ఈ విషయాన్ని శ్రద్దాదేవికి చెప్తే ఏమవుతుంది? ఆమె చదువుల తల్లి. విధ్యాదికురాలయిన ఆమెకీ విషయం చెప్తే తనను కేవలం పిచ్చి దాని కింద జమకట్టి వేస్తుంది. ఒకప్పుడు కర్తవ్యమనే పేరుతొ శ్రమ జీవనాన్ని జీవిత లక్ష్యంగా ఎంచుకుని ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించింది తాను. ఇప్పుడు భయమనే పేరుతొ తన ఆక్రోశాన్ని ఆమె ముందు వెల్లడించి తపస్సులా ఆమె సాగిస్తున్న విద్యాభోధన కార్యక్రమానికి అంతరాయం కలిగించటం తెలివితక్కువ పనే కాదు, స్వార్ధం కూడా అవుతుంది.
కాని భయంకరమయిన దుస్థితిని ఎలా భరించటం.
తామ్రపత్రాలను మరెప్పుడూ విప్పి చూడరాదు. తాత నించి అవి వారసత్వంగా ఎండుకొచ్చాయో! తండ్రి తన జీవితకాలమంతా వాటిని భద్రంగా కాపాడి తనకు ఎందుకు అప్పగించినాడో!
లాంచి బ్రద్దలయిపోతున్నప్పుడే ఇవి కూడా కృష్ణవేణీ సజల ధారల్లో మునిగిపోతే బాగుండేది. కాని సర్పక్రుతుల తలుపులు బ్రద్దలయిపోయి అవి ఎగిరివచ్చి తన దగ్గిర పడినాయి!
వీటికి, తన జీవితానికి ఉన్న అనుబంధం ఏమిటో? వాటివంక చూస్తున్నప్పుడు ఈ భయోద్వేగానికి కారణం ఏమిటో?
తామ్రపత్రాల పైన సర్పాకృతులు ప్రాణం పోసుకున్న వృద్ద భుజంగాల్లాగా తనను బెదిరిస్తాయేమిటి? అక్షరాకృతులు గుండెల్లో దిగుతున్న పిడిబాకుల్లా బాధిస్తాయేమిటి?
వివశురాలైపోయి తామ్రపత్రాలను అవతల ఉంచాలన్న నిర్ణయాన్ని మరచి అలాగే కూర్చుండిపోయింది జ్యోతి.
ప్రొఫెసర్ శ్రద్దాదేవి ఎప్పుడొచ్చిందో ! సోఫాలో ప్రాణం లేని శిల్పంలా పడి వున్న జ్యోతి వంక జాలిగా చూచింది. ఆమె చెంపలపై చారికలు కట్టిన కన్నీటిని ప్రేమగా అద్దింది.
ఆమె చేతులలో వున్న తామ్రపత్రాల వంక చూస్తూ , "ఇవేమిటి ?" అని అడిగింది అత్యంత శ్రద్దా సక్తులతో.
ఏ విషయమైతే ఆమె నించి దాచి వుందాలని ప్రయత్నించిందో అది కాస్తా బయటపడిపోవడంతో , కలవరపాటు పడిపోయింది జ్యోతి. వెంటనే తామ్రపత్రాలను దాయాలని ప్రయత్నించింది.
"జ్యోతి! నానించి దాచుకోవలసిన సంగతులు కొన్నింటిని నీవింకా ,మిగుల్చుకున్నావన్నమాట?" అని అడిగింది శ్రద్దాదేవి భాధాపూరితమయిన స్వరంతో.
ఆ మాట వింటూనే తామ్రపత్రాలను ఆమె చేతికి అందించి బావురుమని ఏడ్చేసింది జ్యోతి.
అప్పటికి ప్రొద్దు కృంగింది.
సంధ్యాకాంతులు మలిగినాయి.
దీపాలు వెలిగినాయి.
జ్యోతి చెప్పగా తామ్రపత్రాలు గురించిన కధ యావత్తూ విన్నది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. కనురెప్పల మాటున నేత్రాలు ముకుళాయితం అయినాయి.
సృష్టి పరిణామశీలి. అనుక్షణం పురోగమించటమే దాని తత్త్వం. ఒక ప్రాణి పుట్టినప్పటిలాగే వుండదు. జీవనపధంలో పరిణమిస్తుంది పురోగమిస్తుంది. ఆ పురోగమనంలో ఒక భాగమే మృత్యువు.
జీవి మరణించాక ఒక ఆకృతి నశిస్తుంది. కాని ప్రకృతి లోని భాగమయిన పదార్ధం తన పురోగమనాన్ని అంతటితో చాలించదు. దాని పురోగమనం అప్రతిహతం. ఎన్నటికీ ఆగనిది. ఎవరూ అపలేనిది. అందునించి ప్రకృతి వ్యక్తమయినది. కొంత అవ్యక్తమయినది. వ్యక్తావ్యక్తమయినది అన్నమాట.
వ్యక్తమయిన పరిణామాన్ని మనం చూడవచ్చు. అవ్యక్తమయిన దానిని చూడలేకపోవచ్చు. ఆత్మల గురించిన ఈనాటి మన అభిప్రాయం ఈ వ్యక్తావ్యక్త స్థితిని అనుసరించి వుంటాయి.
వాటి వునికిని నిర్దారించడం వల్ల నిరూపించుకోలేకపోవచ్చు. అవమానించటం వల్ల అజ్ఞానాన్ని పులుముకోవచ్చు.
