నవ్వాడు ఉదయార్కర్.
"నేను కూడా చిన్న అడ్వెంచరు చెయ్యబోతున్నాను" అన్నాడు.
"ఏమిటది" అన్నాడు అభిషేకన్ ఆత్రంగా.
తను రాయబోతున్న నవలా, దానికోసం చెయ్యబోతున్న అన్వేషణా టూకీగా చెప్పాడు ఉదయార్కర్.
వెంటనే, అసలే నల్లగా ఉండే అభిషేకన్ మొహం మరింత నల్లబడిపోయింది.
నభూతో నభవిష్యతి అనిపించే అలాటి ప్రయోగం తెలుగులో వస్తుందనే ఊహ అతనికి దుర్భరంగా తోచింది. అందుకని పుల్ల విరుపుగా ఏం మాట వెయ్యాలా అని కొద్దిక్షణాలు అలోచించి అన్నాడు.
"వేస్టండీ! ఇది పాతికేళ్ళ క్రితమే టామిల్ లో వచ్చేసింది. ఇంకమీరు రాయడం పరమ దండగ. చెబుతున్నా కదండీ! అబ్బే! తెలుగు వాళ్ళకి అసలు ఒరిజనల్ థాట్ రాదండీ! అబ్బ! టామిల్ లో అయితేనా! తెలుగంతా టామిల్ నుంచీ కాపీ అండీ! మీరు రాసే మేగజైనులో ఫీచర్లూ, జోకులూ అన్నీ కూడా టామిల్ నుంచి కాపీ కొట్టినవే! దండగండీ."
శల్యసారద్యంలా ఉంటాయి అభిషేకన్ మాటలు. మాటలతో మనసు విరిచేయ్యగలరు అతడు.
అతనిలాంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలు! వేరే శత్రువులు అక్కర్లేదు!
తిరగబడి అభిషేకన్ కి రిటార్ట్ ఇవ్వలేని తన అశక్తతకు తన మీద తనకే కోపం వచ్చింది ఉదయార్కర్ కి. ఎవరినీ నొప్పించడం అతనికి ఇష్టం వుండదు. కష్టమయితే తనే దూరంగా ఉంటారు అంతే!
అతనిలోని ఆ మంచివి అలుసుగా తీసుకుని వంచిస్స్తుంటారు కొంతమంది.
అభిషేకన్ మాటలతో మనసు కృంగిపోయింది. ఉదయార్కర్ కి వచ్చిన మూడ్ చచ్చిపోయింది.
కానీ తను ప్రొఫెషనల్ రైటర్!
మూడ్ వున్నా లేకపోయినా వంట్లో, ఇంట్లో బాగున్నా లేక పోయినా. 'రాయి' అంటే మనసు రాయి చేసుకొని రాసి తీరాలి.
చాలా సీన్సిటివ్ మనసు వుండడమే తన పాలిటి పరమూ, తన పాలిటి శాపమూ కూడా అనుకుంటూ ఉంటాడు ఉదయార్కర్.
సెన్సిటివ్ గా ఉండేవాడే మనసు స్పందించి మంచి రచనలు చెయ్యగలడు.
సెన్సిటివ్ గా ఉండేవాడే అతిగా స్పందించి , మనసు ముక్కలు చేసుకుని రాయడం మానేయ్యగలడు కూడా. కానీ రాయక తప్పదు.
మరికొంతసేపు ఏదేదో మాట్లాడి "బెస్ట్ ఆఫ్ లక్కండీ! బోన్ వాయెజ్" అని చెప్పి వెళ్ళిపోయాడు అభిషేకన్. వెళుతూ వెళుతూ "అడ్వెంచరుచేస్తావూ! అడ్వెంచర్? నీ అడ్వెంచరు ఎలా జరుగుతుందో నేనూ చూస్తాను" అనుకున్నాడు ఆక్రోశంగా. అతని బుర్ర చురుగ్గా ఆలోచించడం మొదలెట్టింది.
కాసేపు నిస్సేజంగా అలాగే కూర్చుండిపోయి, తర్వాత లేచి బ్యూటీ క్లినిక్ ఓపెనింగ్ కి వెళ్ళాడు ఉదయార్కర్.
అతన్ని చూడగానే "రండి! రండి!" అని మర్యాదగా ఆహ్వానించారు పొద్దున కనబడ్డ స్త్రీలు ఇద్దరూ.
అతను లోపలికి వెళ్ళాడు.
* * * *
వాచ్ చూసుకున్నాడు ఎడిటర్.
రాత్రి పదయింది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి.
ఎనిమిది, ఎనిమిదిన్నరకి వచ్చేస్తానన్నాడు ఉదయార్కర్. ఇంకా రాలేదేం?
పొద్దున వచ్చిన స్త్రీలు ఇచ్చిన విజిటింగ్ కార్డు ఇంకా అతని టేబుల్ మీదే వుంది.
దాన్లో నెంబరు చూసి రింగ్ చేశాడు ఎడిటరు.
"హలో! ఉదయార్కర్ ఇంకా అక్కడే ఉన్నారా!"
"ఉదయార్కరా! ఏ ఉదయార్కర్?" అంది ఒక స్త్రీ కంఠం.
"నన్ను రిప్రేజేంట్ చేస్తూ వచ్చారు ఉదయార్కర్!"
"మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తునా? ఎందుకు?"
"మీరు నన్ను ఫంక్షన్ కి రమ్మని ఇన్వయిట్ చేశారు కదా?"
ఆ స్త్రీ కంఠంలో నవ్వు ధ్వనించింది.
"ఎవరు?మేమా! మిమ్మల్నా? బ్యూటీక్లినిక్ ఓపెనింగ్ కి జెంట్స్ ని పిలిచామా! ఆర్ యూ జొకింగ్?" లైన్ కట్ అయిపొయింది.
నిశ్చేష్టుడయిపోయాడు ఎడిటరు.
5
నుదురు చిట్లించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు ఎడిటరు.
ఉదయార్కర్ తనని రిప్రేజెంట్ చేస్తూ బ్యూటీ క్లినిక్ కి వెళ్ళనే లేదా!
అసలు ఆ బ్యూటీ క్లినిక్ వాళ్ళు తనని ఫంక్షనుకి పిలవనేలేదా!
దేరీజ్ సమ్ థింగ్ వెరీ ఫిషో!
సాలోచనగా ఉదయార్కర్ ఇంటికి రింగ్ చేశాడు ఎడిటరు.
ఇంట్లో కూడా లేడు ఉదయార్కర్.
సాయంత్రం ఒకసారి ఇంటికి వచ్చి, మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడని చెప్పారు ఇంట్లోవాళ్ళు.
ఆ తర్వాత,ఉదయార్కర్ తరుచుగా వెళ్ళే చోట్లకి పరిచయస్తుల ఇళ్ళకి ఫోన్ చేశాడు ఎడిటరు.
ఎక్కడా లేడు అతను.
అతను ఎక్కడికి వెళ్ళి వుంటాడో అంతుబట్టలేదు ఎడిటర్ కి.
అప్పుడు ---------