Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 12

 

    అక్కడ గాయమయింది. మంట పెడుతోంది. వెచ్చని రక్తం ధారగా కారుతోంది. శ్రద్దాదేవి వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి ఆమె గాయానికి మందు రాచి కట్టుకట్టింది.
    ప్రక్కమీద కళ్ళు గట్టిగా మూసుకుని పిచ్చిదానిలా పడుకుంది జ్యోతి. రవంత చేరువలో కూర్చుని ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది శ్రద్దాదేవి.
    ఆలోచనలవల్ల కాలికి అయిన గాయం వల్లా అలసట పొందిన జ్యోతి అయితే మరికొద్ది సేపటిలో నిద్రపోయింది. కాని ప్రొఫెసర్ శ్రద్దాదేవి మాత్రం నిద్రపట్టలేదు. అలాగే చాలాసేపు కూర్చుంది.
    ఆలోచనల వల్ల వివశురాలయింది. ఆ తామ్రపత్రాలు తొలిసారి సర్పాకృతులు తలుపుల్ని దాటివచ్చే సమయాన ఒక ప్రాణి బలి అయింది. జ్యోతి పక్షాన రక్తపాతమే అయింది.
    ఇప్పటి కిప్పుడు వాటిని చదువుతున్న తొలిసారి తిరిగి రక్తపాతమయింది. ఇవన్నీ యాదృచ్చికంగా జరుగుతున్నా సంఘటనలేనా?
    లేక ఆ రాకాసి గుహలలోని ప్రేతాత్మల ప్రేరణతో జరుగుతున్న సంఘటనలా? ఒకవేళ అదే నిజమయితే ఇది మానవశక్తి పై ప్రేతాత్మలు విసురుతున్న సవాలు అయి ఉండాలి.
    ఇలా అనిపించగానే ప్రొఫెసర్ శ్రద్దాదేవి లో పట్టుదల అధికారికమయపోయింది. నిద్రపోతున్న పిల్లని వదలి వేటకై సాగివచ్చిన అడ బెబ్బులి లా తిరిగి రీడింగ్ రూంలోకి వచ్చిందామే. జ్యోతిని అలా వదలి వచ్చి కుర్చీలో కూర్చుంది మళ్ళీ.
    టేబిల్ సర్దుకుంది. విసురుగా దూరం వెళ్ళి పడిపోయిన తామ్రపత్రాలను మళ్ళీ దగ్గరకు తెచ్చుకుంది.
    బొగ్గుపొడితో కాగితం మీద పడిన ముద్రను ప్రక్కనే ఉంచుకుంది.
    అమృతక్షరాలను సర్పాకృతులను ఒకటికి పదిసార్లు నిశితంగా పరిశీలించ ప్రారంభించింది. మధ్య మధ్య లేచి వెళ్ళి లింగ్విస్టిక్స్ లో తాను సంపాదించి దాచుకున్న గ్రంధాలను తెచ్చి ప్రక్కన వుంచుకుని రిఫరెన్స్ చూచుకోసాగింది.
    అది అర్ధమయిన కొలది ఆమెకు కలుగుతున్న భయోత్సాతం మరింత అయిపొయింది. అర్ధాన్ని అనుసరించి చూస్తె ఆ పత్రాలు ఒక రాక్షసి గుహలో ఉండవలసినవి.
    శ్వేతకి అనే పేరు కలిగిన నాగజాతి యువతి స్వజాతి. జనుల శ్రేయకామనతో స్వాతంత్య పరిరక్షణకై పోరాడి ప్రాణాలను విడిచింది. ఇది జరిగినప్పటికీ వింధ్య పర్వతాలకు దక్షిణ తీరంలోని నర్మద,  తపతి నదుల దిగువ భాగమంతా దండక అనే పేరుతొ పిలవబడుతున్న అరణ్యమే!
    దండకలో కుంభవతి నగరం కాళింగ భూములకు ప్రధాన కేంద్రమయి విలసిల్లుతుండేది. కుంభవతిని పాలించే ప్రభువు క్దుద్ర కాళింగుడు. ఆతడు రాజ్య విస్తరణ కాంక్షాపరుడై కృష్ణాతీరంలో నివాసముంటున్న నాగ యక్ష పుండ పుళింద జాతుల మీదికి ఎత్తి వచ్చాడు.
    నాగజాతి యువతి అయిన శ్వేతకి స్వాతంత్య పరిరక్షణ కోసం క్షుద్రకాళింగుని సేనలతో అత్యంత సాహసంతో పోరాడి తుదకు ప్రాణాలను విడిచింది.
    ఆమె ఆశలు తీరకుండానే చనిపోయింది. ఏ స్వాతంత్య పరిరక్షణ కోసమైతే ప్రేమనూ, పెళ్ళినీ , తన వాడయిన పురుషునీ వొదులు కున్నదో ఆ స్వాతంత్యం నాగులకు దక్కలేదు. వారంతా క్షుద్రకాళింగుకు బందీలు అయినారు. అందునించి ఆమెకు ఆత్మశాంతి లభించలేదు.
    అప్పటికి పశ్చిమోత్తర దిక్కున సప్త సిందూ తీరంలోని పుష్పవతీ నగరం నించి వచ్చిన అగోచర శాక్తేయుడోకడు కృష్ణా తీరాన సందరిస్తున్నాడు.
    అగోచర శాక్తేయులు ఆత్మ రూపాలను అనుసంధానమూ, సంకల్పమూ కల్పించటంలో ఉద్దండులు. కావటం నించి శ్వేతకి ఆత్మను అతడు ఆమెను సమాధి చేసిన రాకాసి గుహలలోనే బంధించాడు.