ఈ జ్యోతి యేవో ఆత్మశక్తులు అనగా ప్రేతాత్మలవల్ల పీడించబడుతోంది. వాటి ఉనికి ఎక్కడో, ఏమిటో తెలియదు. ఈమె ఒంటరితనం లోని భయానికి అర్ధం అదే అయిండాలి. అక్షరాల వంక చూచినప్పటి భీతవహానికి కూడా అర్ధం అదే అయి వుండాలి.
ఆమె భయానికి ఈ తామ్రపత్రాలలోని బ్రాహ్మీమాయమయిన అమృతాక్షరాలకీ ఏదో సంబంధం వున్నదని ఊహించింది. ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఆ సంబంధమేమిటో తెలియాలంటే తామ్రపత్రాలను చదవాలి.
జ్యోతిని అక్కడే వదిలి తను లైబ్రరీ కోసమై ప్రత్యేకించుకున్న గదిలోకి వెళ్ళిందామె. ఆ గదిలో వున్న దీపాలన్నింటినీ వెలిగించుకుంది.
తామ్రపత్రాలపై మెత్తని బొగ్గుపొడిని చల్లింది. దాని మీద ఓ కాగితాన్ని తడిపి అంటించింది. దాన్ని టేబిల్ మీద ఉంచి పైన ఉన్న గాలి పంకా వేసింది.
రెండు నిముషాలపాటు గాలిపంకా తిరిగాక తడిసిన కాగితం తడి అరి ఊడివచ్చింది. తామ్రపత్రాల మీది అక్షరాకృతులు అప్పుడు దాని మీద స్పష్టంగా ముద్రితమయినాయి.
లింగ్విష్టిక్స్ మేధావుల వివరణ ప్రకారం యించుమించు ప్రతి శతాభ్దానికి అక్షరాకృతులలో పరిణామాలు సంభవించుతాయి.
అది సంస్కృత లిపి. అంచనా అతి ప్రాచీనమయినది. బ్రాహ్మీలిపి!! ఇంచుమించు మూడు వేల సంవత్సరాల నాటి లిపి అది.
తామ్రపత్రాలపై ఉన్న సర్పాకృతులు కూడా కాగితం మీద విస్పష్టమయిన ముద్రపడినాయి. ఆ అమృతాక్షరాలను చదివి నిర్విన్నురాలయి పోయింది శ్రద్దాదేవి. చదువుతూనే వుంది ఇంకా! ఇంక తన బ్రతుకులో శనిరోజులు దాపురించినాయి అనుకుంది. బహుశా జ్యోతి తనను గమనిస్తూ ఉండి ఉండవచ్చునన్న ఆలోచన రాగానే తన భయాన్ని గాంభీర్యం మాటున దాచుకుంది.
ఎప్పుడయితే తామ్రపత్రాల పఠనం పూర్తీ అయిందో వెంటనే ఏదో శక్తి ఆ గదిలో ప్రవేశించినట్లు అయింది.
కరెంట్ దీపాలు టప్పున పగిలిన శబ్దమయింది. ఇల్లంతా చీకటి వ్యాపించింది.
4
కన్ను పొడుచుకున్న కనిపించని కారు చీకటిలో ఆమె కూర్చున్న కుర్చీ ఎవరో విసురుగా నెట్టినట్లు అయి తూలి ప్రక్కకు పడిపోయిందామె. అవతలి గది లోంచి జ్యోతి కెవ్వున అరచినట్లు వినిపించింది.
తామ్రపత్రాలు వుంచిన డ్రాయర్ పెద్ద శబ్దంతో అటూ, ఇటూ ఊగి, ప్రక్కకు పడిపోయింది. అది పడుతున్న చోటుని శబ్దాల ద్వారా గుర్తించి చివాలున ప్రక్కకు తప్పుకుంది శ్రద్దాదేవి.
రవంతలో ప్రాణాపాయం తప్పిపోగా ఉస్సురని నిట్టూర్చిందామె. ప్రక్క గదిలోంచి దీనంగా విలపిస్తోంది జ్యోతి.
అతి ప్రయత్నం మీద తాను పడిన చోటు నించి లేచి దారి వెతుక్కుంటూ రీడింగ్ రూమ్ నించి బయటపడిందామే. సన్నని రోదన ధ్వని వినిపిస్తున్న దిక్కుగా ముందుకు సాగిందామె. ప్రక్క గదిలో నేల మీద పడి వుంది జ్యోతి. ఆమె శరీరం పైకి బరువైన వస్తువు ఏదో వాలి ఉంది. బలంగా దాన్ని తొలగించి జ్యోతిని ఇవతలకు లాగటంలో కృతకృత్యుతరాలయింది శ్రద్దాదేవి. చీకటి లోనే దారి వెదుకుతూ ముందుకు సాగింది.
కిచెన్ లో వెతికి కొవ్వొత్తులు వున్న చోటుని పట్టుకుంది. మరి కాస్సేపు ప్రయత్నించాక అగ్గిపెట్టి కూడా దొరికింది.
క్రోవ్వోత్తులు వెలిగినాయి. కాని అంధకారం పూర్తిగా వదిలి పోలేదు. జ్యోతి ఉన్న గదిలోకి వచ్చిందామే. తాను ఆమెను ఎక్కడ వదలి వెళ్ళిందో అక్కడే కూర్చుని ఉంది జ్యోతి. ఆ గదిలోనే స్పేర్ బల్బులు కూడా ఉన్నాయి. అవి దొరికాక చీకటి పూర్తిగా వదిలిపోయింది.
కరెంటు దీపాల కాంతిలో జ్యోతిని ఆపాదమస్తకమూ పరిశీలించింది "దెబ్బ బాగా తగిలిందా?" అని అడిగింది శ్రద్దాదేవి. ఆ ప్రశ్నకు సమాధానంగా తలవొంచి తన కాలి వంక చూసుకుంది జ్యోతి.