోవడం కంటే తెలివి తక్కువతనం మరోటి వుంటుందా? అన్నయ్య అసలే అనుమానం మనిషి. అదృష్టవశాత్తు అతని చేతిలో పడలేదు ఆ ఫోటో: భయపడకు నేను ఎవ్వరికి చెప్పనులే.
చిన్నతనంలో ఇలాంటి సంఘటనలు చాలామంది జీవితాలలో జరుగుతాయి. మగ పిల్లల విషయంలో పట్టించుకోరు. ఆడపిల్లల జీవితంలో దీన్ని ఒక మచ్చగా భావిస్తారు. ఇంతటితో ఈ విషయం ఇద్దరం మర్చిపోదాం." అన్నాడట.
రాణి మరిదికి రెండు చేతులూ ఎత్తి కృతజ్ఞతా సూచకంగా నమస్కరించింది. రాణి మరిది విశాల హృదయుడూ, సంస్కారం కలవాడూ కనక సరిపోయింది. లేకపోతే రాణి సంసారంలో కలతలు రేగేవి. భర్త జీవితమంతా భార్యను వేధించి ఉండేవాడేమో! లేక వదిలేసే వాడేమో! ఇప్పుడు రాణికి ఇద్దరు పిల్లలు. హాయిగా సంసారం చేసుకుంటూ ఉన్నది. అయినా ఆ మరిది అంటే గౌరవంతో పాటు ఆమెకు భయం కూడా వున్నది.
ఇక రూపాయి నోట్ల సంగతి చెప్పనక్కరలేదు. విద్యార్థుల దగ్గిర నుంచి వృద్ధుల వరకూ ఇటువంటి అలవాటు ఉంటుంది. ఒకసారి నేను మద్రాసు మూర్ మార్కెట్ లో (ఆస్కార్ వైల్డ్ కంప్లీట్ వర్క్సు) పుస్తకం కొన్నాను. పది రూపాయలకు కొన్నాను. రెండు మూడు నెలల తర్వాత ఆ పుస్తకం తెరిచి చదవసాగాను.
పుస్తకం మధ్యలో వంద రూపాయల నోటు (బాగా మాసింది) కనిపించింది. పుస్తకం పైన పేరు చూశాను. కుప్పుస్వామి ఎం.ఏ. అని ఉన్నది. అతన్ని తల్చుకొని జాలిపడ్డాను. ఇంత మంచి పుస్తకాన్ని అతను సెకెండ్ హాండ్ బుక్ షాప్ లో ఇచ్చాడంటే ఎంత డబ్బు అవసరంలో ఇచ్చి ఉంటాడో చెప్పవలసిన అవసరం లేదు.
ఎప్పుడో ఆ నోటు పుస్తకంలో పెట్టి మర్చిపోయి వుంటాడు. లేక ఎక్కడో అప్పు తెచ్చుకున్న ఆ నోటు కోసం ఇల్లంతా గాలించి ఉంటాడు. ఏ పరీక్ష ఫీజు కట్టడానికో, ఏ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోవడానికో ఆ డబ్బు సంపాదించుకొని ఉండవచ్చును. చివరికి ఆ నోటు దొరక్క అమ్మేసి వుంటాడు. అంత చదువుకున్న వ్యక్తి ఎంతో ఆర్ధిక ఇబ్బందిలో ఉంటే కాని అలాంటి పుస్తకాన్ని అమ్మి వెయ్యడు.
అదే రోజు అదే షాపులో షేక్ స్పియర్ కంప్లీట్ వర్క్సు కూడా కొన్నాను. దాని మీద కూడా కుప్పుస్వామి ఎం.ఏ. అనే రాసి వుంది. నాకు చాలా బాధ అనిపించింది. ఆ నోటును ఏం చెయ్యాలి? అతనెవరో తెలియదు. పుస్తకాల షాపు కూడా ఏదో సరిగా గుర్తు లేదు. పైగా మద్రాసు వెళ్ళాలి. చివరకు చాలా కాలం ఆ నోటు అలాగే ఉంచి, ఎవరో చందాకు వస్తే ఇచ్చేశాను.
ఒకోసారి ఎవరికో ఉత్తరం రాస్తాం. ఫ్యూన్ నో, ఇంట్లో ఉన్న కుర్రవాడితోనో పోస్టు చెయ్యమంటూనే ఏదో పక్కనే ఉన్న పుస్తకంలో పెట్టేస్తాం, అతడు ఏదో పనిలో ఉండటం చూసి. ఆ తర్వాత ఆ ఉత్తరం తీసి అతనికి ఇవ్వడం మర్చిపోతాం. మనం రాసిన ఉత్తరానికి జవాబు కోసం ఎదురు చూస్తాం. ఎంతకాలానికి జవాబు రాదు.
ఆ ఉత్తరం వాళ్ళకు అందలేదని తెలిసి, పోస్టు బాక్సులో వెయ్యవలసినవాడు వెయ్యలేదని అతని మీద కోపం వస్తుంది. ఏదో అంటాం అనుకోకుండా ఒక శుభముహూర్తాన ఆ ఉత్తరం ఏదో పుస్తకంలో నుంచి మనలిని పలుకరిస్తుంది.
నాకూ ఒకప్పుడు ఆ అలవాటు ఉండేది. రూపాయి నోట్లతోపాటు బస్ పాస్ కూడా పుస్తకాలలో పెట్టేదాన్ని. నా బస్ ఫ్రెండ్ విజయలక్ష్మి నా పక్క సీట్లో కూర్చుంది. నా పర్సు కింద ఉన్న తెలుగు నవల చూసి ఇస్తానని తీసుకొని చదవసాగింది. ఆమె అమీర్ పేటలో దిగిపోతుంది. పుస్తకంలో మునిగిపోయిన ఆమె బస్ ఆగడాన్ని గుర్తించలేదు.
