Previous Page Next Page 
ప్రియతమా! ఓ ప్రియతమా పేజి 11

 

    "చాలు, కాఫీ తెప్పించు" చెప్పిందో అమ్మాయి.
    "ఆరు కాఫీ!" ఆర్డర్ చేసి, తల దిప్పేసరికి , అభినవ్ , రాంబాబూ లోపలికి వస్తూ కనిపించారు.
    మంజీర స్నేహితురాళ్ళ వైపు చూసి కన్ను గీటింది.
    అభినవ్, రాంబాబూ ఒక మూల టేబుల్ దగ్గర కూర్చున్నారు.
    "సర్వర్ బిల్లు తెచ్చి మంజీర కి ఇచ్చాడు. ముపై అయిదు రూపాయలు అయింది.
    మంజీర బిల్లు తీసుకుని స్నేహితురాళ్ళ తో "నాతొ రండి" అంది.
    కాఫీ "సిప్" చెయ్యబోతున్న అభినవ్ భుజం మీద చెయ్యి పడడంతో ఉలిక్కిపడి చూసాడు.
    మంజీరా నవ్వుతూ , "కంగ్రాట్స్, మొదటిసారి గెలిచినందుకు" అంది.
    "థాంక్స్" అతను ఆమె చేతిని తన ఎడమ చేత్తో తెసేస్తూ చెప్పాడు.
    "ఈ శుభ సందర్భంలో మీరు మాకు "ట్రీట్" ఇవ్వడం ఎంతైనా బావుటుంది. కాబట్టి మా బిల్లు మీరు పే చెయ్యాలి. సర్వర్ మా బిల్లు ఈయన 'పే' చేస్తారు" అంటూ తమ బిల్లు అతని ఎదురుగా ఉన్న ప్లేట్లో పడేసి "బై" అంటూ బైటికి నడిచింది.
    ఫ్రెండ్స్ నవ్వుతూ ఆమెని అనుసరించారు.
    రాంబాబు ముందుకే తేరుకుని ముప్పై అయిదు రూపాయలు" అన్నాడు.
    అభినవ్ చిన్న చిరునవ్వు నవ్వి, "బస్ పాస్ ఇంకా కొనకపోవడం మంచిదయింది" అంటూ పర్స్ తీసాడు.
    అరుంధతికి తరచూ జ్వరం వస్తోంది!
    సుమిత్ర నారాయనమూర్త్జితో "ఆవిడకి తన ఊరు మీద పుట్టెడు దిగులు మీరేమో బలవంతంగా తీసుకొచ్చారు. అందుకే చీటికీ మాటికీ మూలుగుతోంది." అంది. అందులో అభిమానం కన్నా, నేను చూడవలసి వస్తోంది అన్న బాదే ఎక్కువ ధ్వనిస్తోంది అతనికి.
    "ఈసారి నేను డాక్టర్ దగ్గరికీ తీసుకెళ్తాను. అవసరమయితే "లీవ్ పెట్టి అమ్మని చూసుకుంటాను" అన్నాడు.
    'అయ్యో రామా! ఇప్పుడు నేను చూసుకోనన్నానా?" అంటూ మూతి తిప్పి వెళ్ళిపోయింది సుమిత్ర.
    నారాయణమూర్తి అరుంధతిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాడు. ఏవో పరీక్షలనీ చెయ్యాలంటే చేయించాడు.
    అరుంధతి చాలా స్తబ్దుగా తయ్యారయింది.
    ఓనాడు సుమిత్ర మళ్ళీ రేగింది. "రోజురోజుకీ ఈవిడ చాదస్తం భరించలేక పోతున్నాను" అంటూ.
    "మళ్ళీ ఏమైందీ?" అడిగాడు నారాయణమూర్తి.
    "ఈవిడ మడి చీర తాకిందని, ఆ పని మనిషితో పోట్లాట వేసుకుంది. అది కాస్తా అలిగి చక్కా పోయింది. ఇప్పుడు చచ్చినట్టు నేనే చేసుకోవాలి పనంతా ఆవిడకేం?" అంది సుమిత్ర.
    "పోనీలే , పెద్దావిడ" అన్నాడు నారాయనమూర్తి.
    "ఎక్కడికి పోతుంది? ఎవరున్నారని పోతుంది?" సాగదీసింది సుమిత్ర.
    "నారాయణా తంతి" అంటూ టెలిగ్రాం తీసుకుని వచ్చింది అరుంధతి.
    "ఏరైవింగ్ అన్ ట్వంటీ ఫోర్త్ .....మిస్టర్ లూ" అని ఉంది అందులో.
    సుమిత్ర చదివి, భర్తకి ఇస్తూ "ఈ లూ ఎవరండీ?" అంది.
    నారాయణమూర్తి చదివి, "కెనడా నుండి పంతులు మావయ్య అదే అప్పన పంతులు మావయ్య వస్తున్నాడట అమ్మా!" అన్నాడు.
    "ఆ!!!" అరుంధతి ఆశ్చర్యంగా చూసింది.
    "పంతులు బావ.....మా బావ వస్తున్నాడా?" అడిగింది ఆనందంగా మళ్ళీ.
    "ఔను" నవ్వుతూ అన్నాడు నారాయణమూర్తి.
    అరుంధతికి పాతరోజులు మళ్ళీ కళ్ళముందు తిరగసాగాయి.
    

