టూకీగా చెప్పాలంటే మెడ్రాసు లో ఎక్కడున్నా ఒక గొయ్యి తీసినా కొత్త స్ట్రీట్ లైట్ ఒకటి పెట్టినా అది వెంటనే టెలిఫోన్ ద్వారా అభిషేకన్ తెలుస్తుంది.
అతను మనిషి హైదరాబాద్ లోనే వున్నా, అతని మనసు మాత్రం ఎప్పుడూ మెడ్రాసులోనే వుంటుంది.
మెడ్రాసులో జరుగుతున్న వాటితో పోల్చి తెలుగునీ, తెలుగు వాళ్ళనీ, ఆంధ్రప్రదేశ్ నీ ఏకీపారెయ్యడం అతని ఫుల్ టైం జాబ్. టెలిఫోన్స్ లో అతను జూనియర్ ఇంజనీరుగా పనిచెయ్యడం కేవలం పార్ట్ టైం లాంటిదే.
ఎందుకంటె అభిషేకన్ అసలైన తెలుగువాడు కావడంవల్ల అతను చిన్నప్పుడు తమిళనాడులో పెరిగాడు. అక్కడ చదువు పూర్తీ అయ్యాక ఉద్యోగం దొరక్క ఒక్క లుంగీ కట్టుకుని కడుపు చేత్తో పట్టుకొని విజయవాడకు దిగుమతి అయ్యాడు. ఇక్కడే ఉద్యోగం సంపాదించాడు.
కొంతమంది తెలుగు వాళ్ళకి లాగే అతనికీ తెలుగు అంటే పడని తెగులు వుంది. అతను ఊపిరి పీల్చినప్పుదల్లా తమిళాన్ని పొగుడుతూ ఉంటాడు. ఊపిరి వదిలినప్పుదల్లా తెలుగుని తిడుతూ ఉంటాడు.
అతని తమిళ భాషా దురభిమానం తమిళులకే వెగటు కలిగించేటంత లెవల్లో వుంటుంది.
మెడ్రాసు న్యూస్ అంతా సమగ్రంగా తెలుసుకున్న తర్వాత అతను కాసేపు ఆ పనీ, ఈ పనీ చేసి కాలం గడిపాడు. వాళ్ళ బాస్ బయటికి వెళ్ళడం గమనించి కొద్ది క్షణాలు ఆగి తనూ లేచి బయటికి వచ్చి, దొంగచూపులు చూస్తూ తన టీ,వి. ఎస్ ఎక్కాడు. లక్డికాపూల్ నుంచి సికింద్రాబాద్ కి రయ్ న పది నిమిషాల్లో చేరుకున్నాడు. తమిళ సినిమా ఒకటి ఆడుతున్న థియేటర్ ముందు ఆగాడు.
బుక్కింగ్ దగ్గరికెళ్ళి "వన్ టికెట్ ప్లీజ్" అన్నాడు డబ్బు అందిస్తూ.
బుక్కింగ్ క్లర్కు ఆ రష్ లో చూసుకోకుండా ఒకటికి బదులు రెండు టిక్కెట్లు ఇచ్చాడు. అది గమనించి కూడా గమనించనట్లే పక్కకి వచ్చేశాడు అభిషేకన్. అతని మొహం ఆర్క్ లైట్ లా వెలిగిపోతోంది.
ఒక ఎక్స్ ట్రా టిక్కెట్టు వచ్చింది తనకి.
అంటే........ఐదురూపాయలు లాభం!
అంతేగానీ, ఆ బుకింగ్ క్లర్కుకి పాపం అయిదు రూపాయలు నష్టం అని ఆలోచించలేదు అభిషేకన్.
అతని ఆత్రం చూసి ఆయనకి అనుమానం కలిగింది. అంచనా వేస్తున్నట్లు ఎగాదిగా చూశాడు అభిషేకన్ ని.
"మా ఫ్రెండ్ వస్తానన్నారు సార్! రాలేదు. టిక్కెట్టు మిగిలి పోయింది. మీరు తీసుకోండి" అన్నాడు అభిషేకన్ ఆదుర్దాగా.
కొద్ది దూరంలో నిలబడ్డ పోలీసు కాలిస్తేబుల్ అభిషేకన్ ని పరీక్షగా చూస్తున్నాడు.
అభిషేకన్ కి ముచ్చెమటలు పోశాయి.
ఆ గూడుకట్టు ముసలాయన బుక్కింగ్ దగ్గర వున్న రష్ ని గమనించి తెగించి అభిషేకన్ దగ్గరే టిక్కెట్టు కొన్నాడు.
అప్పనంగా దొరికన అయిదు రూపాయలు జేబులో వేసుకుని, ఆనందంగా వెళ్ళి సీట్లో కూర్చున్నాడు అభిషేకన్.
సినిమా పూర్తయ్యాక టీవిఎస్ ఎక్కి వాయువేగంతో ఆఫీసు తిరిగి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.
అతను మూడు గంటలసేపు సీట్లోంచి మిస్సయిపోవడం వాళ్ళ బాస్ దృష్టికి రాలేదు. మనసులోనే నవ్వుకున్నాడు అభిషేకన్.
తను చాలా చలాకీ. కాస్త కిలాడీ! అందుకే తననెవరూ పట్టలేరు. అందులోనూ ఈ తెలుగు వాళ్ళు. అందుకనే ఇలా రోజుకో రకం అడ్వెంచర్ చెయ్యగలుగుతున్నాడు తను.
సాయంత్రం కాగానే బాత్ రూంలో కెళ్ళి , బట్టతల మీద మిగిలి వున్న నాలుగు వెంట్రుకలూ షోగ్గా దువ్వాడు అభిషేకన్.
బయటికొచ్చి టీవిఎస్ ఎక్కాడు. మోటారు సైకిల్ రేసుల్లో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన మోటారు సైకిల్ "ఎలెక్ట్రా గ్లయిడ్" నడుపుతున్నట్లు ఫీలవుతూ బుర్రున దాన్ని పోనిచ్చి తన ఇంటిదారి పట్టాడు.
అతను వంద దూరం పోకముందే హటాత్తుగా పోలీసు కానిస్టేబుల్ ఒకతను అగమంటూ చెయ్యి అడ్డం పెట్టాడు.
సడెన్ బ్రేకు వేశాడు అభిషేకన్. అతనికి పై ప్రాణాలు పైనే పోయాయి. ముచ్చెమటలు పోశాయి.
పొద్దున తను రెండో టిక్కెట్ తీసుకుని దాన్ని తిరిగి ఇచ్చెయ్యకుండా అమ్ముకోవడం అప్పుడే పోలీసులకి తెలిసిపోయిందా?
తనని జైల్లో పెడతారా!
"సార్! సార్! పొరపాటయిపోయింది సార్!" అని అతను అనబోయేటంతలోనే -
"మీరెటు వెళ్తున్నారు సార్?" అన్నాడు కానిస్టేబుల్!
"అశోక్ నగర్!"
"నేను ఇందిరాపార్కు దాకా వెళ్ళాలి. లిప్టు ఇస్తారా!"
తను నాస్తికుడినని అందరితో చెబుతూ ఉంటాడు అభిషేకన్. కానీ ఆ క్షణంలో అతను దేముడికి మనసులోనే దణ్ణం పెట్టుకున్నాడు. అతని గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలెట్టింది.
కానిస్టేబుల్ ని ఇందిరాపార్కు దగ్గిర దింపి యింటికి వచ్చాడు అభిషేకన్.