అవి చదవటం ప్రారంభించిన తొలిసారి తిరిగి భూకంపం వచ్చినట్లు అయింది. తిరిగి జ్యోతి రక్తం నేలపై ఒలికింది. ఈ సంఘటనలన్నీ పరిశీలిస్తే రాకాసి గుహలో బంధించబడిన శ్వేతకి ఆత్మరూపం ఈజిప్ట్ పిరమిడ్లలోని మమ్మీలాగ తన శక్తిని చూపుతోంది అనిపిస్తోంది.
ఆమె శక్తి కిరణాలు జ్యోతి మీద మాత్రమే కేంద్రీకృతమయివున్నాయా అనిపిస్తోంది. ఒకవేళ అలాంటిదే జరిగి వుంటే జ్యోతి ఈ ప్రయట్నంలోకి దిగకపోయినా ఆమెకు ప్రమాదమే జరుగుతుంది. దిగితే విజయురాలు కావచ్చు.
ఆమె విజేత అయిననాడు అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఇది ఆత్మ స్థయిర్యంతో సాహసంతో చేయవలసిన పనే అయినా చేయగలిగిన రోజున జ్యోతి ఆంధ్రదేశానికి ఆదర్శ ప్రాయురాలయిన యువతి కాగలుగుతుంది.
ఆత్మ రూపాల చరిత్ర లో ఆమె పేరు శిలాక్షారాలతో నిలిచిపోతుంది. ఇది జ్యోతికే కాదు తనకు కూడా పరీక్షా సమయమే అని భావించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
ఎంతకూ ఆమె ఆలోచనలు తెగలేదు. అంటే జ్యోతి ఏమి చేయాలన్న విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయింది అని కాదు. ఎలాగయినా శ్వేతకి అనే పేరుగల మమ్మీ తాలుకూ శక్తి కిరణాలు ఆమె మీద కేంద్రీకృతమయినాయి.
ప్రయత్నం చేసినా చేయకపోయినా ఆ శక్తి కిరణాలు ప్రేరణ అనివార్యమే! వాటి ప్రభావం అప్రతిహతంగానే ఆమె మీద పనిచేస్తుంది. కాబట్టి ప్రయత్నం చెయ్యటమే మంచిది.
ఆ రాకాసి గుహ ఎక్కడ నేలమాళిగలో ఉన్నదో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి తప్పదు. శ్వేతకి ఆత్మరూపాన్ని విముక్తం చెయ్యాలి. అనివార్యం.
కాని ఆ పని చేయటంలో ఎదురు ఆయె కష్టనష్టాల గురించీ, అంత సాహసానికి జ్యోతి నిలువగలుగుతుందా అనే సందేహం తీర్చుకుందుకూ? ఒకవేళ ఈ ప్రయత్నంలో ఆమెకు ప్రమాదాలు ఎదురు అయితే తాను చేయగలిగిన సాయం ఆమెను కాపాడగలదా అన్న అంశం గురించీ ఆలోచిస్తోంది ప్రొపెసర్ శ్రద్దాదేవి! ఆ విషయంలో ఆమె ఎంత ఆలోచించినా ఒక తుది నిర్ణయానికి రాలేక సతమతమైపోతుంది.
కాలం ఆలోచనల ఒరవడిలో నలిగిపోయింది. క్షణాలు ఉద్విగ్నభావాల సంపుటిలో అంతర్లీనమైపోయిన అక్షరక్రమంలా ఒదిగిపోతున్నాయి. సమయం యెంత అయిందో ఆమెకు తెలియదు.
"అమ్మా! మీరింకా నిద్రపోలేదా!" అన్న ప్రశ్నవిని తలఎత్తి చూచింది శ్రద్దాదేవి . ఎదురుగా జ్యోతి!
అన్ని ఆరాటాలనూ నిద్రాదేవి కౌగిలిలో మరచిపోయి , కడిగిన ముత్యంలా వినూత్న కాంతితో , జన్మత సంప్రాప్తమయిన అద్భుత సౌందర్యంతో ఎదురుగా కన్పించింది జ్యోతి.
ఆమె కంఠస్వరం ఆనాడు లాంచిలో విన్నప్పటిలాగే ఎంతో మధురాతి మధురంగా విన్పించింది.
వీణ మీద వేద నాదాలు పలికించే మాధుర్యమది.
అధిక పరిశ్రమ ఎందరో పి.హెచ్. డి విద్యార్ధినీ విద్యార్ధులకు మార్గదర్శిని అయిన ప్రొఫెసర్ శ్రద్దాదేవికి కొత్త కాదు. ఆమె గ్రంధ పఠనంలో, విద్యావిషయికమయిన అంశాల పరిశోధనలో రోజుల తరబడి శ్రమించగలదు. పరిశ్రమ ఆమె జీవితంలో ఒక భాగం.
అలసట అనేది ఆమెకు అలవాటు.
అయినా రాత్రి ఉద్విగ్నతా, ఆవేదనా, సంశయమూ , ఒక యువతీ ముఖ్యంగా తననే నమ్మి తన మీద ఆశలు పెంచుకుంటున్న జ్యోతి లాంటి యువతి బ్రతుకు బండలు అవుతుందన్న బాధా అనుభవించి ఆమెకు ఇప్పుడు భరించరాని అలసటగా వుంది.