                                                *    *    *

    అప్పన పంతులు, అరుంధతి మేనత్త మేనమామ పిల్లలు. చిన్నప్పటి నుండీ వాళ్ళని "మొగుడు పెళ్ళాలు' గానే వ్యవహరించే వారు.
    అరుంధతికి ఎనిమిదో ఏడు రాగానే వివాహానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు.
    అరుంధతికి బావంటే ప్రాణం.
    అప్పన్నకి అరుంధతంటే అంతకంటే ఎక్కువ ఇష్టం!
    పెళ్ళి దగ్గర పడ్తోందనగానే , ఇంట్లో ఎక్కడ చూసినా సంబరం! ఉత్సాహం!
    అరుంధతిని పెళ్ళి కూతుర్ని చేసారు. ఊరంతా పేరంటం పిలిచారు. పసుపు కొమ్ములు కొట్టారు! అప్పడాలు వోత్తారు. పిండి వంటలు చేసారు! వియ్యాల వారి మీద పాటలు కట్టారు! ఊరూ వాడా ఏకమయి పెళ్ళి పనులు చేసారు.
    అరుంధతి బామ్మ తన నగలన్నీ పెట్టి మనవరాలిని చూసుకుని మురిసి పోయింది. ఎవరి దిష్టి కొట్టకూడదని మెటికలు , విరిచింది కూడానూ!
    పెళ్ళివారు తరలి వచ్చారు.
    ఆ రాత్రి అప్పన్న, అరుంధతి నిద్రపోతుంటే, కల్లో గోకాడు.
    ఆమె లేచి అతన్ని చూసి, మొహం విప్పార్చుకుని, అతని వెంట పరుగు తీసింది.
    ఇద్దరూ వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటుంటే పెద్దాళ్ళు చూసారు. "అప్పుడే అంత తొందరేమిటర్రా" అంటూ నవ్వారు. ఆ తరువాత అరుంధతిని లాక్కుని వెళ్ళిపోయారు.
    అరుంధతిని నిద్ర లేపి, తెల్లారగానే మంగళ స్నానం చేయించి, బుట్టలో కూర్చోబెట్టారు.
    "వర పూజ" చేస్తుంటే , తల్లీ, బామ్మా కావలించుకుని శోకాలు పెట్టారు. ఎందుకో? అరుంధతికి అర్ధం కాలేదు.
    పీటల మీదకి తీసుకేళ్ళారు. మధ్యలో బావని చూడ్డానికి లేకుండా , తెర అడ్డంగా ఉంది.
    తెర తియ్యగానే నును సిగ్గుల పరదాల మాటునుంచి, బావని చూసింది అరుంధతి.
    చిత్రం! అక్కడ బావ లేడు. ఎవరో పెద్దాయన.
    "మోసం", అని అరిచే వయసు లేదు పాపం! "బామ్మా!" అంటూ ఏడ్చింది.
    ఆలోగా అతను మంగళ సూత్రం కట్టేశాడు.
    బామ్మగారు మనవరాలి ఏడ్పు చూసి, తట్టుకోలేకపోయింది. నేల కూలి పోయింది. అందరూ ఆవిడ చుట్టూ మూగారు.
    అరుంధతి కూడా బామ్మ మీద వాలి ఏడుస్తూ ఉండగా, ఎవరో 'పెళ్ళి కొడుకు, అదేమిటి....అలా? కొంపదీసి మూర్చ రోగి కాదు కదా!" అంటున్నారు.
    అరుంధతి తల తిప్పి అతన్ని చూసింది. అదే మొదటిసారి, చివరిసారీ కూడా!
    అతను.....అరుంధతి మొగుడు నోట్లోంచి చొంగ కార్తుం\డగా , క్రింద పడి తపతపా తన్నుకుంటూ దొర్లుతున్నాడు.
    అరుంధతి ఆ దృశ్యం చూడలేక గట్టిగా కళ్ళు మూసేసుకుంది.
    ఆమెకి పెద్దయ్యాక తెలిసింది! అప్పగింతల బట్టల దగ్గర పెద్ద వాళ్ళకి పేచీ వచ్చి, తన పెళ్ళి బావతో జరగలేదని.
    కేవలం రెండు వందల రూపాయల కోసం!
    అరుంధతి పెద్ద మనిషి అయ్యే లోగానే , ఆమె పసుపు కుంకుమలు తుడుచుకు పోయాయి."
    ఆమె ఏడవలేదు! అసలు ఆ మనిషితో ఆమెకి అనుబంధము ఉంటె కదా, ఏడవటానికి!


                                                   *    *    *

    గట్టిగా వినిపించిన వెస్ట్రన్ మ్యూజిక్ కి "అరుంధతి' ఈ లోకంలోకి వచ్చింది.

 Previous Page Next Page