Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 10


    టీ తాగడం పూర్తయ్యాక స్త్రీలలో ఒకామె అంది. "మేమొక బ్యూటీ క్లినిక్ పెట్టాం."
    "అలాగా!"
    "దాని ఓపెనింగ్ సేరేమొనికి మీరు రావాలి."
    ఉదయార్కర్ వైపు నవ్వుతూ చూశాడు ఎడిటర్. తర్వాత ఆ స్త్రీలవైపు తిరిగి అన్నాడు.
    "నేనెందుకు! బ్యూటీ పార్లర్ ల గురించి నాకేం తెలుసనీ!"
    "వీ నో దట్! యూ ఆర్ మిస్టర్ నో అల్! మీరు పెద్ద మేగజైన్ కి ఎడిటరు కదా! మీకు అన్నీ తెలిసి ఉంటాయి. పైగా మాది ఉత్త బ్యూటీపార్లర్ కాదు. బ్యూటీ క్లినిక్. అందంగా లేనివాళ్ళు అందంగా కనబడేటట్లు అందంగా వున్నవాళ్ళు మరింత అందంగా కనబడేటట్లు చెయ్యడానికి హెర్బల్ ఫార్మ్యులేషన్ తయారు చేశాం మేము."
    "అలాంటప్పుడు నేను రావడంకంటే మీరు ఆ ఫార్మ్యులేషన్స్ అన్నీ కోట్ చేస్తూ ఒక ఆర్టికల్ రాసి ఇస్తే బాగుంటుంది కదా! మా మేగజైన్ లో పబ్లిష్ చేస్తాను."
    "మీరు స్వయంగా వచ్చి చూసి శాటిస్ ఫై అయ్యాక పబ్లిష్ చేస్తే బాగుంటుంది. మొదట మీకు మంచి ఇంప్రెషన్ ఏర్పడాలి కదా!"
    "అంటే మీ ఫార్మ్యులేషన్స్ అన్నీ నామీదే ప్రయోగించి చూస్తారా ఏమిటి?"
    అందరూ నవ్వారు.
    నవ్వులు సద్దుమణిగాక అన్నాడు ఎడిటరు. "నన్ను క్షమించండి. నేను చాలా బీజీ. ఇవాళ ఆఫీసులోనే తెల్లారిపోతుంది నాకు."
    "సర్! మీరు ఫంక్షన్ కి తప్పకుండా వస్తారని అందరితో చెప్పెశాం. మీరు కాకా ఒక ఐఎఎస్. ఆఫీసరు, ఒక బ్యాంకు చైర్మను, ఒక మినిస్టరు , ఒక వర్ధమాన సినీతారా కూడా ఫంక్షన్ కి వస్తున్నారు. సర్, మీరు ఎలాగయినా వీలుచుకుని రావాలి."
    "ఐయామ్ సారీ!" అన్నాడు ఎడిటరు.
    "అసలు కుదరదంటారా!"
    "ఇటీజ్ నెక్స్ ట్ టూ ఇంపాజిబుల్! ఇవాళ అంత బిజీగా ఉన్నాను నేను."
    వాళ్ళు కొద్దిక్షణాలు ఆలోచించారు.
    "పోనీ మీ రిప్రేజెంటేటివ్ గా మిస్టర్ ఉదయార్కర్ ని పంపండి"
    "ఉదయార్కర్ మీకు తెలుసా!"
    "ఎవరికి తెలియదు" అంది ఆ ఇద్దరు స్త్రీలలో ఒకామె. "అయన నవలలు ఫాలో అవుతుంటాను నేను. సమయానికి తగిన ఇన్ ఫర్మేషన్ జోడించి రాస్తూ ఉండటం ఆయనకి అలవాటు కదా! మా బ్యూటీ క్లినిక్ ని చూస్తే ఆ చూసినదే తన సీరియల్స్ లో ఎక్కడో ఒకచోట ఇరికించేస్తారు అయన" అంది నవ్వుతూ.
    ఎడిటర్ కూడా నవ్వి, ఉదయార్కర్ వైపు తిరిగాడు. "వాట్ ఉదయార్కర్?"
    "ఇటీజ్ ఒకే విత్ మీ?" అన్నాడు ఉదయార్కర్. కొత్త కొత్త సంగతులు తెలుసుకోవడం అతనికి చాలా ఇంట్రెస్టు.
    చామనచాయ స్త్రీ ఎడిటరు వైపు తిరిగి అంది "గోల్డెన్ ఛాన్సు మిస్ చేసుకుంటున్నారు మీరు."
    "ఎందువల్ల" అన్నాడు ఎడిటరు.
    "మా బ్యూటీ క్లినిక్ లో మగవాళ్ళకి ప్రవేశం ఇవాళ ఒక్క రోజే! రేపటి నుంచి బతిమాలినా కూడా క్లినిక్ లొకి మగవాళ్ళనేవరినీ అనుమతించము" అంది నవ్వుతూ.
    అందరూ నవ్వారు.
    ఆమె ఉదయార్కర్ వైపు తిరిగింది.
    "ఆరున్నర కల్లా మీరు మా క్లినిక్ దగ్గర ఉంటారు. అవునా!"
    చిరునవ్వుతో తల పంకించాడు ఉదయార్కర్.
    వాళ్ళు ఎడిటరు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.
    "రామాయణంలో పిడకల వేటలా ఇదొక పని తగిలిందా మీకు!" అన్నాడు ఎడిటరు.
    "వేల్లోస్తే నష్టమేముంది, జనరల్ నాలెడ్జి పెరగడం తప్ప!" అన్నాడు ఉదయార్కర్.
    "అద్సరే , సీరియల్ ఎలా ప్లాన్ చేస్తారు, బ్రీఫ్ గా ఏమన్నా చెప్పగలరా!" అన్నాడు ఎడిటర్.
    "ఇది నిజంగా సీ.......రియల్ అనుకున్నాంగా! వెళ్ళి బ్రహ్మచారిని కలిసి అక్కడున్న విశేషాలేమిటో చూసి వచ్చేవరకూ సీరియల్ కి ఒక బేస్ ఏర్పడదు. కానీ ఈలోగా నేను ఒకసారి బ్రిటీష్ లైబ్రరీకి, సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి, ట్రెజర్గురించిన రిఫరెన్స్ స్ ఏమన్నా దొరుకుతాయేమో చూస్తారు. అలాగే ఆర్కియాలజీ డిపార్టుమెంటుకు వెళ్ళి వాళ్ళ దగ్గరేమన్నా సమాచారం దొరుకుతుందేమో చూస్తాను. కొంత గ్రవుండ్ వర్క్ పూర్తీచేసినట్లు అవుతుంది. సాయంత్రం ఇంటికెళ్ళి స్నానం గీనం చేసి అక్కడనుంచి వీళ్ళ బ్యూటీ క్లినిక్ ఓపెనింగ్ కి వెళ్ళి ఎనిమిది, ఎనిమిదిన్నరా ప్రాంతంలో మళ్ళీ మీ ఆఫీసుకు వస్తాను. అప్పటిదాకా ఉంటారా మీరు!"
    "నేనెక్కడికి వెళతాను రండి!" అన్నాడు ఎడిటరు.
    