బస్ కదలబోయేముందు ఆదరాబాదరాగా దిగిపోయింది. పుస్తకంతో సహా. కిటికీలో నుంచి రోడ్డు కేసి చూస్తూ ఆలోచనల్లో మునిగి ఉన్న నన్ను కండక్టర్ టికెట్ అడిగాడు. "పాస్"! అన్నాను. అలవాటు ప్రకారం సాధారణంగా పాస్ చూపించమని అడగరు. ఆ రోజు ఆ కండక్టరు పాస్ చూపించమన్నాడు. అతను ఆ రూట్ లోకి కొత్తగా వచ్చాడు. నేను పుస్తకం కోసం వెదికాను కనిపించలేదు విజయలక్ష్మి పుస్తకం తీసుకొని దిగిపోయిందని అర్థం చేసుకున్నాను.
అప్పటికే ఆ బస్ అమీర్ పేట దాటి పంజాగుట్ట చేరింది. నేను తెల్లముఖం వేశాను. కండక్టర్ నాముఖంలోకి అదోలా చూశాడు. నేను పర్సులో నుంచి డబ్బుతీసి టికెట్ కొన్నాను. నా దరిదాపు సీట్లలో వాళ్ళు నన్ను ఎలా చూసి వుంటారో చూడకుండానే వూహించుకున్నాను. కండక్టర్ ఏదో గొణుక్కున్నాడు.
"ఈ రోజుల్లో ఆడవాళ్ళు, పైగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా.... ...." అంటూ వెనక నుంచి చిన్నగా వినిపించింది. అవమానంతో సిగ్గుతో బస్ తో సహా భూమిలోకి కుంగిపోవాలనిపించింది. నేను సంజాయిషీ చెప్పుకున్నా ఎవరూ నమ్మరు.
ఆనాడే నేను పుస్తకాలలో నోట్లూ వగైరా పెట్టే అలవాటు నుంచి బయట పడ్డాను.
అబల సబల కావాలంటే?....
కనుచీకట్లు కమ్ముకుంటున్నాయి. అవంతి ఆ రోజు స్పెషల్ క్లాసుకు అటెండు అయి ఆలస్యంగా కాలేజీ నుంచి ఇంటికి వెడుతున్నది. ఆమె ఉండే కాలనీకి వెళ్ళాలంటే మధ్యలో రెండు, మూడు ఫర్లాంగుల దూరం ఒక మైదానం దాటి వెళ్ళాలి. ఆ మైదానంలో నడిచిందో, లేదో వెనక నుంచి ఒక యువకుడు ఆమెను పట్టుకున్నాడు.
మరుక్షణంలో ఆ యువకుడు బిళ్ళంగోడులా ఎగిరి అల్లంత దూరంలో "అమ్మా" అంటూ పడ్డాడు. దూరంగా నిల్చుని వున్న అతని స్నేహితుడు కాలికి బుద్ధి చెప్పాడు. ఆ అమ్మాయి కూడా ఇంటికే పరుగు తీసింది. ఇంతకీ ఏమైంది? కొంచెం ఆగండి చెబుతాను.
అక్కకు జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వస్తే, చెల్లెలు రాజమండ్రి నుండి బయలుదేరి హైదరాబాదు చేరుకుంది. స్టేషన్ బయట ఆటో ఎక్కింది. ఫలానా కాలనీ ఎక్కడో తనకు తెలియదనీ, ఆ కాలనీకి తీసుకు వెళ్ళమనీ ఆటోవానితో చెప్పింది. ఆటో వెళ్ళుతున్నది. ఎంతకూ ఇల్లు రాదు. ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది.
"ఏయ్! ఎక్కడికి వెళ్ళుతున్నావ్?" "అన్నది." "చుప్ రహో!" అరిచాడు ఆటోవాడు. ఆ అమ్మాయి అరిచినా ఆ దరిదాపుల్లో వినేవారు లేరు. నోరుమూసుకొని కూర్చుంది. హైదరాబాద్ నగరం దాటి రోడ్డు పక్కగా ఆటో ఆపాడు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఉన్నాయి. చెట్ల వెనక పొలాలు ఉన్నయ్.
ఎక్కడా జనసంచారం లేదు. ఆటో ఆగిందో, లేదో ఆటో డ్రైవర్ మూర్ఛపోయాడు ముందుకు ఒరిగిపోయాడు సునంద ఆటో నుంచి దిగింది. పెట్టె చేతిలో పట్టుకొని వడివడిగా పట్నం వైపు నడక సాగించింది పది నిమిషాల్లో వెనుక నుంచి వస్తున్న లారీని చూసింది చెయ్యి చూపించింది. జరిగిన సంగతిని తెలుసుకొని లారీ డ్రైవర్ ఆ అమ్మాయిని లారీలో ఇంటికి చేర్చాడు.
ఒక అమ్మాయి బస్ స్టాండులో నిల్చుని ఉన్నది. ఇద్దరు కుర్రవాళ్ళు ఫోజులు కొట్టసాగారు. పక్కగా వచ్చి వెకిలి పాటలు పాడసాగారు. ఆ అమ్మాయి గిర్రున తలతిప్పి చూసింది ఆ చూపులో ఏం కన్పించిందో వాళ్ళు దిక్కులు చూడసాగారు. చిన్నగా అక్కడనించి తప్పుకున్నారు. అందులో ఒకడు "ఇది కూడా ట్రైనింగ్ అయినట్టే ఉందిరోయ్!" అనడం విన్పించి ముసిముసిగా నవ్వుకుంది ఆ అమ్మాయి.