మొహం కడుక్కుని, ఉదయార్కర్ ఇంటికి వెళ్ళాడు. ఉదయార్కర్ వాళ్ళ ఇల్లు అభిషేకన్ ఇంటి దగ్గరే. ఉదయార్కర్ మంచి శ్రోత అని అభిషేకన్ కి తెలుసు. ఎవరిమీ చెప్పినా ఓపికగా వింటాడు ఉదయార్కర్. అని కూడా అతనికి తెలుసు. ఆ విన్నదంతా సందర్భానుసారంగా తన రచనల్లో ఉపయోగించుకుంటాడని అతనికి తెలియదు.
* * * *
ఎడిటర్స్ ఆఫీసునుంచి బ్రిటీష్ లైబ్రరీకి వెళ్ళాడు ఉదయార్కరు. ఎన్ సైక్లోవీడియా బ్రిటానికా తీసి "ట్రెజర్స్ " గురించి చదవటం మొదలెట్టాడు. రిఫరెన్స్ కోసం కొన్ని పాయింట్లు నోట్ చేసుకుని, అక్కడి నుంచి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళాడు. కొన్ని చరిత్ర పుస్తకాలు తిరగేశాడు.
లైబ్రరీ నుంచి అర్కియాలిజీ డిపార్టుమెంటుకి వెళ్ళాడు ఉదయార్కరు. అక్కడ పనిచేసే ఆఫీసరు ఒకాయన అతనికి పరిచయం.
కాసేపు టీలతో పిచ్చా పాటీలతో గడిచాక సంభాషణని జాగ్రత్తగా నిధుల మీదికి, ట్రెజర్ హంట్ మీదికి మళ్ళించాడు ఉదయార్కర్.
"ఈ నిధులు దొరుకుతూ ఉండడం నిజమేనా?"
"యూ మీన్ ట్రెజర్ ట్రోవ్స్" అన్నాడా ఆఫీసరు. "ఎస్ దొరుకుతూనే వుంటాయి అప్పుడప్పుడూ. కానీ ఎప్పుడూ కూడా ఫలాన చోట ఉందని ఉహించి త్రవ్వితే దొరకవు. ఫలానచోట నిధి ఉందని చెప్పడం , అంజనం వేసి చూడడం , త్రవ్వడం దొరకడం యివన్నీ హంబగ్! ఉత్త ఫ్రాడ్! నిదులంటూ దొరికితే అవి ఎప్పుడూ ఏక్సిడెంట ల్ గా దొరుకుతూ వుంటాయి."
"నిధులు కోసం మీ డిపార్టుమెంట్ వారు త్రవ్వకాలు సాగించారా."
"చాలా అరుదుగా"
"ఎందుకని?"
"చెప్పానుగా! ఇలాంటి విషయాల్లో నమ్మకమైన ఇన్ఫర్మేషన్ దొరకదు. దొరికిన ఇన్ఫర్మేషన్ నమ్మదగినదిగా వుండదు."
"అంటే మీకు ఇన్ఫర్మేషన్ అంటూ వస్తూనే వుంటుందన్నమాట"
"రావదానికేం! వస్తూనే వుంటుంది. కానీ దాన్లో ముప్పాతిక మూడొంతులు అభూతకల్పన, మూడనమ్మకాలూ, కొంత అజ్ఞానం, కొంత ఫ్రాడ్: ఆవి కొన్ని సందర్భాల్లో ప్రాక్టికల్ జోక్స్ కూడా ఉంటాయి."
"నమ్మకమయిన ఇన్ఫర్మేషన్ వస్తే మీరు త్రవ్వకాలు సాగిస్తారా?"
"చాలా నమ్మకం కుదిరితే ఇలాంటి విషయాలలో మేము జోక్యం చేసుకోము. ఎందుకంటే చాలా వ్యయప్రయాసలతో కూడిన పని యిది. దానికి ఎన్నో డిపార్టుమెంట్ ల సహకారం, సమన్వయము కావాలి. రెవిన్యుడిపార్టుమెంట్, పోలీస్ , ఆర్కియాలజీ డిపార్టుమెంట్, జియాలాజికల్ సర్వే.......ఇలా ఎన్నో డిపార్టుమెంట్స్ మధ్య కో ఆర్డినేషన్ ఉంటేగానీ పని పూర్తీ కాదు. అందుకనే రూమర్సుని నమ్మి మేము జోక్యం కలిగించుకోము."