    అది విముక్తికై పోరాడుతుంది.
    నాగులు స్వతంత్రులయాక ఎప్పుడయితే ఆ సమాధి గుహ తెరచుకుంటుందో అప్పుడు ఆమె ఆత్మ రూపం విముక్తవుతుంది. ఈ విషయాలను అగోచర శాక్తేయుడు తామ్రపత్రాలపై చెక్కించి కృష్ణాతీరంలోనే నేలమాళిగలలో నిక్షిప్తం కావించాడు.
    ఇవన్నీ తామ్ర పత్రాలలో వున్న విషయాలు. అయితే బాగా చిలుము తినివేసిన ఒక్క తామ్రపత్రం మిగిలిపోయింది. దాని మీది అక్షరాలూ చిలుము తినివేసిన చిల్లుల మధ్య రూపుమాపిపోయినాయి.
    దానిలోనే ఆ సమాధి గుహ జాడ గురించిన వివరాలు వుండి ఉంటాయని ఊహించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    ఇదంతా నిజమా? లేక ఒక కధా అని కూడ ఆలోచించింది. అందుకు సమాధానం వెదికే దారి ఆ తామ్రపత్రాల ఉనికి గురించి పరిశీలించటం ద్వారానే తెలుస్తుంది.
    జ్యోతి చెప్పిన మాటల్ని జాగ్రత్తగా మననం చేసుకుందామే. ఆమె తాత గొప్ప మంత్ర విద్యావేత్త. ఆత్మ రూపాలను పదుగురి మధ్య అయినా అవిష్కరించగలిగిన శక్తి సంపన్నుడు. అతడి ఆదేశాలను పాటించే ఒక ఆత్మ రూపం ఇచ్చిన సందేశాన్ని అందుకుని అతడీ పత్రాలను అన్వేషించాడు. అవి నిజంగానే లభించాయి.
    కాబట్టి మంత్ర విద్యలో శక్తి సంపన్నులయినవారు. విశ్వాంత  రాళంలోకి అంతర్లీనం కాని, కాలేని ఆత్మరూపాలను దర్శించగలరు. అవి అలా అంతర్లీనం కాలేకపోవటానికి కారణాలు అనేకం ఉండవచ్చు.
    కాని అలాంటి ఆత్మ రూపాలను కనుల ముందు ఆవిష్కరించుకోవటం మనిషికి కష్టసాధ్యమయిన పనే కాని అసాధ్యమయిన పని మాత్రం కాదు.
    తగిన సాధన ద్వారా ఆ శక్తిని సమీకరించుకుంటే అది సాధ్యమే, అయితే అతడు ఆ ప్రేతాత్మను తెలుసుకోలేకపోయినాడు. అందునించి దాన్ని విముక్తి చెయ్యాలని ప్రయత్నించలేదు.
    ఆనాటి సాహసి నాగయువతి అయిన శ్వేతకి ఆత్మ నిక్షిప్తం కాబడిన సమాధి గుహ లేక రాకాసిగుడి ఎక్కడున్నదో తెలుసుకోలేక పోవటమే అందుకు మొదటి కారణం.
    ఆ వివరమంతా చిత్రించిన తుది రాగిరేకు జీర్ణమయిపోయిన స్థితిలో ఉంది. అదే కారణమయి వుంటుంది.
    లేదా బ్రాహ్మమయిన ఈ అమృతక్షారాలను అతడు పటించలేకపోవటం ఒక కారణం కావచ్చు.
    కారణం ఏదయినా ఆ జాడ అతడు తీయలేకపోయినాడు. అందునించే ఆ విషయాన్ని వదలి ఊరుకున్నాడు. అతని తరువాత జ్యోతి తండ్రి అత్యంత సాధారణమయిన వ్యక్తీ. తామ్రపత్రాలను దాచటం ఒక్కటే కర్తవ్యంగా గుర్తించాడు. వాటి గురించి రవంత అయినా పట్టించుకోక వదిలేశాడు.
    జ్యోతి కూడా వాటి గురించి ఆలోచించకుండా వుంటే ఎమయేదో? కాని సర్పాకృతులు చెక్కిన తలుపుల వెనుక నిక్షిప్తమయిపోయిన రహస్యం గురించి ఆమె ఎక్కువగా ఆలోచించింది.
    బహుశా ఆమె వల్లనే ఈ పని జరగవలసి వున్నదేమో! అందు నుంచే ఈ ప్రేరణలన్నీ ఎదురు అవుతున్నాయి అని ఆలోచించింది శ్రద్దాదేవి. అంతవరకూ వచ్చాక ఆమెకు మరికొన్ని సందేహాలు కూడా వచ్చాయి. జ్యోతి ఈ తామ్రపత్రాల రహస్యాన్ని చేధించేందుకు పూసుకుంటే ఏమవుతుంది ?
    ఈ నేల మాళిగను అన్వేషించి గుర్తించటం సాధ్యమవుతుందా? అది సాధ్యమయినా అక్కడ బందీ అయిన ఆత్మ రూపాన్ని విముక్తం చెయ్యటం జరుగుతుందా? ఈ ప్రయత్నం ప్రారంభిస్తే ఎదురయ్యే సమస్య లేమిటి? వాటిని ఎదుర్కోవటం ఎలా?
    ఈ తామ్రపత్రాల ప్రస్తావన వచ్చింది మొదలుగా రక్తపాతం జరుగుతోంది. సర్పాకృతుల తలుపుల వెనుక నుంచి బయటపడే క్షణాన ఒకరికి ప్రాణాపాయం అయింది. జ్యోతి తీవ్రమయిన గాయాలతో రక్తదారాలు కురిపించుకుని ఎలాగో ప్రాణాలతో బయటపడగలిగింది. 

 Previous Page Next Page