                         *     *     *    *

    టెలిఫోన్స్ లో పనిచేసే అభిషేకన్ ఆఫీసుకు వచ్చీ రాగానే చేసేపని  ఒకటి వుంది. చేతిలో టెలిఫోన్ వుంటుంది కాబట్టి రోజూ మెడ్రాసుకు రింగ్ చేస్తాడు అతను. మేడ్రాసులో అతనికో ఫ్రెండ్ వున్నాడు. అతని ద్వారా అంతకు ముందు రోజూ మేడ్రాసులో జరిగిన విశేషాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పించుకుంటాడు అభిషేకన్. మెడ్రాసులో ఏమేమి సినిమాలు రిలీజ్ అయ్యయో, ఏమేమి వెళ్లిపోయాయో కనుక్కుంటాడు. మెడ్రాసులో ఎక్కడ ఏఏ సభలూ, సమావేశాలు జరిగాయో ఎక్కడ ఏ సన్మానం జరిగిందో కనుక్కుంటాడు. మెడ్రాసులో వాతావరణం ఎట్లా ఉందో ఉక్కపోస్తోందో, ఉరుములు ఉరుముతున్నాయో తెలుసుకుంటాడు. అక్కడ ఏ వార్డు ఎన్నికతో కేండిడేటు ఎంత మెజారిటీతో గెలిచాడో తెలుసుకుంటాడు. ట్రాఫిక్ రూల్స్ ఏ వీధిలో ఎలా మార్చినదీ, ఎక్కడ వన్ వే ట్రాఫిక్ పెట్టిందీ కూడా తెలుసుకుంటాడు. మెడ్రాసు గురించి జిజ్ఞాస ఎక్కువ అతనికి.

 Previous Page Next Page