"అమ్మా! గౌరి కొంచెం బాగా బతికినపిల్ల. కాస్త పెంకె. తమరు...." ఆదెమ్మకు ఆపైన మాటలు గొంతులోనే ఉంగిడి చుట్టుకుపోయాయి. మాట్రిన్ ముక్కుపుటాలు ఎగరవేస్తూ ఆమెకేసి బెబ్బులిలా చూస్తున్నది.
"వాగుడంతా కట్టిపెట్టు. ఓఁ, యీ రకం పిల్లలసంగతి నాకు మహ చక్కా తెలుసు! ఇక మాట్టాడకు. చూడాలనుకొంటే ఆ పిల్లను నెలకోసారి వచ్చి, చూసిపోవచ్చు; యిక నడు" అంటూ మాట్రిన్ లోపలికెళ్ళిపోయింది.
ఆదెమ్మ తలొంచుకుని వెనుదిరిగి కాళ్ళీడ్చుకొంటూ బంగళా గేటు దాటి రోడ్డుమీదికి వచ్చింది. ఇన్నేళ్ళ తరువాత ఆమెకు లోకమంతా భయంకరంగా తోచింది. తన జీవితంలో ఏదో పెద్ద వెలితి కనిపించింది.
ఇక తను ఇంటికిపోవటం అనవసరం అనుకొన్నదామె. జరిగిందేమిటో తెలిసిన తరువాత, నాగేంద్రం ఇక తనను బతకనివ్వడు. ఈ ముసలితనంలో తను వుండేందుకు పంచకూడా లేకుండాపోయింది. ఇదంతా తను చేసుకొన్న పాపమేనా?......
ఆదెమ్మ రోడ్డు ప్రక్కనున్న చెట్లనీడకిందగా, ఒక గమ్యం అంటూ లేకుండా నడవసాగింది. ఆనాటినుంచీ ఆమెను ఆ ప్రాంతాలవాళ్లెవరూ మళ్ళీ చూడలేదు.
6
గౌరి కట్లిప్పగానే గొడ్లచావిడి మొండిగోడ దూకిన చంద్రం. తను ఎటు వెళుతున్నదీ చూసుకోకుండా ఊళ్ళోకి చాలాదూరం పారిపోయాడు. అతడి ఉద్దేశం తను ఇంటినుంచి ఎంతదూరం పోగలిగితే అంతమంచిదని.
బాగా అలసిపోయిన చంద్రం, ఒక వీధి మలుపులో గోడకానుకొని నిలబడ్డాడు. ఆసరికి బాగా పొద్దెక్కి, ఎండ తీక్షణం కాసాగింది. చంద్రానికి ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చింది. ఇంట్లో వుండగా అతనేనాడూ అంత ఆకలి ఎరగడు. జేబులు తడువుకొంటే, ఒక్క అర్థరూపాయబిళ్ళ దొరికింది. దానితో ఆ దాపులనున్న హోటలులోకి పోయి, రెండు ఇడ్లీ తిని, కాఫీ తాగి సూటిగా పార్కులోకివెళ్ళి, అక్కడ చెట్లమాటునవున్న ఓ బెంచీమీద పడుకున్నాడు. బాగా అలసిపోయి ఉన్నాడేమో - అతడికి నిద్రపట్టింది.
చాలాసేపటితరువాత అతడు కళ్ళు తెరిచేసరికి చుట్టూ చిమ్మచీకటి: బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ చంద్రం లేచి కూర్చున్నాడు. పార్కులో జనం అంతగా లేరు. తను ఏదోవిధంగా గుంటూరు వదలి, ఎవరికంటా పడకుండా బొంబాయికి పారిపోవాలని అతడు నిశ్చయించుకొన్నాడు. బొంబాయి చాలా పెద్ద పట్టణమట. అక్కడ పనిలేనివాడంటూ వుండడట. అక్కడ తను చేతనైనపని ఏదో ఒకటి చేసి బతగ్గలడు. కొంత డబ్బు కూడబెట్టిన తరువాత గురుకులానికి వెళ్ళి చదువుకోవాలి.