అయినా వీణ మీద వేదనాదాలు పలికించినట్లున్న జ్యోతి మధుర స్వరాన్ని విని ఉలికిపడి తలఎత్తి పులుకడిగిన ముత్యంలా ఉన్న ఆమె ఆకృతిని చూడగానే అలసట అంతటినీ సునాయాసంగా క్షణంలో మరచి పోయింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
చిరునవ్వుతో ఆమె వంక చూచింది.
"నిద్రలో మనసూ, శరీరమూ విశ్రమిస్తాయి. అలసట నించి దూరమవుతాయి. కాని నా తాలుకూ శారీరకమయిన మానసికమయిన శక్తులన్నింటినీ కొన్ని లక్ష్యాల కోసం అంకితమిచ్చాను.
అందునించి వాటికి కావలసిన విశ్రాంతి గురించి ఆలోచించటం ఏనాడో మరచిపోయినాను " అని బదులు చెప్పిందామె. జ్యోతి వచ్చి ఆమె ప్రక్కనే కూర్చుంది.
"ఇలా ఆరోగ్యాన్ని శిధిలం చేసుకునే పనులు మీరు చేయటానికి ఇకముందు నేను అంగీకరించను" అన్నది ప్రేమ, బాధ నిండిన స్వరంతో భావాలు పలుకుతున్నవి ఏవయినా కంఠంలోని మాధుర్యం రవంత అయినా తగ్గదు అనుకుని మురిసిపోయింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. బదులు చెప్పక సాలోచనగా తన వంక పరీక్షగా చూస్తున్న ఆమె ముందు చిరుకోపాన్ని ప్రదర్శించింది జ్యోతి.
"నాకు మీనుంచి సమాధానం కావాలి" అంది రవంత కురుకుగానే ప్రేమాభిమానాలు యిచ్చిన అధికారంతో తన మీద పెత్తనం చెలాయిస్తున్న జ్యోతిని ఆదరంతో చూచింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
ఆమె ముఖంలో చూపు నిలిపి చిరునవ్వు నవ్వింది.
"ఈ చిరునవ్వులతోనే మీరు నన్ను చిరకాలం మోసగించగలననుకుంటున్నారు. కాని ఈ విషయంలో అలాంటి అవకాశం నేనివ్వను. మీరు విధిగా వేళ పట్టున తినాలి. పది గంటల కల్లా పడుకోవాలి. కారణాలు ఏవో చూపి ఈ నియమాన్ని అతిక్రమించితే నేను ఒప్పుకోను" అన్నది జ్యోతి. శ్రద్దాదేవి మనసు కరుణా తరంగిణి అయింది.
ప్రేమమయి అయిన ఈ అందాలరాశి , శాపగ్రస్తురాలయిన యక్షిణిలా అపురూప అసమాన కంట మాధుర్యం కలిగిన ఈ పిచ్చి పిల్లకు తెలియదు -- ఈ శ్రద్దాదేవి కోల్పోయిన బ్రతుకులోని అర్దాలన్నింటినీ కఠిన తరమయిన కర్తవ్యపాలనలోనే పొందగలుగుతోంది. ఆరోగ్యాన్ని పదిల పరచుకుని బహుకాలం జీవించి సాధించేదేమిటి?
ఎంతకాలం జీవించామన్నదే కాదు కదా ఆశయం. బ్రతికినంతకాలం ఎలా బ్రతికామన్నది లక్ష్యం. బ్రతుకుని బహుకాలం కొనసాగించాలన్న లక్ష్యంతో బ్రతుకు అర్ధాలను బలి యిచ్చుకోవటం అల్పులయిన వారు చేసే పని.
అటువంటి అల్పమయిన ఆలోచనలంటే తనకు పరమ అసహ్యం , అయినా ప్రేమ నిండారిన ప్రతిపాదనలవి.
అందునించి మొహం మీదే కాదని చెప్పలేకపోయింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. జ్యోతిని తల మీద చేయి వుంచి ఆశీర్వదిస్తూ కడుపున పుట్టిన బిడ్డను చేర్చుకున్నట్లు అక్కున చేర్చుకుంది. "అమ్మా! జ్యోతీ! నా ఆరోగ్యం గురించి నీవు యింతగా ఆరాటపడుతున్నావు కాని నేను నీకేమవుతాను" అని అడిగింది.
"నాకు తల్లీ తండ్రీ గురువు దైవం అన్నీ మీరే అవుతారు అని మీరు ఈ ప్రశ్న అదిగాక నాకు అన్పిస్తోంది. కాని యింతకు మునుపు ఎన్నడూ యిటువంటి సందేహం నాకు కలగలేదు" అని మనోభావాలు ప్రతిధ్వనించే కంఠంతో అన్నది జ్యోతి.
ఆమె శిరస్సును ముద్దాడి ఆమె తలను గాడంగా వక్షానికి హత్తుకుంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. చిరకాలంగా శిష్యులను ప్రేమ వర్షంలో ముంచేత్తటమే కాని అంతగా అభిమానించబడటం ఆమెకు క్రొత్త. ఒక్కాగానోక్క చినుకయినా పడి ఎరుగని మరు భూమి లాంటి అంతర్యం యిప్పటి జ్యోతి వర్షించిన ప్రేమామృతంతో తడిసి పదును అయిపొయింది .