"మీ త్రవ్వకాలలో...మీరన్నట్లు యాక్సిడెంటల్ గానే అనుకుందాం.............నిదులేప్పుడన్నా దొరికాయా?"
ఫోన్ మోగింది.
ఆ ఆఫీసరు రిసీవర్ ఎత్తి కాసేపు విని, "ఎక్స్యుజ్ మీ! నాకు అర్జెంట్ కాన్ఫరెన్స్ ఒకటి వుంది వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడన్నా లీజర్ గా కలుద్దాం. ఫోన్ చేసి రండి." అన్నాడు కరస్పర్శకై చెయ్యి జాస్తూ.
ఇంక చేసేదేమీలేక అక్కడనుంచి బయలుదేరి ఇంటికి వచ్చాడు ఉదయార్కర్. స్నానం చేసి వరండాలో కూర్చుని, తన ఇండోర్ ప్లాంట్స్ వైపు చూస్తూ సీరియల్ మీద ఆలోచనలన్నీ కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
అప్పుడు వచ్చాడు అభిషేకన్.
"ఇవాళ పెద్ద ఎడ్వంచరయిందండీ!" అన్నాడు ఎగ్జయిటేడ్ గా.
ఏమిటన్నట్లు చిరునవ్వుతో చూశాడు ఉదయార్కర్.
"ఇవాళ టామిల్ సినిమా చూశాను. అబ్బ! టైటిల్ ఎంత బాగుందండీ. అబ్బే! తెలుగులోనూ పెడతారు టైటిల్స్! కత్తుల రత్తయ్యా, కటకటాల రుద్రయ్యా అంటూ."
"కటకటాల రుద్రయ్య అనే సినిమా తమిళంలో కూడా తీసారుగా. పట్టాకత్తి భైరవన్ అని! అదీ దాదాపు అలాంటి టైటిలేగా!"
ఒక్క క్షణం పాటు బిక్కచచ్చిపోయి, తర్వాత రేసుకుక్కలా వెంటబడ్డాడు అభిషేకన్. "అందులో శివాజీ అండీ! శివాజీ ఏం చేసినా చెల్లుతుంది. అయన నడిగర్ తిలక్కం తెలుసా! ఆయనకీ మీ తెలుగు యాక్టర్స్ కీ పోలికేక్కడా! అబ్బే! తెలుగు లాభం లేదండీ! అబ్బ టామిల్ ఎంత బాగుంటుందో!"
ఇక ఆ సంభాషణ పొడిగించడం ఇష్టం లేక ఊరుకున్నాడు ఉదయార్కర్.
"ఇంతకీ నేను చేసిన అడ్వెంచరు ఏమిటని అడగరేం?" అన్నాడు అభిషేకన్.
"చెప్పండి!"
"సినిమా కెళ్ళానని చెప్పానుగా! అందర్లాగా క్యూలో నిలబడి టిక్కెట్టు కొనడం మనకెప్పుడూ అలవాటు లేదు. చేతిలో ఫోన్ ఉంటుందిగా! పోలీస్ డిపార్టుమెంట్ కి ఫోన్ కొట్టాను. వాళ్ళు గడగడలాడిపోతూ ఒక కానిస్టేబుల్ ని పంపి ఒకటికి రెండు టిక్కెట్లు తెప్పించారు. ఆ ఎక్స్ ట్రా టిక్కెట్టు మా ఫ్రెండు కి ఇచ్చేశాను. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంటే మళ్ళీ కానిస్టేబుల్ కనబడి సెల్యూట్ చేశాడు. పోన్లే అని అతనికి ఇందిరా పార్కు దాకా లిప్టు ఇచ్చి అప్పుడప్పుడు కనబడుతూ వుండమని చెప్పాను. వాడింక మన గులాం అనుకోండి! మీకేప్పుడన్నా పోలీస్ డిపార్టుమెంట్ లో పని ఉంటే చెప్పండి! చిటికెలు వేసి చేయించేస్తాను."