చంద్రం బయలుదేరాడు. ఒళ్ళంతా నొప్పులుగా వున్నది. జ్వరం తగిలినట్టు కాలిపోతున్నది. తనెక్కడికి పోవాలో ఆలోచించకుండానే పార్కువదలి నడవసాగాడు. కొంతదూరం వెళ్ళేసరికి రైలుకట్ట కనిపించింది. దూరంగా రైలుకూత వినబడింది. రైలన్నా రైలుస్టేషనన్నా అతడి కెందుకో దిగులూ, ఆనందంకూడా కలుగుతుంటాయి. ఇలా అంటే, స్కూల్లో అతడి స్నేహితులంతా నవ్వి, వేళాకోళం పట్టించేవాళ్ళు, రైళ్ళూ, విమానాలూ వచ్చి ప్రపంచాన్ని కుదించేశాయి అంటాడు మేష్టరు. తనకు మాత్రం అలా అనిపించదు. ఇవి వచ్చిం తరువాతే ప్రపంచం మరింత విశాలమైందనుకొంటాడు. తను ఇష్టంలేని వాళ్ళనుంచి ఎంతదూరమైనా పారిపోయేందుకు యీ రైళ్ళూ, విమానాలూ బాగా ఉపయోగిస్తవి. ఇల్లేకాదు, ఈ దేశమే వద్దనుకుంటే, వాటి సహాయంతో మరోదేశంపోయి హాయిగా బతకవచ్చు. అలా దేశమే వదిలిపోయినవాళ్ళు కొందరున్నారట!
రైలుకట్టమీద ఇలా ఆలోచిస్తూ నడుస్తున్న చంద్రానికి, పట్టాల మీద నీడలా కదులుతున్న ఓ ఆకారం కనిపించింది. ఆశ్చర్యపోతూ, చంద్రం అటుకేసి ఒకడుగు వేసేంతలో, స్టేషన్ కేసి వస్తున్న రైలు పెద్ద కూతవేసి, మహావేగంగా ఆ ప్రాంతాన్ని సమీపిస్తున్నది. చంద్రం ఒక్క దూకులో పట్టాల మీదికిపోయి, అక్కడవున్న ఆకారాన్ని రెండుచేతులతోనూ పట్టి, పట్టాలనుంచి అవతలకి నెట్టి, కాలు నిలదొక్కుకోలేక దభీమంటూ ఆ ఆకారంమీద పడిపోయాడు. ఇంతలో రైలు ప్రళయ భయంకరంగా గర్జిస్తూ దాటిపోయింది. చంద్రం లేచి నిలబడ్డాడు. అంతవరకూ అతడితో పెనుగులాడిన ఆకారంకూడా లేచీ నిలబడుతూనే, "ఎవరూ? చంద్రం!" అంటూ చంద్రాన్ని కావిలించుకుంది.
"నువ్వా, ప్రకాశం! ఏమిటిది? ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నావా?" అన్నాడు చంద్రం, తన స్నేహితుణ్ణి గుర్తించి.
"అవును చంద్రం! రైలుకిందపడి ఆత్మహత్య చేసుకొందామనుకున్నాను. నువ్వు ఎందుకడ్డుతగిలావు? రెక్కల కష్టంమీద బతికే మా నాన్న నా చదువుకోసం ఎంతో ఖర్చు పెట్టాడు. నేను బాగా చదివి ఏ ఐ. ఏ. యస్. ఆఫీసర్నో అవుతానని ఆయన ముచ్చట పడేవాడు. నేను పరీక్ష తప్పాను. ఈ సంగతి తెలిస్తే నాన్న ఎంత బాధపడతాడో తెలుసా?" అన్నాడు ప్రకాశం ఏడ్పుగొంతుతో.
"తెలివితక్కువగా మాట్లాడబోకు ప్రకాశం! నువ్వు పరీక్ష తప్పావని తెలిస్తేనే అంత బాధపడే మీ నాన్న, నిజంగా నువ్వు ఆత్మహత్య చేసుకొంటే బతికుండగలడనుకొంటున్నావా?" అన్నాడు చంద్రం కోప్పడుతున్నట్టు.
"నువ్వన్నది నిజమే చంద్రం! పరీక్ష తప్పానన్న విచారంలో యివేమీ నేనాలోచించలేదు. ప్రాణానికి తెగించి నన్ను కాపాడావు. పద మా యింటికిపోదాం. నువ్వీ రాత్రికి మా యింట్లో వుండాలి-" అంటూ ప్రకాశం ముందు దారితీశాడు.
చంద్రం మౌనంగా ప్రకాశం పక్కన నడవసాగాడు. హఠాత్తుగా ప్రకాశానికో అనుమానం కలిగింది. ఇంత రాత్రివేళ చంద్రం యీ రైలు కట్టకేసి ఎందుకొచ్చినట్టు? చంద్రంకూడా పరీక్ష తప్పాడు. అతడూ తన లాగే....
"చంద్రం! నువ్వీ ప్రాంతానికెందుకొచ్చావ్? నాలాగే నువ్వూ..... అవునా?" అని అడిగాడు ప్రకాశం.
"అలాంటి అనుమానం ఏమీ పెట్టుకోకు. నేను చచ్చేందుకు ఇటురాలేదు. ఒకవేళ రైలుకిందపడి చచ్చినా, నాకోసం దిగులు పడేవాళ్ళెవ్వరూ లేరు" అన్నాడు చంద్రం నిస్పృహగా.
"నీకోసం దిగులుపడేవాళ్ళే లేరా?" అంటూ ప్రకాశం ఆప్యాయంగా చంద్రం చేయి పట్టుకున్నాడు. చంద్రం చేయి వణికింది. అతడు గద్గదస్వరంతో, "అవును, ప్రకాశం! యీ లోకంలో నాకోసం దిగులుపడేవాడివి నువ్వొక్కడి వున్నావు" అన్నాడు.
ఆ తరువాత యిద్దరూ మౌనంగా నడిచారు. ఇంటిని సమీపించేసరికి ప్రకాశం తండ్రి భద్రయ్య వాకిట్లో తలవంచుకుని విచారంగా కూర్చుని వుండటం వాళ్ళకు కనిపించింది. వాళ్ళు వస్తున్న అలికిడి వింటూనే భద్రయ్య తలఎత్తి, వాళ్ళకేసిచూసి, కొడుకును గుర్తించి "వచ్చావా, బాబూ!" అంటూ పరుగెత్తి వెళ్ళి ప్రకాశాన్ని కావలించుకొని, "పరీక్ష తప్పినందుకు నీవేం అఘాయిత్యం చేసుకున్నావో అని పొద్దుటినుంచీ కుమిలిపోతున్నాను. ఇంతసేపూ ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? చంద్రం! నువ్వు పరీక్ష పాసయావా?" అంటూ ఆ యిద్దరినీ ఇంట్లోకి తీసుకుపోయాడు.
కొద్దిసేపటి తరువాత ప్రకాశం, చంద్రం భోజనం చేశారు. చంద్రానికి తిండి సహించలేదు కాని, భద్రయ్య బలవంతం చేయగా తిన్నాడు. భద్రయ్య ఒకటికి రెండుసార్లు అడిగినమీదట ప్రకాశాన్ని రైలుపట్టాలమీద తానెలాంటిస్థితిలో చూసింది అతడికి చెప్పాడు.
భద్రయ్య హృదయం చంద్రంపట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. అతడు తనకు పుత్రభిక్ష పెట్టాడు! అంత చిన్నవాడికి తన కృతజ్ఞతాభావం ఎలాంటి మాటలతో చెప్పటం? భద్రయ్య చంద్రం చేతులు పట్టుకుని, నుదుటిమీద చేయివేశాడు. అది వెచ్చగా వున్నట్టు తోచింది.
"చంద్రం, నీకు బాగా జ్వరం వచ్చినట్టుంది. ఒరే బాబూ! ఆ మంచం వేసి చంద్రాన్ని అక్కడ పడుకోబెట్టు, నేను డాక్టర్ ని పిలుచుకువస్తాను" అంటూ భద్రయ్య, చంద్రం వద్దని వారిస్తున్నా వినక డాక్టరు కోసం పరిగెత్తాడు.
డాక్టరు వచ్చిచూచి, ఇది మామూలు జ్వరంలా లేదన్నాడు. ఏవో మందులిచ్చాడు. మూడు నాలుగు రోజుల తరువాత అది టైఫాయిడ్ అని తేలింది. భద్రయ్య, కృష్ణారావుకోసం కబురు చేస్తానన్నాడు. చంద్రం వద్దంటే వద్దనటమేగాక, అన్న అక్కడికి వచ్చేలావుంటే, తను ఎటైనా పారిపోతానన్నాడు. మీకు యిక్కడ ఇబ్బందిగా వుంటుందిగనక తనను ధర్మాసుపత్రికి తీసుకుపొమ్మన్నాడు.
"ఎక్కువగా మాట్లాడకు, చంద్రం! నువ్వు యిక్కడ వుండటం మాకిబ్బందిగా వుంటుందా? ఎంతమాట! నువ్వు నా బిడ్డను కాపాడావు; నా బిడ్డతో సమానుడివి" అంటూ భద్రయ్య పైపంచతో కళ్ళు తుడుచుకున్నాడు.
"నేను పొరపాటుగా మాట్లాడాను. ఏమీ అనుకోకండి! ఈ టైఫాయిడ్ నన్నేమీ చేయదు. నేను బతుకుతాను, నేను నిర్దోషినని రుజువు చేస్తాను. కాని ఒకవేళ ఈ జ్వరంతో చచ్చిపోతే, నా శవాన్ని కాల్చివేసిన తరువాత మా అన్నయ్యవాళ్ళకు కబురుచేయండి. చంద్రం చనిపోతూ తన డబ్బు దొంగిలించలేదని అన్నట్టు ఆయనతో చెప్పండి" అంటూ చంద్రం కన్నీరు పెట్టుకున్నాడు.